ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కశ్మీర్ లో కనుమరుగవుతున్న ప్రజాస్వామ్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఇటీవల జమ్మూ-కశ్మీర్ లోని పట్టణ ప్రాంతాలలోని స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోతోందని అర్థం అవుతోంది. 2002లో జమ్మూ-కశ్మీర్ శాసన సభకు ఎన్నికలు జరిగిన దగ్గరనుంచి ఎన్నికల మీద కలిగిన ఆసక్తి గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వస్తోంది.

శ్రీనగర్, జమ్మూ ప్రాంతంలోని 71 మునిసిపల్ కార్పొరేషన్లతో సహా 79 మునిసిపల్ సంస్థలకు, ఆరు మునిసిపల్ కౌన్సిళ్లకు, 71 మునిసిపల్ కమిటీలకు జరిగిన ఎన్నికలలో సగటున 35 శాతం మంది ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. ఇంతమాత్రమైనా ఓటింగులో పాల్గొనడానికి కూడా జమ్మూ, లడాఖ్ ప్రాంతంలో ఎక్కువ మంది ఓటింగులో పాల్గొనడమే కారణం. కశ్మీర్ లోయ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియను దాదాపు తిరస్కరించారు. అక్కడ అత్యధికంగా పోలైంది 8.3 శాతం ఓట్లు మాత్రమే. ఆ తర్వాతి దశల్లో ఓటర్ల శాతం మరీ తగ్గిపోయింది. రెండవ విడత పోలింగులో 3.4%, మూడవ విడతలో 3.49%, నాల్గవ దశలో 4% ఓట్లు మాత్రమే పోలైనాయి. నామినేషన్లు దాఖలు చేయడం మీదే ఆసక్తి చూపకపోవడంవల్ల ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు ఆసక్తి లేదని ఎన్నికలకు ముందే స్పష్టమైంది. చాలా నియోజకవర్గాలలో పోటీ చేసేవారే లేరు. లేదా పోటీ లేకుండానే ఎన్నికల తంతు ముగిసింది. ఆ రకంగా కశ్మీర్ లో 598 వార్డులు ఉంటే పోలిగు జరిగింది 186 వార్డుల్లో మాత్రమే. 231 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. 181 నియోజక వర్గాలలో ఒక్క అభ్యర్థి కూడా పోటీ చేయలేదు. మొత్తం మీద 412 వార్డుల్లో పోలింగే జరగలేదు. వేర్పాటువాదులు, మిలిటెంట్లు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చినందువల్ల పోలింగ్ జరిగిన వార్డులలోనూ ఎన్నికల ప్రచారం నామమాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల ఎవరు పోటీ చేస్తున్నారో కూడా తెలియదు. వారి భద్రత కోసం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను రహస్యంగా ఉంచారు.

1989 తర్వాత కశ్మీర్ లో ఉన్న పరిస్థితే ఇప్పుడూ పునరావృతం అయింది. అప్పుడు ప్రధాన స్రవంతిలోని రాజకీయ వ్యవస్థ కుప్ప కూలింది. ఎన్నికల ప్రక్రియ జాడే కనిపించలేదు. 1989లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో కేవలం 5% ఓట్లు మాత్రమే పోలైనందువల్ల ఎన్నికల ప్రక్రియ ప్రహసన ప్రాయంగా తయారైంది. 1996లో ఓటు వేసిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. కాని భద్రతా దళాల కనుసన్నల్లో ఎన్నికలు జరిగినందువల్ల వాటికి విలువ లేకుండా పోయింది. బలవంతాన ఓట్లు వేయించారన్న ఆరోపణ గట్టిగా వినిపించింది. 2001లో జరిగిన పంచయతీ ఎన్నికలలోనూ అనేక చోట్ల ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు.

2002 తర్వాత ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత పెరిగింది. వేర్పాటువాదుల వ్యతిరేక ప్రచారం జోరుగా సాగినా రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఎన్నికల ప్రక్రియ మీద ఆసక్తీ కనిపించింది, ప్రజల భాగస్వామ్యమూ ఉంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఎక్కువ శాతం ఓట్లు పోలైనాయి. స్థానికంగా ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. పార్లమెంటు ఎన్నికలలో కన్నా స్థానిక ఎన్నికల మీద ఆసక్తి ఎక్కువగా కనిపించింది. శాసనసభ ఎన్నికలకన్నా పంచాయతీ ఎన్నికలప్పుడు ప్రజల ఉత్సాహం అధికంగా ఉండేది. 2011 పంచాయతీ ఎన్నికలలో దాదాపు 80% ఓట్లు పోలైనాయి. ఆ సమయంలో వేర్పాటువాదులు ఎన్నికలను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపును ప్రజలు తిరస్కరించారు. అమర్ నాథ్ భూ వివాదం తర్వాత వేర్పాటువాద ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కొద్ది కాలానికే 2008లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 52% ఓట్లు పోలైనాయి. కనీసం నాలుగు జిల్లాల్లో 60% కన్నా ఎక్కువ ఓట్లు పోలైనాయి. అలాగే 2010లో అయిదు నెలలపాటు వేర్పాటువాద ఉద్యమం పెచ్చరిల్లినా 2011లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. 2014 శాసనసభ ఎన్నికలు సైతం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల ప్రచారమూ జోరుగా సాగింది. కశ్మీర్ ప్రాంతంలో 46 నియోజకవర్గాలు ఉంటే 23 నియోజకవర్గాలలో 60% పైగా ఓట్లు పోలైనాయి. 13 నియోజకవర్గాలలో 70% పైగా ఓట్లు పోలైనాయి. అయిదు నియోజకవర్గాలలో 80% కన్నా ఎక్కువ ఓట్లు పోలైనాయి.

ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి కనిపించిన ఈ దశలో ఓటర్లు "పరిపాలనాపరమైన రాజకీయాలకు", వేర్పాటువాద రాజకీయాలైన "ఘర్షణ నివారించే రాజకీయాలకు" మధ్య స్పష్టమైన తేడా కనబర్చారు. వేర్పాటువాద రాజకీయాలు కొనసాగినా ప్రజాస్వామ్య ప్రక్రియకు కూడా చోటు ఉండేది. ప్రజల్లో వేర్పాటువాద రాజకీయ ధోరణి ఉన్నా విద్యుత్తు, రోడ్లు, నీళ్ల కోసం ఎన్నికల ప్రక్రియ అవసరం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే వేర్పాటువాద ధోరణులు ప్రబలంగా ఉన్న సమయంలోనూ ప్రజాస్వామ్య ప్రక్రియకు చోటు ఉండేది.

ఇప్పుడు "పరిపాలనా సంబంధ రాజకీయాలకు", "ఘర్షణలు నివారించే రాజకీయాలకు" మధ్య సమాంతరత ఇప్పుడు పూజ్యమైంది. 2014 ఎన్నికల తర్వాత, ముఖ్యంగా 2016లో వేర్పాటువాదం బాగా ప్రబలిన దగ్గర నుంచి కశ్మీర్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2017లో శ్రీనగర్ లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఈ శూన్యం ప్రస్ఫుటంగా కనిపించింది. హింసాత్మక సంఘటనలు, నిరసన ప్రదర్శనలు ఎన్నికల సమయంలో ఎక్కువైనాయి. కేవల్మ్ 8% మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ పార్టీ ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడం చూస్తే ప్రధాన రాజకీయ పార్టీలకు ఎదురుగాలి వీస్తోందని స్పష్టమైంది. రాజ్యాంగంలోని 35ఎ అధికరణాన్ని తొలగించాలన్న వాదన విపరీతమైనందువల్ల ఎన్నికల ప్రక్రియకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అసలు విషయం ఏమిటంటే కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ప్రధాన స్రవంతి రాజకీయాలకు అనుకూలంగా లేదు.

Back to Top