పురుషాధిక్యతను ఎదిరిస్తున్న మహిళలు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
గత వారం ఇద్దరు మహిళలు తాము ఇదివరకు ఎదుర్కున్న లైంగిక అత్యాచారాల వ్యధార్థగాథలు ఏకరువు పెట్టవలసి వచ్చింది. అమెరికాలో మనస్తత్వ శాస్త్ర ప్రొఫెసర్ క్రిస్టిన్ బ్లసే ఫోర్డ్ తన మీద సుప్రీంకోర్టు ప్రతినిధి బ్రెట్ ఎం. కవనగ్ పాల్పడ్డ అత్యాచారాన్ని వివరించారు. తామిద్దరం ఈడొచ్చిన వయసులో ఉండగా 1982లో బ్రెట్ అత్యాచారానికి పాల్పడ్డారని ఫోర్డ్ చెప్పారు. 2008లో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ప్రసిద్ధ నటుడు నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించాడని ముంబై నటి తనూశ్రీ దత్తా వెల్లడించారు. ఈ కారణంగా ఆమె సినిమా పరిశ్రమకు దూరం కావలసి వచ్చిందట.
నిజానికి ఈ ఇద్దరు మహిళలు వెళ్లబోసుకున్న గోడు వారిని వేధించిన వారికి పరిమితమైన వ్యవహారం కాదు. "#నేను సైతం" ఉద్యమం వచ్చిన తర్వాత మహిళలు తమకు ఎప్పుడో జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా వెల్లడించే ధర్యం కూడగట్టుకోవడానికి నిదర్శనం. ఇలా చెప్పుకోలేనంత కాలం లైంగిక వేధింపులకు పాల్పడే వారు నిరాఘాటంగా తమ అఘాయిత్యాలు కొనసాగిస్తూనే ఉంటారు. వేధించడం మామూలు విషయమై పోతుంది. మహిళలను వేధించడం తీవ్రమైన నేరం. పురుషులు తమ ఆధిపత్యం కారణంగా ఏ శిక్షా లేకుండా తప్పించుకోగలుగుతున్నారు. ఈ అఘాయిత్యాలు ఈ ధోరణికి ప్రతీక. ఫోర్డ్ విషయంలో తప్ప తాగిన ఈడొచ్చిన ఉన్నత పాఠశాల విద్యార్థి, తనూశ్రీ కేసులో రాజకీయ పలుకుబడి ఉన్న ప్రసిద్ధ సినీ నటుడు తమకు శిక్ష ఉండదన్న ధీమాతోనే ఈ పని చేశారు. వారిలో గూడు కట్టుకుపోయిన ఈ భావన దిగ్భ్రాంతి కలగజేస్తుంది.
ఇందులో మొదటి సంఘటన 36 ఏళ్ల కింద జరిగితే రెండవ సంఘటన పదేళ్ల కిందటిది. తమ గోడు వినిపించుకునే వారు ఉన్నారన్న ఉద్దేశంతో వీరు ఇప్పుడు ఎన్నడో తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టారు. అమెరికా చిత్ర నిర్మాత హార్వే వీన్ స్టీన్ తమ మీద లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని 2017లో బయట పెట్టినప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏం మారింది? "#నేను సైతం" అని వేలాదిమంది ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపుల గురించి తమ గోడు వెళ్లబోసుకున్న తర్వాత పరిస్థితి ఏం మారింది?
వ్యవస్థాపూర్వకంగా ఏమీ మారలేదు. అమెరికాలోనూ మారలేదు. మన దేశంలో సరే సరి. కాని కొంత మంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాలను ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నారు. ఆ ఘటనలు వారి జీవితాలను మార్చేశాయి. వారి తీసుకునే నిర్ణయాయలను ప్రభావితం చేశాయి. ఇలాంటి ఘటనలు తమ జీవితాలను ఎలా మార్చేశాయో గ్రహించలేని మహిళలూ ఉన్నారు. వాటి ప్రభావాన్ని వాళ్లు ఇప్పటికీ పూర్తింగా గుర్తించనే లేదు. చాలా కాలంగా మహిళలు ఇలా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు.
లైంగిక వేధింపులకు పాల్పడే వారికన్నా బాధితులే ఎక్కువగా సిగ్గు పడవలసిన దుస్థితి వచ్చింది. అధికారం, ప్రధానంగా పిత్రుస్వామిక అధికారం రాజ్యమేలే సమయంలో లైంగిక దాడులకు "సాక్ష్యం" ఏమిటి అని ఎలా నిర్ధారిస్తాం? తమ మీద జరిగిన దాడిని మరిచిపోవడానికి మహిళలు ప్రయత్నించే దశలో సాక్ష్యం ఎక్కడి నుంచి దొరుకుతుంది? సాక్ష్యాన్ని ఉపయోగించుకుని లైంగిక దాడులకు పాల్పడే వారే బాధితుల నోళ్లు నొక్కేస్తున్నప్పుడు మహిళలకు ఇక దిక్కేది?
చాలా మంది మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఏమిటంటే ఈ మహిళలు చెప్పే కథలు నమ్మడం ఎలా? ఈ విషయంలో మనం మహిళలను ఎలా నమ్మాలి? వారు నిజం చెప్తున్నారని నమ్మకం ఏమిటి? 36 ఏళ్ల కింద జరిగిన అత్యాచారానికి ఇప్పుడున్న సాక్ష్యం ఏమిటి?
న్యాయవ్యవస్థ కూడా ఈ "నమ్మకం" మీదే ఆధారపడడమూ కొత్త కాదు. మహిళలు చెప్పే మాటలను పిత్రుస్వామిక భావజాలం దృష్టితోనే చూస్తాం. తనకు ఏ శిక్షా ఉండదు అన్న ధీమాతోనే పురుషుడు అఘాయిత్యాలకు పాల్పడతాడు గనక ఈ భావనే న్యాయవ్యవస్థనూ ఆవహిస్తోంది. ఎందుకంటే న్యాయవ్యవస్థలో ఎక్కువ మంది పురుషులు, అగ్రవర్ణాల వారే. అనేక తీర్పుల్లో న్యాయస్థానాలు మహిళల సమ్మతి అన్న విషయానికి విలువ ఇవ్వలేదు. ఆమె చెప్పే మాటలకన్నా ఆమె శరీరం మీద కనిపించే గాయాలకే ఎక్కువ విలువ ఇచ్చారు. మహిళల శరీరం మీద ఎలాంటి గాయాలూ కనిపించకపోతే ఆ మహిళ లైంగిక చరిత్రకు, శీలానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తీర్పులు చెప్పేశారు. వీటి ఆధారంగా ఆమె చెప్పేది "నమ్మదగిందేనా" అని విచికిత్సలో పడిపోయారు.
మహిళల్లో చైతన్యం పెరగడం, స్త్రీవాదం వేళ్లూనుకోవడంవల్ల మహిళల తెలివిడిని కూడా మగతనం, పిత్రుస్వామిక భావజాలం దృష్టితోనె చూశారు. మహిళలు చెప్పే విషయాలను విశ్వసించడం లేదు. మహిళలు ఎదుర్కుంటున్న ఇబ్బందికన్నా పురుషులు చెప్పే కథలకు, మహిళలు తమ భావాలు అసలు సరైనవేనా కావా అన్న అనుమానంలో పడవేసే స్థితికి, తమకు హక్కు ఉందా లేదా అన్న అనుమానానికి దారి తీస్తోంది. తమ అనుభవాలను ఏకరువు పెట్టడం ద్వారా మహిళలు మరో రకమైన జ్ఞానాన్ని బయటపెట్ట గలుగుతున్నారు. అది వారి అనుభవం మీద ఆధారపడింది. అది వారి జ్ఞానేన్వేషణ లక్షణానికి సంబంధించింది. అది మరింత సమగ్రమైన సామాజిక వాస్తవికత మీద ఆధారపడింది.
"#నేను సైతం" ఉద్యమంవల్ల మన దేశంలో అయితే ఉన్నత విద్యా రంగంలో లైంగిక దాడులు అంతకంతకూ బయటపడడం ఎక్కువ అయింది. అనేకమంది తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మహిళలు ఈ విషయంలో నిర్దిష్టమైన వైఖరి అనుసరిస్తున్నారు. న్యాయం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. అది కొంత ఆశాజనకంగా కనిపించినా పిత్రుస్వామిక అధికారానికి అతీతమైంది కాదు. మనూశ్రీ దత్తా మీద నానా పాటేకర్ పరువునష్టం దావా వేశారు. క్రిస్టిన్ బ్లసే ఫోర్డ్ బహిరంగంగా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పినా కవనాగ్ ఇంకా రుజువులు కావాలనుకుంటున్నారు. సాధారణంగా అఘాయిత్యాలకు పాల్పడిన పురుషుల జీవితం నిరాటంకాగా, యథావిధిగా సాగిపోతుంది. జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పినందువల్ల ఫలితం ఏమిటో అంతుబట్టడం లేదు.
కానీ మహిళలు గొంతు విప్పడం ద్వారా మహిళలు తమ శక్తిని నిరూపించడమే కాకుండా తమ జ్ఞానాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.