ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

పద్ధతి లేని గణాంకాలు ప్రమాదకరం

.

ఉపాధి కల్పనకు సంబంధించిన గణాంకాలు పెద్ద ఎత్తున తరచూ చేపట్టే సర్వేల ఆధారంగా సాగాలే కానీ, దారి మళ్లించే స్వీయ మదింపుల ద్వారా కాదు. ప్రధానమంత్రి మోదీ ఈ మధ్య జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ 18-25 ఏళ్ల మధ్య ఉన్న 70 లక్షల మంది ఉద్యోగులు భవిష్యనిధి సంస్థలో (ఈపీఎఫ్‌ఓ) ఖాతాలు తెరిచినట్లు ఓ ‘ఒక స్వతంత్ర సంస్థ’ గుర్తించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ అదనపు ఉద్యోగాలు ఏ కాలానికి సంబంధించినవో చెప్పేందుకు కూడా ఆయన ప్రయత్నించలేదు. ‘‘ఇదంతా కూడా కొత్తగా కల్పించిన ఉపాధిని సూచించడం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఆయన పేర్కొన్న గణాంకాలు, 31 మార్చి 2018తో అంతమయ్యే సంవత్సరానికి గాను ఉద్యోగాల కల్పనని అంచనా వేసే నీతి ఆయోగ్‌ అనే సంస్థకి సంబంధించినవి. ఉపాధి కల్పనకి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం (ఆర్థిక సూచనలతో పాటుగా) ప్రకారం, గత ఏడాది కంటే 2017-18 సంవత్సరంలో మరింత మెరుగైన ఉపాధి కల్పన జరుగుతుందని సూచించడం లేదు. నీతి ఆయోగ్‌కు అందించిన ‘టువర్డ్స్‌ ఏ పేరోల్‌ రిపోర్టింగ్ ఇన్ ఇండియా’ (ఆన్‌లైన్లో దీని సంగ్రహపాఠం లభ్యం) అనే నివేదిక, ఉద్యోగాల సంఖ్యను ఎలా అంచనా వేయాలో అన్న విషయం మీద ప్రభుత్వం సూచించిన విధానానికి అనుగుణంగానే రూపొందించారు. కొంతమంది ఆర్థికవేత్తలు సైతం, భారతదేశంలో ఈ విధంగా ఉద్యోగాలను లెక్కించడంలో కొన్ని బలహీనతలు ఉన్నాయని చెబుతున్నారు: కొద్దిపాటి నమూనాలు (సాంపుల్స్‌), అనిశ్చితమైన సర్వేలు, గణాంకాల విడుదలలో జాప్యం. అందుకని పెద్ద ఎత్తున సర్వేలతో పాటుగా, వాస్తవ స్థితిని ప్రతిబింబించే సూచికల అగత్యం చాలా ఉంది. ‘ద రిపోర్ట్‌ ఆఫ్‌ ద టాస్క్‌ ఫోర్స్‌ ఆన్ ఇంప్రూవింగ్ ఎంప్లాయ్‌మెంట్ డేటా’ (2017)లో శ్రామికశక్తిని అంచనా వేసేందుకు కొన్ని ఇతర పద్ధతులతో పాటుగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ), ఉద్యోగుల బీమా సంస్థ (ఈఎస్‌ఐ), సాధారణ భవిష్యనిధి, జాతీయ భవిష్యనిధి (ఎన్‌పీఎస్) తదితర పథకాలకు సంబంధించిన ‘పరిపాలక గణాంకాలు’ ఉపయోగించుకోవచ్చని చెప్పింది. అయితే ఇలాంటి పరిపాలక గణాంకాలలో కొద్దిమంది కార్మికులు మాత్రమే ఉంటారు. కాబట్టి మిగతా శ్రామిక శక్తిని పరిగణనలోకి తీసుకోకుండా, నూతన ఉద్యోగాల కల్పనకి సంబంధించిన సరైన గణాంకాలను అంచనా వేయలేం. అయితేగియితే ఇలాంటి గణాంకాలు, శ్రామికులు ఎంతమేరకు సామాజిక భద్రతా పథకాలలో పాలుపంచుకుంటున్నారో సూచించేందుకు మాత్రమే, ఒక విధమైన క్రమబద్ధీకరణగా మాత్రమే ఉపయోగపడుతుందే కానీ... నూతన ఉద్యోగ కల్పనని సూచించదు.

ఈ ప్రత్యేక నివేదిక పరిపాలక గణాంకాలలో ఉన్న మరికొన్ని లోటుపాట్లను కూడా ఎత్తిచూపుతోంది. ఆ గణాంకాలలో ఉన్న కొన్ని ప్రత్యేకతల వల్ల అవి దారిమళ్లించే నివేదికలకు కారణం అవుతాయి. ప్రభుత్వ విధానాలలో వచ్చే మార్పుల వల్ల, ఈ గణాంకాలలో కొన్ని పాక్షికతలు చోటు చేసుకుంటాయి. వీటి అమలులోను, ఆమోదయోగ్యతలోనూ ఏడాది తర్వాత ఏడాది మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయా పథకాలలో చేరమంటూ ప్రభుత్వం కనుక ఒత్తిడి తీసుకువస్తే, సంబంధిత గణాంకాలలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈమధ్యకాలంలో ఈపీఎఫ్ఓ చాలా చురుకుగా వ్యవహరిస్తూ, వేర్వేరు ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను కూడా భవిష్యనిధి లేదా పింఛను పథకాలలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నది (2017లో చేపట్టిన ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకుండా). ఒక తాత్కాలిక ఉద్యోగి ఉద్యోగం శాశ్వతం అయినప్పుడు కూడా ఎలాంటి అదనపు ఉద్యోగం కల్పించకుండానే, ఈ పథకాల నమోదులో మార్పు ఉంటుంది. పైగా ఈ పరిపాలక గణాంకాలు పునరావృతం అయ్యే అవకాశాలు కూడా (ఉదా॥ ఈపీఎఫ్ఓ, ఈఎస్‌ఐసీ, ఎన్‌పీఎస్‌) ఉన్నాయని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఎందుకంటే వేర్వేరు పథకాలలో ఒకే పేరు పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఇలాంటి పునరావృతాలను ఏరిపారేసినా, ఈ గణాంకాలు లోపరహితం అని చెప్పడానికి లేదు. ఆర్థికరంగంలో అటు 2016-17, 2017-18 సంవత్సరాలు అనూహ్యమైన పరిణామాలను చవిచూశాయి. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అనే రెండు తీవ్ర పరిణామాలతో అనధికార వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో ఆయా వ్యాపారాలలో ఉన్నవారు తమ లాభాలను పణంగా పెట్టి, ప్రభుత్వ విధానాలను ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ‘బలవంతపు క్రమబద్ధీకరణ’ ఉద్యోగ భద్రత పథకాలలో మరింతమంది చేరికను సూచిస్తుందే కానీ, సర్వత్రా ఉపాధి పెరిగిందని మాత్రం సూచించదు. కాబట్టి ఇలాంటి పథకాలలో చేరిక ఆధారంగా ఉపాధి కల్పనని సూచించే గణాంకాలను సేకరించడం ఒక బలహీనమైన ప్రాతినాధ్యాన్ని సూచిస్తుంది. విచిత్రంగా, నీతిఆయోగ్‌కు ఈ నివేదికను రూపొందించినవారు, తాము ఎన్నుకొన్న పద్ధతి... అమెరికాలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్‌టిక్స్ (బీఎల్‌ఎస్) నెలవారీ ఉద్యోగుల జీతాల ఆధారంగా రూపొందించే నివేదికలు వంటి నివేదికలను తయారుచేసేందుకు దోహదపడుతుందని చెప్పుకున్నారు. నిజానికి బీఎల్‌ఎస్ తన నివేదికలను రూపొందించేందుకు పెద్దస్థాయిలోను, త్వరితంగాను జరిగే సర్వేల మీద ఆధారపడుతుంది. దానికి తోడు ఇంటింటికీ తిరిగి అనుబంధ వివరాలను కూడా సేకరిస్తుంది. ఇలా చాలా పెద్దమొత్తంలో వివరాలను సేకరిస్తుంటారు. వ్యవసాయేతర ఉద్యోగాల మీద ఆధారపడేవారిలో, దాదాపు మూడోవంతు మందిని ఈ సర్వేలో భాగస్వాముల్ని చేస్తారు. ఇవి భారతదేశంలోని లేబర్‌ బ్యూరో ఎంటర్‌ప్రైజ్‌ నిర్వహించే సర్వేలాంటివే. కానీ చాలా పెద్దమొత్తంలోను, చాలా తరుచుగానూ వీటిని నిర్వహిస్తుంటారు. కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాల కోసం సేకరించే ‘పరిపాలక గణాంకాలు’ సంస్థాగతమైన, వ్యక్తిగతమైన సర్వేలకు ప్రత్యామ్నాయం కానేకాదు.

ఉపాధిలో పెరుగుదల అనేది కార్మిక విపణిని గమనించేందుకు ఉన్న ఒకానొక మార్గం మాత్రమే! పూర్తిస్థాయి అవగాహన కోసం... ఉపాధితీరుతెన్నులు, పని వాతావరణం వంటి విషయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అమెరికాలో అధికారిక వ్యాపారాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, అక్కడి వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలాగా అక్కడి సర్వేలు ఉంటాయి. ఈ కారణాల చేత, పరిపాలక గణాంకాల ఆధారంగా సర్వేలు రూపొందించడం, సైద్ధాంతికంగా ఆసక్తికరంగానే ఉండి క్రమబద్ధమైన శ్రామికశక్తిని అంచనా వేయడానికి బాగుంటుందే కానీ సర్వేలకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. దీని బదులు ప్రతిష్టాత్మకమైన నేషనల్ సాంపిల్‌ సర్వే ఆఫీస్‌, లేబర్‌ బ్యూరో ఎంప్లాయ్‌మెంట్ సర్వేలని మరింత మెరుగుపరిస్తే బాగుంటుంది. ఏళ్లతరబడి, ఇవి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా, సంక్లిష్టమైన విషయాలను గ్రహించేందుకు కొన్ని సర్వే విధానాలను రూపొందించుకున్నాయి. ఉదాహరణకు అధికారిక వ్యాపారంలో అనధికారికమైన ఉపాధి, అనధికారిక వ్యాపారంలో ఉండే ఉద్యోగాలు, కాలానుగుణ ఉద్యోగాలు, నిరుద్యోగం వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రస్తుత నివేదికకి, దాని ప్రచారానికి సంబంధించిన మరో నిరాశాకరమైన విషయం ఏమిటంటే... నివేదిక పూర్తి పాఠాన్ని కానీ, అది రూపొందించేందుకు ఉపయోగపడిన పరిపాలక గణాంకాలని కానీ ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం. దీనిని మరొక నిపుణుడు సరిచూసే అవకాశం లేకపోవడం వల్ల సరికొత్త, రుజువు కాని పద్ధతుల ఆధారంగా రూపొందించిన నివేదికలు కేవలం రాజకీయ లబ్ది కోసమే వీటిని ప్రచారం చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top