ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పౌరుల నమోదులో అసలు ఆంతర్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జాతీయ పౌరుల నమోదు (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ - ఎన్.ఆర్.సి.) ముసాయిదా తుదిరూపు దిద్దుకుంటోంది కనక అది ఆమోదం పొందితే "పరాయి వారి నుంచి ప్రమాదం" తప్పుతుంది అని భావించే వారికి కొంత ఊరట కలగవచ్చు. "పరాయివారు" అని ఫిర్యాదు చేసే వారి దృష్టిలో వారు జాతీయ పౌరుల నమోదు చిట్టా తయారు చేసే ప్రాంతంలలోకి అక్రమంగా చొరబడి అక్కడి అవకాశాలను వినియోగించుకునే వారు. ఈ చిట్టా తయారీ పూర్తి అయితే ఫిర్యాదు చేసే వారికి ఊరట కలుగుతుంది. తాము యుక్తమైన రీతిలో భారత పౌరులం అన్న గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారు. తమను అనుమాన దృష్టితో చూడకుండా స్వేచ్ఛగా సంచరించవచ్చునని భావిస్తున్నారు.

ఎన్.ఆర్.సి. చిట్టా తయారైతే "భారతీయులుగా" తమ నైతిక ధర్మం నిర్వర్తించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఇతరులపట్ల తమ బాధ్యతను నిర్వర్తించవచ్చునని ఆశిస్తున్నారు. భారత పౌరులు ఎవరో చిట్టా తయారు చేయడంవల్ల పౌరులు తమ బాధ్యతను "న్యాయంగా" నిర్వర్తించవచ్చునని, ఇతరులపట్ల కూడా ఇలాగే వ్యవహరించవచ్చునని "పరాయి" వాళ్లయితే ఆ అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉంది. జాతీయ పౌరుల నమోదు చిట్టా తయారు చేయడం పూర్తి అయితే "పరాయివారు" లేకుండా చేయవచ్చునని ప్రభుత్వ ఆంతర్యంగా కనిపిస్తోంది. కేవలం దేశ పౌరులే పరస్పరం తోడ్పడాలన్నది ప్రభుత్వ ఆలోచనలా ఉంది.

అసలు విషయం ఇదేనా? భూమిపుత్రులు అనుకునే వారితో వలస వచ్చిన వారి రోజువారీ అనుభవం ఎలా ఉంటుంది? "స్థానికులు" అన్న మాటకు ప్రాధాన్యం ఇవ్వడంవల్ల ఈ గడ్డ మీద పుట్టని వారిని విశాల మానవాళిలో అంతర్భాగంగా భావించడానికి అవకాశం ఉండకపోవచ్చు. పైకి చూడడానికి ఆత్మ విశ్వాసాన్ని పాదుకొల్పేదిగా, స్వయంప్రతిపత్తిని (అంటే ఆత్మ గౌరవం) ప్రోది చేసేదిగా కనిపించే ఈ చిట్టా నమోదు ప్రక్రియ ఒక జాతికి పరిమితమైన అంశంగా రూపుదాలుస్తుంది. దేశ సరిహద్దులు దాటి వచ్చిన పరాయివారు ఎవరు అన్నది నిరూపించడం అంత సులువైన పని కాదు.

ఎన్.ఆర్.సి. సిద్ధమైనంత మాత్రాన పరాయివారికి హక్కులు లేకుండా చేయడం, వారిని గుర్తించకపోవడం అన్న సమస్యలకు సమాధానం దొరకదు. "ఈ పని చేసే దమ్ము మాకు ఉంది, ఇలాంటి పని చేస్తున్నది మేమే" అని ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థించేవారు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నైతికత శూన్యం. అందులో ఉన్న విషాదాన్ని వీరోచితమైన ఈ భాష వినియోగించే వారు గమనించడం లేదు. ఎన్.ఆర్.సి. సిద్ధం చేసే సాహసం ప్రదర్శించినందువల్ల మానవ సంక్షోభాన్ని పరిష్కరించగలమా? ఈ చిట్టా తయారీ ఎంత అవసరమైందైనా ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.  

మేం గనక విజయం సాధించాం అన్న ఆనందం ఉంటే ఉండవచ్చు కాని మానవ సంవేదన మాత్రం బలి కాక తప్పదు. ఎందుకంటే పరాయివారిని ఏరి వేయడం మానవాళి అన్న విశాల దృక్పథానికి ఉపకరించేది కాదు. నిజానికి పరాయివారిని ఏరివేస్తాం అని డాంబికంగా మాట్లాడుతున్నవారే తమ మతానికే చెందినవాళ్లయితే వారిని ఆహ్వానిస్తాం అంటున్నారు. అంటే ఇతర మతాల వారిని సహించరనే కదా! ఇది 1984-85లో సూడాన్ లో అంతర్యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయిల్ అనుసరించిన వైఖరిలాగే ఉంది. అరబ్బులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ సమయంలో ఇజ్రాయిలీలు ఇథియోపియాలో శరణార్థుల శిబిరాల్లో చిక్కుకుపోయి ఉన్న యూదులను మాత్రమే విమానాల్లో తరలించారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ పని చేయడం నైతికంగా సమర్థనీయమైంది కాదు. ఇజ్రాయిల్ ఒక్క ఇథియోపియా యూదుల విషయంలోనే మానవత్వం ప్రదర్శించింది. అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఇతరుల గోడు పట్టించుకోలేదు. కాని ప్రస్తుతం మన దేశం విషయానికి వస్తే నిరంకుశాధికార వర్గం ఏలుబడిలో, లేదా ఒక మత వర్గాన్ని మాత్రమే వెనకేసుకువచ్చే నాయకుడో, అలాంటి అభిప్రాయాలున్న కొందరు నాయకులు అధికారంలో ఉన్న సమయంలో మానవత్వానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒంటెత్తు పోకడతోనే చూస్తారు. మన రాజ్య వ్యవస్థ దాడి చేయడానికి అనువైన వారు భూమిపుత్రుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వారి విద్వేషానికి గురికావలసిందేనా అని ప్రశ్నించి తీరవలసిందే. ఎన్.ఆర్.సి. చిట్టాలో చోటు దక్కని వారు తమను వెలివేసినట్టుగా భావించి, పౌర సమాజం విద్వేషానికి గురవుతూ ప్రభుత్వం అనుమాన దృష్టితో చూస్తూ ఉంటే బతుకు ఈడ్వాల్సిందే. వారి మీద విద్వషం వెళ్లగక్కక పోయినా మహా అయితే జాలి చూపవచ్చు. అయినా వెలేసినట్టు చూడడం ఆగదు.

ఈ చిట్టాలో చేరని వారి బిక్క మొహాలు చూస్తే ప్రభుత్వం సవ్యంగా ప్రవర్తిస్తుందనుకుంటే బాధితులకు రక్షణ కల్పించవచ్చు. లేదా అస్పష్టమైన వైఖరి అనుసరించి సరిపెట్టుకోవచ్చు. కాని భూమి పుత్రుల దృష్టిలో ప్రభుత్వ అస్పష్ట వైఖరి కూడా సంతృప్తి కలిగించదు. అదీ తప్పే అనుకోవచ్చు. ఎందుకంటే స్థానిక ప్రజలు పరాయివారిని ఏరి వేయాలన్న విపరీతమైన ఆకాంక్షతో పోరాటాలే చేశారు. చట్టబద్ధంగా పౌరులు ఎవరో అక్రమగా నివాసం ఉంటున్నవారు ఎవరో తేలిపోవాలన్నదే వారి అంతిమ లక్ష్యం. కాని ఇందులో దురుద్దేశం లేకపోతే అందులో నిర్ణాయక కోణమూ ఉంటుంది. నిజానికి ఈ చిట్టా తయారీ సాటి మనిషిని సర్వనాశనం చేయడానికి, బాధించడానికి ఉపకరించకూడదు.

అథిథుల విషయంలో అనాదరణ, కొన్ని సార్లు మనతో పాటే ఉంటున్న వారి మీద విద్వేషం పరాయివారు అన్న అభిప్రాయం కలిగించకూడదు. ఇలా చేయడం అంటే మానవత్వాన్ని విస్మరించడమే. రాజ్యవ్యవస్థ, పౌర సమాజం ఈ నైతికతకు నిబద్ధమై ఉండాలి.

Back to Top