ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పోలీసుల నేరాలపై అదుపు తప్పదు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పోలీసు నిర్బంధంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు మరణించినందుకు కేరళలోని ఇద్దరు పోలీసులకు మరణ శిక్ష విధించారు. మరో ముగ్గురు పోలీసులకు జైలు శిక్ష విధించారు. ఇలాంటి సందర్భాలలో పోలీసులకు శిక్ష విధించడం ఆ మాటకొస్తే మరణ శిక్ష విధించడం ఇదే మొదటి సారి. ఉదయశంకర్ అనే యువకుడిని 2005లో పోలీసులు చిత్రహింసలు పెడ్తే అతను మరణించాడు. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇద్దరు పోలీసులకు మరణ శిక్ష విధించింది. ఈ శిక్ష పడడానికి 13 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టిందన్న మాట అలా ఉంచితే పోలీసు కస్టడీలో ఉన్న వారు మరణిస్తే పోలీసులను శిక్షించే సందర్భాలే లేని చోట ఈ కేసులో శిక్ష పడడానికి దోహదం చేసిన పరిస్థితులు అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. మళ్లీ ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు పోలీసులు బలాదూరుగా శిక్ష తప్పించుకోకుండా నివారించడానికి తోడ్పడతాయి. నేరాలకు సంబంధించి పోలీసులు సాధారణంగా చట్టానికి అనుగుణంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించరు. ఈ విషయంలో 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ మాత్రం ఖాతరు చేయవు.

కానీ ఉదయకుమార్ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారి, శవ పరీక్ష చేసిన డాక్టర్ చాలా శ్రద్ధా తత్పరతో వ్యవహరించారు. ఉదయకుమార్ పోలీసు కస్టడీలో మరణించినప్పుడు కేరళ ప్రభుత్వం ఆ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేసింది. నేర పరిశోధక విభాగం చార్జిషీట్ దాఖలు చేసింది. చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు వచ్చిన ఇద్దరు పోలీసులను అరెస్టు చేసింది. ప్రాసిక్యూషన్ తరఫు ప్రధాన సాక్షి విచారణ సమయంలో ఎదురుతిరిగినప్పుడు ఉదయ కుమార్ తల్లి సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కేరళ హైకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. సీబీఐ కోర్టు ఎన్నదగిన రీతిలో విచారణ కొనసాగించింది. పోలీసు నిర్బంధంలో మరణాలకు సంబంధించిన దర్యాప్తు ఎంత అపసవ్యంగా సాగుతుందో, విచారణ తంతులా ఎలా మారుతుందో అందరికీ తెలిసిందే. సాక్షులు ఎదురు తిరుగుతారు. శవ పరీక్ష చేసిన డాక్టర్లు ఒత్తిడికి లొంగి పోలీసులు ఏ పాపమూ ఎరగరన్న నివేదికలు ఇస్తుంటారు. దర్యాప్తు అసలు విషయాన్ని కప్పి పుచ్చడానికే ఉపకరిస్తుంది. బాధితుల కుటుంబాల వారి దగ్గర కోర్టుల చుట్టూ తిరగడానికి, న్యాయవాదులను నియమించుకోవడానికి ఆర్థిక వసతి ఉండదు.

2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశం చాలా వరకు జాతీయ పోలీసు కమిషన్, ప్రసిద్ధ న్యాయమూర్తుల నాయకత్వంలోని వివిధ కమిటీలు చేసిన సిఫార్సులకు అనువుగానే ఉంది. మన దేశంలో పోలీసు సంస్కరణలు నాసిరకంగా ఉన్నందువల్ల అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశం నిర్ణయాత్మకమైందని భావించారు. కానీ ఈ నిర్దేశాలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు పాటించనందువల్ల ఆ ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. అసలు ఆ సిఫార్సులను పట్టించుకోని సందర్భాలే ఎక్కువ. ఈ నిర్దేశాలలో కొన్ని పోలీసుల వ్యవహారంలో ప్రభుత్వాల అధికారాన్ని తగ్గించేవిగా ఉన్నాయి. అందుకే వాటిని పాటించరు. సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను అమలు చేయక తప్పని స్థితిలో వ్యవహరించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది.

పోలీసు సంస్కరణలు సూచించడానికి వివిధ కమిటీల సిఫార్సులు, సుప్రీం కోర్టు నిర్దేశాలు చాలా సమగ్రంగా ఉన్నాయి. 1861 నాటి పోలీసు చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం రూపొందించాలన్నది ఇందులో ప్రధానమైంది. ఉన్నతాధికారులతో సహా పోలీసుల నియామక, బదిలీ, పదోన్నతుల పద్ధతుల్లో మార్పులతో సహా దర్యాప్తుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వం ప్రమేయం లేకుండా పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పని చేసేట్టు చూడడం మరో మంచి సిఫార్సు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నది మరో సూచన.

పోలీసు వ్యవస్థపై ప్రజలకు అంతంత మాత్రంగా ఉన్న విశ్వాసం పూర్తిగా సడలిపోకుండా ఈ సిఫార్సులు చేశారు. నిజానికి 2018నాటి "భారత్ లో పోలీసు వ్యవస్థ వాస్తవ పరిస్థితి" నివేదికలో నేరాల సంఖ్య, పోలీసులు, కోర్టులు కేసులను పరిష్కరిస్తున్న వైనం, పోలీసు వ్యవస్థలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం, మౌలిక సదుపాయాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలు, బాలలకు సంబంధించిన కేసుల పరిష్కారం మొదలైన ఆరు అంశాలలోనూ మన పోలీసు వ్యవస్థ అణగారిన వర్గాలకు, మైనారిటీలకు వ్యతిరేకంగానే ఉందని తెలియజేశారు. పోలీసులు వర్గ వివక్ష చూపుతారని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. లింగ వివక్ష, కుల వివక్ష, మత వివక్ష, మైనారిటీ మతాలవారిపట్ల వివక్ష, ముఖ్యంగా ముస్లింల పట్ల వివక్ష విపరీతంగా ఉందని ఈ నివేదికలో తెలియజేశారు.

పోలీసు సంస్కరణలు కనీసం నత్తనడకగా అయినా అమలు కానందువల్ల సుప్రీం కోర్టు 2006లో కచ్చితమైన నిర్దేశాలు జారీ చేసి వీటిని అమలు చేయకపోతే కోర్టు ధిక్కారం కింద శిక్షించాలని చెప్పవలసి వచ్చింది.

పోలీసులు వివిధ కారణాల రీత్యా వివక్ష చూపడం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. షికాగోలో పోలీసు సంస్కరణలపై న్యాయ శాఖ 2017లో విడుదల చేసిన నివేదికలో జాతి వివక్ష ప్రబలంగా ఉందని, నల్లజాతి  వారిపై విపరీతంగా బలప్రయోగం చేస్తారని, పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాతే తెల్ల జాతీయులైన పోలీసులు నల్ల జాతి యువకుడిని కాల్చి చంపారు. అయితే షికాగో ప్రభుత్వం, పోలీసులు కలిసి పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి సవివరమైన ప్రణాళిక రూపొందించారు. దీనిని అమెరికా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అమలు చేస్తారు.

నిందుతులైన పోలీసుల దుష్ప్రవర్తన పోలీసు వ్యవస్థపై గౌరవాన్ని, నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని ఉదయ కుమార్ కేసులో సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. "పోలీసు వ్యవస్థపై విశ్వాసం సడలిపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, అది ప్రమాదకరం" అని పేర్కొన్నారు. ధబాంగ్ సినిమాలో పోలీసు అవినీతిపరుడు అయినప్పటికీ పేదలకు, పొరుగు వారికి సహాయం చేయడం సినిమా కథ మేరకు బాగానే ఉంటుంది. కాని వాస్తవానికి ఇది అందనంత దూరం. సత్వరం పోలీసు వ్యవస్థను సంస్కరించవలసిన అవసరం ఉంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top