ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

పలాయితుల కోసం అన్వేషణ వృధా

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

విజయ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారు పన్నులు ఎగవేసి, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి దేశం నుంచి పలాయనం చిత్తగించిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్.డి.ఎ. ప్రభుత్వం 2018 జులై 31న పలాయిత ఆర్థిక నేరగాళ్ల చట్టం తీసుకొచ్చింది. విదేశాలకు పారిపోయి అక్కడ మన చట్టాలు వర్తించవని వాదిస్తున్న వారిని మళ్లీ మన దేశానికి తీసుకు రావడానికి ఈ చట్టం చేశారు. పైగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగవలసి ఉంది కనక పరువు కాపాడుకోవడానికి ఈ చట్టం చేశారు. ఈ కొత్త చట్టం నేరాలకు పాల్పడి దేశం వదిలి వెళ్లే వారిని నిరోధించగలుగుతుందని, వారి మీద నేరారోపణ రుజువు కాకపోయినా వారి ఆస్తులను జప్తు చేయవచ్చునని ప్రభుత్వం వాదిస్తోంది. కాని అది సాధ్యమయ్యేలా లేదు.

ఈ చట్టం నిరోధంగా పని చేయకపోవడం అటుంచి అది రాజ్యాంగబద్ధం కాదని సవాలు చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో న్యాయవ్యవస్థకు ఉన్న విచక్షణాధికారాలను ప్రశ్నించవచ్చు. పలాయితులకు సివిల్ వ్యవహారాల్లో ఉన్న అవకాశాలు లేకుండా చేయడం సహజ న్యయానికి విరుద్ధమైనవి. అసలు ఈ చట్టం మూలకందమే లోప భూయిష్టమైంది.

దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి పలాయనం చిత్తగించే వారి మీద చర్య తీసుకోవడానికి ఇప్పటికే అనేక చట్టాలు, నిబంధనలూ ఉన్నాయి. మరి కొత్త చట్టం పూరించగలిగిన లోటు ఏమిటి? న్యాయ వ్యవహారాల విభాగం చెప్తున్న దాని ప్రకారం అనేక చట్టాలతో పాటు 2002 నాటి డబ్బు దారి మళ్లించే వారిని నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయే వారి మీద చర్య తీసుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ చట్టాల ప్రకారం వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కొత్త చట్టం ఆర్థిక నేరాలకు పాల్పడే వారు పలాయనం చిత్తగించకుండా కాపాడుతుందని అంటున్నారు. అయితే అది ఎలా సాధ్యమో తెలియదు. ఈ చట్టం వారు పలాయనం చిత్తగించిన తర్వాత తీసుకొచ్చింది కనక ఇప్పటికే పారిపోయిన వారి మీద చర్య తీసుకోవడానికి పనికి రాదు. ఈ చట్టం భవిష్యత్తులోనైనా ఇలాంటి ఉదంతాలను పరిష్కరించగలుగుతుందా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే తప్పించుకుని పారిపోయిన వారికి రాజకీయ పలుకుబడి అపారంగా ఉంది. నీరవ్ మోదీ, మాల్యాలాంటి వారికి ఉన్నది ఈ పలుకుబడే. వారి ఆస్తులు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన లొంగి పోతారనుకోవడం అమాయకత్వమే.

తమ పక్షపాత దృష్టిని కప్పి పుచ్చుకోవడానికి దేశంలోని అనేక ప్రభుత్వాలు ఇలాంటి చట్టాలే తీసుకొచ్చాయి. ఈ చట్టాలు ఓటు బ్యాంకులుగా వినియోగపడ్తున్న పేదలను మభ్య పెట్టడానికే పనికి వస్తాయి. దానికి తోడు ఈ చట్టాలను అమలు చేయడానికి రూపొందించే నిబంధనలను బడా వ్యాపారుల ప్రయోజనాలు పరిరక్షించే రీతిలోనే ఉంటాయి. ఇలాంటి వారివల్ల ప్రయోజనం పొందేది రాజకీయ పార్టీలే. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలు కుమ్మక్కు అయినందువల్లే నీరవ్ మోదీ మీద ఉన్న కేసులు వరసగా వాయిదా పడ్తూ వచ్చాయి. విజయ మాల్యా వ్యవహారంలో ఆయన బాకీ పడ్డ పన్ను మొత్తం వసూలు చేయడానికి ఆయన ఆస్తులు వేలం వేస్తే కొనడానికి ముందుకొచ్చినవారే లేరు. వ్యవస్థాపరమైన ఈ లోపాలను సరిదిద్దే ఏర్పాట్లు కొత్త చట్టంలో కూడా లేవు. అవినీతిని అదుపు చేయడానికి ఉన్న అనేక చట్టాలకు ఈ కొత్త చట్టమూ తోడు కావడం తప్ప ఫలితం ఏమీ ఉండదు. తప్పులను నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న దశలో చట్టాలున్నా ప్రయోజనం ఉండదు.

పలాయినం చిత్తగించిన వారివల్ల ఎదురవుతున్న ప్రధాన సమస్య బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోవడమే. దీన్ని అరికట్టడానికి తీసుకున్న నికరమైన చర్యలేమీ లేవు. బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల సమస్య స్వల్పకాలికమైన విషయం ఎంత మాత్రం కాదు. ప్రభుత్వ రంగ  బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో వాటాలు ఉన్న ప్రభుత్వం బ్యాంకుల ఉన్నతాధికారుల నియామకం, బోర్డు సభ్యుల నియామకం కోసం వాటంగా వినియోగించుకుంటోంది. లేదా బ్యాంకులకు పెట్టుబడి సమకూర్చడంలో ప్రభుత్వం నిలక్ష్య ధోరణి అనుసరిస్తుంది. బ్యాంకు ఉన్నతాధికారులు ప్రభుత్వం అండతో నియమితులయ్యే వారే కనక బ్యాంకులను నియంత్రించడానికి అధికారం ఉన్న రిజర్వూ బ్యాంకు కూడా నిస్సహాయంగా ఉండిపోతుంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కనక ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని నివారించలేకపోతున్నారన్న విమర్శ తప్పించుకోవడానికి ఈ కొత్త చట్టం తీసుకు రావడానికి ముందే 2018 మేలో బ్యాంకుల నియంత్రణ (సవరణ) ఆర్డినెన్సు కూడా తీసుకొచ్చారు. చెల్లించని రుణాలను త్వరితగతిన వసూలు చేయడం కోసం ఈ అత్యవసరాదేశం తెచ్చామని చెప్తున్నారు. ఇవేవీ బ్యాంకుల నిర్మాణాత్మక లోపాలను, దేశ ఆర్థిక వ్యవస్థను  సరిదిద్దడానికి పనికొచ్చేవి కావు.

ప్రసుత అవినీతి ఏ ఒక్క ప్రభుత్వ హయాంకో సంబంధించింది కాదు. ఇది ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరించడంవల్ల కలిగిన ముప్పు. ఆర్థిక విధానాలను సరళీకరించడం, ఉదారవాద ఆర్థిక విధానాలను అనుసరించడం మొదలు పెట్టినప్పటి నుంచీ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే ప్రధాన కర్తవ్యంగా మార్చుకుంది. ఎప్పుడూ కొరత ఉండే ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలకు అప్పగిస్తున్నారు. ప్రైవేటు వ్యాపార సంస్థల ప్రయోజనానికి అనుగుణమైన విధానాలనే అనుసరిస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారవర్గాల ప్రయోజనాలను పరిరక్షించాలన్న దీక్ష పూనడంవల్ల అవినీతి పెచ్చరిల్లి పోయింది. కొద్ది మందికి సంపద దోచిపెట్టే విధానాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మందికి నష్టం కలుగుతోంది. సామాజిక-ఆర్థిక-సాంస్కృతిక అంశాలతో సంబంధంలేని విధానాల వల్ల పాతుకుపోయిన అవినీతిని నిర్మూలించడం అసాధ్యం.

ప్రస్తుతం దేశంలో అవినీతి వ్యక్తిరేక ఉద్యమాలన్ని అనైతికం అన్న ఆగ్రహావేశాల ఆధారంగానే సాగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు సైతం ఈ ధోరణికి అనువుగానే ఉన్నాయి. ఈ నైతిక ధోరణి అవినీతి విషయంలో ప్రజల చైతన్య స్థాయిని పెంచవచ్చునేమో కాని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల ఉదాత్త ఆశయాలు నెరవేరవు. ఇవి నిలబడే అంశాలు కావు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top