ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

ఆకలి చావులకు ఎవరు బాధ్యులు?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

దేశ రాజధాని దిల్లీలో ముగ్గురు బాలికలు ఆకలికి అలమటించి మరణించిన ఉదంతం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఉదంతం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లకు కూడా రాజ్య వ్యవస్థ పౌరులను కాపాడలేకపోతోందన్న ప్రశ్ననే కాక మనం ఎంచుకున్న అభివృద్ధి మార్గాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. ఎనిమిదేళ్ల మన్సి, నాలుగేళ్ల శిఖ, రెండేళ్ల పరుల్ ను జులై 24 న ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాని అప్పటికే ఆ ముగ్గురూ మరణించినట్టు డాక్టర్లు తేల్చారు. శవ పరీక్షలో ఆ పసి కందులవి ఆకలి చావులు అని నిర్ధారణ అయింది. వారి తండ్రి కనిపించడం లేదు. తల్లికి మతి స్థిమితం లేదు. ఇప్పుడు తల్లి ఆసుపత్రిలో ఉన్నారు. వైపరీత్యం ఏమిటంటే దేశం ఇప్పుడు పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం నుంచి వస్తు వినిమయ వ్యామోహ పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఈ వినిమయదార్లు ఎవరు? ఎవరు ఎంత వినియోగిస్తున్నారు? ఆహారోత్పత్తి, సేవా రంగం సంతృప్తికరంగానే ఉన్నాయి. కాని ఈ "వినియోగదారు అయిన భారత్"కు ఆకలి చావుల గురించి తెలుసా?

ఈ ముగ్గురు బాలికలు ఆకలి చావుల బారిన పడకముందే గత ఆరు నెలల కాలంగా ఆకలి చావుల వార్తలు అనేకం వచ్చాయి. ఈ వార్తలు ఎక్కువగా జార్ఖండ్ నుంచి, ఆ తర్వాత కర్నాటక, ఛత్తిస్ గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఈ అన్ని సందర్భాలలోనూ నిజ నిర్ధారణ సంఘాల నివేదికలు, మీడియాలో వచ్చిన వార్తలు వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. ఈ వ్యవస్థ అన్నార్తులను ఆదుకోలేకపోయిందనే చెప్పాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా సబ్సిడీ ధరలకు ధాన్యం సరఫరా చేయాలి, బడికెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలి. తల్లులకు పోషకాహారం అందించాలి. అంగన్ వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారం సరఫరా చేయాలి. ఈ ముగ్గురు బాలికల్లో ఎనిమిదేళ్లున్న మన్సి నిజానికి బడికి వెళ్లాల్సింది. ఉచిత, నిర్బంధ విద్య ఆమెకు విద్యా హక్కు చట్టం ద్వారా అందాల్సింది. మిగతా ఇద్దరు పిల్లలకు అంగన్ వాడీల ద్వారా పోషకాహారం అందాల్సింది. ఆ బాలికలు నివసిస్తున్న ప్రాంతంలో ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ వారు మరణించడానికి కొద్ది నెలల ముందు నుంచీ వారికీ ఈ సదుపాయాలేవీ అందలేదని దిల్లీ రోజీ రోటి అధికార్ అభియాన్ నిజ నిర్ధారణలో తేలింది. వారి కుటుంబం వలస వచ్చినందువల్ల, ఈ సదుపాయాలు పొందడానికి, నమోదు చేయించుకోవడానికి వారి దగ్గర తగిన పత్రాలు లేనందువల్ల వారికి ఏ సదుపాయమూ అందలేదు. లేదా దిల్లీలో రేషన్ కార్డులు అందించవలసిన కోటా అప్పటికే పూర్తి అయి ఉండవచ్చు.

ఈ ఉదంతంలో పూర్తి వివరాలు తెల్సుకోవడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన ఆకలి చావులకు గురైన వారి విషయంలో వారికి జాతీయ ఆహారభద్రతా చట్టం కింద అందవలసిన సదుపాయాలు అందనే లేదు. లేదా వయసు మీరిన వారికి, ఒంటరిగా ఉన్న మహిళలకు అందవలసిన సామాజిక భద్రత అందుబాటులోకి రాలేదు. దీనికి ఉన్నతాధికార వర్గాల అలసత్వమో, ఆయా రాష్ట్రాలకు ఉన్న నిధుల లేమో కారణం కావచ్చు. చాలా కాలం పాటు ఆకలికి అలమటించవలసి వచ్చిన ఈ అన్ని ఉదంతాలలోనూ సామాజిక భద్రతకు తగిన వ్యవస్థలు అమలులో ఉన్నా అణగారిన వర్గాలకు చెందిన వారికి ఆ సదుపాయాలు అందడం లేదన్నది మాత్రం వాస్తవం. సామాజిక భద్రతా పథకాలను సవ్యంగా అమలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, పట్టణ ప్రాంతాలలో సామాజిక వంటశాలలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ పంపిణీ విధానం ద్వారా ఆహార ధాన్యాలు అందజేయవలసిన అవసరం చాలా ఉంది. అలాగే సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం ప్రధానం. ఇలాంటి ప్రయత్నాలు కొన్ని రాష్ట్రాలలో అమలైనాయి. వాటి వల్ల ఫలితాలు కూడా అందాయి. ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయాలి. అదీ గాక ఆధార్ కార్డు ఉంటేనే ఇ పథకాల అమలుకు అర్హత ఉంటుందన్న నియమం ఉండకూడదు. అవసరమైన వారినందరినీ ఆదుకునే సామాజిక భద్రతా విధానాలను అమలు చేయాలి.

రాజ్య వ్యవస్థ అందజెసే సదుపాయాలను అందజేయడంతో పాటు రెండు దశాబ్దాలుగా ఆర్థికాభివృద్ధి అధికంగానే ఉన్నప్పటికీ ఆకలి చావులు ఎందుకు ఉన్నాయన్న విషయంలో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థలో కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం కలుగుతోంది. చాలా మందికి జీవనోపాధికి, గౌరవప్రద జీవనానికి అవకాశమే ఉండడం లేదు. ఉపాధి అవకాశాలు కొరవడుతున్నాయి. ఈ వాస్తవాలను అంగీకరించాలి. జీవనోపాధికి భద్రత కొరవడినందువల్ల లక్షలాది మంది దుర్భర జీవితం గడపవలసి వస్తోంది. వారి జీవనోపాధికి భద్రత లేదు. ఈ ముగ్గురు అమ్మాయిల పొరుగు వారికి వారి పరిస్థితి దుర్భరంగా ఉందని తెలుసు. కాని అది మరణానికి దారి తీస్తుందని వారు ఊహించి ఉండరు. ఇలాంటి సందర్భాలలో రాజ్యం ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిస్థితి దేశంలో మరెక్కడైనా తలెత్తవచ్చు.

వనరుల సమాన పంపిణీపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. రాజ్య వ్యవస్థ, రాజకీయ పార్టీలు చేయవలసింది ఇవి ఆకలి చావులు అవునా కాదా అని శుష్క చర్చలతో కాలం వృధా చేయడం కాదు. ఈ విషయమై చర్చించేట్టు చూడాలి. ఆకలి చావులకు గురైన వారందరూ తీవ్ర పేదరికంలో ఉన్న వారే. వారికి ఆహారం, పోషకాహారం, ఆరోగ్య సేవలు అందలేదు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ పరిస్థితితికి జవాబుదారీతనం ఉండాలి. పరిస్థితి ఇలాగే కొనసాగడానికి ఎంత మాత్రం అవకాశం ఉండకూడదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top