ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సంపాదకుడి వ్రాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ సంపాదకుడిగా ఉండడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం. ఉత్తమమైన పత్రికగా ప్రఖ్యాతి కొనసాగుతున్నప్పుడు సంపాదకుడిగా ఉండడం మరింత సంతోషకరం. ఉత్తమ పత్రికగా స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఇ.పి.డబ్ల్యు. బృందం నిబద్ధతతో చేస్తున్న కృషి, ఈ పత్రికను ఆదరిస్తున్న వారి మద్దతు పత్రిక విశిష్ట స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కారణం. ఇ.పి.డబ్ల్యు. సంపాదకత్వం బాధ్యతతో కూడిన వ్యవహారం. భిన్నమైన, వైవిధ్యభరితమైన ఆలోచనలకు ఈ పత్రిక తావిస్తుంది. స్థానికంగానూ, విశ్వవ్యాప్తంగానూ పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న దశలో భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు వ్యక్తమయ్యే స్థితిలో, ఆర్థిక వ్యవస్థలు పరిణామం చెందే పరిస్థితి ఉన్న తరుణంలో విమర్శనాత్మకమైన అభిప్రాయాలకు ఈ పత్రిక స్థానం కల్పిస్తుంది.

ఈ పత్రిక ఓ సార్వత్రిక విశ్వవిద్యాలయం లాంటిది. అందుకని సహజంగానే తన అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దదు. భిన్నమైన అభిప్రాయాలను గౌరవిస్తుంది. ప్రతి జీవికి సమానమైన మానవతా విలువ ఉండాలని భావిస్తుంది. ఇ.పి.డబ్ల్యు చర్చలు వాదనాపటిమతో కూడుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీలకాంశాలపై దృష్టి కేంద్రీకరిస్తాయి.

రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మారుతున్న ప్రస్తుత తరుణంలో ఇ.పి.డబ్ల్యు. పాత్ర కీలకమైంది. రాజకీయాలు కుటిలమైపోయాయి. రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణ ఎంత బలంగా ఉందనుకున్నా అదీ బూటకపు వ్యక్తీకరణలాగే మిగిలిపోతోంది. రాజకీయ వ్యక్తీకరణ నిండా మాటల గారిడీయే నిండిపోయినందువల్ల బూటకపు వాగ్దానాలతో ధారాళంగా మాటలు దొర్లించే వారు భ్రమలు కల్పించగలుగుతున్నారు. ప్రధానమైన రాజకీయ శక్తులకు దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి అధికారంలో కొనసాగడం. రెండవది ఆ అధికారాన్ని తమ సామాజిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వినియోగించడం.

అధికారంలో ఉన్న వారి రాజకీయ అభిప్రాయాలను వ్యతిరేకించే వారు ఒక వేపు చీలికలు వాలికలై ఉంటే మరో వేపు వారి మీద ట్విట్టర్, బ్లాగులు, వాట్స్ ఆప్ మొదలైన సామాజిక మాధ్యమాల ద్వారా దాడి కొనసాగే ప్రమాదం పొంచి ఉంది. సమకాలీన ఆలోచనల్లో సంకుచితత్వం వల్ల తమ రాజకీయ అభిప్రాయాలే సరైనవన్న అభిప్రాయానికి వస్తున్నారు. అయితే ఈ సంకుచిత భావాలు, మితవాద రాజకీయ అభిప్రాయాలు ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడి అవుతున్నాయి.

"రెండు నిమిషాల్లో మాగీ సిద్ధం" లాంటి భావాలు పరిణామాత్మక ఆలోచనలకు తావు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి అడ్డ దారి గంభీరమైన, ఉపయుక్తమైన ఆలోచనా స్రవంతికి విఘాతం కలిగిస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభం కాకపోయినా ఆ సంక్షోభానికి సంకేతం. ఇలాంటి భావాలు ఉన్న వారు ఇతరులు స్వతంత్రంగా ఆలోచించడాన్ని భరించలేరు. తాము "సవ్యమైన మార్గంలో" ఉండాలనుకునే వారు "పురోగమన భావాలు" ఉన్నవాళ్లమనుకుంటారు. వీరు రాజకీయంగా సరిగ్గా ఉండాలనుకుంటారు తప్ప రాజకీయ చైతన్యంగలవారిగా ఉండాలనుకోరు. రాజకీయంగా సరిగ్గా ఉండాలనుకునే వారు "బూటకపు మాటల మాయ"లో పడిపోతారు. లేదా తాము వ్యతిరేకించే వారిని మాటలతో చిత్తు చేయాలని చూస్తారు.

దీనికి తోడు మాటలతో ఆడుకునే వారివల్ల పరిణామాత్మక ఆలోచనకు మరింత విఘాతం కలుగుతుంది. సమాకాలీన పరిస్థితిలో ప్రధానమైన రాజకీయ భావాలు ఉన్న వాళ్లమని అనుకునే వారికి, దీనికి విరుద్ధమైన బావాలు ఉన్నాయని అనుకునే వారికి మధ్య సంభాషణ కేవలం ఒక తంతుగా మారుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం తన లొసుగులను కప్పి పుచ్చుకోవడానికి "దేశద్రోహులు," "కుహనా సెక్యులర్ వాదులు" వంటి మాటలు వినియోగిస్తుంది. వైపరీత్యం ఏమిటంటే దీనికి విరుద్ధమైన భావాలు వ్యక్తం చేస్తున్నామనుకునే వారు కూడా అవే పడికట్టు మాటలు వాడతారు.

ఇ.పి.డబ్ల్యు. తెరిచిన పుస్తకం లాంటిదే తప్ప తీవ్రంగా ఆలోచించే ఉన్నతవర్గ సమూహం కాదు. మరో రకంగా చెప్పాలంటే భావ సారూప్యత ఉన్న వారు, మేధాపరంగా ఉన్నత వర్గానికి చెందిన వారు, పండితులు, సామాజిక కార్యకర్తలు ఇతరుల భావాలతో అంగీకరించే వారు లేదా ఒకరి కోసం ఒకరు రాసే వారు. తాము వాడే భాష అద్భుతమైందని, వారు రాసే ఇతివృత్తాలే సవ్యమైనవని భావిస్తారు. ఇలాంటి తీవ్రమైన వాదనలు చేసే వారి భాషను "అందరికీ తెలిసినట్టే" అన్న పదబంధాల వల్ల గుర్తించవచ్చు. ఇలాంటి సందర్భాలలో ప్రజాభ్యున్నతి ప్రజలకు సంబంధం లేనిదిగా మిగిలిపోతుంది.

ఇ.పి.డబ్ల్యు. తెరిచిన పుస్తకం లాంటిదే కాని, రహస్యంగా ఉంచే బ్లాగు లాంటిది కానందువల్ల భిన్న ఆలోచనా ధోరణుల నుంచి కీలకమైన భావాలు వ్యక్తమవుతాయని ఇ.పి.డబ్ల్యు. నమ్ముతుంది. విమర్శనాత్మకమైన లోచూపు ఉన్న భావాలు ఏదో ఒక చోట నుంచి మాత్రమే రావని సకల విమోచనోద్యమాల నుంచి ఇవి వస్తాయని కూడా ఇ.పి.డబ్ల్యు. విశ్వసిస్తుంది. ఈ పత్రిక సవిమర్శక ఆలోచనా ధోరణిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. ఇది పరిణామాత్మకంగా ఉండాలని ప్రయత్నిస్తుంది. ఇ.పి.డబ్ల్యు. ప్రచురించే రచనలు, ఆలోచనలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకుంటుంది. వివిధ వర్గాల మధ్య సయోధ్యతోనే ఇది సాధ్యమవుతుంది. ఇ.పి.డబ్ల్యు. డిజిటల్ సంచిక, ఈ పత్రికలో వచ్చే రచనలను వివిధ భాషల్లోకి అనువదించి ప్రచురించడంవల్ల పరిణామాత్మక ఆలోచనలను పెంపొందింప చేయాలని ప్రయత్నిస్తోంది.

ఇ.పి.డబ్ల్యు. చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని, మానవాభ్యున్నతికి విమోచనకి తోడ్పడాలనీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top