ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మారుతి కార్మికులపై ఎందుకీ కక్ష?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మారుతి సుజుకి కార్మిక సంఘానికి చెందిన పదమూడు మంది మీద అక్రమంగా నేరారోపణ మోపి వారికి జీవిత ఖైదు విధించినందుకు నిరసనగా జులై 18వ తేదీన వేయి కన్నా ఎక్కువ మంది కార్మికులు గురుగ్రాం (గూర్గావ్) లో ప్రదర్శన చేశారు. వీరిలో 12 మంది మారుతి సుజుకి కార్మిక సంఘం కార్యనిర్వాహక సభ్యులే. వీరి మీద "అక్రమ" కేసులు మోపారని ఎందుకు అంటున్నామంటే పోలీసులు మారుతి కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై కూట సాక్ష్యాలు సృష్టించారు. మొత్తం 148 మంది కేసు దాఖలు చేస్తే 117 మందిపై ఆరోపణలు నిరూపించడానికి సాక్ష్యాధారాలే లేవని అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.పి.గోయలే అంగీకరించారు. సాక్షులు వీరిలో ఒక్కరినైనా గుర్తించలేకపోయారు. ఈ 148 మంది "అనుమానితులు" అని కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన జాబితాలో ఉన్న వారే. పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు చేసి వారి మీద ఆరోపణలు మోపలేదు. మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే న్యాయమూర్తి గోయెల్ ఆరోపణలు లేని వారి ఒక్కరి వాగ్దానాన్ని కూడా అంగీకరించలేదు. "నేరం" జరిగిందనే ఆరోపణ ఉన్న సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఇతరుల సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.

మారుతి కార్మికులు నిరసన ప్రదర్శన జరిపిన ఈ జులై 18ననే సరిగ్గా ఆరేళ్ల కింద 2012 జులై 18న ఆ కంపెనీ పర్సనల్ మేనేజర్ అవనీశ్ దేవ్ గొడవ జరిగినప్పుడు మరణించాడు. నిజానికి తమ కార్మిక సంఘాన్ని రిజిస్టర్ చేయించుకోవడానికి కార్మికులు చేసిన పోరాటానికి అవనీశ్ దేవ్ సానుభూతి చూపే వారు. కంపెనీ యాజమాన్యం రెచ్చగొట్టిన ఘర్షణలో మరణించింది దేవ్ ఒక్కరే. ఘర్షణ జరిగిన సమయంలో అంతుపట్టని రీతిలో అగ్ని ప్రమాదం జరిగి ఊపిరాడక దేవ్ మరణించారు. మారుతి సుజుకి యాజమాన్యం, హర్యాణా ప్రభుత్వం కార్మికుల మీద కక్ష సాధింపు వైఖరి అనుసరిస్తోంది. హర్యాణాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం 13 మంది కార్మికులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను మరణ శిక్షగా మార్చాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించడం ఆశ్చర్యకరమేమీ కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల మీద ఎందుకు కక్ష సాధిస్తున్నట్టు?  

13 మంది కార్మికులకు మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ ఎందుకు పట్టుబడుతోంది అని సెషన్స్ కోర్టు ప్రత్యేక ప్రాసిక్యూటర్ అనురాగ్ హూదాను అడిగితే "మన (భారత) పారిశ్రామిక ఉత్పత్తి సన్నగిల్లింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘భారత్ లో తయారీ’ (మేక్ ఇన్ ఇండియా) అంటున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు జరగడం మన దేశ ప్రతిష్ఠకు భంగకరం" అని సమాధానమిచ్చారు. అంటే కార్మికులు సంఘం పెట్టుకోవడానికి చట్టబద్ధమైన హక్కు హరించాలన్న మాట. నిరంతరం పని చేసే వారిని కాంట్రాక్టు కార్మికులుగా కాకుండా ఉద్యోగంలో ఉన్న కార్మికులుగా పరిగణించాలనీ, కార్మిక సంఘంలో క్రియాశీలంగా పని చేస్తున్నవారిని కక్ష సాధింపు ధోరణితో ఉద్యోగాలనుంచి తొలగిస్తే వారిని మళ్లీ ఉద్యోగాల్లో నియమించాలని కోరే హక్కు కార్మికులకు లేకుండా చేయాలన్న మాట. కార్మికులు తమ వాస్తవ సమస్యలను చెప్పే అవకాశం లేకుండా చేయాలన్న మాట. పారిశ్రామిక ఉత్పత్తి పెంచడానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరడానికి యాజమాన్యానినికి సంపూర్ణ అధికారాలు ఉండాలని వాదిస్తున్నారు. కార్మిక సంఘంలో క్రియాశీలంగా ఉండేవారిని ఇష్టానుసారం బదిలీ చేస్తున్నారు. సస్పెండ్ చేస్తున్నారు. బర్తరఫ్ చేస్తున్నారు. కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించడం లేదు. విధి లేక కార్మికులు రెండేళ్ల పాటు పోరాడి యాజమాన్యానికి తాబేదారుగా వ్యవహరించే కార్మిక సంఘానికి గుర్తింపు ఇవ్వకుండా అసలైన కార్మిక సంఘానికి గుర్తింపు సంపాదించడానికి కృషి చేశారు. 2012 జనవరి ఆఖరున కార్మిక సంఘానికి గుర్తిపు దక్కింది. అంటే మారుతి కంపెనీలో రగడ జరగడానికి కేవలం అయిదు నెలల ముందు ఈ గుర్తింపు సాధించుకున్నారు.

ఆ సంస్థలో ఉన్న అసలు సమస్య ఏమిటంటే కార్మికులను నికరమైన ఉద్యోగాల్లో నియమించకుండా కాంట్రాక్టు కార్మికులుగా నియమించే అధికారం ఉండాలని యాజమాన్యం కోరుతోంది. కాంట్రాక్టు కార్మికులకైతే తక్కువ వేతనాలు చెల్లించవచ్చు. అనేక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉండదు. కాంట్రాక్టు కార్మికులైతే పని చేసే పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా అడిగే వారు ఉండరు. ఈ దుష్ట విధానాన్ని కొనసాగించడానికి మునుపు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రభుత్వ యంత్రాంగం మారుతీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కైనాయి. పోలీసులూ అదే పని చేశారు. మునుపు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, పోలీసులు కలిసి కార్మికుల మీద బూటకపు కేసులు పెట్టారు. ఆ రకంగా మొత్తం కార్మికవర్గాన్నే బెదరగొట్టడానికి ప్రయత్నించారు. కార్మికులు ఎక్కడైనా ప్రతిఘటిస్తే వారికీ మారుతీ కార్మికులకు పట్టిన గతే పడుతుందన్న హెచ్చరికలు జారీ చేయడం వారి ప్రధాన ఉద్దేశం. మోదీ నినాదమైన మేక్ ఇన్ ఇండియా విజయవంతం అవుతున్నట్టు చూపించాలి కనక బీజేపీ కార్మికులపట్ల మరింత కఠిన వైఖరి అనుసరిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి, వారికి లాభాలు సమకూర్చి పెట్టడానికి ఇంతకన్నా మెరుగైన మార్గం ఉండదు కదా!

యావజ్జీవ శిక్ష పడ్డ 13 మంది కార్మికులకు మరణ శిక్ష విధించాలని కంపెనీ హైకోర్టుకు విన్నవించడంలో ఆంతర్యం ఇదే. 2012 జులై 18న మారుతి సంస్థలో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే యాజమాన్యం ఎలాంటి దర్యాప్తు లేకుండా, అప్పీలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా 2,300 మంది కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకుంది. న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చిన 117 మందికి శిక్ష విధించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయాలని హర్యాణా ప్రభుత్వం అర్జీ దాఖలు చేస్తోంది.

అయితే ఈ కథ ఇక్కడితో ముగియ లేదు. యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ 13 మందికి మరణ శిక్ష విధించేట్టు చేయాలని ప్రయత్నిస్తోంది. కార్మికుల తరఫున సీనియర్ న్యాయవాదులు బృందా గ్రోవర్, రెబెకా జాన్, ఆర్.ఎస్.చీమా వాదించనున్నారు. అవనీశ్ దేవ్ ను గాయపరచి, నిప్పు పెట్టి, ఆయన మరణానికి కారణమైంది కార్మికులేనన్న సాక్ష్యాధారాలు పుట్టించడం యాజమాన్యానికి సులభమేమీ కాదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top