ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పలస్తీనాను నట్టేట ముంచిన ఇజ్రాయిల్

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పలస్తీనాను వెలివేస్తూ "ఇజ్రాయిల్, ది నేషన్ స్టేట్ ఆఫ్ జ్యూయిష్ పీపుల్" (ఇజ్రాయిల్ యూదుల జాతి రాజ్యం) చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఇజ్రాయిల్ దౌర్జన్యానికి ఒడిగట్టింది. అంటే పలస్తీనియన్లను శాశ్వతంగా వారి దేశం నుంచి తరిమేయడానికి చట్టం రూపొందించింది. ప్రముఖ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఖండించినా అది పేరుకు మాత్రమే. ఈ అంశంపై ఆ దేశాల నిర్లక్ష్యం ఈ ఖండనల్లో స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడడానికి జోక్యం చేసుకోలేని స్థితిలో ఆ దేశాలు అనుసరించే వ్యూహం నిర్లక్ష్యం వహించడమే కాబోలు. ఇజ్రాయిల్ కు మిగిలిన ఏకైక అగ్ర రాజ్యం అమెరికా మద్దతు ఉంది. అందుకే ఇజ్రాయిల్ తన సైనిక శక్తినంతా మోహరిస్తోంది. అమెరికాను వ్యతిరేకించే దేశాలన్నీ కలిసినా ఓడించలేనంతటి సైనిక శక్తి ఇజ్రాయిల్ కు ఉంది. అమెరికా దన్నువల్ల ఇజ్రాయిల్ ను ఓడించడం అసాధ్యం అయిపోయింది. ఇజ్రాయిల్ మొదటి నుంచీ ఎలాంటి ప్రాయశ్చిత్తం లేకుండా వ్యవహరిస్తోంది కనక నైతికంగా కూడా ఆ దేశాన్ని ఎదుర్కునే అవకాశం లేకుండా పోతోంది. పౌరులతో నాగరికంగా వ్యవహరించడం ఇజ్రాయిల్ కు అలవాటు లేని విషయం.

ఇజ్రాయిల్ ప్రవర్తనను ప్రపంచ దేశాలు పట్టించుకోకపోవడానికి ఈ దశలో ఉన్న భిన్నమైన పరిస్థితి కారణం కావచ్చు. ఇజ్రాయిల్ ఏ విలువలనూ పాటించదు. జాత్యహంకార ధోరణే ప్రదర్శిస్తుంది. జ్ఞానోదయ శకం నుంచి ఇజ్రాయిల్ ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కే స్వభావాన్నే వ్యక్తం చేస్తోంది. సర్వులకూ వర్తించే రిపబ్లికన్ విలువలను ఇజ్రాయిల్ ఏ మాత్రం ఖాతరు చేయదు. వారసత్వంగా అమలులోకి వచ్చిన అసమానతలను పారదోలడానికి రిపక్లికన్ విలువలు ఉపకరిస్తాయని అంగీకరించదు.

జులై 19వ తేదీన ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్ ఆమోదించిన ఈ చట్టాన్ని కరడు గట్టిన జియానిస్టులు మహదానందంతో ఆహ్వానించారు. ఆలంకారికమైన జియానిస్టు నినాదాలను నమ్మిన వారు వంచనకు గురయ్యారు. ఆ జియానిస్టు నాయకులనే నమ్మారు. ఇజ్రాయిల్ రాజ్యం ఏ విలువల ఆధారంగా ఏర్పడిందో ఆ విలువులు మంటగలుస్తూ ఉంటే మౌనంగా దుఃఖించడం తప్ప ఏమీ చేయలేక పోతున్నారు.

ఇజ్రాయిల్ ఆమోదించిన చట్టం ఇజ్రాయిల్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించినప్పుడు విడుదల చేసిన ప్రకటనకు పూర్తి భిన్నమైందని సంగీతకారుడు, పియానో కళాకారుడు డేనియల్ బేరెన్ బోయిం ఆవేదన వ్యక్తం చేశారు. 1948లో ఇజ్రాయిల్ అవతరించినప్పుడు యూరప్ నుంచి వలసవెళ్లిన వారు ఏకమయ్యారు. "పొరుగు రాజ్యాలతో, ఆ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం" అని అప్పుడు ఇజ్రాయిల్ వాగ్దానం చేసింది.

బేరెన్ బోయిం వ్యక్తం చేసిన ఆగ్రహంలో చిత్త శుద్ధి కనిపిస్తోంది. అయితే ఆయన ప్రదర్శించిన అమాయకత్వం దిగ్భ్రాంతికరంగా ఉంది. ఇజ్రాయిల్ చేసిన వాగ్దానాలను, తీరా వాటిని వమ్ము చేసిన తీరు చూస్తే వాగ్దానాలు ఉన్నదే భంగం చేయడానికి అన్న అభిప్రాయం బలపడుతోంది. అమెరికా ఆమోదించిన బిల్ ఆఫ్ రైట్స్ లోనూ, ఫ్రెంచి విప్లవ పర్యవసానంగా ఆమోదించిన మానవుల, పౌరుల హక్కుల ప్రకటనలోనూ ఇదే వంచన కనిపిస్తుంది. ఈ రెండు సందర్భాలలోనూ బానిసత్వం, జాతి వివక్ష, సైనిక దాడులు, వలసవాదం పెల్లుబికిన సమయంలో ఉదాత్తమైన ప్రకటనలు వెలువడ్డాయి.

కానీ ఈ ఉదాత్త ఆశయాలేవీ ఇజ్రాయిల్ అస్తిత్వంలోకి రావడాన్ని, ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్రవర్తనను అడ్డుకోలేకపోయాయి. మొదటి నుంచీ ఇజ్రాయిల్ జియానిస్టు ధోరణినే ప్రదర్శించింది. సామ్రాజ్య వాద దేశాలతో కలిసి దురాక్రమణ విధానాలనే అనుసరిస్తోంది. ఇజ్రాయిల్ అనుసరించిన జియానిస్టు విధానంవల్ల అసలు పలస్తీనా అస్తిత్వాన్నే నిరాకరించింది. "పలస్తీనియన్లకు దేశమే లేకుండా పోయింది. పలస్తీనియన్లు దేశం లేని వారిగా మిగిలిపోయారు."

ఇజ్రాయిల్ అనుసరించిన కరడుగట్టిన జాతి విద్వేషం కారణంగా, కిరాతకంవల్ల పలస్తీనియన్లు తమ సొంత గడ్డను వదిలి పలస్తీనియన్లు మైనారిటీలుగా ఉన్న అరబ్ దేశాలకు వెళ్లవలసి వచ్చింది. 1967లో జరిగిన సైనిక దాడుల తర్వాత ఆనందహేలలో విస్మరించిన అంశం ఏమిటంటే యూదులు ఇజ్రాయిలీలూ ఇప్పటికీ మైనారిటీలే.

ప్రపంచంలోని ఆ మూల ఉన్న ఏకైక ప్రజాస్వామ్య దేశం తమదేనని చెప్పుకున్న ఇజ్రాయిల్ జాతి వివక్ష విధానలనే అనుసరించింది. అందువల్ల ప్రస్తుత పరిణామాలు ఏ మాత్రం ఆశ్చర్యకరం కాదు. ఇజ్రాయిల్ ను సమర్థిస్తున్న పశ్చిమ దేశాలు, ప్రధానంగా అమెరికా సాంస్కృతిక వైవిధ్యాన్ని ఎంత మాత్రం మౌలిక విలువగా భావించడం లేదు కనక, ప్రజాస్వామ్యం ఒక హక్కుగా కాక ఒక విశేష అధికారంగా గుర్తిస్తున్నందువల్ల ఆశ్చర్యానికి, దిగ్భ్రమకూ స్థానమే లేదు.

అసలు ఇజ్రాయిల్ అవతరణే ఒక వైపరీత్యం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వెనుదిరుగుతున్న పశ్చిమ దేశాల వలసవాదులు పెట్టి పోయిన కుంపటి ఇజ్రాయిల్. వలసవాద విశేషాధికారాలు కోల్పోయిన తర్వాత వలసవాదులు సంక్షేమ రాజ్యం అన్న పదబంధాన్ని మనుగడలోకి తీసుకొచ్చారు. మునుపటి వలస దేశాల నుంచి వలస వచ్చిన వారిని తమ దేశాల్లో పనివాళ్లుగా వినియోగించుకున్నారు. తమ దేశాల అభివృద్ధికి వలస వచ్చిన వారిని పావులుగా వాడుకున్నారు. 1980ల నాటికి సంక్షేమం, అభివృద్ధి అన్న రెండు మాటలు సంక్షోభంలో కూరుకుపోయాయి. నయా ఉదారవాదం కావలసి వచ్చింది. పౌరులందరినీ జాతి, లింగ, మత భేదాలు లేకుండా న్యాయంగా చూస్తాం అని హామీలు గుప్పించవలసి వచ్చింది. జాతి రాజ్యాల మధ్య, ఆ దేశాలలోని వారి మధ్య అసమానతలు పెరిగిపోతున్నందువల్ల ఈ హామీలు ఇవ్వవలసి వచ్చింది.

అణగారిన వర్గాల వారిలో అసంతృప్తి, అభద్రతా భావం  పెరిగి పోతున్నందువల్ల విశేషాధికారాల గురించి మళ్లీ ప్రస్తావించవలసి వచ్చింది. సంపన్నత పై మెరుగులకే ఉపయోగపడడం, కొద్ది మందికే పరిమితమైంది కనక జాతి వివక్ష పెరిగింది. కొత్త జాతీయతా భావాలు తలెత్తుతున్నాయి. ప్రపంచ దృక్పథంలో ఇది ఒక మహత్తరమైన విధానం అయిపోయింది.

ఇజ్రాయిల్ ఒక జాతి రాజ్యం అని ప్రకటించుకోవడానికి ఏ దాపరికంలేని జాతివివక్ష భావాలున్న డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చే దాకా ఆగవలసి వచ్చింది. తమ దేశాన్ని ద్విజాతి దేశంగా అంగీకరించడానికి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తిరస్కరించారు. అయితే సమీప భవిష్యత్తులో పలస్తీనా భూభాగంపై తమ పెత్తనం కొనసాగుతుందని బాహాటంగానే ఆయన ప్రకటించారు.

ఇది విషాదకరమైన భవిష్యత్తుకు సంకేతం. కానీ ఎంత ఒంటరివాళ్లుగా ఉన్నప్పటికీ పలస్తీనా ప్రజలు కృతనిశ్చయంతో పోరాడడానికి సిద్ధంగానే ఉన్నారు. ద్విజాతి రాజ్య పరిష్కారం, ఒకే రాజ్యంలో రెండు జాతులు, ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయని, మత విభేదాలతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమాన హక్కులు ఉంటాయి అన్న బూటకపు వాగ్దానాల కారణంగా కొంత కాలంగా పలస్తీనా విమోచనోద్యమం నిద్రాణంగా ఉంది. ఇజ్రాయిల్ విధ్వంసం సృష్టించి మరణ మృదంగం మోగిస్తున్నందువల్ల పలస్తీనా ప్రజలు మళ్లీ ఉద్యమించవచ్చు. లేకపోతే విపత్కరమైన ఘర్షణలకు మొత్తం ప్రపంచం బలి కావలసి వస్తుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top