ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బక్క రైతును ఆదుకోని మద్దతు ధర

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

భారత్ లో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించడాన్ని ఓట్లు రాబట్టడానికి ఎన్నికలలో ఉపకరణంగా పరిగణిస్తారు. 2019 ఖరీఫ్ పంటల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా ఈ పద్ధతికి మినహాయింపు కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు రైతుకు అయిన ఖర్చు మీద ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని వమ్ము చేసింది. అయినా ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరలో పెంపుదల "చరిత్రాత్మకమైంది" అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇది కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ప్రచారమే.

అయితే తాజాగా ప్రకటించిన కనీస మద్దతు ధరలో "చరిత్రాత్మకమైంది" ఏమీ లేదు. యు.పి.ఎ. రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించిన కనీస మద్దతు ధర ఒక్క రాగులకు మినహా మిగతా పంటలకు ప్రకటించిన ధర తక్కువే. ఈ కనీస మద్దతు ధర ప్రకటించడానికి ముందే కందులు, రాగులు, మినుములు, వరి లాంటి ఖరీఫ్ పంటలకు సేద్యం చేయడానికి రైతు కుటంబం చేసిన శ్రమ (ఎ2+ఎఫ్.ఎల్. ఉత్పత్తి ఖర్చు కన్నా 50 శాతం ఎక్కువ ధర చెల్లించి సేకరించారు.

ప్రకటించిన ఈ మద్దతు ధరనైనా చిన్న, మద్దతు తరగతి రైతుల దగ్గర కొనడాన్ని అమలు చేయడం ఆందోళన కలిగించే విషయం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా రైతులు మార్కెట్ ధర కన్నా తక్కువకు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. క్వింటాల్ కందులకు ప్రభుత్వం రూ.5,450 మద్దతు ధర ప్రకటిస్తే మహారాష్ట్ర మార్కెట్లలో 20 నుంచి 25 శాతం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. మధ్యప్రదేశ్ లో క్వింటాల్ సోయాకు రూ. 3,600  కనీస ధర ప్రభుత్వం ప్రకటిస్తే 15 శాతం తక్కువకు, మినుములకు కివింటాలుకు రూ. 5,400 మద్దతు ధర ప్రకటిస్తే 52శాతం తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తోంది. అలాంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలులోకి రాకపోతే ప్రయోజనం ఏమిటి?

మార్కెట్ ధర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు కన్నా తక్కువ ఉండడం అంటే వ్యవసాయ ఉత్పత్తి పెంచడం, వ్యవసాయ మార్కెట్ ధరల మధ్య పొంతన లేని విధానాలకు నిదర్శనం. మద్దతు ధర నిర్ణయించేటప్పుడు సాంప్రదాయికంగా ఉత్పత్తి ధర-ధర నిర్ణయించే విధానం వ్యవసాయ ఉత్పత్తులకు ఉండే గిరాకీని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మార్కెట్ ధరకన్నా కనీస మద్దతు ధర ఎక్కువ ఉంటే ఆ పంట ఉత్పత్తి అపూర్వంగా పెరుగుతుంది. కాని తగినంత గిరాకీ లేకపోతే మార్కెట్ లో మాంద్యం ఏర్పడుతుంది. అప్పుడు ధరలు కనీస మద్దతు ధరకన్నా తగ్గుతాయి.

ప్రభుత్వ ధాన్యం సేకరణ ద్వారా కనీస మద్దతు ధర అమలు చేస్తారు. అయితే ఇలా కొనే అవకాశం చాలా తక్కువ. వరి, పత్తికి తప్ప మిగతా పంటలను సేకరించే వ్యవస్థ పకడ్బందీగా లేదు. 2017-18లో 11 రాష్ట్రాలలో 45 రకాల పప్పులను సేకరణ ధరకన్నా 10 శాతం తక్కువ ఉంది. ఈ జాబితాలో ఉన్న 60 శాతం ఉత్పత్తుల ధరది ఇదే పరిస్థితి. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ లో మార్పులు చేయకుండా కనీస మద్దతు ధర పెంచినందువల్ల వ్యవసాయ ఆదాయం పెరిగే అవకాశం లేదు.

మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో ఎగుడు దిగుడుకు కేవలం ఉత్పత్తిలో కనిపించే తేడాలే కారణం కాదు. సగం పంటల ధరలు కోతలు ముగిసిన తర్వాత నిర్ణయమవుతాయి. ధరల్లో ఎగుడుదిగుడు ఉండడానికి ఇదో కారణం. మధ్యవర్తుల పాత్ర ప్రధానంగా ఉంటుంది. దళారులు ఉత్పత్తిలో పెరుగుదలను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. రైతులకు తక్కువ ధరే దక్కుతుంది. పంట బాగా పండినా పండకపోయినా రైతు పరిస్థితి మారదు. భారత మార్కెట్లలో దళారుల లాభాలు మొత్తం ధరలో అయిదింట నాలుగు వంతులు ఉంటుంది. మద్దతు ధర పెరిగితే దళారులు తమ లాభాలు పెంచుకుంటారు. ఆ రకంగా వారు ప్రభుత్వ సేకరణతో పోటీ పడతారు.

కనీస మద్దతు ధర వ్యవసాయదారులకు మేలు చేస్తుందా లేక వ్యవసాయంతో సంబంధంలేని వ్యాపార వర్గాలకు మేలు చేస్తుందా వ్యవసాయ మార్కెట్లలో గిరాకీ, సరఫరాల మీద ఆధారపడి ఉంటుంది. మన దేశంలో రైతులు పంట పండిన వెంటనే అమ్ముకోక తప్పని పరిస్థితి ఉంది. అదువల్ల సరఫరాను వారు మార్చలేరు. కానీ వ్యాపారులు వేచి ఉండగలరు. అదీగాక మార్కెటింగ్ విధానాల్లో వైవిధ్యం లేకపోవడంవల్ల కనీస మద్దతు ధర ప్రకారం సేకరించే సమయం తక్కువగా ఉంటుంది కనక మార్కెట్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల కనీస మద్దతు ధర రైతులతో చెలగాటమాడుతుంది. ఈ ప్రభావం చిన్న రైతులపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు తమదగ్గరకు వచ్చి కొనేవారికి అమ్ముకోవాల్సిన పరిస్థితి తప్పదు. 

రైతులకు ప్రయోజనం కలిగించే చర్యలతో పాటు మార్కెటింగ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడం, నిలవ చేసే సదుపాయాలు పెంచడం, ధాన్యాన్ని వినియోగించి ఆహార పదార్థాలను తయారు చేయడంవంటి పనులకు లంకె కుదిరితే తప్ప ఫలితం ఉండదు. దీనితో పాటు 2003 నాటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టంలో సవరించాలి. రైతుల నుంచి నేరుగా కొనే అవకాశం ఉండాలి. మండీలలో మాత్రమే కొనాలి అన్న కాలదోషం పట్టిన విధానం ఉండకూడదు. లేకపోతే కనీస మద్దతు ధర పెంచినంత మాత్రాన రైతుకు ఒరిగేది ఏమీ ఉండదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top