ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

ప్రపంచ బ్యాంకు రాంకుల దాష్టీకం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

వ్యాపారం చేయడంలో సులువుగురించి ప్రపంచబ్యాంకు ఇటీవల ప్రచురించిన సూచిక వివాదాస్పదమైంది. నిజానికి అసలు ఈ సూచికే రిక్తమైంది. ప్రపంచబ్యాంకులో ప్రధాన ఆర్థిక సలహాదారు పాల్ రోమర్ వ్యాపారం చేయడంలో సులువు నివేదికపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిలీకి ఇచ్చిన రాంకు గణనీయంగా తగ్గడంతో పాల్ రోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి చిలీ రాంకింగ్ పడిపోవడానికి రాంకులు ఇవ్వడంలో అనుసరించే పద్ధతి మార్చడమే ప్రధాన కారణం. 2006 నుంచి చిలీ రాంకు 25 నుంచి 57 మధ్య ఊగిసలాడుతోంది. చిలీలో మైఖేల్ బాచ్లెట్ సోషలిస్టు ప్రభుత్వ హయాంలో ఈ రాంకు నిరంతరం తగ్గిపోయింది. కాని మితవాది, యథాతథ వాది అయిన సెబాస్టియన్ పినేరా హయాంలో మాత్రం చిలీ రాంకు పెరిగింది. రోమర్ చెప్పాల్సిందే చెప్పారు. రాంకింగులు ఇవ్వడానికి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవడం వల్ల వివిధ సంవత్సరాలలో రాంకింగులు తారుమారు అవుతుంటాయి అని రోమర్ అన్నారు. నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించి ప్రపంచ బ్యాంకు ఈ రాంకులను పునఃపరిశీలిస్తుందని రోమర్ చెప్పారు. రాంకులపై రోమర్ అనుమానం వ్యక్తం చేయడం సబబే. ప్రపంచ బ్యాంకు రాంకులు ఇచ్చే విధానంలో లోపాలు ఉన్నాయనడానికి బోలెడు సమాచారం అందుబాటులో ఉంది. ఈ లోపం ప్రధానంగా సులువుగా వ్యాపారం చేసే అవకాశానికి సంబధించినవే.

చట్ట సంబంధమైన నిబంధనలు, ప్రక్రియలను దృష్టిలో ఉంచుకుని 2003లో మొట్ట మొదటి సారి ఈ ర్యాంకులు ఇవ్వడం ప్రారంభించారు. రాంకులు కేటాయించే నివేదిక ఒక విశాల నగరంలో వ్యాపారానికి ఉన్న అవకాశాలను ప్రైవేటు సంస్థల దృష్టితో చూస్తుంది. లాంఛనప్రాయమైన ఆర్థిక వ్యవస్థలో విధానాలను దృష్టిలో ఉంచుకుని అంచనా వేస్తారు. కాని వివిధ దేశాల మధ్య ఉన్న నిబంధనలలో వ్యత్యాసాన్ని మాత్రం ప్రపంచ బ్యాంకు పట్టించుకోదు. రోజువారీ వ్యాపార వ్యవహారాలను విస్మరిస్తుంది. సులభంగా వ్యాపారం చేయడానికి గల అవకాశాలను అంచనా వేయడానికి వివిధ సూచికలను ప్రపంచబ్యాంకు 2006 నుంచి ఆధారం చేసుకుంటోంది. ఈ సూచిక ఆధారంగానే ప్రపంచ బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుంది. తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత ఈ పద్ధతిని 2009లో విడనాడారు. వాస్తవానికి ప్రపంచబ్యాంకు గ్రూపు అధ్యక్షుడు జిం యాంగ్ కిం ఏర్పాటు చేసిన "వ్యాపారం చేయడంలో సులువు గురించిన నివేదికను సమీక్షించడానికి స్వతంత్ర కమిటీ" అసలు ఈ సూచికను ప్రచురించనే కూడదని చెప్పింది. ఈ వ్యవహారాన్ని సమీక్షించిన తర్వాత అంతర్జాతీయ పోలికలకు ఇది ఉపయోగపడవచ్చు కాని సూచిక తయారు చేయడం వల్ల తప్పుడు సమాచారం అందుతుందని చెప్పారు.

ఆర్థిక, గణాంక శాస్త్రాలలో సూచికలు తయారు చేయడం పేచీకోరు వ్యవహారం. విభిన్నమైన అంశాల ఆధారంగా సూచికలు తయారు చేస్తారు. ఒక్కో అంశానికి ఇచ్చే ప్రాధాన్యం, పోల్చే పద్ధతి నిరపేక్షంగా ఉండవు. రెండు అంశాలను "న్యాయంగా" అంచనా వేసే పద్ధతులు ఉన్నాయి కాని సాధారణంగా పక్షపాతంతోనే వ్యవహరిస్తారు. అయితే ఏ సూచికలైనా సంక్లిష్టమైన ధోరణులను సులభంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఈ కారణంగానే వీటికి ఆకర్షణ ఉంటుంది. కాని విధాన నిర్ణయాలలో పొరపాటు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటికి బహుళ ప్రచారం ఉంటుంది కనక వీటిని విస్మరించలేం. ఈ రాంకులు ఇవ్వడానికి అనుసరించే పద్ధతి మీద చర్చకు అంతగా ప్రాముఖ్యత ఉండదు. కాని రాంకులలో ఎగుడు దిగుడు ప్రధాన చర్చనీయాంశం అవుతుంది.

ఈ రాంకుల ఆధారంగా ప్రభుత్వాలు విధానాలను మార్చడం పెద్ద సమస్య. రాంకుల్లో పై స్థాయికి ఎదగడానికి ప్రభుత్వాలు ఇలా విధానాలు రూపొందిస్తాయి. భారత ప్రభుత్వం 2017-18 నాటి పారిశ్రామిక విధాన పత్రంలో 2017-18లో 90వ రాంకు సాధించడం, 2020 నాటికి 30వ రాంకు సాధించడం తమ లక్ష్యం అని చెప్పడమే విచిత్రం. గత సంవత్సరం మన రాంక్యు 130 ఉండగా ఈ సంవత్సరం 100వ రాంకుకు చేరాం. ఉదాహరణకు వ్యాపారం చేయడంలో సులువుకు సంబంధించిన అంశంలో రుణం సంపాదించడంలో భారత్ 29వ స్థానంలో ఉంది. కాని అనేక పరిశోధనలు, సర్వేల ప్రకారం ఆ పరిస్థితి లేదు. దివాలా చట్టాలు మొదలైన అంశాల మీద ఆధారపడి ఈ మాట చెప్తున్నారు కాని "రుణం అందుబాటులో" ఉండడం వల్ల కాదు. తప్పుడు పరిభాష ఉపయోగించడం వల్ల ఆర్థిక వ్యవస్థ విషయంలో పొరపాటు అవగాహన కలుగుతోందని వ్యాపారం చేయడంలో సులువు మీద జరిపిన పునఃపరిశీలనలో తేలింది. ఈ సూచిక సర్వస్వం అనే పొరపాటు కలగజేస్తుంది. నిజానికి అది కాగితాల మీద ఉన్న నిబంధనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సూచికలో పైకి ఎగబాకాలన్న దృష్టితో ఆ దిశగా ఆర్థిక విధానాలను సవరిస్తాయి. ఈ విధానాలు ప్రజల అవసరాలకు, ఆర్థిక వ్యవస్థ అవసరాలకు ఉపయుక్తమైనవి కాకపోవచ్చు. మెరుగైన రాంకు సాధించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

అందరికీ ఒకే సైజు సరిపోతుంది అన్న ఈ రాంకింగుల పద్ధతి వివిధ దేశాలలో అభివృద్ధి అవసరాలను పరిగణనలోకి తీసుకోదు. రాంకులు సంపాదించడానికి ప్రపంచ బ్యాంకు షరతులు పాటించడంవల్ల తమ అభివృద్ధి అవసరాలను పట్టించుకోరు. కాని రాంకులు మాత్రం సాధిస్తారు. ఇది ప్రపంచ ఫుట్ బాల్ టోర్నమెంటు లాంటిదే. అందరికీ ఒకే నిబంధనలు వర్తింప చేస్తారు. కాని ఇతరుల ఎత్తులను చిత్తు చేయడాన్ని కూడా పరిగణిస్తారు. వ్యాపారం చేయడానికి సులువైన పద్ధతి విధానాల గురించి తెలియజేస్తుంది కాని ఏ విధానాలు అనుసరించాలో చెప్పదు. ఈ లోపాలను, విమర్శలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ బ్యాంకు ఈ రాంకుల దాష్టీకాన్ని విడనాడడమే లేదు. 

Updated On : 6th Feb, 2018

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top