ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సంక్షోభం సుప్రీంకోర్టుదే కాదు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అది "కేవలం చిటికలో సమసిపోయిన వివాదం" కాదు. "కుటుంబానికి పరిమితమైన తగవు" కాదు. గత జనవరి 12వ తేదీన అత్యంత సీనియర్లు ఐన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పత్రికల వారితో మాట్లాడడం వల్ల ఏ వ్యవస్థా ప్రశ్నించడానికి, సంస్కరణకు అతీతం కాదని రుజువు అయింది. న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ లోకూర్, కురియన్ జోసెఫ్ 2017 నవంబర్ లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి దీపక్ మిశ్రాకు ఒక లేఖ రాసి ఆయనతో తమ విభేదాలను తెలియజేశారు. కాని ఆ విభేదాలు ఏమిటో వివరించలేదు. కాని జరిగిన సంఘటనల పరంపరను చూస్తే ఏదో ఒక ఉదంతం కాకుండా ఈ నలుగురు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తితో అనేక విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. కార్యకారణ సంబంధాల గురించి తెలుసుకోవడం అనే దాహార్తి గల మీడియా మాత్రం ఈ వివాదానికి ప్రధాన కారణం 2014 డిసెంబర్ లో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.హెచ్. లోయా వ్యవహారంలో సీబీఐ విచారణకు సంబంధించిన విభేదాలే ప్రధానమన్న నిర్ధారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ఎదుటకు వచ్చిన ఈ కేసును విచారించాలని బెంచి నిర్ణయించింది. ఈ విషయం పైనే నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగా తమ అభ్యంతరాలను చెప్పాయని మీడియా భావించింది.

కొంతమంది నలుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఉన్న విభేదాలను బహిరంగ పరిచి రచ్చకెక్కడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టే ఆఖరి అవకాశం అన్న విషయాన్ని, ఆ న్యాయస్థానం బాధ్యతాయుతంగా, దాపరికం లేకుండా వ్యవహరించాలన్న అంశాన్ని ఎవరూ నిరాకరించలేరు. నలుగురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఇసుమంత వాస్తవం ఉన్నా అది విచారించవలసిన, ఆలోచించవలసిన విషయమే. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసులను ప్రధాన న్యాయమూర్తి కావాలనే తనకు నచ్చిన బెంచీలకు కేటాయిస్తుండడం పట్ల ఈ న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా నిర్దిష్టమైన బెంచీలకు కేటాయించడంలో ఆంతర్యం తీర్పు తాము కోరిన విధంగా రావాలనే అన్న భావన కూడా వ్యక్తం అయింది. కేసులను ఏ బెంచీకి కేటాయించాలన్న విషయంలో ప్రధాన న్యాయమూర్తి ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల, నిబంధనలను పాటించకపోవడం వల్ల "ఈ వ్యవస్థలో అనుచితమైన, అవాంఛితమైన పరిణామాలకు దారి తీస్తుంది" అని న్యాయమూర్తులు తమ లేఖలో పేర్కొన్నారు. నిబంధనలను పాటించకపోవడం వల్ల "ఈ వ్యవస్థ ప్రతిష్ఠ ఇప్పటికే కొంతవరకు దెబ్బ తిన్నది" అని నలుగురు న్యాయమూర్తులు తమ లేఖలో పేర్కొన్నారు.

ఈ నలుగురు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తి మీద నమ్మకం పోయిన నమ్మకాన్ని ఎలా పునరుద్ధరించగలరో తెలియదు. ఏమైనప్పటికీ ఈ వివాదం వివరాలు ఎలా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు మీద ప్రజలకున్న విశ్వాసం సడలుతుందన్నది మాత్రం వాస్తవం. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద ప్రజలకు విశ్వాసం సడలిపోవడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని న్యాయమూర్తి చలమేశ్వర్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఒక్క సుప్రీంకోర్టు మీద విశ్వాసం సన్నగిల్లడమే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటి మీద ప్రజల విశ్వాసం చెక్కు చెదరకూడదు.

ఉదాహరణకు చట్టసభలనే తీసుకోండి. రాను రాను పార్లమెంటులో చట్టాల గురించి చర్చ దాదాపుగా జరగడం లేదు. ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగిందే పదిహేను రోజులు. ముఖ్యమైన చట్టాల మీద ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగనే లేదు. 2017 నాటి ముస్లిం మహిళల (సం రక్షణ, పెళ్లి) చట్టం పై (ముమ్మారు తలాఖ్ ను నిషేధించే చట్టం) సరైన చర్చ లేకుండానే హడావుడిగా ఆమోదించేశారు. ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆమోదించవలసి ఉంది. పార్లమెంటులో ఇలా చర్చ లేకుండా బిల్లులు ఆమోదించడం పరిపాటి అయిపోయింది. పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చిన ప్రధానమైన అంశాలను సవ్యంగా చర్చించకుండా తోసేయడం అంటే ప్రజాధనంతో నడిచే ఆ వ్యవస్థ నిరుపయోగంగా తయారు కావడమే.

న్యాయవవస్థ, చట్టసభలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలాగే ప్రజాస్వామ్యంలో కార్యనివాహకవర్గం చట్టసభకు జవాబుదారుగా ఉండాలి. కాని ప్రస్తుత కార్యనిర్వాహక వర్గం తనకు అనువైన చట్టాలను ఈ బాదర బందీ లేకుండా ఆమోదింప చేయాలని ప్రయత్నిస్తోంది. ఆర్థిక బిల్లులు కాని వాటిని ఆర్థిక బిల్లులుగా చెలామణి చేసి రాజ్యసభలో ఇబ్బంది లేకుండా ఆ బిల్లులని గట్టెక్కించాలని ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి అనుసరించాయన్నది ఈ ప్రభుత్వం అలాగే వ్యవహరించడాన్ని ఆమఒదించడం ఏ దృష్టితో చూసినా సమర్థనీయం కాదు. చట్టంలో అవకాశం లేక పోయినా, గతంలో అనేక న్యాయస్థానాలు ఆధార్ కు వ్యతిరేకంగా తీర్పులు చెప్పినా ఆధార్ ను బలవంతంగా జనంపై రుద్దుతోంది.

అదే కాకుండా మీడియా ఉంది. దీన్ని రాజ్యవ్వ్యవస్థలో నాలుగో అంగం అంటాం. మన దేశంలో "స్వేచ్ఛగా" ఉందనుకునే మీడియా రాజకీయ చర్చల విషయంలో అజ్ఞానంతోనే వ్యవహరించింది. ప్రతి అంశాన్ని ద్వంద్వాల రూపంలోనే మీడియా చూస్తుంది. చర్చలకు అవకాశమే లేదు. మధ్యే మార్గానికి వీలే లేదు. అంతిమ పరిష్కారం తామే చెప్తామన్న ధోరణిలో మీడియా ప్రవర్తిస్తోంది. అసలు మీడియా వివాదాలనుకునేవే చాలా వరకు ఊహాత్మకమైనవే. అయితే దీనికి మినహాయింపులున్నాయి. మీడియాలో ఒక భాగం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. అధికారంలో ఉన్న వారు బాధ్యతాయుతంగా వ్యవహరించేట్టు చేస్తున్నారు. కాని అలాంటి సంఘటనలు చాలా అరుదు.

ఎన్నికల కమిషన్ స్వతంత్ర్యంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం ఉంది. కాని ఆ వ్యవస్థ కూడా ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ వ్యవస్థ మీద కూడా విశ్వాసం సడలి పోతోంది. గుజరాత్ లో శాసనసభలను జాప్యం చేయడం వల్ల ఎన్నికల కమిషన్ మీద నమ్మకం తగ్గింది. ఈ ఎన్నికలను వాయిదా వేసినందువల్ల ప్రభుత్వం జి.ఎస్.టి. ని తనకు అనువుగా మలుచుకోగలిగింది. తద్వారా అక్కడ వ్యాపార వర్గాలను శాంతింప చేయగలిగింది. ఆ వ్యాపార వర్గాలు చాలా వరకు అధికార పార్టీకి మద్దతిచ్చేవే.

భారత ప్రజాస్వామ్యానికి ముప్పు కేవలం సుప్రీంకోర్టులో ఏర్పడిన సంక్షోభంవల్లే కాదు. అయితే అది కీలకమైందే. ప్రజాస్వామ్యానికి కీలకమైన అనేక వ్యవస్థల మీద కూడా విశ్వాసం సన్నగిల్లడం ప్రధానమైన సమస్య. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top