ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

అసలు కన్న కొసరే ఎక్కువ

.

తహసీన్ ఎస్.పూనావాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో సుప్రీంకోర్టు జులై 17వ తేదీన తీర్పు చెప్పింది. ఈ తీర్పులో దేశవ్యాప్తంగా మూకలు దాడి చేయడాన్ని, హతమార్చడాన్ని నిరోధించడానికి మార్గదర్శకాలు, నిర్దేశాలు ఉన్నాయి. అయితే ఈ తీర్పులో ఎక్కడా "గొడ్డు మాంసం", "హిందువు", "ముస్లిం", "దళితులు", "సవర్ణులు" అన్న మాటలు ప్రస్తావించనే లేదు. సందర్భం ఏమిటో తెలియకుండా ఈ తీర్పు చదివితే గోథాం నగరంలో బ్యాట్ మాన్ కు వ్యతిరేకంగా తీర్పు చెప్పినట్టే ఉంటుంది కాని 21వ  శతాబ్దంలో దేశంలో ఎదురవుతున్న పరిణామాల గురించి మాట్లాడుతున్నట్టు లేదు. కాని ఇందులో "అతి జాగ్రత్తగా ఉండే వారి" (చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడి చేసే) వారి గురించి, అలాంటి దాడుల గురించి 11 సార్లు, అయిదుసార్లు "శాంతి భద్రతల" గురించి ప్రస్తావన మాత్రం ఉంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా రాసిన ఈ తీర్పులో అసలు సమస్యను అర్థం చేసుకోవడానికి మార్గమే కనిపించడం లేదు. దాడి చేయడం, కొట్టి చంపడం క్షణికావేశంలో జరుగుతున్నది కాదని, ఇది కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదన్న భావన ఎక్కడా కలగదు. సామాజిక వ్యవస్థను నిర్వహించడానికి ఉద్దేశించిన తీర్పులా కనిపిస్తోంది. అణగారిన వర్గాల వారు తమ జీవితంలో పురోగమించాలంటే చెల్లించవలసిన మూల్యం ఏమిటో చెప్పినట్టుగా ఉంది. ఈ రకమైన నేరాలలో అవి జరుగుతున్న తీరు, రాజ్య యంత్రాంగం ఆ నేరాలకు మద్దతు ఇస్తున్న విధానం ఈ మూక దాడుల, హత్యల వ్యవహారంలో ఇమిడి ఉంది.

మూకలు దాడి చేయడం, హతమార్చడం గురించి మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ వెలువడిన అపార సమాచారం ప్రస్తావన ఈ తీర్పులో ఎక్కడా కనిపించదు. ఇటీవల జరిగిన అనేక సంఘటనలను ఈ తీర్పులో సవివరంగా చర్చించనే లేదు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న మూక దాడులను, హత్యలను నిశితంగా విశ్లేషించడానికి బదులు అస్పష్టమైన మాటలు దొర్లించడం, అనవసరమైన విశేషణాలు వాడడం మాత్రమే కనిపిస్తోంది. ఈ సమస్యకు కారణం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కడా లేదు. బలహీనమైన యంత్రాంగంవల్లే ఇవన్నీ జరిగినట్టు, ఆ యంత్రాంగం తన విధి నిర్వహణలో విఫలమైనట్టు, ఈ సమస్యను పరిష్కరించాలంటే న్యాయస్థానం పర్యవేక్షణలో అంతా జరగాలన్నట్టు మాత్రమే ఉంది. న్యాయ స్థానం ప్రస్తావించిన విషయమే జార్ఖండ్ లో అలీముద్దీన్ అన్సారీని కొట్టి చంపడంలో ఉందన్న విషయం గురించి న్యాయ స్థానానికి తెలిసినట్టు లేదు. చట్టాన్ని అమలు చేయవలసిన వారు సవ్యంగా పని చేయకపోవడంవల్లే ఈ కేసులో ఎనిమిది మందికి హైకోర్టు జామీను ఇవ్వ వలసి వచ్చినట్టు మాత్రమే ఈ తీర్పు చదివితే తెలుస్తుంది.

మూక దాడులు, హత్యల గురించి భిన్నాభిప్రాయాలకు చోటు లేదు. వాటిని ఎవరైనా గర్హించవలసిందే. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తున్న కొద్దీ "గొడ్డు మాంసం" పేరుతో ముస్లింల మీద, దళితుల మీద దాడులు కొనసాగుతున్నాయన్న విషయంలో అనుమానాలకు తావే లేదు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో జరిగిన మూక దాడుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేనప్పటికీ "గొడ్డు మాంసం" తిన్నారన్న అరోపణతో దాడులు చేసిన వారందరికీ ఏదో ఒక రకంగా సంఘ్ పరివార్ తో సంబంధాలున్నాయి. నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రావడానికి ముందు "అచ్ఛే దిన్" అన్న ప్రచారం జరిగింది. దానితో పాటే గొడ్డు మాంసం పరిశ్రమ పెంపొందడంవల్ల ముస్లింలకే ప్రయోజనం కలుగుతోందన్న అభిప్రాయాన్ని వ్యాపింప చేసి హిందువులలో గొడ్డు మాంసం తినడాన్ని వ్యతిరేకించే వైఖరిని పెంచి పోషించే ప్రయత్నమూ స్పష్టంగానే ఉంది.

ఈ సమస్య వెనక ఉన్న రాజకీయ స్వభావాన్ని గుర్తించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు వైఖరివల్ల ఈ సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని సుప్రీంకోర్టు తానే తగ్గించుకుంది. జార్ఖండ్ మూక హత్యకు పాల్పడిన వారు జామీను మీద విడుదలైతే వారికి పూలమాలలు వేసి సత్కరించింది కేంద్ర మంత్రి అయినప్పుడు చట్టం మూక దాడులకు పాల్పడే వారిని శిక్షించగలుగుతుందన్న భరోసా ఎక్కడినుంచి వస్తుంది? "చట్టం అంటే ప్రజలకు భయం?" ఎలా కలుగుతుంది? అలాంటప్పుడు చట్టబద్ధ పాలన గురించి సుప్రీంకోర్టు చెప్పే నీతులవల్ల, చేసే హితబోధలవల్ల ప్రయోజనం ఏముంటుంది? ఉత్తరప్రదేశ్ లో పోలీసులు భారీ స్థాయిలో ఎంకౌంటర్లకు పాల్పడుతుంటే నేరస్థులను కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం "విజయం" సాధించింది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే చట్టం అంటే భయమో, గౌరవమో ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయి?

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గొడ్డు మాంసాన్ని నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇంతవరకు విచారించనే లేదు. ఇవి 2016 నుంచి పేరుకుపోయి ఉన్నాయి. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి కె.పుట్టుస్వామికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేసులో ఎవరికేది ఇష్టం అయితే అది తినవచ్చు అన్న తీర్పును సుప్రీంకోర్టు అంగీకరిస్తున్నట్టే కనిపించినా గొడ్డు మాంసం విక్రయించడాన్ని నిషేదించడం సుప్రీంకోర్టు దృష్టిలో తప్పు అనిపించలేదు. దళితుల, ముస్లింల జీవనోపాధికి ముప్పు కలిగించే చట్టాలు అమలులో ఉన్నప్పుడు మూకదాడుల మీద సుప్రీంకోర్టు ధర్మ పన్నాలు వల్లించడం, దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంవల్ల ప్రయోజనం ఏమిటి?

సుప్రీంకోర్టు కొన్ని అంశాలను పట్టించుకోకపోవడం, ఖాతరు చేయకపోవడమే ప్రస్తుత సమస్య కాదు. సుప్రీంకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కూడా కూడా సమస్య ఉంది. సుభాష్ కాశీనాథ్ మహాజన్ కు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కేసులో సమగ్ర సమాచారం ఏమీ లేకపోయినప్పటికీ న్యాయస్థానం షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వారి మీద (అఘాయిత్యాల నిరోధక) చట్టాన్ని నీరుగార్చింది. ఈ తీర్పువల్ల ఆ వర్ణాల వారిమీద దాడులు, అఘాయిత్యాలు జరిగినా శిక్షించడానికి అవకాశం సన్నగిల్లింది. గుజరాత్ లో గోవధపై కఠినతరమైన చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టం చెల్లుతుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. గోవులు (పాలిచ్చే సకల సంతతి) ముస్లిం కసాయిల జీవనోపాధికన్నా మిన్న అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

అందువల్ల పూనావాల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. మూక హత్యలు, దాడులను నిరోధించడానికి ఏమీ చేయకుండానే ఏదో చేస్తున్నట్టు కనిపించడానికి సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నిస్తోందని గ్రహించాలి. ఈ సమస్యను ఆ న్యాయస్థానం విశ్లేషించిన తీరు పైపై మెరుగులకు మాత్రమే పరిమితం. ఉద్దేశపూర్వకంగానే అరకొర సమాచారం ఆధారంగా తీర్పు వెల్లడించింది. అంతకన్నా అరకొర పరిష్కారాలు సూచించింది. సుప్రీంకోర్టు న్యాయ నిర్ణయ విధుల్లో నిజాయితీగా, సమర్థంగా వ్యవహరించకపోతే ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసం పెరగడం కల్ల.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top