ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వరమా? శాపమా?

.

ఇటీవల విదేశాంగ మంత్రి సుషమా స్వరాజ్ ను ఆమె పార్టీకి చెందిన వారే వెంటపడి సామాజిక మాధ్యమాల్లో వేధించడంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, సభ్య సమాజం ఈ మాధ్యమంతో ఎలా వ్యవహరించాలి అన్న గందరగోళంలో పడిపోయింది. దీనికి సానుకూలంగా స్పందించాలో ప్రతికూలంగా స్పందించాలో ఆ పార్టీకి తెలియడం లేదు. సుషమా స్వరాజ్ మీద సామాజిక మాధ్యమాలలో వెంటపడినప్పుడు బీజేపీ చాలా హీనస్వరంతో మాత్రమే స్పందించింది. ఇది ఆ పార్టీలోని అంతర్గత కలహాలకు సంకేతం.

అభిప్రాయాలను, భావాలను, సమాచారాన్ని వ్యక్తం చేయడానికి ఒక విషయ ప్రసార వేదిక కావాలి. ఇంటర్నెట్ ఇలాంటి విషయ ప్రసార ఉపకరణమే. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, వాట్స్ ఆప్ ఇలాంటి వేదికలే. అయితే న్యాయబద్ధమైన, సవ్యమైన సమాచారం ఏమిటో కనిపెట్టడమే కష్టం. బూటకపు సమాచారాన్ని నిరాకరించడమూ ఇబ్బందే. ఈ వేదికల ద్వారా బెదిరింపులను, దూషణలను నిరాకరించడమూ కుదిరేపని కాదు. ఈ మాధ్యమాన్ని లేదా ఆ వేదికలను నిషేధించగలమా? లేదా ఆ మాధ్యమాల్లో వచ్చే విషయాన్ని నిషేధించగలమా?

విషయాన్ని ప్రచురణకు ముందే నిషేధించడం, ఆంక్షలు విధించడం చట్ట రీత్యా సులభమైన పనే కాని అమలు కష్ట సాధ్యం. రష్యాలో స్టాలిన్ పరిపాలన కొనసాగిన కాలంలో సమాచారంపై రాజ్యవ్యవస్థ నియంత్రణ కఠినంగా ఉండేది. కానీ అసమ్మతి వ్యక్తం చేసే వారి కవితలు, రాతప్రతులు చేతి రాతతో ప్రతులు తీసి పంపిణీ చేసేవారు. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా డైరీలలోని అంశాలను టాయిలెట్ పేపర్ మీద రాసి ప్రచారంలో పెట్టే వారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం పత్రికల మీద ఆంక్షలు విధిస్తే పత్రికలు అనుమతి పొందని వార్తల స్థానాన్ని ఖాళిగా ఉంచేవి. ప్రజలు ఏదో ఒక దారి చూసుకున్నారు గనక నిరంకుశ ప్రభుత్వాలు సైతం నిష్క్రియాపరంగా మారిపోయాయి. కానీ అంతర్జాలం ఎక్కడపడితే అక్కడ అందుబాటులో ఉన్నప్పుడు, అపారమైన బాండ్ విడ్త్ ఉన్నప్పుడు, సెల్ ఫోన్లు సులభంగా దొరికినప్పుడు సామాజిక మాధ్యమాలలో ఉన్న విషయాన్ని అదుపు చేయడం సులభం కాదు. ఇదివరకటి మాధ్యమాలలాగా కాకుండా అంతర్జాతాల వేదికలు రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి పాఠకుడు విలేకరే, సంపాదకుడే, అభిప్రాయాన్ని మలిచే వాడే. అలాంటప్పుడు రాత, ఫొటోలు, వ్యంగ్య చిత్రాలు, భావోద్వేగ చిహ్నాలు, ఫొటోలు, మాటలు మొదలైనవాటిని అదుపు చేయడం ఎలా సాధ్యం?

ఈ రోజుల్లో ఈ వేదికలు అందరికీ సులభంగా అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు అక్షరాస్యత బాగా పెరుగుతోంది. వ్యక్తులు చేసే వ్యాఖ్యలను నిషేధించడం కుదరదు. ఈ మాధ్యమాల మీద ఆంక్షలు విధించాలంటే ప్రభుత్వం కృత్రిమ మేధా శక్తిని వినియోగించవలసి ఉంటుంది. ఇలాంటివి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇవి సమర్థంగా అమలులోకి రావాలంటే మరో దశాబ్దమైనా పడ్తుంది. ఒక కంప్యూటర్ కార్యక్రమం ద్వారా రచనల నుంచి, వ్యంగ్య చిత్రాలనుంచి భావోద్వేగాలను వ్యక్తం చేసేట్టు చేయడం చాలా కష్టం. ఇవన్నీ ఇప్పటికీ సైన్స్ కాల్పనిక కథల దశలోనే ఉన్నాయి. ఇలాంటి మాధ్యమాలలో సంక్షిప్త నిక్షేప సందేశాలు ఉన్నప్పుడు, అవి ఆయా వేదికలకే అందుబాటులో లేనప్పుడు ఇవన్నీ అసాధ్యం.

ఈ రోజుల్లో ఒక మాధ్యమాన్ని మొత్తంగా నిషేధించడం సులభమే. గత కొద్ది సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు అంతర్జాల సేవలను, మొబైల్ ఫోన్లను నిలిపి వేశాయి. పరిస్థితిని అదుపులో ఉంచడానికి వీటి మీద వారమో అంతకన్నా ఎక్కువో నిషేధం అమలు చేశాయి. దీనికి నిర్దిష్టమైన నియమ నిబంధనలు కూడా ఏమీ లేకపోవచ్చు. కానీ ఇదే మాధ్యమాన్ని అసలైన వ్యాపారం చేసే వారికి, వ్యాపారాలో మరో పనో చేసే వారికి ఈ నిషేధంవల్ల అపార నష్టం కలుగుతుంది. అంతా డిజిటల్ మయం కావాలని ప్రభుత్వం భావిస్తున్నప్పుడు ఈ నిషేధం అంత సులభం కాదు. ఇ-మెయిల్, ఇ-కామర్స్, ఆధార్, భీం ఆప్ మొదలైనవన్నీ అంతర్జాలం మీద ఆధారపడినవే. ఈ మౌలిక సదుపాయాలు కల్పించడానికి భారీ సంస్థలు ఈ రంగంలో వేలు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాయి. మరి లైసెన్స్ తీసుకుని నిర్వహించే ఈ వ్యాపారాలకు విఘాతం కలిగించడం ఎంతవరకు సమంజసం? మన దేశంలో సకల ఆర్థిక కార్యకలాపాలూ ఆంక్షలవల్ల స్తంభించిపోతాయి. అంతర్జాలంపై విధించిన నిషేధాలవల్ల 2012 నుంచి 2017 మధ్య భారత్లో 20,000 కోట్ల రూపాయల నష్టం కలిగిందని అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధన భారత మండలి అంచనా వేసింది. ప్రభుత్వానికి ఇష్టం అయినప్పుడు అంతర్జాలాన్ని అనుమతించడం, అనువు కానప్పుడు నిషేధించడం కుదరదు. పౌరుల ప్రాథమిక హక్కులను హరించడానికి చట్టాలను అమలు చేయడంలో సామర్థ్యాన్ని కనబరచక పోవడం లేదా ప్రభుత్వ పని తీరు పదే పదే మారుతూ ఉండడం కారణం కాకూడదు.

ఇలాంటి వేదికలను కట్టడి చేయడం ఆఖరి అస్త్రం మాత్రమే కావాలి. అది సవ్యమైన సమాచారానికి సంబంధించిందైనా ప్రమాదకరమైన సమాచారమైనా. రాజకీయ పార్టీలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ, కోట్లాది మంది ప్రజలు ఫేస్ బుక్ లాంటి వేదికలను వాడుతున్నప్పుడు నిషేధం ఎలా సాధ్యం? ప్రభుత్వ విధానాలను వాట్స్ ఆప్ ద్వారా తెలియజేస్తున్నప్పుడు దాన్ని నిషేధించడం ఎలా కుదురుతుంది? మంత్రులే అధికారిక ప్రకటనలకోసం ట్విట్టర్ ను వాడడాన్ని ఎలా ఆపగలం? చైనాలాంటి రాజ్యవ్యవస్థ అయితే ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకపోవచ్చు. విదేశీ వేదికలను నిషేధించి తాము నియంత్రించగలిగే వేదికలను సృష్టించుకోవచ్చు. కానీ మన దేశంలో పశ్చిమ దేశాలు ఏమనుకుంటాయోనన్న చింత ఎక్కువ. అందుకే మన ప్రభుత్వాలు ఉదారవాదం అనుసరిస్తున్నట్టు కనిపించాలనుకుంటాయే తప్ప నిజంగా ఉదారవాదం ఉండదు.

నిజానికి ఈ ధర్మ సంకటమే ప్రస్తుతం మన ప్రభుత్వాన్ని వేధిస్తోంది. ప్రభుత్వం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ విషయంలోనైనా విష ప్రచారం కొనసాగించడం మొదలు పెడ్తే అది అదే రూపంలో ప్రచారంలోకి వస్తుంది. అంటే అంతర్జాలం లేదా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి అవుతుంది. విద్వేష రాజకీయాలు రాజ్యమేలుతున్నప్పుడు సమాచార వాహికను కుంటుపరచినందువల్ల ఒరిగేదేమీ ఉండదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top