ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కూర్చునే హక్కు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పనివేళకు  కూర్చునే హక్కు కోసం కేరళ చిల్లర దుకాణాల ఉద్యోగులు ఏడేళ్ళుగా చేస్తున్న పోరాటం విజయవంతమైంది. వారు కూర్చునే హక్కును సాధించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ సంస్థల్లో మాదిరిగానే కేరళలోని రిటైల్ దుకాణాల ఉద్యోగులు కూడా పని వేళల్లో నిలుచుని ఉండాల్సిందే. ఆ ఉద్యోగుల్లో ఎక్కువమంది స్త్రీలు. రోజుకు 12 గంటల పని.  రోజుకు రెండుసార్లే ‘టాయిలెట్ బ్రేక్’ అదీ సణుగుతూ అనుమతించడం. కూర్చోవడానికి అసలు  వీల్లేదు. ఇదీ వారి దుస్థితి.  చిల్లర దుకాణాలలో పని పరిస్థితులు మెరుగుపరిచేందుకు కేరళ మంత్రివర్గం కేరళ దుకాణాలు వాణిజ్య సంస్థల చట్టానికి సవరణ ఆమోదించింది.  ఈ సవరణ ప్రకారం అమ్మకాలు జరిపే సిబ్బందికి కూర్చునే వసతి కల్పించడం ప్రధానమైంది.  పనిచేసే చోట లైంగిక వేధింపులు లేకుండా నిరోధించడం, మహిళా ఉద్యోగులు రాత్రి విధులకు హాజరైనప్పుడు వారి భద్రతకు, రవాణాకు సౌకర్యాలు కల్పించడానికి సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఈ  మహిళా ఉద్యోగులు జరిపిన పోరాటం దేశవ్యాప్తంగా రిటైల్ రంగంలో ఉద్యోగులు అమానుష పరిస్థితులలో పనిచేయడం, రాజకీయ పార్టీలకు, ప్రధానస్రవంతిలోని కార్మికసంఘాలకు అనుబంధంగా లేని  అసంఘటిత రంగాలలో కూడా మహిళా కార్మికుల సంఘాలు ఏర్పాటు కావడం వంటి రెండు అంశాలను తెరపైకి తెచ్చింది.  

పనిచేసే చోట మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కోజికోడ్ వాణిజ్య కేంద్రంలోని ఎస్ ఎం స్ట్రీట్ రిటైల్ సంస్థలకు చెందిన మహిళా ఉద్యోగులు ప్రధానంగా సేల్స్ ఉమన్, క్లీనర్లు, స్వీపర్లు 2010లో అసంఘటిత మేఘల తొళిలాలి యూనియన్ (ఏ ఎం టి యు) నేతృత్వంలో ఏకమయ్యారు.  పై ఉద్యోగుల అనుమతితో ఒకటి, రెండుసార్లు ‘బ్రేక్’ తీసుకొని ఆ మహిళలు దగ్గరలోని రెస్టారెంట్ల లోని టాయిలెట్లను ఉపయోగించేవారు. అప్పుడు వారు పోకిరి కస్టమర్ల కొంటె వ్యాఖ్యలు వినవలసి వచ్చేది. ఈ నేపథ్యంలో త్రిస్సూర్ కళ్యాణ్ సారీస్ కు చెందిన మహిళా ఉద్యోగులు 2014లో కూర్చునే హక్కు కోసం సమ్మె చేసి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఎక్కువ గంటలు నిల్చోవడం, టాయిలెట్లు లేకపోవడం వల్ల మహిళలకు వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు, పాదాలు వాయడం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, నరాలు ఉబ్బడం వంటి సమస్యలు వస్తాయి.

వారి డిమాండ్లకు స్పందించిన యాజమాన్యాలు ఎలాంటి నోటీసు లేకుండా బదిలీలు చేశాయి. పని వేళల్లో కూర్చోవాలనుకుంటే ఇంట్లోనే కూర్చోవాలని యాజమాన్యాలు బదులిచ్చాయి.  మహిళా ఉద్యోగుల పోరాటానికి మద్దతిచ్చిన ఏ ఎం టి యు నాయకులు  కేరళ రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పిటీషన్లు దాఖలు చేశారు.  కర్కషంగా వ్యవహరించే యాజమాన్యాలతో యూనియన్ నాయకులు ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించేవారు. దేశవ్యాప్తంగా ఫాన్సీ  స్టోర్స్, మాల్స్ వంటి రిటైల్  సంస్థల ఉద్యోగులు కూడా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ నెగ్గుకు రావాల్సి వస్తోంది. ఇండియాలో  రోజురోజుకు ఆన్ లైన్ షాపింగ్ పెరుగుతున్నప్పటికీ వ్యవస్థీకృత రిటైల్ కూడా రోజురోజుకు విస్తరిస్తోంది. మధ్యతరగతి వర్గం, పట్టణీకరణ పెరుగుదల, ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేయని వినియోగ వర్గాలను కూడా ఆకర్షించడానికి సంస్థలు ప్రయత్నించడం రిటైల్ విప్లవానికి దారితీస్తోంది.

రిటైల్ రంగంలో పనిచేసే ఉద్యోగులలో అధికశాతం యువతులు వారికి విద్యార్హతలు, నైపుణ్యం చాలా తక్కువ. వినియోగదారులకు ‘మర్యాద’ ఇవ్వడాన్ని సాకుగా చూపి రిటైల్ అవుట్లెట్ల యజమానులు తమ ఉద్యోగులు ఎప్పుడు నిలబడే ఉండాలని అంటున్నారని మీడియా వెల్లడించింది. వినియోగదారులను ఆకర్షించడం పేరుతో వినూత్న మార్కెటింగ్, విక్రయ వ్యూహాలను సంస్థలు అనుసరిస్తున్నాయి. అదే సమయంలో కార్మిక శాఖకు చెందిన నియమ నిబంధనలను ఉపేక్షిస్తున్నాయి. నిజానికి రిటైల్ యజమానులు కార్మిక శాసనాలలో ‘సడలింపు’ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తదనుగుణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అనుకూలంగా చర్యలు తీసుకున్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలోని సంస్థలు సంవత్సరం పొడవునా 365 రోజులు రోజుకు 24 గంటలు పనిచేసేందుకు మూడు షిఫ్ట్ లలో అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాక దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వల్ల యువత జీతభత్యాల విషయంలో ఇచ్చినకాడికి సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కార్మిక సంఘాలలో చేరేందుకు కానీ,  సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకునే ధైర్యం కానీ చేయలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో మహిళా కార్మికులు ప్రధాన స్రవంతిలోని యూనియన్లు,  పురుషాధిక్య కార్మిక సంఘాల జోలికి వెళ్లకుండా తమంతట తాము వ్యవస్థీకృతం కావడం ప్రారంభించారు. ఇటీవలి ఉదాహరణ తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు వేతనాల పెంపు, పని పరిస్థితుల మెరుగుదల కోసం వీరోచిత పోరాటం చేశారు.

కేంద్ర ప్రభుత్వం భవిష్యనిధి నియమ నిబంధనలు మార్చడాన్ని నిరసిస్తూ బెంగుళూరులో దుస్తుల తయారీ సంస్థల్లో పనిచేసే మహిళా కార్మికులు వీధుల్లోకి వచ్చారు. నియమావళి మార్పు తమపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని, ప్రయోజనాలకు భంగకరమని  వారు వ్యతిరేకించారు.  అసంఘటిత రంగంలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పనిచేసే వివిధ సంస్థల్లో ఏ ఎం టి యు మహిళా ఉద్యోగులతో కలిసి వారి సమస్యలపై పోరాటం చేస్తోంది .

ఇక కేరళలో ఏ ఎం టి యు ఆధ్వర్యంలో జరిగిన పోరాటం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం సవరించిన బిల్లులో వాడిన భాష చాలా అస్పష్టంగా, యజమానులకు మేలుచేసేలా ఉందని సంఘ నాయకులు కుండ బద్దలుకొట్టారు. సవరణకు ముందున్న శాసనం ప్రకారం ప్రతి నాలుగు గంటలకు ఒక ‘బ్రేక్’ ఇవ్వలని ఉంది. అయితే ఈ నిబంధనను ఎన్నడూ అమలు చేయలేదు ఇప్పుడు సవరించిన బిల్లు ప్రకారం వినియోగదార్లు లేనప్పుడు మహిళా ఉద్యోగులు కూర్చోవచ్చా లేదా అనే విషయం స్పష్టంగా లేదు లేక వారు కేవలం బ్రేక్  టైంలోనే కూర్చోవాలా అనేది కూడా స్పష్టం కాలేదు. ఎందుకంటే వినియోగదార్లు ఎవరూ లేనప్పుడు కూడా ఎన్నడూ వారిని కూర్చోడానికి అనుమతించేవారు కాదు. ఏడు సంవత్సరాలుగా కూర్చునే హక్కు కోసం మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసిన ఉద్యోగులు ఇప్పుడు అ శాసనం కచ్చితంగా అమలు జరిగేలా చూసుకోవాలి. 

ఆర్థిక సంస్కరణలు అమలు జరుగుతున్నందువల్ల అధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టి జరుగుతుండటంతో పాటు కార్మిక సంఘాలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.  ఈ ఉద్యొగాలన్నీ అసంఘటిత రంగంలో ఉన్నందువల్ల  ఉద్యోగంలో చేరేవారికి సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఉంటుందని అనుకోవడం ఉత్త భ్రమ. రిటైల్ వంటి కొన్ని రంగాలలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల కార్మిక సంఘాలు, వాటి నాయకులు తమ వ్యూహాల విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. కార్మిక శక్తిలో వస్తున్న మార్పులను, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలనే ఉత్సాహంలో కార్మికులకు హాని కలిగించే శాసనాలను తెచ్చే ప్రభుత్వ విధానాలను చూసుకొని వారు వ్యవహరించాల్సి ఉంటుంది. రిటైల్ రంగంలో ఉన్న సేల్స్ సిబ్బంది కూర్చునే హక్కును సమర్ధిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇతర రాష్ట్ర  ప్రభుత్వాలు కూడా అనుసరించి ఆయా రాష్ట్రాల కార్మికుల కూర్చునే హక్కును ఆమోదిస్తాయా? 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top