ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

నిర్వీర్యం అవుతున్న యు.జి.సి.

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) ఆరు దశాబ్దాలకు పైగా ఉన్నత విద్యా వ్యవస్థలో చాలా ఉపయోగపడింది. ఇతర అనేక వ్యవస్థల లాగే యు.జి.సి. కూడా కొంతకాలంగా భిన్నమైన బాధ్యతలు నిర్వహించడంలో సతమతమవుతోంది. వ్యవస్థాపరమైన పరిస్థితులు మారినందువల్ల, నిధులు కుంచించుకుపోవడంవల్ల యు.జి.సి. ఈ పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. యు.జి.సి.కి నిధుల కొరతతోపాటు ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా విఘాతం కలిగిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూర్చే బాధ్యత నివహిస్తున్న యు.జి.సి పని తీరు మీద అసంతృప్తి వల్ల ప్రస్తుత ప్రభుత్వం యు.జి.సి. చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించడానికి కారణం అవునో కాదో తెలియదు. లేదా యు.జి.సి. స్థానంలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఇంతకన్నా మెరుగ్గా దిద్ది తీర్చాలనుకున్నారేమో కూడా తెలియదు.

కొత్తగా ఏర్పాటు చేయబోయే వ్యవస్థను ఉన్నత విద్యా కమిషన్ అని వ్యవహరిస్తారు. ఇది యు.జి.సి. నిర్వహిస్తూ వచ్చిన అనేక విధులను నిర్వహిస్తుందని అంటున్నారు. అయితే కొత్త వ్యవస్థకు ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉండదు. ముందున్న సంస్థ పేరులోనే "నిధులు" అన్న మాట ఉండేది. నిధుల వ్యవహారాన్ని ఇక మీదట మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అయితే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిధుల వ్యవహారాన్ని చూడడం అంటే రాజకీయ జోక్యం పెరుగుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ఉన్నత విద్యలో ఇంత మేరకు ఉన్న కొద్దిపాటి స్వయంప్రతిపత్తి కూడా ఉండదేమోనని విద్యావేత్తలు ఆందోళనపడుతున్నారు.

మరో వేపు ప్రభుత్వం అనేక నిపుణుల సంఘాల సిఫార్సులను ప్రస్తావించింది. తిరకాసంతా అక్కడే ఉంది. పదేళ్ల కింద ప్రస్తుతం కీర్తి శేషులైన ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ కూడా యు.జి.సి. ఎలా ఉండాలని భావించిందో, జాతీయ నాలెడ్జి కమిషన్ కూడా అలాగే భావించింది. ఈ రెండు వ్యవస్థల సిఫార్సుల ఆధారంగానే యు.జి.సి.ని రద్దు చేయాలని నిర్ణయించారంటున్నారు. అయితే యశ్పాల్ కమిషన్, నాలెడ్జి కమిషన్ యు.జి.సి. ఎదుర్కుంటున్న సమస్యలను, వాటిని పరిష్కరించడానికి సూచించిన పరిష్కారాలు భిన్నమైనవి. నాలెడ్జి కమిషన్ అంతకంతకూ పెరుగుతున్న ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని సూచిస్తే యశ్పాల్ కమిషన్ వృత్తి విద్య విషయంలో యు.జి.సి.కి కొంత బాధ్యత, నియంత్రణా వ్యవస్థలకు మరికొంత బాధ్యత ఉండడాన్ని ఆమోదించలేదు. నిజానికి యు.జి.సి.ని రద్దు చేయాలని యశ్పాల్ కమిటీ సూచించనే లేదు. యశ్పాల్ కమిటీ యు.జి.సి. నిధుల కేటాయింపులో సమానత్వం పాటించాలని, పాఠ్యాంశాలను ఖరారు చేయడంలో ఇంతవరకు నిర్లక్ష్యం చేసిన అంశాలను పరిగణనలోకి తీసుకోవలని, వివిధ అంశాల బోధనపట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించింది.

కానీ ఇప్పుడు యు.జి.సి. ఇంతవరకు నిర్వర్తిస్తున్న బాధ్యతను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు బదలాయించాలని సంకల్పించారు. ఇది యశ్పాల్ కమిటీ సిఫార్సులకు విరుద్ధమైంది. అయితే కొన్ని వృత్తి విద్యా సంబధిత అంశాలను ఉన్నత విద్యా మండలి పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. నిధుల కేటాయింపు బాధ్యతను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు బదలాయించడం ద్వారా నిధుల మీద మంత్రిత్వ శాఖ ఆధిపత్యం ఉండాలని అనడంవల్ల అనుమానాలు తలెత్తుతాయన్న విషయం ప్రభుత్వానికి తెలియకపోలేదు. నిధుల పంపిణీ ఆన్ లైన్ పద్ధతిలో ఉంటుందని అనడం అంటే ఇటీవల అనుసరిస్తున్నట్టుగా ప్రతిభకు పట్టంగట్టే విధానాంలో విశ్వసనీయత తగ్గుతుందని కూడా ప్రభుత్వానికి తెలుసు. నిధులు కేటాయించే బాధ్యత నుంచి యు.జి.సి.ని తప్పించడం కోసం చట్టాన్ని మార్చడానికి ప్రభుత్వం అత్యంత ఆత్రుత ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది. ఇది ప్రమాదకరం కూడా. ఇటీవలి కేంద్ర బడ్జెట్లలో ఉన్నత విద్యకు నిధుల్లో కోత పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థలు తామర తంపరగా వెలుస్తున్నాయి. వాటి నిధుల మీద ఎలాంటి నియంత్రణా లేదు. భవిష్యత్తులో విద్యా విధానం ఎలా ఉండబోతోంది అనడానికి ఇది స్పష్టమైన సూచన.

ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోంది. 1986నాటి విద్యా విధానాన్ని మార్చడానిక్కి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. నూతన విధానం రూపొందించడంలో అనేక మార్పులు గోచరించాయి. ఈ జాప్యంవల్ల అత్యంత ఆశావాదులకు కూడా నిరాశ ఎదురవుతోంది. ఈ మార్పులు రూపొందించడానికి ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమిటీకి 2018 సెప్టెంబర్ గడువుగా నిర్దేశించారు. ఈ కొత్త విధానంలో నిధుల కేటాయింపులో యు.జి.సి. బాధ్యత ఏ మేరకు ఉంటుందో ఆశించడం అత్యాశ కాదు. నూతన విద్యా విధానాన్ని రూపొందించడానికి ఇంకా మూడు నెలల గడువు మాత్రమే ఉన్న దశలో యు.జి.సి. చట్టాన్ని పార్లమెంటు సమావేశాలలో సవరించడానికి ప్రయత్నించడం అనుమానాలకు దారి తీస్తోంది. నూతన విధానం రూపొందించడానికి ముందు పెద్ద మార్పులు ఏమీ ఉండవు అన్న భావనకు అవకాశం లేకుండా పోతోంది.

నిధుల కేటాయింపులో యు.జి.సి. బాధ్యత లేకుండా చేయాలన్న తమ విధానానికి విరుద్ధమైన అంశాలు ఏవీ నూతన విద్యావిధానంలో ఉండకూడదని ఆ కమిటీకి సూచించాలన్న ఆత్రుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంటే కొత్త విద్యా విధానంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నిధుల కేటాయింపులో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నట్టు ఉంది. ఇది 1990ల దగ్గర నుంచి సామాజిక రంగంలో అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ధోరణి ఈ దిశలోనే ఉంది. అంటే ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగానే విధానాలు రూపొందిస్తున్నారు. కేవలం ప్రతిభకు పట్టం కట్టే దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు పెట్టుబడికి పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా జాతి మేధో జీవనాన్ని, జ్ఞాన సృజనను ప్రైవేటు రంగం చేతిలో పెడ్తున్నారు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top