ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్రజాస్వామ్యం నుంచి మూకస్వామ్యానికి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మూకలు దాడి చేసి కొట్టి చంపే సంఘటనలు మన దేశంలో అత్యంత సహజం అయిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సంఘటనలను సమాజంలోని అనేక వర్గాలవారు ఖండించకపోవడం మరింత విచారకరం. పైగా ఇలాంటి మూక హత్యలను చూసి ఆనందిస్తున్న వారూ కనిపిస్తున్నారు. ఇలాంటి మూక దాడులు, హత్యలు జరగకుండా చుసే బాధ్యత రాష్ట్రాల ప్రభుత్వాలదే అని న్యాయవ్యవస్థ స్పష్టం చేసింది. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్రాల బాధ్యతే.

ఇలాంటి మూక హత్యల సందర్భంలో వివక్షాపూరితమైన ప్రమాణాలు పాటిస్తారు. చట్టానికి అతీతంగా శిక్షలు విధించాలని చూస్తారు. ముఖ్యంగా అత్యాచారాలు జరిగినప్పుడు ఆధిపత్యం చెలాయించే స్థితిలో ఉన్న సామాజిక వర్గాలకు, మతానికి చెందిన వారు అత్యాచారాల విషయంలో వివక్షాపూరిత ధోరణి అనుసరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని మంద్సౌర్ లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినప్పుడు అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులు ఈ విషయంలో ఆ బాలికకు న్యాయం జరిగేట్టు చూడాలని ప్రదర్శనలు, ర్యాలీలూ నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడింది ముస్లిం అని అనుమానం కలిగినప్పుడు అధిక సంఖ్యాక వర్గాల ఆగ్రహం మరింత పెరిగింది.

నేరానికి పాల్పడిన వారిని కొట్టి చంపాలని మూకలు నిర్ణయించడం ముందే కుట్రపన్నడంవల్ల కాకపోవచ్చు.  మహారాష్ట్రలోని ధూలే లో జులై ఒకటవ తేదీన మూక దాడిలో అయిదుగురు మరణించారు. అలా కొట్టి చంపడం న్యాయమా కాదా అని నిరపేక్షంగా ఆలోచిస్తున్నట్టు లేదు. అయితే ఈ దాడులకు సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే ప్రచారం కొంత కారణం కావచ్చు. దాడికి గురవుతున్న వారికి ఏ ఆసరా లేదు. ధూలేలో జరిగిన మూక దాడిని ఏ రకంగానూ సమర్థించడానికి అవకాశం లేదు. మూక చట్టాన్ని ఉల్లంఘించి దాడికి పాల్పడింది. చట్టాన్ని ఉల్లంఘించడం అంటే చట్ట ప్రకారం నడుచుకోకపోవడం, వివేచనా పూర్వకంగా ఆలోచించకుండా హింసాత్మక సంఘటనలకు పాల్పడడమే. అయితే కొన్ని సందర్భాలలో పోలీసులు ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలను నివారించిన సందర్భాలు ఉండవచ్చు. 2018 మేలో ఉత్తరా ఖండ్ లో మూక దాడి నుంచి పోలీసులు ఒక వ్యక్తిని కాపాడారు. అలాగే మహారాష్ట్రలోని మాలేగావ్ లో ఇటీవల ప్రజలు అయిదుగురిని మూక దాడి నుంచి కాపాడారు.

మూక దాడికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి విద్వేషం జీర్ణించుకుపోవడం. రెండవది పోలీసుల, న్యాయవ్యవస్థ అసమర్థత వల్ల ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోవడం. 2017 ఏప్రిల్ లో గో రక్షకులు పెహ్లూ ఖాన్ మీద మూక దాడి చేసి కొట్టి చంపడానికి ఒక మతం మీద విద్వేషం పెరగడమే కారణం.

ఒక కులం వారిలో, మతం వారిలో గూడు కట్టుకున్న విపరీతమైన అభిమానంవల్ల నేరానికి పాల్పడ్డారనుకున్న వారిని బహిరంగా కొరడాలతో కొట్టడం, ఉరి తీయడంలాంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. అత్యాచారానికో, అఘాయిత్యానికో పాల్పడిన వారు తమకు ఇష్టం లేని కులానికో, మతానికో చెందిన వారు అనుకున్నప్పుడు ఈ దురభిమానాలు ఎక్కువగా పని చేస్తున్నాయి. అదే సమయంలో బాధితుడు దళితుడో, మరో అణగారిన వర్గానికో చెందిన వాడైనప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక వేళ పట్టించుకున్నా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని అంటున్నారు. మహారాష్ట్రలోని ఖైర్లంజీలో 2006లో దళితులను ఊచకోత కోసినప్పుడు ఇదే వైఖరి వ్యక్తమైంది. బాధితులు కనక మైనారిటీ వర్గానికి చెందిన వారైతే మెజారిటీ మతం వారు చట్టాన్ని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. మరీ విచిత్రం ఏమిటంటే "చట్టాన్ని పరిరక్షించవలసిన వారే" మైనార్టీ మతస్థుల మీద ద్వేషం వెళ్లగక్కుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జమ్మూ-కశ్మీర్ లోని కఠువాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ఇదే ధోరణి వ్యక్తం అయింది.

మరో వేపున బాధితులు దళితులో మైనారిటీలో కాకపోతే నిందుతుల మీద తక్షణ చర్య తీసుకోవాలని, వారిని కొరడాలతో కొట్టి శిక్షించాలని, మూక దాడి చేసి హతమార్చాలని అనుకుంటున్నారు. 2016లో మహారాష్ట్రలోని కొపర్దిలో, గత నెలలో మంద్సౌర్ లో బాధితురాలి సామాజిక నేపథ్యానికి చెందిన మహిళలు సైతం నిందుతులను తక్షణం శిక్షించాలని పట్టుబట్టారు. ఈ మహిళలు నిందితుడి జననాంగాలు కత్తిరించివేయాలని కోరుతున్న దృశ్యాలను టీవీల్లో చూశాం.

తమ కులానికో, మతానికో సంబంధించిన వారు బాధితులైనప్పుడు చట్టాన్ని ఖాతరు చేయకపోవడం, నిందితులను తక్షణం అంతమొందించాలన్న ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిందితుడు తమ కులానికో, మతానికో చెందిన వాడైతే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరుతున్నారు కాని తక్షణం శిక్షించాలని అనుకోవడం లేదు. మూక దాడులకు పాల్పడడం లేదు. కులం, మతం ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు చట్టాన్ని ఖాతరు చేయని ధోరణి ఎక్కువ కనిపిస్తోంది. కాని నిందితులు తమ వర్గానికి చెందినవారైనప్పుడు పూర్తిగా దీనికి వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నారు.

అంతిమంగా ఈ రెండు సందర్భాలలోనూ మూక దాడులకు దిగితే చట్టాన్ని ఖాతరు చేయని ధోరణి ప్రబలంగా ఉంటోంది. ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు.

Updated On : 7th Aug, 2018
Back to Top