ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పప్పు ధాన్యాలు పండించే రైతుల ఎడతెగని కష్టాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మార్కెట్ లోకి పప్పు ధాన్యాలు విపరీతంగా వచ్చినందువల్ల పప్పుల ధరలు పడిపోయాయి. ఈ ధరలు పడిపోవడం వరసగా ఇది రెండవ ఏడు. ఈ ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు కావడం లేదు. 2014-15లో పరిస్థితి భిన్నంగా ఉండేది. అప్పుడు పంట తక్కువగా ఉన్నందువల్ల ధరలు పెరిగాయి. అందువల్ల పప్పుల వాడకం తగ్గింది. కాని పప్పు ధాన్యాలు పండించే విస్తీర్ణం పెరిగి 2018లో ధరలు పడిపోయాయి. పంట దిగుబడి, ధరల్లో ఎగుడుదిగుళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తగిన విధానాలు రూపొందించకపోవడంవల్ల రైతులు కష్టాలు ఎదుర్కుంటున్నారు.

2014-15లో పప్పు ధాన్యాల దిగుబడి అంతకు ముందు సంవత్సరం కన్నా 9.7 శాతం తగ్గింది. వరసగా అనావృష్టి ఎదురుకావడం, వ్యాపారులు సరుకు దాచేయడం వల్ల పప్పులకు కొరత ఏర్పడింది. పప్పు ధాన్యాలు పండించే విస్తీర్ణంలో వర్షాధారంగా పండించేదే 88 శాతం అయినందువల్ల అనావృష్టివల్ల కొరత ఎక్కువ అయింది. 2015-16లో మన దేశంలో 16.5 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల దిగుమతి ఉంటే 5.79 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నాం. మన దేశంలో వినియోగానికి 21.89 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ దశలో ప్రభుత్వం పప్పుల సేకరణ పెంచింది. కంది పప్పు, మినప పప్పు, పెసర పప్పు దిగుమతి అనుమతించింది. ఎగుమతుల మీద ఆంక్షలు విధించింది. నిత్యావసర సరుకుల చట్టం కింద నిల్వల మీద పరిమితులు విధించింది. మార్కెట్ ధరలను అదుపులో ఉంచడానికి 20 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పప్పు ధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించడం కోసం కనీస మద్దతు ధర పెంచింది.

ఆ తర్వాత మార్కెట్ పరిస్థితి మారింది. వర్షాలు బాగా కురవడం, పప్పు ధాన్యాలు పండించే విస్తీర్ణం పెరగడం, కనీస మద్దతు ధర చెల్లించడంవల్ల పరిస్థితి మారిపోయింది. 2016-17లో పప్పు ధాన్యాల దిగుమతి 22.95 మిలియన్ టన్నులకు పెరిగింది. దీనికి తోడు 6.61 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకున్నాం. స్వదేశంలో వినియోగానికి 29.42 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువ.

2017-18 లో ముందస్తు అంచనాల ప్రకారం రికార్డు స్థాయిలో 24.51 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. అంటే అంతకు ముందు సంవత్సరం కన్నా 1.37 మిలియన్ టన్నులు, గత అయిదేళ్ల సగటు కన్నా 5.66 మిలియన్ టన్నులు ఎక్కువ. దీనికి తోడు 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో మరో 5.1 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నాం. దాని వల్ల గిరాకీ కన్నా సరఫరా పెరిగింది. 2017-18లో పప్పులకు సంబంధించిన టోకు ధరల సూచీ మైనస్ 26.7 శాతం తగ్గింది. మార్కెట్ ధరలు అంతకు మునుపు సంవత్సరం కన్నా 30 శాతం తగ్గాయి. మద్దతు ధర నామ మాత్రంగా పెంచినా రైతులకు అందింది మద్దతు ధరకన్నా తక్కువ. వ్యవసాయ పెట్టుబడులు, ధరల ప్రకారం చూస్తే రైతులకు అయ్యే ఖర్చులు పెరిగాయి. ఈ ఖర్చులు 2016-17లో 3.7 శాతం, 2015-16లో 2.8 శాతం పెరిగాయి. అంటే రైతులకు అందే ఆదాయం తగ్గింది. దీనికి తోడు ప్రభుత్వం సేకరణ విధానం రైతులకు అనుకూలంగా లేదు. మద్దతు ధరవల్ల రైతులకు మేలు కలగలేదు.

కొరతలు, అవసరమైన దానికన్నా ఎక్కువ సరుకు అందుబాటులో ఉండడం, ధరలు పెరగడం తగ్గడం వల్ల పప్పు ధాన్యాల మీద కాలానుగుణ ప్రభావం ఉంటుందని తేలింది. కొరత ఉన్నప్పుడు అనుసరించిన విధానాలు మిగులు ఉన్నప్పుడు ఉపకరించవు. మిగులును వినియోగించుకునే విధానాలు రూపొందించాలి. మార్కెట్ లో ధర తగ్గితే రైతుల మీద ప్రతికూల ప్రభావం ఉండకుండా చూసే విధానం అనుసరించాలి. రైతుల, వినియోగదార్ల ప్రయోజనాలను కాదని వ్యాపారులు లాభాలు గడించే అవకాశం ఉండకూడదు.

మరి ప్రపంచంలో అన్ని చోట్ల కన్నా ఎక్కువగా పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసి, వినియోగించే మన దేశంలో ఎలాంటి విధానాలు అనుసరించాలి? పప్పులకు విదేశాల్లో అంతగా గిరాకీ ఉండదు కనక ధరలు స్థిరంగా ఉండే విధానం అనుసరించాలి. పంట బాగా పండినప్పుడు ధర తగ్గి రైతులకు నష్టం కలగకుండా చూడాలంటే ప్రభుత్వం నిర్దిష్టమైన పరిమాణంలో పండిన పంటను సేకరించాలి. దిగుమతుల పరిమాణం మీద, ఎగుమతుల మీద ఆంక్షలు విధించాలి.

ఇవి తాత్కాలిక చర్యలే. రైతులకు మెరుగైన ధర లభించాలంటే ఇతర చర్యలు కూడా చేపట్టాలి. వాతావరణ పరిస్థితులను బట్టి ధరల్లో ఎగుడు దిగుడు ఉండే పదార్థాలకు తగిన విధానాలు ఉండాలి. అలాగే రైతులకు మార్కెట్ సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి. అప్పుడే రైతులు బేరమాడ పరిస్థితి ఉంటుంది. ధరలను మాయ చేసే మధ్య దళారుల పాత్ర తగ్గించాలి. మెరుగైన విత్తనాలు, నీటిపారుదల సదుపాయాలు, గిడ్డంగి సదుపాయాలు, శీతల గిడ్డంగులు అవసరం. వ్యవసాయ కంపెనీలు రైతులతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవడంవల్ల కూడా ఫలితం ఉంటుంది.

రాష్ట్రాలు విస్తృతంగా పప్పు ధాన్యాలు సేకరించడానికి తోడు ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాకు కూడా తగిన ఏర్పాట్లు ఉండాలి. ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్న రాష్ట్రాలలో పప్పులు విరివిగా అందుబాటులో ఉండాలి.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top