అఘాయిత్యాల జాతర
A vicarious “aesthetic” by perpetrators of atrocities against Dalits is now becoming evident.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
మహారాష్ట్రలో రాజకీయంగా చైతన్యవంతమైన జాల్గావ్ జిల్లాలో ఈడొచ్చిన ఇద్దరు దళితులను చితకగొట్టి, నగ్నంగా నడిపించిన వీడియో దవానలంలా వ్యాపించింది. మహారాష్ట్రలో డీనోటిఫై చేసిన ఒక వ్యక్తి బావిలో ఆ ఇద్దరు దళితులు స్నానం చేసినందుకు వారిని చితకబాదారు. దాడి చేసిన వారి సామాజికవర్గం అగ్రవర్ణం కాదన్న మాటేగాని 2016లో ఊనాలో దళితుల మీద మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చిన ఘటనకు భిన్నమైంది ఏమీ కాదు.
ఈ రెండు సందర్భాలలోనూ దళితుల మీదే అఘాయిత్యం జరిగింది. ఆ అఘాయిత్యాలను సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో పెట్టారు. అంటే ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారిని చట్టం ఏమీ చేయలేదన్న అభిప్రాయం ఉంది. జాల్గావ్ కేసుకు, గుజరాత్ లోని ఊనా సంఘటనకు మధ్య తేడా ఏమిటంటే ఊనాలో దాడి చేసిన వారు సవర్ణులు. జాల్గావ్ లో దాడికి దిగినవారు సవర్ణ హిందూ కులవ్యవస్థలో భాగం కారు.
నిందితుల మీద పోలీసులు ఎస్.సి., ఎస్.టి. వారి మీద అఘాయిత్యాల నిరోధక చట్టం అమలు చేసినా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిని కుల సంబంధమైన వ్యవహారంగా పరిగణించలేదు. ఇది కులకలహం కాదని చెప్పడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరించింది.
మొదట ప్రభుత్వంలోని ప్రముఖులు, కొంతమంది పత్రికా రచయితలు ఈ అఘాయిత్యానికి కులంతో సంబంధం లేదు అని ప్రచారం చేశారు. దారి తప్పిన కొందరు ఈ దాడికి పాల్పడ్డారని నమ్మించడానికి ప్రయత్నం చేశారు. అంటే కుల దురాగాతాన్ని వ్యక్తుల దురాగతంగా చిత్రించడానికి ప్రయత్నించారు. అంటే ఈ దాడి వెనక కులపరమైన దురుద్దేశం లేదని చెప్పడానికి ప్రయత్నించారు. దాడికి దిగిన వారు హిందూ కుల వ్యవస్థలోని సవర్ణులు కాకపోవచ్చు. కాని ఇతర కులాలవారిని సహించని తత్వం ఇందులో పూర్తిగా ఉంది.
ఈడొచ్చిన ఆ ఇద్దరు దళితులను చితకబాదిన మాట మాత్రం నిజం. రెండవ వ్యూహం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది. ఊనా లేదా జాల్గావ్ లో దురాగతాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఈ పద్ధతినే అనుసరిస్తుంటాయి. ఇది అలవాటైన వ్యవహారం. తద్వారా అణగారిన వర్గాల, దళిత వర్గాల వారి అభ్యున్నతికి, సామాజిక న్యాయం అందజేయడానికి తమ ప్రభుత్వం సకల ప్రయత్నాలూ చేస్తోందని చెప్పుకునే ప్రయత్నం ఉంది.
మహారాష్ట్ర లో బీజేపీ-శివసేన ప్రభుత్వం ఈ శిష్టాచారాన్ని అనుసరిస్తూనే ఉన్నాయి. ఒక చానల్ లో ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని విపరీతంగా ప్రచారం చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ నష్ట నివారణకు ప్రయత్నించిన వారిలో దళితులు కూడా ఉన్నారు.
కాని ప్రభుత్వ వర్గాల వారు అగ్రవర్ణాల వారిలో దళితుల మీద ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయన్న వాస్తవాన్ని అంగీకరించడం లేదు. దళితులపట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకున్నంత మాత్రాన ఈ ఆగ్రహావేశాలను కప్పి పుచ్చలేం. పైగా దళితుల కోసం విపరీతంగా శ్రమిస్తున్నామని ప్రచారం చేయడం వల్ల దళితులపై అగ్రవర్ణ ఆగ్రహం మరింత పెరుగుతుంది.
దీని వల్ల అగ్రవర్ణాల వారిని నిలవరించడం కుదరదు. అగ్రవర్ణాల వారు పోటీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నారు. చట్టబద్ధ పాలనకు భిన్నంగా తమకు తమ ప్రత్యేక చట్టాలున్నాయన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చట్ట బాహ్యమైన కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటే అత్యాచారాలకు, కులపరమైన దాడులకు గురయ్యే వారు న్యాయమార్గ పాలనకు దూరంగా ఉండిపోతారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తుంది. సామాజికంగా సచేతనంగా ఉన్న వర్గాలు ఉంటే ఈ అఘాయిత్యాలకు గురైనవారి తరఫు వారు వీరి మీద ఆధారపడడానికి అవకాశం వస్తుంది.
ఒక వైపున సామాజిక నిఘా కొరవడడం, మరో వేపు అగ్రవర్ణాల వారు సృష్టించే సామాజిక భయోత్పాతం కారణంగా జాల్గావ్ లో అఘాయిత్యానికి గురైన దళితుల తరఫు వారు ఇది కేవలం హింసాత్మక సంఘటనగా భావించారు కాని కుల పరమైన దురాగతంగా భావించలేదు. ఈ గ్రామంలో, బహుశః ఇతర చోట్ల కూడా ఇలాంటి నిశ్శబ్ద ప్రతికూలత వల్ల దళితులు రాజ్యాంగం హామీ ఇచ్చే అంశాలను వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోతోంది.
కులపరమైన అరాచకాన్ని ఎదుర్కోవడం సాధ్యం కావడం లేదు. అందువల్ల బాధితులకు దానంతట అదిగా చట్టపరమైన సహాయం అందదు. ఈ హక్కులు సంపాదించడానికి నైతికప్రంగా చొరవ చూపిస్తే తప్ప వీరికి హక్కులు దక్కవు. జాల్గావ్ లో జరిగిన అఘాయిత్యాన్ని వీడియోల్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో పెట్టినందువల్ల పోలీసులు దాడి చేసిన వారిని అరెస్టు చేయడానికి అవకాశం కలిగింది.
కుల కలహాలు న్యాయమార్గ పాలనను మృగ్యం చేయకుండా ఉండాలంటే చట్టబద్ధ పాలనను పరిరక్షించి తీరవలసిందే. ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలకు దోహదం చేయకుండా మౌన ప్రేక్షక పాత్ర పోషించకూడదు.