ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ప్లాస్టిక్ ప్రళయం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

శాసనాలు, ప్రకటనలతో మార్పు రాదు. వీటిని అమలు చేయాలంటే సవివరమైన, వాస్తవికమైన, అమలు చేయదగిన ప్రణాళికలు కావాలి. జూన్ అయిదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ 2022 కల్లా ఒకే సారి మాత్రమే వినియోగిచదగిన ప్లాస్టిక్ వాడకాన్ని అంతమొందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన నాటకీయమైంది. కాని ఈ గడువు నిర్ణయించేడానికి, లక్ష్య సాధనకు ఆలోచించి నిర్ణయించినట్టు కనిపించడం లేదు.

ప్లాస్టిక్ ను 1898లో కనిపెట్టినా అది భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం 1939లోనే సాధ్యమైంది. అప్పటి నుంచి ప్లాస్టిక్ మన జీవితాలను పూర్తిగా ఆవహించింది. ఒక్క సారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ సామాగ్రితో పాటు అనేక ఇతర పనులకు ప్లాస్టిక్ వాడడం విస్తరించింది. ప్లాస్టిక్ చౌక, తేలిక, ఎలా కావాలంటే అలా వంగుతుంది. ప్లాస్టిక్ స్థానంలో మరో పదార్థాన్ని వినియోగించడం సులభం కాదు. ప్లాస్టిక్ వాడకం ఒక రకంగా ఆర్థికాభివృద్ధికి చిహ్నం. ప్లాస్టిక్ వాడడాన్ని పారిశ్రామిక దేశాలనుంచి అలవాటు చేసుకున్నాం. వాడి పారేయడానికి అనువుగా ఉంటుందని ప్లాస్టిక్ వాడుతున్నాం. ఏదీ చిరకాలం ఉండదు. అలా అయితేనే పరిశ్రమలు కొనసాగుతాయి. కాని ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయడం కుదిరే పనిలా కనిపించడం లేదు. అయినా ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం "ప్లాస్టిక్ ప్రళయం" అంటోంది కాబట్టి మనమూ ఆ దారిలోనే వెళ్లాలనుకుంటున్నాం.

మన సముద్రాల్లో 150 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. దీనివల్ల సముద్ర జీవులు, పక్షులు, మొక్కలకు చాలా ఇబ్బంది కలుగుతోంది. ప్లాస్టిక్ విచ్ఛిన్నం కాదు కనక అది సర్వత్రా వ్యాపిస్తోంది. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థం జలవనరుల్లోకి, ఆహార పదార్థాలలోకి చేరుతోంది. ఇటీవల జరిగిన అధ్యయనంలో మంచి నీళ్లలో సూక్ష్మ ప్లాస్టిక్ చేరడంతో నీళ్లు కలుషితం కావడంలో అమెరికా, లెబెనాన్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు తేలింది. పరిశీలించిన 82.4 శాతం నమూనాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఇవి నీళ్లల్లోనో, ఆహార పదార్థాలలోనో ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి సరఫరాకు ఆటంకం కలిగించేడం ఆందోళన కలిగిస్తోంది. 1950ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా 8.3 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. కాని ఇందులో 20 శాతం ప్లాస్టిక్ ను మాత్రమే నాశనం చేయగలిగాం, లేదా ఆ వ్యర్థాలను వినియోగించి ఇతర వస్తువులను తయారు చేయగలిగాం. మిగతాది సముద్రంలోనో, పర్వత సానువుల్లోనో, నదుల లోనో, బావుల్లోనో, పల్లపు ప్రాంతాలలోనో, చెత్త కుప్పల్లోనో పేరుకు పోతోంది. పట్టణాలలో చెత్త కుప్పలు అపారం. ఈ దుస్థితి భారత్ లో మరీ ఎక్కువ. ఈ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టం. 

ఈ సమస్యను పరిష్కరించడానికి మన దేశంలో మూలాల్లోకి వెళ్లడం లేదు. ఉదాహరణకు వాహనాలవల్ల కలిగే కాలుష్యాన్ని నివారించడానికి వాహనాలకు కాలుష్య తనిఖీలు చేయాలంటాం తప్ప అసలు వాడే ఇంధనం నాణ్యత గురించి ఆలోచించం. ఇంతవరకు 18 రాష్ట్రాలు నిర్దిష్ట నగరాలు, లేదా ప్రాంతాలలో ఒక్క సారి మాత్రమే వినియోగించవలసిన ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాయి. ఈ ప్రయోగం ఎక్కడా విజయవంతం కాలేదు. ఒక్క సిక్కింలో మాత్రమే ఒక్క సారే వాడే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగారు. ఒక్క సారే వాడగలిగే ప్లాస్టిక్ వినియోగాన్ని 1998లోనే నిషేధించినా ఇలాంటి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని ఆపలేకపోయాం. కానీ దీనివల్ల ప్రజల్లో చైతన్య స్థాయి పెరిగింది. ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది. టాక్సిక్ లింక్ అనే సంస్థ దిల్లీ, చండీగఢ్ లో సిక్కిం తో పాటు 2014లో ఓ అధ్యయనం చేశారు. ఇ ప్రాంతాల్లో ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గనే లేదు. దిల్లీ, చండీ గఢ్ లోని చిన్న రాష్ట్రాలలోనే ఈ పరిస్థితి ఉంటే మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలలో ఇంకెలా ఉంటుంది.

ఇందులో రెండు సమస్యలున్నాయని టాక్సిక్ లింక్ తెలియజేసింది. మొదటిది పాడైపోయే కూరగాయలు, మాంసం లాంటివి అమ్మే వారికి ఈ ప్లాస్టిక్ సంచులు చౌకగా లభిస్తాయి. రెండవది ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ఉన్న ముప్పేమిటో వినియోగదార్లకు తెలియకపోవడం. పైగా మన దేశంలో పర్యావరణ నిబంధనల అమలు సక్రమంగా ఉండదు. ప్లాస్టిక్ సంచుల వల్ల వినియోగదార్లకు సదుపాయంగా ఉంటుంది. కాని ప్లాస్టిక్ ను నాశనం చేయడం సాధ్యం కాదు కనక ఆ సమస్యను మొత్తం సమాజం ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిబంధనలు, నిరోధకాలు, ప్రోత్సహకాల వల్ల కొంత పరిష్కారం సాధ్యం కావచ్చు కాని అసలు సమస్య ఈ ప్లాస్టిక్ సంచుల ఉత్పత్తిని నిలిపివేయడం. మన దేశంలో ప్లాస్టిక్ సంచుల తయారీ 80 నుంచి 90 శాతం చిన్న తరహా పరిశ్రమల్లోనే సాగుతుంది. ఈ రంగంపై సరైన నియంత్రణ లేదు. ఒక్క సారి మాత్రమే వాడగలిగిన ప్లాస్టిక్ పదార్థాలను నిషేధించినంత మాత్రాన సరిపోదు. పెద్ద పరిశ్రమలు, బహుళ జాతి కంపెనీలు పాకేజింగ్ కోసం 48 శాతం ప్లాస్టిక్ నే ఉపయోగిస్తాయి. ఈ పరిశ్రమల నుంచి ఎదురయ్యే సమస్యే పెద్దది. అందువల్ల మళ్లీ వాడుకోవడానికి వీలు లేని ప్లాస్టిక్ ను వినియోగించే వారు బాధ్యత తీసుకునేట్టు, దానిని తొలగించడానికి అయ్యే ఖర్చు భరించేట్టు చేయాలి. దానికి తోడు జీవ విచ్ఛిన్నానికి అనువైన కాగితం, జనప నార, గుడ్డతో తయారు చేసే సంచులను చౌకగా తయారు చేసే సదుపాయం ఉండాలి. మొత్తం మీద వినియోగదారులు తమకు సదుపాయం కావాలా, లేక పర్యావరణ పరిరక్షణ ముఖ్యమా ఆలోచించుకోవాలి.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top