ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

అంగడి సరుకైన మీడియా

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా సంక్షోభంలో ఉంది. అయితే ఆ మాట మీడియా అంగీకరించడం లేదు. కళ్లెదుట కనిపిస్తున్న కుంభకోణాలను బయటపెట్టడం మానేసి, కోబ్రా పోస్ట్ లాగా వ్యవహరించకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా పెద్ద మీడియా సంస్థలన్నీ ఇసకలో తలదూర్చి ఉష్ట్ర పక్షిని తలపిస్తున్నాయి.

మే 25వ తేదీన పరిశోధనాత్మక కథనాలకు ప్రసిద్ధి చెందిన కోబ్రా పోస్ట్ ఆపరేషన్ 136 పేర రెండవ విడత మీడియా బండారం బయట పెట్టింది. పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత మీడియా మొత్తం 200 దేశాలలో 138వ స్థానంలో కడగొట్టున ఉంది. కోబ్రా పోస్ట్ తొలి విడత విడుదల చేసిన సమాచారం ప్రకారం 17 మీడియా సంస్థల వ్యవహార సరళి బయట పెట్టడానికి రహస్య కెమెరాలను వినియోగించింది.

ఒక విలేకరి “ఆచార్య అటల్” అన్న మారు పేరుతో తాను శ్రీమద్ భగవద్గీత ప్రచార సమితికి చెందిన వాడినని చెప్పుకుని మీడియా సంస్థల మార్కెటింగ్, వ్యాపార ప్రకటనల విభాగాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. మొదట మత సంబంధమైన సందేశాలు, ఆ తర్వాత కీలకమైన, వ్యంగ్యపూరితమైన సమాచారం ప్రచురించి సంఘ్ పరివార్ కు అనుకూలంగా జనం మద్దతు కూడగడితే అపారంగా డబ్బిస్తానని మీడియా సంస్థల వారితో నమ్మబలికాడు ఈ ఆచార్య అటల్.

నిజానికి ఆయన ఎవరికీ డబ్బిచ్చింది  లేదు… కానీ మీడియా సంస్థల వారు డబ్బు తీసుకుని ఇలాంటి పని చేయడానికి అంగీకరించడమే అత్యతంత ఘోరమైన విషయం.

కోబ్రా పోస్ట్ మొదటి విడత విడుదల చేసిన ఆపరేషన్ 136ను మీడియా కానీ, జనం కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మే 25వ తేదీన రెండవ విడత సమాచారం విడుదల చేస్తామని కోబ్రా పోస్ట్ ప్రకటించిన తర్వాత అందరి దృష్టి అటు వేపు మళ్లింది.

అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దైనిక్ జాగరణ్ అనే హిందీ పత్రిక…. ఈ సమాచారం విడుదల చేయకుండా కోర్టు కెళ్లి ఇంజంక్షన్ ఉత్తర్వులు సంపాదించింది. ఈ ఒక్క పత్రికకు సంబంధించిన సమాచారం కోబ్రా పోస్ట్ విడుదల చేయలేదు కాని మిగతా మీడియా సంస్థల బండారం అంతర్జాలం ద్వారా బయట పెట్టింది.

రెండవ సారి విడుదలైన సమాచారంలో పెద్ద మీడియా సంస్థలకు చెందిన వారితో సంభాషణలు వెలికి వచ్చాయి. అందులో ఒక పెద్ద మీడియా సంస్థ యజమాని మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఈ సంభాషణల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి, డబ్బు ఎలా ముట్ట చెప్తారు అన్న సమాచారం ఉంది.

అయినా రెండు మూడు పత్రికలు తప్ప మిగతా పెద్ద మీడియా సంస్థలు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోలేదు. కొన్ని మీడియా సంస్థలు కోర్టుకెళ్లి తమ వ్యవహారం బయటపెట్టకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. కోబ్రా పోస్ట్ సంస్థకు లీగల్ నోటీసులు కూడా పంపాయి. కొన్ని పత్రికలు సదరు విలేకరి గతంలో చేసిన కార్యకలాపాలను బయట పెడుతూ వార్తలు ప్రచురించాయి.  అసలు ఈ టేపులకు ఉన్న విలువ ఏమిటి అని కూడా ప్రశ్నించాయి.

రహస్యంగా స్టింగ్ ఆపరేషన్ ద్వారా సమాచారం సేకరించవచ్చునా…. ఈ టేపులు అసలైనవేనా కాదా…. వాటిలో కట్టు కథలు ఏమైనా ఉన్నాయా…. అన్న మీమాంసను పక్కన పెట్టినా ఆ టేపుల్లో బయటపడ్డ విషయంపై మాత్రం చర్చ జరగాల్సిందే. కానీ మీడియా సంస్థలలో ఉన్నత స్థానాలలో ఉన్న వారు, మార్కెటింగ్ విధులు నిర్వహించే వారు డబ్బు తీసుకుని ఒక రాజకీయ ఎజెండాను ప్రచారం చేయడానికి అంగీకరించడం ఆశ్చర్యకరమైందే కాదు, ప్రమాదకరమైంది కూడా.

ఏవో కొన్ని పత్రికలు మినహాయిస్తే చాలా మీడియా సంస్థలు ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారి పాట పాడతాయని ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా రుజువైంది. ఆ డబ్బిచ్చే వారు కార్పొరేట్ సంస్థలైనా, రాజకీయ పార్టీలు అయినా, కార్పొరేట్ సంస్థలు సమకూర్చే నిధులతో నడిచే రాజకీయ ఫ్రంట్లు అయినా ఈ మీడియా సంస్థలకు నిమిత్తం లేదు.

దాదాపు గత రెండు దశాబ్దాల నుంచి దేశంలోని మీడియా విశ్వసనీయత జారుడు బల్ల మీదే ఉంది. ఎమర్జెన్సీ సమయంలో అనేక మీడియా సంస్థలు ఏ మాత్రం లజ్జ లేకుండా రాజీ పడి పోయాయి. ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరించడం ప్రారంభించిన తర్వాత మీడియాను కొనడం, మీడియా అమ్ముడుపోవడం మితి మీరి పోయింది. మీడియా సంస్థల్లో సంపాదక విభాగానికి ఇతర విభాగాలకు మధ్య ఉన్న తేడా సమసి పోయింది.

అమ్మింది పత్రిక అన్న అభిప్రాయం వేళ్లూనుకుంది. అందువల్ల నిర్దిష్ట ధరకు వార్తలు ప్రచురించే దుష్ట సంప్రదాయం రాజ్యమేలుతోంది. ఆ తర్వాత ప్రైవేటు సంస్థలతో బేరసారాలు మొదలైనాయి. వార్తలు వ్యాపార ప్రకటనల స్థాయికి దిగజారాయి. దీనివల్ల ఉభయపక్షాలూ ప్రయోజనం పొందాయి. ఈ క్రమంలో జరిగిందల్లా మీడియా మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లడమే.

డబ్బిచ్చే వారికి అనుకూలంగా వార్తలను మలచడం వల్ల ప్రైవేటు వ్యాపార సంస్థలే కాదు, రాజకీయ పార్టీలు కూడా లబ్ధి పొందాయి. డబ్బిచ్చి వార్తలు రాయించుకునే విధానాన్ని మొట్ట మొదట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బయట పెట్టింది. 2004లో జరిగిన ఈ సంఘటనల గురించి ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది. మీడియ సంస్థలు రాజకీయ పార్టీల దగ్గరకెళ్లి డబ్బిస్తే మీకు అనుకూలంగా రాస్తామని చెప్పేవి.

మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాలలో 2009 ఎన్నికల సమయంలో ఇలాగే జరిగింది. డబ్బిచ్చి పుచ్చుకోవడం లోపాయికారీ వ్యవహారం కనక ప్రత్యక్ష సాక్ష్యాలు ఏమీ కనిపించవు. పరిస్థితి ఆధారంగా లభించే సాక్ష్యాలే దిక్కు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వార్తలు రాయించుకోవడానికి అయిన ఖర్చును ఎన్నికల కమిషన్ కు చూపే లెక్కల్లో చూపించరు.

ప్రెస్ కౌన్సిల్ ఈ వ్యవహారంపై ఒక దర్యాప్తు సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ సంఘం 71 పేజీల “పెయిడ్ న్యూస్: హౌ కరప్షన్ ఇన్ ఇండియన్ మీడియా అండర్మైన్స్ డెమొక్రసీ” నివేదిక సమర్పించింది. కానీ ఈ నివేదికను ప్రెస్ కౌన్సిల్ లోని సభ్యులందరూ ఆమోదించకపోవడం వల్ల ఆ నివేదిక అటకెక్కింది.

మీడియా సంస్థలు కార్పొరేట్ సంస్థల దగ్గర, రాజకీయ పార్టీల దగ్గర డబ్బు పుచ్చుకుని వార్తలు రాయడం కోబ్రా పోస్టు బయటపెట్టక ముందే అందరికీ తెలుసు. ఆ సంస్థ తీగ లాగినందువల్ల మీడియాను పీడిస్తున్న జబ్బు ఏమిటో, మీడియా సంస్థలు టోకున ఎలా అమ్ముడుపోతున్నాయో తెలిసింది.

ఈ వాస్తవాన్ని మీడియా అంగీకరించకపోవడం అంటే ప్రజాస్వామ్యంలో మీడియా సానుకూల పాత్ర నిర్వహించాలన్న సూత్రాన్ని పాటించకపోవడమె. ఎవరు అధికారంలో ఉన్నారన్న దానితో నిమిత్తం లేకుండా నిరపేక్షంగా వ్యవహరించే విధానాన్ని మీడియా సంస్థలు ఎన్నడో వదిలేశాయి. మిగిలిందల్లా డబ్బిచ్చే వారి పాట పాడే మీడియా సంస్థలే.

 

Back to Top