విలువలను హరించిన నాల్గేళ్ల పాలన
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ఏ ప్రభుత్వ పాలననైనా మానవులకు, వ్యవస్థలకు ఇచ్చే గౌరవం ఆధారంగానే అంచనా వేయాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలననైనా, లేదా ఏ ఇతర పార్టీ పాలననైనా ఆచరణాత్మకంగా అంచనా వేసే బాధ్యతను ఆయా పార్టీలకు వదిలి వేయాలి. ఏ పార్టీ పాలననైనా ఆఖరి సంవత్సరంలో అంచనా వేయడం పరిపాటి. అందువల్ల బీజేపీ పరిపాలనను విలువల ఆధారంగా అంచనా వేయాలంటే అయిదు సంవత్సరాలకే పరిమితం కానక్కర లేదు. ఏ పరిపాలన అయినా మానవ గౌరవాన్ని ఏ మేరకు పెంపొందించిందనేది ప్రధానం కనక ఇంకా సుదీర్ఘ సమయాన్ని దృష్టిలో ఉంచుకునే అంచనా వేయాలి. అయితే ఏ రాజ్య వ్యవస్థ కానీ లేదా రాజ్యంలోని వ్యవస్థలు కానీ నైతిక సంక్షేమాన్ని లేదా ప్రజల గౌరవాన్ని పెంపొందింప చేయలేవన్న అరాచక ధోరణితో కూడా నిర్ధారణకు రాకూడదు.
అసలు రాజ్య గౌరవాన్ని, ముఖ్యంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ గౌరవాన్ని బేరీజు వేయవలసిన అగత్యం ఎందుకొస్తుంది? ఏదుకంటే నాలుగేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ గౌరవం ప్రశ్నార్థకమైంది. గో రక్షకులు, సామాజిక మాధ్యమాలలో వెంటపడి వేధించే వారు, నైతిక, సాంస్కృతిక పోలీసులు భారత సమాజం మీద పెత్తనం చేయడానికి ఈ నాలుగేళ్లుగా ప్రయత్నించారు.
రాజ్య వ్యవస్థ గౌరవం అధికారంలో ఉన్న వారు ప్రజల గౌరవాన్ని ఏ మేరకు పరిరక్షిస్తారన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. గత నాలుగేళ్ల కాలంలో సమాంతర అధికార కేంద్రాలు ప్రబలిపోయాయి. అదీ కాక బీజేపీ కార్యకర్తలు తమ నాయకుడు ఇంతవరకు ఎన్నడూ కనిపించనంత బలమైన ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు.
ఈ సమాంతర అధికార కేంద్రాలు దళితులను బహిరంగంగా అవమాన పరిచాయి. ఊనా సంఘటన దీనికి మంచి ఉదాహరణ. తమ సంస్కృతి, ఆహారపు అలవాట్ల వల్ల కొంతమందిని సాంస్కృతికంగా తక్కువ స్థాయిగల వారని ప్రచారం చేశారు. కాని ఈ ఆహార అలవాట్లు వారి కొనుగోలు శక్తికి సంబంధించిన అంశాలు. అస్తిత్వ స్వేచ్ఛ లేకపోవడం అంటే గౌరవం లేక పోవడమే. శాకాహారులైన కొందరు శాకాహారాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఈ శక్తులను మాలిమి చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతోందా? కాకపోతే భారత రాజ్యాంగం ప్రసాదించే గౌరవాన్ని వారు కోల్పోతున్నారా? గత నాలుగేళ్ల కాలంలో నైతికతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పే వారు మూక హత్యలకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాలలో తమకు గిట్టని వారిని వేధిస్తున్నారు. నేరారోపణలున్న తమ వారి మీద కేసులు రద్దు చేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని సమర్థిస్తున్నారు. అంటే రాజ్యాంగేతర శక్తులను అదుపు చేయడంలో రాజ్య వ్యవస్థ విఫలమైందనే.
ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజల ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలి. విజ్ఞానం ఆర్జించడం ద్వారా అణగారిన వర్గాల వారు ఆత్మ గౌరవాన్ని కాపాడుకోగలగాలి. కాని గత నాలుగేళ్ల కాలంలో విద్యా సంస్థలు ఈ మహత్తర లక్ష్య సాధనకు దూరమైనాయి. ఈ విద్యా సంస్థలు సమానత్వం, సామాజిక న్యాయం అన్న భావనలపై విద్వేషం రెచ్చగొట్టే కేంద్రాలుగా మారిపోయాయి. ఉన్నత విద్యా సంస్థలు నైతికంగా ఎంతగా దిగజారిపోయాయో చెప్పడానికి రోహిత్ వేముల ఉదంతమే తార్కాణం.
సత్యాన్ని అంగీకరించడంలోనే ప్రభుత్వ గౌరవం ఆధారపడి ఉంటుంది. సర్వత్రా నిరాశ, నిస్ప్రుహ నెలకొని ఉందని, ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించాలి. కానీ ఇ వాస్తవాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. దానికి బదులు ఖరీదైన వాగ్దానాలు చేస్తోంది. తద్వారా సమస్యను పరిష్కరిస్తున్నామన్న భ్రమ కల్పిస్తోంది. అచ్చే దిన్ లాంటి బీజేపీ నినాదాల్లో ఆశాభావం ఉన్నట్టు కనిపించినా అవి భావాతీతమైనవే. ఆచరణ సాధ్యం కానివే. పెద్ద నోట్ల రద్దు వందమంది ప్రాణాలు బలిగొంది. కోట్లాది మంది బతుకులు అతలాకుతలమైనాయి.
ఖరీదైన వాగ్దానాలు, భ్రమల్లో గడపడంవల్ల ఇటీవలి ఉప ఎన్నికలలో బీజేపీ పరాజయం గమనిస్తే భారత ఓటరు మనోభావాలను అర్థం చేసుకోవడం లేదనిపిస్తుంది. ఈ విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న బీజేపీ తమ నాయకుడి త్యాగ నిరతి గురించి గొప్పలు చెప్పుకుంటోంది. వ్యక్తిగత త్యాగం ఆధారంగా మానవీయ అంశాల వేపు జన సమీకరణ సాధ్యమే. కాని ఆ వ్యక్తిగత త్యాగాలు ఒక పార్టీ మనవ విద్వేషానికి దారి తీస్తే ఆ విషయాన్ని అనుమానించవలసిందే.