ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆచరణలేని ఆలోచనలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

లైంగిక దాడులకు, ఆసిడ్ దాడులకు గురైన వారికి ఆర్థిక రూపంలో పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ పని ఎప్పుడో జరగవలసింది. అయినప్పటికిన్నీ వివిధ రాష్ట్రాలలోనూ, అత్యాచార బాధితులకు ఒకే చోట సకల పరిష్కారం చూపే కేంద్రాలలోనూ గజిబిజి పత్రాల అవసరం, అధికారవర్గాల మొద్దుబారిన వైఖరి కారణంగా ఇలాంటి పథకాల అమలు అనుల్లంఘనీయమైన సమస్యలకు దారి తీస్తున్నాయి. ఉదాహరణకు 2013లో ఏర్పాటు చేసిన నిర్భయ నిధి నుంచి తొమ్మిది రాష్ట్రాలలో అత్యాచారానికి గురైన వారిలో కేవలం 123 మందికే ఆర్థిక పరిహారం అందిందని న్యాయవాది ఇందిరా జైసింగ్ చెప్పారు. జాతీయ న్యాయ సేవల వ్యవస్థ ప్రకారం దేశవ్యాప్తంగా అత్యాచారానికి గురైన వారిలో 5 నుంచి 10 శాతం మందికి మాత్రమే ఆర్థిక పరిహారం అందింది.

అత్యాచార బాధితులకు ఆర్థిక పరిహారం అందించే నిధికి కోర్టులో కేసుల విచారణకు సంబంధం లేదు కనక అత్యాచార సంఘటన జరిగిన వెంటనే పరిహారం కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ న్యాయ సేవల వ్యవస్థ అత్యాచార, ఆసిడ్ దాడి బాధితుల వ్యవహారాన్ని తనంత తాను స్వీకరించి తాత్కాలిక ఆర్థిక సహాయం అందజేయాలని సిఫార్సు చేయవచ్చు. ఈ పథకం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఈ పథకం కింద అత్యాచారానికి గురై మరణించిన వారి కుటుంబాలకు, మూకుమ్మడి అత్యాచారానికి గురైన వారికి కనీసం రూ. అయిదు లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 10 లక్షల పరిహారం చెల్లించవచ్చు. ఇతర అత్యాచార బాధితులకు, ఏకపక్ష లైంగిక దాడికి గురైన వారికి, 80% వైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య పరిహారం చెల్లించవచ్చు. ఆసిడ్ దాడులకు గురైన వారికి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల దాకా పరిహారం చెల్లించవచ్చు. ఇది ఆసిడ్ దాడివల్ల కలిగిన గాయాల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. దాడి జరిగిన వెంటనే లక్ష రూపాయాలు చెల్లించాలి, రెండు నెలల లోగా రెండు లక్షలు చెల్లించాలి. అత్యాచారాలు, ఆసిడ్ దాడులు మైనర్ బాలికల మీద జరిగితే రెట్టింపు పరిహారం ఇవ్వాలి.

అత్యాచారానికి, ఆసిడ్ దాడులకు గురైన వారికి తక్షణం వైద్య సహాయం అవసరం అవుతుంది కనక న్యాయ సహాయ కమిటీలు వెంటనే నిర్ణయాలు తీసుకుని తక్షణ సహాయం సిఫార్సు చేయాలి. ఆసిడ్ దాడి జరిగిన వారికైతే వెంటనే చికిత్స, అనేక సార్లు శస్త్ర చికిత్సలు అవసరం అవుతాయి. 2012లో దీల్లీలో అత్యాచారం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీలు పడి పరిహారం ప్రకటించాయి. మహిళలకు భద్రత కల్పిస్తామని హామీలు గుప్పించాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బాధిత పరిహార పథకాన్ని రూ. 200 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అత్యాచారానికి, ఆసిడ్ దాడికి, అమ్మకానికి గురైన అమ్మాయిలకు, సరిహద్దులో కాల్పులకు గురై మరణించిన వారికి, గాయపడిన వారికి ఈ సహాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిహారాలు ప్రకటించాయి.

కాని మీడియాలో వచ్చిన నివేదికలు, సర్వేల ప్రకారం చూస్తే బాధిత కుటుంబాలకు రాష్ట్ర, జిల్లా న్యాయ సహాయ కేంద్రాలలో ఎదురవుతున్న అనుభవాలు ఘోరంగా ఉన్నాయి. అత్యాచారానికి, ఆసిడ్ దాడులకు గురైన వారి కోసం మహారాష్ట్రలో ప్రారంభించిన మనోధైర్య యోజన అమలు తీరు అద్వానంగా ఉంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తండ్రి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు ఇలాంటి వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారాలకు సంబంధించిన విచారణకు, పరిహారం చెల్లించడానికి ఏ మాత్రం సంబంధం లేదని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పినప్పటికీ న్యాయ సహాయ కేంద్రాలు తమ పద్ధతిలో దర్యాప్తు జరిపి పరిహారం చెల్లించాలో లేదో నిర్ణయిస్తామని చెప్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదు చేయగానే బాధితులకు పరిహారంలో 50% పొందే అర్హత వస్తుంది. మిగతా పరిహారం చార్జి షీట్ దాఖలు అయిన తర్వాత చెల్లించాలి. పరిహారం చెల్లింపులో జాప్యం, విసుగు పుట్టించే ప్రక్రియ ఈ పథకం ప్రయోజనానికే భంగం కలగజేస్తోంది. లైంగిక దాడి జరిగిన వెంటనే పోలీసులు న్యాయ సహాయ కేంద్రాలకు సమాచారం ఇచ్చే పద్ధతి ఉండాలని బాధితులకోసం పాటుపడే వారు కోరుతున్నారు. దీనివల్ల బాధితులకు త్వరగా సహాయం అందించవచ్చు.

2017లో ఆంధ్రప్రదేశ్ లో 901 అత్యాచార కేసులు నమోదైతే కేవలం ఒక సందర్భంలో మాత్రమే పరిహారం అందిందని జాతీయ న్యాయ సేవల వ్యవస్థ సుప్రీం కోర్టుకు తెలియజేసింది. బాలల మీద 1,028 లైంగిక దాడుల కేసులు నమోదైతే 11 మందికి మాత్రమే పరిహారం అందింది. రాజస్థాన్ లో 3,305 ఎఫ్.ఐ.ఆర్.లు నమోదైతే 140 మందికే పరిహారం అందింది. బిహార్ లో 1199 ఎఫ్.ఐ.ఆర్.లు నమోదైతే పరిహారం అందింది 82 మందికే. మధ్యప్రదేశ్ లో అందించిన పరిహారం ఆరువేల నుంచి ఆరువేల అయిదువందల రూపాయలు మాత్రమే ఉందని జాతీయ న్యాయ సేవల వ్యవస్థ సుప్రీంకోర్టుకు నివేదిందించింది.

జాతీయ న్యాయ సేవల వ్యవస్థ ఈ పథకాన్ని సవివరంగా రూపొందించింది కనక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సత్వరం పరిహారం చెల్లిస్తే బాధితులకు కొంతైనా ఉపశమనం లభిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యాచార బాధితులకు అధిక పరిహారం చెల్లించాలన్న ధోరణి కనబడ్తోంది. సుప్రీంకోర్టు కూడా ఈ దిశలోనే ఆదేశాలు జారీ చేసింది. పరిహారం చెల్లిస్తే బాధితులకు వెంటనే ఉపశమనం కలగడంతో పాటు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదు చేయడం పెరుగుతుందని అంతకు ముందే అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అత్యాచార బాధితులకు దాన ధర్మం కింద ఈ సొమ్ము అందజేయడం లేదనీ, అది వారి హక్కు అని ఈ పథకాన్ని అమలు చేసే వ్యవస్థలు గ్రహించాలి.

అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలని ఘోషించే మన సమాజం పరిహారం అందేట్టు చూడడానికి ప్రయత్నించకపోవడం విచిత్రమే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top