ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

ఉపాధి కల్పనపై కాకి లెక్కలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

వ్యవస్థీకృత రంగంలో ఉపాధి గురించి ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలు ప్రచారంలో పెడ్తోంది. కాని ఉద్యోగ కల్పన గురించి అందిన అనేక రకాల నికరమైన సమాచారం ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఉంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.), పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి వ్యవస్థ (పి.ఎఫ్.ఆర్.డి.ఎ.) ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ (ఇ.ఎస్.ఐ.సి.) సంస్థలు వేతనాల చెల్లింపు నివేదికల ఆధారంగా ఉపాధి కల్పనకు సంబంధించిన సమాచారాన్ని 2018 ఏప్రిల్ 25న విడుదల చేశాయి. ఈ సమాచారాన్ని కర్నాటక శాసనసభ ఎన్నికలకు 15 రోజుల ముందు విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించడానికి ముందు జనవరిలో కూడా ఇలాంటి వివరాలే విడుదల చేశారు. ఇ.పి.ఎఫ్.ఒ., ఇ.ఎస్.ఐ.సి., జాతీయ పింఛన్ పథకం (ఎన్.పి.ఎస్.) రికార్డుల ఆధారంగా ఈ సమాచారం వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగానే 2017-18లో 70 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించామని ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పుకున్నారు. ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేస్తున్నా ఉపాధి అవకాశాలు పెరగడం లేదన్న వాస్తవాన్ని తిప్పికొట్టడానికి ఈ లెక్కలు ఉపయోగించుకున్నారు.

జనవరిలో విడుదల చేసిన సమాచారాన్నిబట్టి చూస్తే శ్రామికులు సామాజిక భద్రతా పథకాలను ఎలా వినియోగించుకుంటున్నారో మాత్రమే తెలుస్తుంది. ఈ సామాజిక భద్రతా పథకాలలో ఇ.ఎస్.ఐ. లాంటివి స్వచ్ఛందమైనవి. ఇ.పి.ఎఫ్.ఒ. లాంటివి తప్పని సరిగా అమలు చేయాల్సినవి. ఎన్.పి.ఎస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్బంధంగా అమలు చేయాలి. కాని ఇది కొన్ని రాష్ట్రాలలో, ప్రైవేటు రంగంలో పని చేసే వారికి స్వచ్ఛందమైందే. కొన్ని నియమాలకు కట్టుబడిన సంస్థలకు మాత్రమే ఇ.పి.ఎఫ్.ఒ. అమలు అవుతుంది. సెప్టెంబర్ 2017 నుంచి 2018 వరకు ఎ.పి.ఎఫ్.ఒ. కింద తెరిచిన కొత్త ఖాతాలు 32 లక్షల 70 వేలు మాత్రమే. ఎన్.పి.ఎస్. కింద తెరిచిన కొత్త ఖాతాలు కేవలం నాలుగు లక్షల 20 వేలే. 25 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న వారు ఇ.పి.ఎఫ్.ఒ. కింద తెరిచిన కొత్త ఖాతాలు 20 లక్షలు, ఎన్.పి.ఎస్. కింద తెరిచిన కొత్త ఖాతాలు 84, 659 మాత్రమే. ఇ.ఎస్.ఐ. పథకం కింద 2017 సెప్టెంబర్ నాటికి మొత్తం ఖాతాలు 29 మిలియన్లు అయితే అది 2018 ఫిబ్రవరి నాటికి 27 మిలియన్లకు తగ్గిపోయాయి. ఇ.ఎస్.ఐ. పథకం స్వచ్ఛందమైంది, ప్రతి నెలా ఒకే రకంగా ఉండదు కనక దాని ఆధారంగా ఒక నిర్ధారణకు రాలేం. ఇ.పి.ఎఫ్.ఒ. ఖాతాల విషయంలో కచ్చితమైన నిర్ధారణ సాధ్యం కాదు. ఎందుకంటే కొత్తగా ఈ పథకంలో చేరిన వారు ఎందరు, లేదా సంస్థ స్వరూపం మారినందువల్ల ఈ పథకం కిందకు వచ్చిన వారు ఎందరో తేల్చడం కష్టం. ఇ.పి.ఎఫ్.ఒ., ఎన్.పి.ఎస్. పథకాల్లో కొత్తగా చేరిన వారినిబట్టి చూసినా ఆరు నెలల్లో చేరింది కేవలం 21 లక్షలే. ఏడాది కాలంలో చేరింది 42 లక్షలు మాత్రమే. అంటే 70 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించామన్న వాదనతో ఈ లెక్కలు సరిపోలడం లేదు.

అదీగాక వ్యవస్థీకృత రంగంలో పని చేసే వారు మొత్తం ఆర్థిక వ్యవస్థలో పని చేసే వారిలో పదో శాతం మంది కూడా ఉండరు. ఈ లెక్కన చూస్తే అవ్యవస్థీకృత రంగంలో పని చేసే 90 శాతం మంది కొంత పెరిగైనా ఉండాలి లేక మారకుండానైనా ఉండి ఉండాలి. వాస్తవానికి ఈ అంచనాలేవీ సరైనవి కావు. నేషనల్ సాంపుల్ సర్వే కార్యాలయం 2004-05, 2011-12 సంవత్సరాల మధ్య ఉపాధి-నిరుద్యోగం గురించి సేకరించిన సమాచారం ప్రకారం ఒక్క వ్యవసాయ రంగంలోనే ఏటా 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వేతనాల రికార్డుల ప్రకారం కొత్తగా ఉపాధి కల్పించామని చెప్పే దానికన్నా ఇది ఎక్కువ. లేబర్ బ్యూరో ఉపాధి కల్పన గురించి సేకరించే వార్షిక సమాచారం ఆధారంగా చూసినా వ్యవసాయ రంగంలో ఉపాధి కోల్పోయే వారి సంఖ తగ్గుతూనే ఉంది. నరేంద్ర మోదీ హయాంలో తగ్గడం మరింత వేగవంతమైంది. పెద్ద నోట్ల రద్దు, హడావుడిగా ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) కారణంగా అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి కల్పన గణనీయంగా తగ్గింది.

జరగవల్సిందల్ల ప్రతి సంవత్సరం కుటుంబాల పరిస్థితిపై సర్వే చేయడమే. ఈ విషయాన్ని అనేక సార్లు ప్రస్తావిస్తూనే ఉన్నారు. 2004 నుంచి 2011 వరకు నేషనల్ సాంపుల్ సర్వే ఆరు సార్లు సర్వే చేసింది. ఇందులో నాలుగు సర్వేలు విస్తృతంగా చేసినవి. ఆ సర్వేలు అర్థ సంవత్సరానికి ఒక సారి జరిగాయి. దీని వల్ల వార్షిక ఉపాధి కల్పనకు సంబంధించిన సమాచారం అందింది. 2011-2012 తర్వాత దురదృష్టవశాత్తు ఈ సర్వేలు నిర్వహించడం ఆపేశారు. లేబర్ బ్యూరో కూడా వార్షిక ఉపాధి కల్పనపై సర్వే నిర్వహిస్తుంది. అందులో భాగంగా చివరి సర్వే 2015-16లో నిర్వహించారు. 2014 మార్చి నుంచి 2015 జులై మధ్య కోటీ 60 లక్షల మంది కార్మికులు తగ్గిపోయారని తెలిసిన తర్వాత ఈ సర్వే కూడా నిలిపివేశారు. లేబర్ బ్యూరో ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించే సర్వేలోనూ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించే సర్వేలోనూ గత మూడేళ్ల కాలంలో ఉపాధి కల్పన అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో కన్నా గణనీయంగా తగ్గినట్టు తేలింది. చివరకు నేషనల్ సాంపుల్ సర్వే పట్టణ ప్రాంతాలలో ప్రతి మూడు నెలలకు ఒక సారి, ఆ తర్వాత చాలా కాలానికి గ్రామీణ ప్రాంతాలలో ఏడాదికి ఒక సారి సర్వే చేస్తోంది. కాని ఈ సమాచారం 2019లో జరిగే కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశం లేదు.

గత 15 ఏళ్ల నుంచి మన ఆర్థిక వ్యవస్థ 7శాతం అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ వేతనాల జాబితానుబట్టి చూస్తే ఉపాధి పెరుగుతున్న దాఖలాలు లేవు. ఉపాధి అవకాశాలు కొరవడినందుకు నిరసనగా పట్టణ ప్రాంతాలలోనూ, గ్రామీణ ప్రాంతాలలోనూ యువత నిరసన ప్రదర్శనలు చేస్తోంది. ఉదాహరణకు జాట్లు, మరాఠాలు, పటేళ్లు పోరుబాట పట్టారు. వాస్తవ పరిస్థితికి, ప్రభుత్వం చెప్పే లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదంటే ప్రభుత్వ లెక్కలన్నీ కాకి లెక్కలే. గణాంకాల ద్వారా మాయ చేయడం ఎన్నికల ప్రచారానికి ఉపకరించవచ్చు. కానీ ఉపాధి కల్పనకు అనుగుణమైన విధానాలు రూపొందించడానికి ఈ గణాంక విన్యాసాలు ఎందుకూ కొరగావు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top