ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846
Reader Mode

ప్రజాస్వామ్యాన్ని కుళ్లబొడుస్తున్న బీజేపీ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

కర్నాటక ఎన్నికల ఫలితాలను అనేక రకాలుగా విశ్లేషించవచ్చు. కాంగ్రెస్ కు, జనతా దళ్ (ఎస్)కు నిబద్ధత లేదని అనవచ్చు. ఆ రెండు పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకుని ఉంటే మరింత మెరుగైన స్థానంలో ఉండేవి. ఎన్నికలు కర్నాటక ప్రజలకు ముఖ్యమైనవే. కానీ భారతీయ జనతా పార్టీ మరో రకంగా ఆలోచించింది. మొత్తం దేశమంతా తమ పార్టీకే అధికారం ఉండాలని బీజేపీ అనుకుంటోంది. "భారత్ లోని 80 శాతం బీజేపీ చేతికి చిక్కింది" అని కొంతమంది బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడమే దీనికి రుజువు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల చిత్రాన్ని భారత రాజకీయ చిత్రపటంలో చూపించి ముద్రణా మాధ్యమం ఈ వాదనను బలపరిచింది. హిందుత్వ రాజకీయం ప్రకారం ఎన్నికలలో విజయం అంటే ఎంత భూభాగం తమ అధీనంలో ఉందని మాత్రమే కాని తమ సమతాభావ దృక్పథం ఏ మేరకు విస్తరించిందో చెప్పడం కాదు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయబద్ధంగా రాజకీయ అధికారం సంపాదించడం బీజేపీ లక్ష్యం అనిపించవచ్చు. కాని మర్యాదకరమైన భాష ఉపయోగించి ఓటర్లను సమీకరించి పార్టీ కార్యకర్తల మీద, ఓటర్ల మీద నైతిక ప్రభావం చూపడం మీద బీజేపీ దృష్టి ఉన్నట్టు కనిపించడం లేదు. నైతికంగా ఓటర్లను సమీకరించడం అంటే 2014 ఎన్నికలలో బీజేపీ చేసిన వాగ్దానాలు ఎంత మేరకు అమలు చేశారో చెప్పడం. కానీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు తమ వాగ్దానాలను ఏ మేరకు అమలు చేశారో చెప్పనే లేదు. తమ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ముతక భాష వినియోగించారు.

ప్రత్యర్థులు, వ్యతిరేకించే వారు, పోటీ పడే వారు ఉపయోగించే భాషకు బదులు రాజకీయ నాయకులు మర్యాదకరమైన భాష వాడాలి. కాని "కాంగ్రెస్ ముక్త్ భారత్" అన్న బీజేపీ పథకానికి ఈ మర్యాదకరమైన భాష ఉపకరించదు కనక రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చిత్రించారు. అలా చిత్రించడం కోసమే బీజేపీ నాయకులు మగతనాన్ని ప్రతిబింబించే, సైనిక పరిభాష వాడారు. ఇటీవలి కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు ఒక వేపున తమ మగతనాన్ని, యుద్ధానికి కాలు దువ్వే ప్రతిబింబించే భాష, మరో వేపు ముతక భాష వినియోగించారు. ప్రత్యర్థుల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. తమ శత్రుపక్షాన్ని అంటే కాంగ్రెస్ ను నిర్మూలించడానికి కయ్యానికి కాలు దువ్వే భాష వాడారు. అమిత్ షా ఈ భాషే వాడారు. ప్రతిపక్షమనేదే లేకుండా ఉండాలన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా ఉంది. రాజకీయంగా సముచిత నిర్ణయాలు తీసుకునే లక్షణం విజ్ఞులైన ఓటర్లకు ఉంది కనక ప్రజాస్వామ్యం, నిర్దిష్టమైన ఓటర్ల మద్దతు అన్నది బీజేపీకి సమకూరడం లేదు. ఈశాన్య ప్రాంతంలో మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో, పశ్చిమాన గోవాలో, దక్షిణాదిన కర్నాటకలో అందుకే బీజేపీకి చుక్కెదురైంది.

కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ సంపూర్ణ అధికారం సంపాదించాలన్న బీజేపీ ఆకాంక్ష సాధించడానికి బీజేపీ నైతికంగా సమర్థనీయం కాని పద్ధతులను అనుసరించింది. ప్రజాస్వామ్య నియమాలను ఉల్లంఘించింది. లేకపోతే అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండేది. కాని బీజేపీ మేఘాలయలో కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించినా అధికారం సంపాదించింది. కర్నాటకలో 104 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీకి దూరంగా ఉండిపోయింది.

ఏమైనా సరే అధికారం సంపాదించడం కోసం బీజేపీ ఎక్కడ లేని ఆత్రుత ప్రదర్శించింది. అధికారంలో ఉండడానికి నైతిక మార్గాలను అనుసరించాలన్న పట్టింపు బీజేపీకి ఎంత మాత్రం లేదు. అయితే ప్రజాస్వామ్య భవిష్యత్తు ఎన్నికల ఫలితాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మర్యాదకరమైన భాష ద్వారా జనం మద్దతు సమీకరించడం, ప్రజాస్వామ్య నియమాలను పాటించడమే ప్రజాస్వామ్య మనుగడకు నిదర్శనం. ప్రజాస్వామ్య సూత్రాలను పదిలం చేయాలంటే పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో వ్యవహరించాలి. కాని ఎలాగైనా అధికారం సంపాదించాలన్న పట్టుదల ఏ రకంగానూ ఉత్తమ ప్రజాస్వామ్య విలువలకు తోడ్పడదు.

ఆరు నూరైనా అధికారం సంపాదించాలన్న ఆత్రుత గతంలో లాగా ఒక సామాజిక వర్గం వారు పెత్తనం చేలాయించే పద్ధతికి మాత్రమే సంకేతం. భారత ప్రజలమైన మనం ప్రజాస్వామ్యంలో మర్యాదను పరిరక్షించవలసిన అవసరం ఉంది. కాని ప్రజాస్వామ్య విధానాల ఆసరగా సామాజిక ఆధిపత్యం చెలాయించాలనుకునే వారిని ఎలా ఎన్నుకోగలమన్నదే మనకు అంతుబట్టని విషయం. భారత రాజకీయాలలో ఒకే కుటుంబ పాలనకు ప్రాధాన్యం ఉండడం కూడా ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చేది కాదు. "నేను పరిపాలిస్తాను, నన్ను పరిపాలించడానికి అంగీకరిస్తాను" అంటే అది నైతికమైన విధానం. ఎలాగైనా సరే అధికారం సంపాదించాలనే ఆకాంక్ష ఉన్న వారు "నేనే పరిపాలిస్తాను, నిరంతరం పరిపాలిస్తాను, శాశ్వతంగా పరిపాలిస్తాను" అన్న రీతిలో వ్యవహరిస్తారు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top