ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆధార్ పై ఉష్ట్రపక్షి ధోరణి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఆధార్ విషయంలో సేకరించిన వ్యక్తిగత సమాచారం సురక్షితం కాదు అన్న వాదన లేవనెత్తినప్పుడల్లా భారత విశిష్ట గుర్తింపు వ్యవస్థ (యు.ఐ.డి.ఎ.ఐ.) ఇసకలో తల దూర్చేస్తూ ఉంటుంది. చండీగఢ్ నుంచి వెలువడే ట్రిబ్యూన్ పత్రిక విలేకరి కేవలం రూ. 500 చెల్లించి ఆధార్ సమాచారం సేకరించిన వైనాన్ని ప్రచురిస్తే ఆధార్ వ్యవస్థ ఆ విలేకరిపై కేసు నమోదు చేయించింది. ఈ సమాచారం సేకరించినందువల్ల ప్రమాదం ఏమీ జరగలేదని చెప్పింది. కాని జనం తమ వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించుకోవాలని సలహా పారేసింది. ఆధార్ గురించిన అసత్య ప్రచారానికి తెర దించవలసిన సమయం ఆసన్నమైంది.

ఆధార్ చాలా విస్తృతమైన, సర్వవ్యాప్తమైన వ్యవస్థ కనక ఇబ్బందులకు ఆస్కారం ఉంటుంది. అనేక సందర్భాలలో అనధికారికంగా ఈ సమాచారాన్ని సేకరించి, ప్రచురించి, దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయి. ట్రిబ్యూన్ ప్రచురించిన వార్తనుబట్టి అనధికారికంగా ఈ సమాచారాన్ని ఎలా అంగడి సరుకు చేస్తున్నారో రుజువు అయింది. జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అప్పనంగా అమ్మేస్తున్నారు. ఇంతకు ముందు ఏర్ టెల్ పేమెంట్ బ్యాంకు తమ వినియోగదార్ల ఖాతాలు సృష్టించి వారి అనుమతి లేకుండానే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద ఇచ్చిన డబ్బును పేమెంట్ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన విషయం గురించి విన్నాం. అనేక ప్రభుత్వ వెబ్ సైట్ల లాగే జార్ఖండ్ ప్రభుత్వ వెబ్ సైట్ ఆధార్ నెంబర్లను, బ్యాంకు ఖాతాల వివరాలను, దాదాపు పది లక్షల మంది పింఛన్ దార్ల ఖాతాదార్ల పేర్లను, చిరునామాలను వెల్లడించింది.

ఇలాంటి అవకతవకలు బయట పడ్డప్పుడల్లా యు.ఐ.డి.ఎ.ఐ. బయో మెట్రిక్ (జీవ పరిణామ సంబంధ) సమాచారం సురక్షితంగా ఉందని, వెల్లడి అయిన ఆధార్ నెంబర్ల వల్ల ఆ వెబ్ సైట్ల వల్ల ముప్పేమీ లేదని చెప్తూ వస్తోంది. జీవ పరిణామ సంబంధ సమాచారం లేనిదే ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని బుకాయిస్తూ వచ్చింది. (2017 నవంబర్ 20 నాటి యు.ఐ.డి.ఎ.ఐ. పత్రికా ప్రకటన). ఈ సమాచారం వెల్లడి కాలేదనే చెప్తోంది. వెల్లడైన సమాచారం నామమాత్రం అయిందని వాదిస్తోంది. తమ వ్యవస్థకు సంబంధించిన సకల అంశాలు తమ దగ్గర ఉంటాయని, ఏ మాత్రం దుర్వినియోగం జరిగినా కనుక్కోవచ్చునని కూడా యు.ఐ.డి.ఎ.ఐ. చెప్తూ వస్తోంది.

ఈ ఉదంతాలు బయట పడ్డ తర్వాత 5000 మంది అధికారులకు ఈ సమాచారం అందుబాటులో లేకుండా చేసింది. రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీన్నే వాస్తవిక గుర్తింపు, కె.వై.సి. అంటారు. ఇప్పటికే లక్షలాది మంది దరక్షాస్తుదార్ల సమాచారం ప్రైవేటు ఆపరేటర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంకులు, తపాల కార్యాలయాల వంటి ప్రభుత్వ కేంద్రాలకు ఈ బాధ్యత అప్పగించారు. వాస్తవాలు బయటికి వచ్చిన తర్వాతే చర్య తీసుకోవడం మొదటి నుంచి యు.ఐ.డి.ఎ.ఐ. కి అలవాటుగా మారింది. ప్రతి అడుగులోనూ నష్టం జరిగిపోయిన తర్వాత నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్తోంది. ఆధార్ కు కావాల్సిన చట్టం చేయక ముందే యు.ఐ.డి.ఎ.ఐ. వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆధార్ సంఖ్యలను నమోదు చేయడం, అనుసంధానం చేయడం ప్రారంభించారు. ఏ చట్టమూ, భద్రత లేకుండానే సకల జీవన రంగాలకు ఆధార్ నమోదు తప్పని సరి చేశారు. వ్యక్తిగత సమాచారానికి రక్షణే లేకుండా మొత్తం వ్యవహారం సాగిపోయింది. జనన ధృవీకరణ సర్టిఫికేట్ నుంచి మరణ ధృవీకరణ సర్టిఫికేట్ దాకా సకల విషయాలకు ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరి చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిరాశ్రయులు శరణాలయాల్లో చేరాలంటే ఆధార్ సంఖ్య అందజేయాలని కోరడం ఈ అస్తవ్యస్తతకు పరాకాష్ఠ. దీనితో "ఆధార్ కార్డు లేని వారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో మనుగడలో లేనట్టేనా" అని సుప్రీంకోర్టు కటువుగా ప్రశ్నించవలసి వచ్చింది.

ప్రభుత్వం చెప్పిన దానికి అతీతంగా ఆధార్ ను తప్పని సరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు 2015 నుంచి సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ కేసులో జనవరి 17 నుంచి మళ్లీ విచారణ జరగబోతొంది. ఆధార్ వ్యవస్థను ఎందుకు, ఎలా ప్రారంభించారు, అది ఎలా సర్వవ్యాప్తమైందో అడగవలసిన అగత్యం అత్యున్నత న్యాయస్థానానికి ఉంది. ఆధార్ సమాచారానికి భద్రత లేని వైనాన్ని, ప్రభుత్వం అందించే సేవలు ఆధార్ కార్డు లేకపోతే అందుబాటులో లేని పరిస్థితిని, ఆధార్ సంబంధిత అంశాలలో పౌరుల హక్కులను, అన్నింటికన్నా ముఖ్యంగా ఈ విషయాలలో యు.ఐ.డి.ఎ.ఐ. వైఫల్యాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కీలకమైన సమాచారంపై నియంత్రణ ఉన్న యు.ఐ.డి.ఎ.ఐ. సరైన భద్రత లేకుండా ఎలా నిర్వహించగలదో కూడా పరిశీలించాలి. దేశంలో సమాచార భద్రత విషయంలో బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ విడుదల చేసిన శ్వేతప్రత్రంలో "సమాచార భద్రతను అమలు చేయడానికి ఉన్నత స్థాయి చట్టబద్ధమైన వ్యవస్థ ఉండాలి" అని చెప్పింది. ఇలాంటి వ్యవస్థలకు అనేక అంతర్జాతీయ ఉదాహరణలు, పూర్వోదంతాలు ఉన్నాయని కూడా ఈ శ్వేతపత్రంలో తెలియజేశారు. అంటే ఈ వ్యవస్థ యు.ఐ.డి.ఎ.ఐ. కి సంబంధం లేకుండా స్వతత్రంగా ఉండాల్సిందే.

మనం సమాచార యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ఒక వ్యక్తి గుర్తింపు సమాచారాన్ని సృజిస్తుంది. అది రాజ్యవ్యవస్థకు మాత్రమే కాకుండా ప్రైవేతు కార్పొరేట్ సంస్థలకు కూడా అందుబాటులో ఉంటుంది. మన దేశంలో ఆధార్ పథకాన్ని ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ప్రారంభించారు. వ్యక్తుల గోప్యతకు అవకాశం లేకుండా చేశారు. ఈ గోప్యతను ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం ధ్రువీకరించింది. సుప్రీంకోర్టు ఈ గోప్యత హక్కును పునరుద్ఘాటిస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే దాన్ని చిందరవందర చేస్తున్నారు. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top