ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బిట్ కాయిన్ మాయాజాలం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

షికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్స్ చేంజీలో 2017 డిసెంబర్ 10న బిట్ కాయిన్ కరెన్సీని ఉపయోగించి వ్యాపారం చేయవచ్చునని చెప్పిన తర్వాత, ఆ మరుసటి వారం అంతకన్నా పెద్దదైన షికాగో మర్కెంటైల్ ఎక్స్ చేంజిలో కూడా ఇదే అవకాశం కల్పించినందువల్ల పెద్ద సంస్థాగత పెట్టుబడి దారులు బిట్ కాయిన్ తో వ్యాపార లావాదేవీలు ప్రారంభించారు. ఇంతకు ముందు అనియంత్రిత ఎక్స్ చేంజీల్లో వ్యాపారంపై నియంత్రణ ఉండేది. ఇప్పుడు బిట్ కాయిన్ ఉపయోగించి వ్యాపారం చేయడం వల్ల లాభాలు సమకూరే మరో పోర్ట్ ఫోలియోకు అవకాశం వచ్చింది. బిట్ కాయిన్ ధర అంతకంతకూ పెరుగుతుండడం వల్ల భారీ సంస్థాగత పెట్టుబడి దార్లు లాభాల అన్వేషణలో పడ్డారు. బిట్ కాయిన్ నిజానికి భౌతిక రూపంలో ఉండే డబ్బు (కరెన్సీ) కాదు. అది డిజిటల్ రూపంలో ఉండే గుప్త కరిన్సీ మాత్రమే. ఈ గుప్త కరెన్సీ ధర అనూహ్యంగా పెరిగిపోతోంది. 2017 జనవరిలో ఒక బిట్ కాయిన్ ధర వెయ్యి డాలర్లు పలికితే 2017 డెసెంబర్ కల్లా ఇరవై వేల డాలర్లు పలికింది. అయితే నీటి బుడగ లాంటి ఈ పెరుగుదల ఎప్పుడు పగిలిపోతుందోనన్న భయాందోళనలు కూడా ఉన్నాయి. బిట్ కాయిన్ తో వ్యాపారం చేసే హెడ్జ్ ఫండ్స్ వారు బిట్ కాయిన్ ను ఇతర గుప్త కరెన్సీని ఉపయోగించి లాభాలు సంపాదించారు. అయితే ఈ బిట్ కాయిన్ పెరుగుదల మీద ఊహించి వ్యాపారం చేయడంలో ముప్పు ఉందని వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (రిజర్వు బ్యాంకు లాంటివి) హెచ్చరిస్తున్నాయి.

అయినా ఆర్థిక మాంద్యం తర్వాత పెట్టుబడిదారీ దేశాలు ముఖ్యంగా అమెరికాలోని ఫెడరల్ రిజర్వు, యూరప్ కేంద్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ జపాన్ పరిమాణాత్మ సడలింపు ద్రవ్య విధానాన్ని అనుసరించినందువల్ల నగదు లభ్యత పెరిగింది. వాణిజ్య బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తే జనం ఖర్చు పెట్టడం పెరగడానికి వీలుగా కేంద్ర బ్యాంకులు ఈ ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుంటాయి. ద్రవ్య చెలామణి పెరగేట్టు చూడడానికి ప్రభుత్వం మార్కెట్ నుంచి బాండ్లు వగైరా కొంటుంది. నగదు అందుబాటులో ఉన్నందువల్ల దాన్ని స్టాక్ మార్కెట్లు, బాండ్లు, ఇతర ఆర్థిక ఆస్తుల్లో, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఇది ఆస్తుల విలువలో ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఆస్తుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగినా ఆస్తుల కొనుగోలుకు రుణాలు తీసుకుని మళ్లీ ఈ ఆస్తుల్లోనే పెట్టుబడి పెడ్తారు. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. లాభాలు వస్తాయన్న ఊహ మీద ఆధారపడ్డ వ్యాపారాలు పెరిగాయి. ఇది వేలం వెర్రిగా మారింది. స్పెక్యులేషన్ రంగంలో ఉండే వారికి ఏ మేరకు రుణాలు ఇవ్వవచ్చునన్నది మార్కెట్ లో ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది. దీన్నిబట్టే బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి.

పరిమాణాత్మక సడలింపు వల్ల నగదు లభ్యత పెరగడంతో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో వాస్తవంగా స్తబ్దత ఉన్నప్పటికీ భవిష్యత్తులో లాభం వస్తుందన్న వేలం వెర్రి పెరిగింది. అందువల్లే ఆర్థిక మార్కెట్ లో గుప్త కరెన్సీ మీద మోజు పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2009లో బిట్ కాయిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ బిట్ కాయిన్ తో లావాదేవీలను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి డిజిటల్ పద్ధతులను వినియోగిస్తారు. అదనంగా ఎన్ని బిట్ కాయిన్లు జారీ చేయాలో నిర్ణయిస్తారు. వీటి బదలాయింపును పర్యవేక్షిస్తుంటారు. ఊహించినట్టుగానే బిట్ కాయిన్ లో ఉన్న వికేంద్రీకృత లెడ్జర్ సాంకేతికతను ఉపయోగించి వ్యాపార, పారిశ్రామిక సంస్థలు లావేదేవీలు నిర్వహిస్తాయి. బిట్ కాయిన్ లో ఉన్న వికేంద్రీకృత లెడ్జర్ టెక్నాలజీని. బ్లాక్ చైన్ ను ఆసరాగా షేర్ల వ్యాపారం చేసే సంస్థలు లాభాలు సంపాదించాయి. స్టాక్ మార్కెట్ లో ఈ కంపెనీల వాటాల ధరలు పైకి ఎగబాగుకుతున్నాయి. మరిన్ని బిట్ కాయిన్లను, గుప్త కరెన్సీ తయారు చేసే కంపెనీల వాటాల ధరలు స్టాక్ మార్కెట్ లో తారాజువ్వల్లా పైకి దూసుకెళ్తున్నాయి.

1999లో కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడిన కంపెనీలు అన్న పేరున్న కంపెనీల వాటాల ధరలు ఇలాగే పెరిగి చివరకు ఆ బుడగ పగిలిపోయిన ఉదంతం మనకు అనుభవంలో ఉన్నదే. మళ్లీ అదే నిర్హేతుకమైన అత్యుత్సాహం కనిపిస్తోంది. కొంచెం అతిశయోక్తి ఉంటే ఉండొచ్చు కాని మీ కంపెనీ షేర్ల ధరలు దూసుకుపోవాలంటే లాంగ్ ఐలెండ్ ఐస్డ్ టీ కార్ప్ పేరును లాంగ్ బ్లాక్ చైన్ కార్ప్ గా మార్చండి. ఈ బిట్ కాయిన్ వ్యవహారాన్ని సమర్థించేవారు రెండవ ఇంటర్నెట్ విప్లవం వస్తొందని చెప్తున్నారు గదా! డాలర్, యూరో, రూపాయి లాగా రిజర్వూ బ్యాంకు లాంటి కేంద్ర బ్యాంకు మీద నమ్మకం ఉంచాల్సిన పని లేదు. లేదా తమ కేంద్ర బ్యాంకులను సమర్థించే దేశాల మీద కూడా నమ్మకం ఉంచవలసిన అగత్యం లేదు. ఆలస్యమెందుకు కేంద్ర బ్యాంకులు విధించే నియమ నిబంధనలతో సంబంధం లేని అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ఇంటర్నెట్ ద్వారా ప్రవేశించండి.

బిట్ కాయిన్ ఎంత గొప్పదో జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెట్టి ఈ బుడగ ఎప్పుడు చితికి పోతుందో ఆలోచించవలసిన అవసరం ఉంది. 2007లో రెండు బేర్ స్టీర్న్స్ హెడ్జ్ కంపెనీలు విఫలమైనాయి. ఆ సంవత్సరం జూన్ లో ఈ రెండు కంపెనీల అత్యంత ముప్పు ఉన్న రుణాలను స్తంభింప చేశారు. అప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వు అధ్యక్షుడు బెన్ బెర్నేక్ కుదువ పెట్టి రుణాలు తీసుకున్న సెక్యురిటీ మార్కెట్లు విఫలమైనందువల్ల ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదని సెలవిచ్చారు. ఈ వాటాల్లో ఇమిడి ఉన్న స్పెక్యులేషన్ వ్యాపారం గురించి, విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ గురించి, వీటి మధ్య ఉన్న అంతస్సంబంధం గురించి ఆయనకు తెలియదా? ఇది పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని తెలియదా?

బిట్ కాయిన్-బ్లాక్ చైన్ మీద వేలం వెర్రికి కచ్చితమైన అంతస్సంబంధం ఉన్నప్పుడు, ఆస్తులకు సంబంధించిన మార్కెట్లకు, బ్యాంకులు రుణాలివ్వడానికి సబంధం ఉన్నప్పుడు, రుణాలు చెల్లించని సందర్భంలో పరిస్థితి ఏమిటి అని గమనించాలిగదా? వాస్తవానికి వీటికి సంబంధించిన సమాచారం ఏమీ లేదు. కాని ఆస్తుల ధరల నీటి బుడగ విచ్ఛిన్నం అయిపోయినప్పుడు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయినప్పుడు ఆర్థిక సంస్థలు సంక్షోభంలో కూరుకుపోతాయని మాత్రం కచ్చితంగా తెలుసు. ఈ దుష్ప్రభావం అనేక దేశాల మీద ఆర్థిక సంస్థల మీదా ఉంటుంది.

దీర్ఘ కాలిక ఆర్థిక స్తబ్ధతకు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో, స్పెక్యులేషన్ మీద ఆధార పడిన రుణాలు అందుజేసే పద్ధతికి, అనుత్పాదక పెట్టుబడికి పరిష్కారం కనిపించడంలేదు. అంటే ఈ నీటి బుడగల్లాంటివే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాయా? సంపద ప్రభావం - ఆస్తుల ధరలు పెరగక పోయినా ఆదాయాలు పెరగని దశలో కూడా వస్తు వినియోగం పెరగడం అసలైన ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతాయి. ఆర్థిక నీటి బుడగలు పేలి పోయినప్పుడు వాస్తమైన ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుది. గతానుభవాల్లాగే పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ మార్గంలోనైనా సంపద పెంచుకోవాలని చూస్తోంది. ఇలాంటి చిట్కాలు ప్రయోగించే పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజల అవసరాలు తీరుస్తాయా లేదా అన్న విషయంతో నిమిత్తం లేదు. 

Back to Top