ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఉద్దేశపూర్వకంగా రేపిన వివాదం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

విశ్వవిద్యాలయాల్లో దౌర్జన్యకాండ రెచ్చగొట్టడానికి బీజేపీకి మరో కొత్త అవకాశం చిక్కింది. ఈ సారి బీజేపీ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంపై తన దాడి ఎక్కుపెట్టింది. 1938 నుంచి ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై అనవసర వివాదాన్ని రెచ్చగొట్టారు. జిన్నా చిత్రపటం తొలగించాలని కోరుతూ హిందూ యువ సేన, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపి) మూకలు మే రెండవ తేదీన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోకి చొరబడి రాద్ధాంతం చేశాయి. విధ్వంసానికి పాల్పడినవారి మీద చర్య తీసుకోవడానికి బదులు పోలీసులు విశ్వవిద్యాలయ విద్యార్థులనే చితకబాదారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థుల మీద లాఠీ చార్జీ చేసి బాష్ప వాయువు ప్రయోగించారు.

ఈ ఉదంతం ద్వారా దేశ విభజనకు జిన్నా కారకుడన్న అంశం మరో సారి చర్చకు వచ్చింది. వివాదం సృష్టించడానికి సంఘ్ పరివార్ జిన్నా చిత్రపటాన్ని ఆసరాగా చేసుకుంది. దేశ విభజనకు జిన్నా ఒక్కడే కారకుడు అన్న అంశాన్ని చరిత్రకారులు ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు. దేశ విభజన సంక్లిష్టమైన వ్యవహారమనీ దానికి ఎవరో ఒక వ్యక్తి బాధ్యుడని చెప్పలేమని చరిత్రకారులు భావిస్తున్నారు. అయినా "గొప్ప వారి" మీద ఆసక్తి అంతం కాదు. భారత, పాకిస్తాన్ దేశాలు జిన్నా విషయంలో పుక్కుటి పురాణాలను, పైశాచిక విధానాలను పోటీపడి వాడుకుంటున్నాయి.

అలీగఢ్ విశ్వవిద్యాలయం ఉదంతానికి బీజేపీ నాయకుల స్పందన చూస్తే దేశ విభజనపై వారి అభిప్రాయం ఏమిటో అర్థం అవుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ తో సహా అనేకమంది బీజేపీ నాయకులు అలీగఢ్ విశ్వవిద్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించిన సంఘ్ పరివార్ వారి "ఆందోళన" ను ఆమోదించారు. కాని యోగి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి స్వామీ ప్రసాద్ మౌర్య సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించడమే కాక జిన్నా మహాపురుషుడు అని అన్నారు. మౌర్యను పార్టీ నుంచి బహిష్కరించాలన్న కోర్కెలు గట్టిగా వినిపిస్తున్నాయి. 2009లో బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సిన్హా, 2005 లో లాల్ కృష్ణ అద్వాణీ కూడా జిన్నా గురించి వాస్తవాలు చెప్పి ఇదే పరిస్థితి ఎదుర్కున్నారు. తన చరిత్రలో తనకు అసౌకర్యంగా ఉండే అంశాలను రూపుమాపడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమైనందువల్లే ఇలాంటి అంశాలను పదే పదే లేవనెత్తుతున్నారు. వాస్తవానికి ముస్లిం లీగ్ దృక్పథానికి, హిందూ మహాసభ సిద్ధాంతానికి మధ్య పెద్ద తేడా లేదు.

పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని కోరడానికి ముస్లిం లీగ్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం ఆ పార్టీనే ముందుగా చెప్పింది కాదు. హిందూ మహాసభ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ 1923లోనే ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగినన్నాళ్లూ ముస్లిం లీగ్, హిందూ మహా సభ కూడా బ్రిటిష్ వారికి సహకరించాయి. బెంగాల్ లాంటి చోట రెండు పక్షాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేశాయి. తమ పార్టీకి మూలకందమైన హిందూ మహాసభ నాయకుడు సావర్కర్ ముందే ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని ముస్లిం లీగ్ పుణికిపుచ్చుకుని దాన్ని చివరికంటా లాగి పాకిస్తాన్ ఏర్పాటు అయ్యేట్టు చేయగలిగినందుకు బీజేపీకి అక్కసు ఉండొచ్చు. హిందూ మహాసభ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ఇప్పటికీ హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే పరితపిస్తోంది.

దేశ విభజనకు జిన్నా ఒక్కడే కారకుడన్న వాదన చాలా కాలంగా కొనసాగుతోంది. అది కేవలం హిందుత్వ వాదులు మాత్రమే చేస్తున్న వాదన కాదు. కాంగ్రెస్ సిద్ధాంత కర్తలు, చాలా కాలం పాటు ఆధిపత్య స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ అనుకూల చరిత్రకారులు జిన్నాను ప్రతినాయకుడిగా చిత్రించారు. అయితే చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఈ వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు తన తొలి దశ రాజకీయ జీవితంలో జిన్నా ఎక్కువ కాలం నిఖార్సైన కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. దాదాబాయ్ నౌరోజీ రాజకీయాల్లో జిన్నాకు గురువులాంటి వారు. గోపాల కృష్ణ గోఖలే అంటే జిన్నాకు జీవితాంతం చాలా అభిమానం ఉండేది. బాల గంగాధర తిలక్ మీద దేశద్రోహం కేసు మోపినప్పుడు ఆయన తరఫున కోర్టులో వాదించింది జిన్నా. 1916లో లక్నో ఒప్పందం కుదిరినప్పుడు తిలక్ తో కలిసి జిన్నా పని చేశారు. దానివల్ల ముస్లీం లీగ్, కాంగ్రెస్ సన్నిహితమైనాయి. ముస్లిం లీగ్ 1906లోనే ఏర్పడినప్పటికీ చాలా కాలం జిన్నా ఆ పార్టీలో చేరలేదు అన్నది చారిత్రక సత్యం. 1913లో కాని ఆయన ముస్లిం లీగ్ లో చేరలేదు. మూడేళ్ల తర్వాత జిన్నా ముస్లిం లీగ్ అధ్యక్షుడయ్యారు.

స్వాతంత్ర్యం వచ్చే అంత్య దశ వరకు సమైక్య భారత్ ఉండాలని; హిందువులు, ముస్లింలు కలిసి అధికారం పంచుకోవాలని జిన్నా కోరారు. పాకిస్తాన్ ఏర్పాటు తమ అంతిమ లక్ష్యం అని జిన్నా, ముస్లిం లీగ్ చెప్పింది 1940లో మాత్రమే. నిజానికి అప్పటికీ ముస్లింలకు ప్రత్యేక రాజ్యం కావాలన్న ఆకాంక్ష కచ్చితంగా లేదు. ఎందుకంటే ముస్లింలు, హిందువులు అధికారాన్ని పంచుకుని ఫెడరల్ భారత్ అవతరించాలని కాబినెట్ మిషన్ చేసిన సూచనను జిన్నా అంగీకరించారు. దీనికి కాంగ్రెస్ అంగీకరించలేదు. దానితో సంప్రదింపులకు అవకాశం లేకుండా పోయింది. చివరకు దేశ విభజన అనివార్యం అని తేలిపోయిన తర్వాత పంజాబ్ ను, బెంగాల్ ను ఏక కాలంలో విభజించేట్టు చూడడానికి కాంగ్రెస్, హిందూ మహాసభ కలిసే కృషి చేశాయి. అంటే ఇది ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరించడమే. ముస్లింలు సమైక్య భారత్ లో ఉండలేకపోతే అదే సూత్రం ప్రకారం పంజాబ్ లోని హిందువులు (నిజానికి సిక్కులు), బెంగాల్ లోని హిందువులు పాకిస్తాన్ లో ఉండలేరని హిందూ మహా సభతో పాటు కాంగ్రెస్ కూడా వాదించింది. ఈ చారిత్రక సత్యాలను జాతీయవాద చరిత్రకారులు తోసిపుచ్చడమే కాక అవహేళన చేశారు. కాంగ్రెస్ ను "నయా సామ్రాజ్యవాద" సంస్థగా చిత్రించడం కోసం ఈ పని చేశారు. ప్రస్తుతం ఈ చారిత్రక సత్యాలను జనానికి తెలియజేయవలసిన అగత్యం ఉంది.

అదే సమయంలో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో జరిగింది చరిత్రకు భాష్యం చెప్పడంలో భాగం కాదని కూడా గ్రహించాలి. అయితే అదేమిటో నిశితంగా పరిశీలించాల్సిందే. ఇలాంటి సందర్భాలను బీజేపీ తన ఆలోచనా ధోరణిని పరివ్యాప్తం చేయడానికి వినియోగించుకుంటోంది. ఆ విశ్వ విద్యాలయం పేరులో ఇప్పటికీ ముస్లిం అన్న పేరు ఉంది కనక మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ విద్యా సంస్థ మీద దాడి చేయడంలో ఆశ్చర్యం లేదు. మోదీ ప్రభుత్వ అంత్య దశలో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం మీద దాడి చేయాలనుకున్నారు. అప్పుడే ఈ వివాదం 2019 లో ఎన్నికలు జరిగే దాకా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top