ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వేతనం లేకుండా పనా?!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి హక్కుకు సంబంధించింది కనక సమయానికి వేతనం చెల్లించవలసిన పథకం. కానీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన 64శాతం, మార్చికి సంబంధించిన 86శాతం, ఏప్రిల్ కు సంబంధించిన 99శాతం వేతనాలు ఇంకా చెల్లించలేదని ఈ పథకం అమలును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించే నరేగా సంఘర్ష్ మోర్చా తెలియజేసింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాలు చెల్లించకపోవడం, ఆలస్యంగా చెల్లించడం కొత్తేమీ కాదు. వేతనాల చెల్లింపు విధానాన్ని ఇటీవల మార్చినందువల్ల పరిస్థితి మరింత దిగజారింది.

ఈ పథకం కింద వేతనాల చెల్లింపులో విడుదల చేసే మొత్తం పక్క దారి పట్టకుండా నివారించడం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. ఆ తర్వాత ఆధార్ తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల ద్వారా కూడా చెల్లిస్తున్నారు. కార్మికులకు వేతనాలు చెల్లించడంలో అవకతవకలు జరగకుండా చూడడం ప్రశంసించదగిందే. కాని ఆచరణలో ఇబ్బందులు ఎదురుకావడం ఆందోళనకరం. ఈ పద్ధతిలో వేతనాలు చెల్లించే విధానం కొంత కాలం తర్వాత మెరుగుపడవచ్చు కానీ దీనివల్ల వికేంద్రీకృత భాగస్వామ్య అభివృద్ధికి విఘాతం కలుగుతోంది.

ఇంతకు ముందు ఉన్న పద్ధతి ప్రకారం అయితే ప్రతి స్థాయిలో ఆవృత నిధి ఉండేది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే వ్యవస్థలకు బ్యాంకు అకౌంట్లు, చెల్లించడానికి అధికారం ఉన్న వారు ఉండే వారు. స్థానిక సంస్థలు వికేంద్రీకృత పద్ధతిలో నిధులు చెల్లించడానికి వీలు ఉండేది. కానీ జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు కేంద్రీకృతం అయిపోయాయి. ఈ చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఎందుకంటే దీనికి కావాల్సిన నిధులు ఒకే ఖాతాలో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ పథకాన్ని అమలు చేసే వ్యవస్థలు పని చేసిన వారి సంఖ్య, పని దినాల ఆధారంగా ఎంత చెల్లించాలో చెప్తే ఆ ప్రకారం నిధులు బదలాయిస్తారు. నిధుల బదిలీకి సంబంధించిన వివరాలను సమకూర్చిన తర్వాత ఈ పథకం అధికారి ఆ వివరాలను అప్ లోడ్ చేస్తారు. పనులు చేసే వారికి సరంజామా సరఫరా చేసే వారికి చెల్లించడానికి కూడా ఇదే పద్ధతి. దీనిలో మనుషులు కల్పించుకోవడానికి వీలు ఉండదు. అందువల్ల నిధులు దారి మళ్లే అవకాశం లేదు. కాని ఈ పద్ధతే పెద్ద ఆటంకంగా తయారవుతోంది.

మొదటి సమస్య నిధుల బదిలీ ఉత్తర్వులు త్వరగా అమలు కావడం లేదు. 2018 ఏప్రిల్ 19 నాటి మేనేజ్మెంట్ ఇంఫర్మేషన్ వ్యవస్థ (ఎం.ఐ.ఎస్.) సమాచారం ప్రకారం 20017-18లో జారీ చేసిన 19.55 శాతం చెల్లింపు ఉత్తర్వులు అమలు కాలేదు. 2.38 శాతం ఉత్తర్వులను తిరస్కరించారు. ఇవన్నీ కలిపితే చెల్లింపు జరగని ఉత్తర్వులు 21.93 శాతానికి చేరతాయి. పని చేసిన కూలీల బ్యాంకు ఖాతాల్లోకి, సరంజామా అందజేసిన వారి ఖాతాల్లోకి మూడు నాలుగు నెలల దాకా నగదు జమ కావడం లేదని కొన్ని రాష్ట్రాల నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. కొన్ని సందర్భాలలో ఇంతకన్నా ఎక్కువ సమయమే పడ్తోంది. వేతనాల చెల్లింపు ఉత్తర్వులు అమలు కానందువల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. కూలీలకు వేతనాల చెల్లింపు, సరంజామా సరఫరా చేసే వారికి చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సమాచారం వల్ల స్పష్టం అవుతోంది.

కేంద్రం నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రాలు తమ వనరుల నుంచి చెల్లించలేక పోతున్నాయి. ముందు చెల్లించి తర్వాత కేంద్రం నుంచి రాబట్టుకోలేక పోతున్నాయి. ఇంతకు ముందు ఈ వెసులుబాటు ఉండేది. 2016-17లో రూ. 12,000 కోట్ల మేర వెతనాల చెల్లింపు బకాయి పడింది. ఇది ఉపాధి హామీ పథకానికి కేటాయించిన మొత్తంలో నాల్గవ వంతు. అప్పుడు జార్ఖండ్, త్రిపుర రాష్ట్రాలు తమ వనరుల నుంచి చెల్లించాయి. కాని ఇప్పుడు చెల్లింపులు జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. అందువల్ల రాష్ట్రాలు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. ఉపాధి హామీ పథకం కింద పని చేసే వారికి 15 రోజులలోగా వేతనం పొందడం వారి హక్కు. జాప్యం జరగడం అంటే ఈ హక్కును హరించినట్టే. "చెల్లింపులకు హామీ" లేకపోతే ఈ పథకం నీరుగారినట్టే. కొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే పని చేసే వారికి ఈ పథకం మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. అప్పుడు కార్మికులు మరింత అస్థిరమైన పనులు చేస్తారు లేదా విధి లేక వలస వెళ్తారు. పేదలకు ఏ రోజుకు ఆ రోజు నగదు అవసరం. దానితోనే వారి రోజు వారీ ఖర్చులకు డబ్బు చేతిలో ఉంటుంది. అది కొరవడితే వారు ఈ పథకంలో పని చేయరు. వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగితే ఈ పథకం అసలు ప్రయోజనమే దెబ్బ తింటుంది.

రెండవ సమస్య కేంద్రీకృత చెల్లింపుల పద్ధతివల్ల పంచాయతీ రాజ్ వ్యవస్థలను బలోపేతం చేసే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థలు ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో భాగమై 25 ఏళ్లు గడుచినప్పటికీ ఇంకా ఆ వ్యవస్థలు అధికారాల వికేంద్రీకరణ, విధులు, పని చేసే వారి కోసం ప్రభుత్వాల మీద ఆధారపడక తప్పని పరిస్థితే ఉంది. అనేక రాష్ట్రాలలో గ్రామ పంచాయితీలు మొట్ట మొదటి సారి బ్యాంకు ఖాతాలు తెరిచాయి. నియత పద్ధతి ప్రకారం ఆ ఖాతాల్లో డబ్బు జమ అయ్యేది. అయితే జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు, నిధుల చెల్లింపు ఉత్తర్వుల పద్ధతి అమలులోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయితీల బ్యాంకు ఖాతాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి.

వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి తక్షణం చర్య తీసుకోవలసిన అగత్యం ఉంది. వేతన విధానాన్ని కూడా పునః పరిశీలించాలి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వ్యవసాయ కార్మికులకు వర్తించే వినియోగదారుల ధరల సూచీ ప్రకారం ప్రతి ఏటా వేతనాలు సవరిస్తుంది. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాలను కూడా సవరిస్తుంది. అయితే ప్రస్తుతం వ్యవసాయ కార్మికులకు నిర్ణయించే వేతనాలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలకన్నా ఎక్కువ ఉన్నాయి. ఇది 2006లో ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి పరిస్థితిని తిరగదోడడమే. 2006లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసే వ్యవసాయ కార్మికుల వేతనాలు ఉపాధి హామీ పథకం కింద చెల్లించే రూ. 60 వేతనంకన్నా తక్కువ ఉండేవి. అందువల్ల రోజు కూలీలు ఉపాధి హామీ పథకంపై ఆసక్తి చూపే వారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలలో వేతనాలు పెరగడానికి కూడా అవకాశం కలిగింది. కాని ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి వల్ల ఉపాధి హామీ పథకం కూలీలకు ఆసక్తికరంగా లేకుండా పోయింది. అంటే మహిళా కార్మికులు ఈ పథకం కింద పని చేస్తే పురుషులు ఎక్కువ కూలీ గిట్టే పనులు చూసుకుంటారు.

అమలులో ఉన్న వేతనం చెల్లించడం న్యాయ సమ్మతం అయింది కావచ్చు. కాని వాస్తవ రూపంలో కూడా కనీస వేతనానికి హామీ ఉండాలి కదా! మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సఫలం కావాలంటే కనీస వేతనం వాస్తవికంగా ఉండాలి. వేతనాల చెల్లింపులకు కచ్చితమైన హామీ ఉండాలి.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top