ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

దక్షిణాదిలో బీజేపీది ఎదురీతే

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠకు పెద్ద విఘాతం కలిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా దీర్ఘకాలం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ తెగదెంపులు చేసుకోక తప్పలేదు. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాబట్టలేక ఎన్.డి.ఎ. కూటమి నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ బయటికి వచ్చేసినా ఆయనకు వై.ఎస్. జగన్ మొహన్ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నుంచి, సినీ నటుడు పవన్ కళ్యాన్ జనసేన పార్టీ నుంచి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాన్ ఇప్పుడు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్న ఎజెండాతో 2017 నవంబర్ లో జగన్ మోహన్ రెడ్డి భారీ స్థాయిలో పాదయాత్ర చేపట్టారు. అంతకు ముంది జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కారణంగానే అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవలసి వచ్చింది. పదేళ్ల పాటు ఆయన మళ్లీ అధికారంలోకి రాలేక పోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల ప్రభావం పార్లమెంటులో కూడా ప్రతిబింబించింది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై అందరి కన్నా ముందు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. దానితో చంద్రబాబు నాయుడు పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక తప్పని పరిస్థితి ఎదురైంది. అయితే ఈ రెండు తీర్మానాలు పార్లమెంటులో చర్చకు రాలేదు.

పదేళ్ల్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేయవలసినంత ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు తీవ్ర స్థాయిలో ఎదుర్కున్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూ సేకరణ విషయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ చంద్రబాబుకు అదే అనుభవం ఎదురైంది. రాజధాని నిర్మిస్తున్న పద్ధతి, పోలవరం పథకం అమలు విషయంలో పౌర సమాజం చంద్రబాబును తూర్పారబట్టింది. రాజధాని నిర్మాణం కోసం భూములు, కొంప గూడు వదులుకోవాల్సి వచ్చిన వారు కూడా బాబుపై ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించుకోవడంలో బాబు విఫలమయ్యారన్న విమర్శలూ చెలరేగాయి. రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులను కూడా రాబట్టుకోలేక పోయారు. ఈ వైఫల్యాల వల్ల చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన సక్రమంగా నిర్వహించగలరన్న పేరు ఉండేది. సమాచార సాంకేతికత హైదరాబాద్ లో అందుబాటులోకి రావడానికి 2000 సంవత్సరం తర్వాత బాబు చేసిన కృషికి మంచి పేరు వచ్చింది. కాని 2014 ఎన్నికలలో ఆయన బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందువల్ల ఒరిగిందేమీ లేకపోవడం, అభివృద్ధి పనులు కుంటినడకన సాగడాం అనే ప్రధానమైన ప్రతికూల అంశాల ఆధారంగా తెలుగుదేశం 2019 ఎన్నికలలో పోటీ చేయక తప్పదు.

తెలుగు దేశంతో మైత్రి అంతమైంది కనక ఆంధ్రప్రదేశ్ లో స్వశక్తి మీద ఆధారపడి పట్టు సంపాదించాలని బీజేపీ ఆశిస్తోంది. కాని గత ఎన్నికలలో బీజేపీ పరిస్థితినిబట్టి చూస్తే ఆ అవకాశం అంతగా కనిపించడం లేదు. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో 25 లోకసభ స్థానాలు ఉంటే బీజేపీకి రెండు సీట్లు మాత్రమే దక్కాయి. తెలుగు దేశానికి 15 స్థానాలు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు దక్కాయి. కాని 1999లో తెలుగు దేశంతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఒకే ఒక సందర్భంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏడు లోకసభ స్థానాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎన్నడూ గణనీయమైన శక్తి కాదు. ఇప్పుడు తన మిత్రపక్షమైన తెలుగు దేశం ఆకాంక్షలను తీర్చలేదన్న అపఖ్యాతి బీజేపీకి ఉంది. కాని తెలుగు దేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో చాలా కాలం నుంచి పట్టు ఉంది. నిర్ణాయక శక్తిగా వ్యవహరించే కమ్మ సామాజికవర్గం మద్దతు ఆ పార్టీకి ఉంది. అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రెడ్లు, దళితులు, క్రైస్తవులలో ప్రాబల్యం ఉంది. పవన్ కళ్యాణ్ కు సినీ నటుదుగా ఉన్న ప్రఖ్యాతితో పాటు కాపు సామాజికవర్గ మద్దతు ఉంది. బీజేపీకి నిర్దిష్టంగా ఏ వర్గం మద్దతూ లేదు.       

ఆంధ్ర ప్రాంతంలో పట్టు సంపాదించడం కోసం కాపులు తమను ఇతర వెనుకబడిన వర్గాల జాబితాలో ప్రకటించాలన్న కోర్కెను ఆసరాగా చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలనుకుంటోంది. కీలకమైన ప్రాంతీయ నాయకుల మద్దతు సమకూరుతుందని బీజేపీ ఆశిస్తోంది. గతంలో ఈ వ్యూహం బీజేపీకి అనుకూలంగా పని చేసింది. అంతకు ముందు కాపులను ఐక్యం చేయడానికి పవన్ కళ్యాణ్ అన్న, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రయత్నం చేశారు. 2009 ఎన్నికలకు ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఎన్నికల ఫలితాలు ఆశించినంతగా రాలేదు. చివరకు 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రలో రాజకీయాలను కొత్త పుంతలు తొక్కించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మోదీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వమ్ము చేశారన్న అపవాదు తొలగించుకోవాలంటే ఇంతవరకు రాజకీయాల్లో బలమైన శక్తిగా లేని కాపు సామాజిక వర్గం వారి మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాలలో పట్టు సంపాదించడానికి బీజేపీ కృషి చేస్తోంది. కాని తమిళ నాడు ప్రజలు కూడా బీజేపీ తమను దగా చేసిందని, కావేరీ జల వివాదంలో కర్నాటకకు అనుకూలంగా వ్యవహరించిందని భావిస్తున్నారు. కర్నాటక శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నందువల్ల ఇలా చేస్తోందని తమిళులు అనుకుంటున్నారు. పదిహేనవ ఆర్థిక సంఘానికి నిర్దేశించిన పరిశీలనాంశాలు తమను ఆర్థికంగా దెబ్బ తీస్తాయన్న అభిప్రాయం దక్షిణాధి రాష్ట్రాల్లో బలంగా ఉంది.

2014 సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రభంజనం ఉపకరించింది. కాని 2019 ఎన్నికల దగ్గరికి వచ్చే సరికి ప్రాంతీయ నాయకులు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మిత్రపక్షాల ఆకాంక్షలను నెరవేర్చక పోవడం, రాష్ట్రాల ప్రభుత్వాల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో దక్షిణాదిలో బీజేపీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నందువల్ల ఈ ప్రాంతంలో పాగా వేయాలన్న బీజేపీ ఆశలు అడియాసలే కావచ్చు.

Updated On : 16th May, 2018

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top