ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కథువా గుణ పాఠం నేర్పుతుందా?!

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

జమ్మూకు 72 కి.మీ. దూరంలోని కథువా సమీపంలోని ఓ గ్రామలో ఉండే ఏనిమిదేళ్ల బాలికపై కిరాతకంగా మూకుమ్మడిగా అత్యాచారం చేయడం, అంతమొందించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కానీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందుతులను అరెస్టు చేసిన తీరు మరింత భయానకంగా ఉంది. ఒక బాలిక మీద అత్యాచారం, హత్య జరగడాన్ని, మత విద్వేషం రెచ్చగొట్టడానికి, నేరస్థులకు రాజకీయంగా రక్షణ కల్పించే దశకు మనం ఎలా చేరుకున్నాం?

ఆ ఎనిమిదేళ్ల అమ్మాయి జనవరి పదో తేదీన కనిపించకుండా పోవడం 17వ తేదీన ఆమె మృత దేహం భయానక స్థితిలో కనిపించడం దుర్నీతికి నిదర్శనం. ఒక అమ్మాయిని అపహరించి, మాదక ద్రవ్యాలు ఇచ్చి, ఒక దేవాలయంలో నిర్బంధించి, విపరీతంగా కొట్టి, అత్యాచారం చేసి, ఆ తర్వాత హతమార్చడం మొదలైనవన్నీ వింటేనే భీతి కలుగుతోంది. మరీ భయానకమైన అంశం ఏమిటంటే నిందితుల్లో స్థానిక పోలీసులు కూడా ఉండడం. ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తర్వాత నిందితుల్లో ఒకరు ఆ తల్లిదండ్రులతో పాటు ఆ అమ్మాయిని వెతకడం మరీ విచిత్రం. ఆమె ఎక్కడుందో, ఆమెకు ఏం జరుగుతోందో తెలిసినా ఆ నిందితుడు అన్వేషిస్తున్నట్టు నటించడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఆ అమ్మాయి మృత దేహం దొరికిన తర్వాత ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఆ పోలీసు జవానుతో సహా అనుమానితులను నిర్బంధించారు. ఆ తర్వాత రాజకీయాలు మొదలైనాయి. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరడానికి బదులు కొందరు రాజకీయ నాయకులు, న్యాయవాదులు అఘాయిత్యానికి పాల్పడిన వారిని సమర్థించారు. దీని వల్ల జమూ-కశ్మీర్ పోలీసుల సమర్థత, నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిని ఇలా వెనకేసుకు రావడం ఇంతకు ముందెన్నడూ లేదు. బీజేపీ సభ్యుల మద్దతుతో హిందూ ఏక్తా మంచ్ కు చెందిన వారు జాతీయ పతాకాలు చేతబూని అనుమానితులకు న్యాయం జరగాలని కోరడం విడ్డూరం. పోలీసులు చార్జి షీట్ దాఖలు చేయడాన్ని న్యాయవాదులు ప్రత్యక్షంగా అడ్డుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అమ్మాయి అపహరణ, అత్యాచారం, హత్య మొదలైన ఘాతుకాలన్నీ చిన్న విషయాలు అయిపోయినాయి.

ఈ పరిణామాల వెనక విస్తృతమైన రాజకీయ సందర్భం ఉంది. ఎందుకంటే పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీకి హిందువులు అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న జమ్మూలో బలం సమకూరింది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జమ్మూలో హిందూ రాజకీయల ప్రాబల్యం, కశ్మీర్ ప్రాంతంలో ముస్లిం రాజకీయాల ఆధిపత్యం మారనే లేదు. అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక ముస్లిం కావడం, నిర్బంధానికి గురైన అనుమానితులు హిందువులు కావడం మత రాజకీయాలకు దోహదం చేశాయి. అసువులు బాసిన ఓ బాలిక శవం మీద కూడా రాజకీయాలు చేయడం దేశ రాజకీయాల్లో మరీ దిగజారుడుతనానికి నిదర్శనం.

ఈ అత్యాచారాం, హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఇంకా విస్తృతమైన సందర్భం గురించి ఆలోచించాలి. మొట్టమొదట పిల్లల మీద అత్యాచారాలు, గృహ హింస చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గణాంకాలు సగం కథే చెప్తాయి. మహిళల మీద, అమ్మాయిల మీద ఇళ్లల్లోనే దాడులు జరుగుతాయి. వారిని చిత్రహింసలు పెడ్తారు. ఇళ్లల్లోనూ, ఇరుగుపొరుగున, వీధుల్లో, పొలాల్లో, అడవుల్లో ఎక్కడైనా లైంగికంగా వేధిస్తారు. కఠినమైన చట్టాల వల్ల అంతగా ప్రయోజనం కనిపించలేదు. 2012లో బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపాడడానికి చట్టం చేశారు. 2013లో అత్యాచారానికి సంబంధించిన చట్టాలను కఠినతరం చేశారు. మరణ శిక్ష విధించడానికి కూడా అవకాశం కల్పించారు. అయినా అత్యాచారాలు, బాలల లైంగిక వేధింపులు తగ్గలేదు. చట్టాలను అమలు చేసే యంత్రాంగాలు సవ్యంగా పని చేస్తేనే చట్టాలవల్ల ప్రయోజనం ఉంటుంది.

ఈ సంఘటన జమ్మూలో జరిగిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కశ్మీర్ ప్రాంతంలో కూడా మహిళలు, బాలికల మీద లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయి. వాటి మీద దేశ వ్యాప్తంగా అంతగా ఆగ్రహం వ్యక్తం కాలేదు. న్యాస్థానాలు న్యాయం అందించడంలో ఇతర చోట్ల ఉన్న సమస్యలకు తోడు జమ్మూ-కశ్మీర్ లో మహిళలు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ చట్టం భద్రతా దళాల వారు చేసే అకృత్యాలకు రక్షణ కల్పిస్తుంది.

భిన్న మతాల మధ్య రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాన్ని రెచ్చగొట్టినప్పుడు ఇతర మతం వారికి గుణపాఠం నేర్పడం కోసం మహిళల మీద దాడులు, అత్యాచారాలకు పాల్పడతారు. దేశ విభజన దగ్గర నుంచి ఇలాంటివే జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అదనపు సమస్య ఏమిటంటే ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారికి తమను కాపాడే వారు ఉన్నారు అన్న ధైర్యం ఉంది. ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి, హతమార్చిన వారిని వెనకేసుకు రావడానికి ఈ భరోసా తప్ప మరే కారణం ఉంటుంది?

ఇతర అమ్మాయిలకు ఇదే గతి పట్టకుండా నిరోధించడానికి వ్యవస్థాగతమైన మార్పుల అవసరం ఉంది. బాధితులందరూ ముందు ఆశ్రయించేది పోలీసు స్టేషన్నే. అక్కడ వారికి సానుభూతే ఉండదు. ఒక వేళ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరిగినా చివరకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. అరకొర దర్యాప్తు, పట్టీ పట్టనట్టు ఉండే న్యాయవాదులు కలిసి ఆ కేసు విఫలం కావడానికి చేయగలిగిందల్లా చేస్తారు. న్యాయం అందజేసే మన వ్యవస్థ శిధిలమైంది. దాన్ని చక్కదిద్దాలి.

2012 డిసెంబర్ 16వ తేదీన జరిగిన ఘోర సంఘటన మహిళ పరిస్థితి మారడానికి దోహదం చేస్తుందనుకున్నాం. ఈ చిన్నారి ఉదంతం మళ్లీ అలాంటి ఆశ రేకెత్తించాలి. ప్రతి భారతీయుడూ ఆగి మన సమాజం ఎక్కడికి వెళ్తోందో ఆలోచించాలి. దిక్కూమొక్కూ లేకపోవడాన్ని, కిరాతకత్వాన్ని, అన్యాయాన్ని మతం పేర, కులం పేర, రాజకీయాల పేర సమాజం అంగీకరిస్తోందా? లేదా ఎవరి ప్రాణమైనా విలువైందే అన్న మానవతా భావన అంకురిస్తుందా? హేయమైన నేరాలకు కుల మతాలతో సంబంధం లేదని గ్రహించగలమా?

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top