ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

దౌత్య యత్నాల వల్లే సిరియాలో శాంతి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ఏప్రిల్ ఏడో తేదీన సిరియా ప్రభుత్వం ఆందోళనకారులపై రసాయనిక ఆయుధాలు ప్రయోగించిందన్న వార్త రావడంతో బషర్-అల్-అస్సద్ ప్రభుత్వంపై అమెరికా దాని మిత్ర దేశాలు భారీ స్థాయిలో సైనిక దాడులు చేయడానికి అవకాశం కల్పించినట్టయింది. ఎనిమిదేళ్లుగా సిరియాలో కొనసాగుతున్న సంక్షోభం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలు మానవతను మంటగలుపుతున్నాయి. ఐక్య రాజ్య సమితి శరణార్థుల కమిషనర్ అంచనా ప్రకారం 2011 నుంచి ఇప్పటి వరకు 54 లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా వెళ్లారు. వారు వివిధ దేశాలలో శరణార్థులుగా ఉంటున్నారు. 61 లక్షల మంది స్వదేశంలోనే నిర్వాసితులైపోయారు. ఇంకా అనేక లక్షల మంది ఘర్షణలలో చిక్కుకున్నారు.

అస్సద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభం అయినప్పుడు సాయుధ దళాలు ఏర్పడడంతో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఎదురైంది. సిరియా ప్రభుత్వానికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత విషమించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు ఇస్లామిక్ స్టేట్ ఆగడాలను అణచివేయడానికి రంగంలోకి దిగాయి. ఇది ఆత్మ రక్షణ కోసమని, సామూహిక ఆత్మ రక్షణ అని, మానవతా వాద దృక్పథంతోనే జోక్యం చేసుకోవడం అని అమెరికా, దాని మిత్ర దేశాలు సమర్థించుకున్నాయి. మానవతావాద దృష్టితో కూడా సాయుధ ఘర్షణకు దిగడాన్ని అంతర్జాతీయ చట్టం ఒప్పుకోదు. ఆత్మ రక్షణ, సామూహిక ఆత్మ రక్షణ అన్న మాటలకు చట్టభద్ధత ఉంటుందనుకోవడం భ్రమ. సిరియా ప్రభుత్వం కోరినందువల్లే తాము జోక్యం చేసుకున్నామని, ప్రభుత్వేతర సాయుధ దళాలకు వ్యతిరేకంగా మాత్రమే తాము పోరాడుతున్నామని, సిరియా ప్రభుత్వానికి అండగా ఉంటున్నామన్నది రష్యా సమర్థన. మొత్తం మీద వివిధ దేశాల వారు, ప్రభుత్వేతర సాయుధ దళాలవారు ఘర్షణకు దిగడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ఈ ఘర్షణల్లో పాల్గొంటున్న పక్షాలు సాయుధ ఘర్షణ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. దీనితో సిరియాలో మానవత్వం సంక్షోభంలో పడిపోయింది. ఈ ఘర్షణలను నివారించడానికి ఎలాంటి ప్రయత్నం జరిగినా అది కొన్ని సూత్రాలకు లోబడి ఉండాలి.  

మొట్టమొదటిది ఐక్య రాజ్య సమితి దౌత్య చర్చలకు శ్రీకారం చుట్టాలి. అన్నింటికన్నా ముందు ఇతర దేశాల సాయుధ జోక్యాన్ని అరికట్టాలి. సాధారణంగా ఇలాంటి సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఈ ఘర్షణలో భాగస్వాములైన పక్షాల మధ్య పరస్పర విశ్వాసం ఉంటే అస్సద్ తో దౌత్యం సాధ్యమవుతుంది. సైనిక చర్యలు ఆగితేగాని ఇది కుదిరే పని కాదు. ఇలాంటి ప్రయత్నాన్ని సిరియా ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం అని భావించకూడదు. సిరియా సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తున్నట్టే అనుకోవాలి. ఇలాంటి దౌత్యపరమైన ప్రయత్నాలు చేయడానికి ఐక్య రాజ్య సమితే తగిన వ్యవస్థ. ఐక్య రాజ్య సమితి తీసుకునే నిర్ణయాలను సమితిలో వీటో అధికారం ఉన్న దేశాలు అడ్డుకుంటున్నప్పటికీ ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి దౌత్య చర్చలను ప్రారంభించవచ్చు.

రెండవ ముఖ్యమైన అంశం మానవతా దృష్టితో వ్యవహరించడం. కోటీ పది లక్షల మంది సిరియా ప్రజలను తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దేశం వదిలి శరణార్థులుగా వెళ్లిన వారిని, స్వదేశంలోనే నిర్వాసితులై ఎక్కడో తలదాచుకుంటున్న వారిని, ఘర్షణల్లో చిక్కుకున్న వారిని కూడా ఆదుకోవాలి.

సిరియా నుంచి వచ్చి పడుతున్న శరణార్థుల విషయంలో పశ్చిమ దేశాలు యాగీ చేసినప్పటికీ అత్యధిక శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది పొరుగున ఉన్న టర్కీ, లెబనాన్, జోర్డాన్ దేశాలే. శరణార్థులు సొంత గూటికి చేరే ఏర్పాటు తక్షణం జరగాలి. కేవలం మానవతావాద అంశంలో హామీలు ఇవ్వడానికి పరిమితం కాకుండా వారు వెనుదిరిగి వస్తే క్షేమంగా ఉంటారన్న విశ్వాసం కల్పించాలి. వారు సురక్షితంగా తిరిగి రావడానికి సానుకూల పరిస్థితి కల్పించాలి. ఘర్షణ వాతావరణం ముగిసిన తర్వాత వారు మళ్లీ కొత్త జీవితం ప్రారంభించడానికి తగిన సామాజిక, ఆర్థిక ఏర్పాట్లూ ఉండాలి. ఇది సాధ్యం కావాలంటే సిరియాలో జోక్యం చేసుకుంటున్న దేశాల మధ్య, మానవతా సహాయాన్ని అందించే సంస్థల మధ్య సంపూర్ణమైన సమన్వయం ఉండాలి.

మరో ముఖ్యమైన అంశం ఘర్షణల సమయంలో జరిగిన తీవ్ర ఉల్లంఘనలను పరిశీలించాలి. ఘర్షణల్లో పాల్గొన్న పక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను బాహాటంగా ఉల్లంఘించాయని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ తెలియజేసింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పట్టణ ప్రాంతాలలో తీవ్ర స్థాయిలో దాడులు జరగడం, పౌరుల మీద దాడి చేయడం, చివరకు అంబులెన్సుల మీద కూడా దాడులకు దిగడం, నీటి సరఫరా వ్యవస్థల మీద, మార్కెట్ల మీద దాడి చేయడం సిరియాలో నిత్యకృత్యం అయిపోయింది. సిరియా సంక్షోభంలో భాగంగా లైంగిక దాడులు, మహిళల మీద అత్యాచారాలు కూడా పెచ్చరిల్లి పోయాయి.

సిరియాలో అంతర్జాతీయ నేరాలను నిలవరించడానికి ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ దాడులకు పాల్పడిన వర్గాల మీద భవిష్యత్తులో చర్య తీసుకోవడానికి అనువుగా మానవహక్కుల ఉల్లంఘనలు, వేధింపులపై సమాచారం సేకరించడం ఈ వ్యవస్థ బాధ్యత. ఈ ఉల్లంఘనల వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు విచారణ నిమిత్తం నివేదించడానికి చేసిన ప్రయత్నం విఫలమైది. ఈ కోర్టు కొన్ని సందర్భాలలోనే విచారణ చేపడ్తుందని గతంలో జరిగిన ఘర్షణలు రుజువు చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉండే అధికార బలం కూడా ఈ విచారణలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నేరాలకు పాల్పడిన అన్ని పక్షాలపై విచారణ జరిపించాల్సిందే. స్థానిక, అంతర్జాతీయ భాగస్వామ్యంతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించవచ్చు.

శాంతి నెలకొల్పే ఏ ప్రయత్నాలలోనైనా స్థానికుల పాత్ర ఉండాలి. శాంతి సాధన కోసం ప్రభుత్వాన్ని మార్చవలసిన అవసరమే వస్తే దాన్ని సిరియా ప్రజల నిర్ణయానికి వదిలేయాలి. ఇతరత్రా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని మార్చే అంశం షరతుగా ఉండకూడదు.

Back to Top