ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పరీక్షలు కాదు జ్ఞానం ప్రధానం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సి.బి.ఎస్.ఇ.) నిర్వహించే పదో తరగతి లెక్కల ప్రశ్న పత్రం, 12వ తరగతి ఆర్థిక శాస్త్ర ప్రశ్న పత్రం లీక్ కావడం చాలా కలత కలిగించే విషయం. ఈ ప్రశ్న పత్రం లీక్ అయినందువల్ల లక్షలాదిమంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విపరీతమైన వేదన కలగడమే కాక విద్యా వ్యవస్థలో అవినీతి, దుర్వర్తన ఎంతగా పేరుకుపోయాయో ఆలోచిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. సి.బి.ఎస్.ఇ. తమకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంది. గత కొద్ది వారాలుగా ఈ సంస్థపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా చూడవలసిన మౌలిక బాధ్యత నిర్వర్తించడంలో సి.బి.ఎస్.ఇ. విఫలమైంది.

సి.బి.ఎస్.ఇ. నిర్వహించే పరీక్షలకు చాలా విశిష్టత ఉంది. ఉన్నత విద్య ఏ రంగంలో అభ్యసించాలో విద్యార్థులు నిర్ణయించుకోవడానికి ఈ పరీక్షలు కీలకం. అవి విద్యార్థుల జీవితాన్నే మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షల్లో సాధించిన మార్కులు విద్యార్థుల సమర్థతకు. అభిరుచికి కొలమానం కావన్నది వేరే అంశం. అయినప్పటికీ సి.బి.ఎస్.ఇ. పరీక్షలు నిర్వహించి మార్కులు వేసి, సర్టిఫికేట్లు ఇస్తుంది కాబట్టి ప్రజల దృష్టిలో ఇవి చాలా ముఖ్యమైనవే. ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూసే విద్యార్థులు, తమ పిల్లల భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, తమ బాధ్యత ఎంత మేరకు నెరవేర్చామో బేరీజు వేసుకునే ఉపాధ్యాయులు, మంచి ఫలితాలు సాధిస్తే తమకు మరింత గీరాకీ పెరుగుతుందని అనుకునే పాఠశాలలకు ఈ పరీక్షలు చాలా ముఖ్యమైనవే. బోర్డ్ పరీక్షల చుట్టూ ఇంత వ్యామోహం ఉండడంవల్ల ఈ విద్య వ్యాపారంగా మారింది. పరీక్ష పత్రాలు ముందే బయట పడ్డాయి అంటే ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పుకునే పాఠశాలలకు, బోర్డుకు, సి.బి.ఎస్.ఇ. మీద పర్యవేక్షక అధికారం ఉన్న అధికారులకు మధ్య ఎంత విడదీయరాని లంకె ఉందో అర్థం అవుతుంది.

ఇంతవరకు జరిగిన చర్చల్లా బాధ్యులెవరో నిర్ణయించడానికి, దోషులను కనిపెట్టి శిక్షించడానికి, ప్రశ్న పత్రాలకు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం చుట్టే తిరిగింది. పరీక్షా పత్రాలు బయటపడ్డందుకు సి.బి.ఎస్.ఇ. డైరెక్టర్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి తో సహా దీనికి బాధ్యులైన అధికారులు రాజీనామా చేయాలని గట్టిగా కోరిన వారు ఉన్నారు. ఈ అంశంపై అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనాయి. కాని మళ్లీ పరీక్షలు నిర్వహించాలో లేదో తేల్చుకోవాల్సింది సి.బి.ఎస్.ఇ. మాత్రమేనని భావించి సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చింది. సి.బి.ఎస్.ఇ. ఇప్పుడు విద్యార్థులకు ఊరట కలిగించాలి. పరీక్షల నిర్వహణా విధానాన్ని లోప రహితం చేయాలి. అదే సమయంలో మంచి జీవితం గడపడానికి, సమర్థతను నిరూపించుకోవడానికి ఈ పరీక్షలు కొలమానం కాదు అనుకుంటే ఈ పరీక్షలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అని అడగక తప్పదు.

విమర్శనాత్మకంగా విద్య నేర్చుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడడం లేదన్న ఫిర్యాదులు చాలా రోజుల నుంచే ఉన్నాయి. ఇప్పటికీ చదువు అంటే బట్టీ పట్టడమేనని, పాఠ్య పుస్తకాలే జ్ఞాన భాండాగారలని, పరిక్షల్లో వచ్చే మార్కులే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అంశం అన్న అభిప్రాయం బలంగా ఉంది.

అనేకమంది విద్యావేత్తలు, ప్రభుత్వాలే నియమించిన కమిటీలు విద్యావిధానంలోని లోపాన్ని ఎత్తి చూపకపోలేదు. జరగవలసిందల్లా ప్రస్తుత పరిస్థితికి ప్రత్యామ్నాయం రూపొందించడమే. ఆలోచించగలిగే, వివేచించగలిగే, సున్నిత మనస్కులైన, వివేకం ఉన్న పసి వాళ్లను ఎలా పెంచి పోషించాలో ఆలోచించాలి. విద్యార్థులు కేవలం పరీక్షల్లో గట్టెక్కే పద్ధతికి విరుగుడు ఏమిటో కనుక్కోవాలి. ఈ పని చేయాలంటే ప్రస్తుతం పరీక్షలకు ఉన్న ప్రేరణ, విలువల గురించి పునరాలోచించాలి. విద్యార్జనను పునర్నిర్వచించి పాఠశాలల బాధ్యత ఏమిటో నిర్ణయించాలి.

ఇవన్నీ చేయాలంటే పరిక్షల స్వభావాన్ని, ప్రయోజనాన్ని బేరీజు వేయాలి. లాంఛనప్రాయమైన విద్యా విధానంలో విద్యార్థుల, ఉపాధ్యాయుల పాత్ర, బాధ్యత ఏమిటో కూడా వివేచించాలి. జ్ఞానం ఎలా వస్తుంది, దాన్ని ఎలా తూకం వేస్తాం, పాఠశాలల్లో దాన్ని ఎలా సక్రమ పద్ధతిలో పెట్టగలమో చూడాలి. వాస్తవ జీవితంలో పిల్లలు నిరతరం నేర్చుకుంటారు లేదా విసర్జించవలసిన దాన్ని వదిలేస్తారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. విద్యార్జనను పాఠ్య పుస్తకాల నుంచి విడగొట్టాలి. విద్యార్థులు ఆర్జించే ప్రపంచ జ్ఞానం, అనుభవ జ్ఞానం తరగతి గదిలో భాగం కావాలి. ఈ ప్రక్రియకు ఉపాధ్యాయులు తోడ్పడాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది విద్యార్థుల ప్రతిభా పాటవాలను అంచనా వేసే పద్ధతి మారాలి. అది విద్యార్జనకు తోడ్పదేదిగా ఉండాలి తప్ప వారిని బెదరగొట్టడానికి, అసాధ్యమైంది అని అనుకోవడానికి, చదువంటే ఆమడ దూరం పారిపోవడానికి దారి తీసేలా ఉండకూడదు. "చదువు భారం కాకూడదు" అని చెప్పిన యశ్పాల్ కమిటీ నివేదిక పర్యవసానంగా రూపొందించిన 2005 నాటి జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం, 2009 నాటి బాలలకు ఉచిత, నిర్బంధ విద్య పొందడాన్ని హక్కుగా మార్చిన చట్టం ఈ విషయంలో ఆశావహంగా ఉన్నాయి.

మనం అసమానతలకు నిలయమైన సమాజంలో ఉన్నందువల్ల పరీక్షల విధానాన్ని పట్టుకు వేలాడుతున్నాం. ఈ విధానంలో "ప్రతిభ" ఆధారంగా విద్యార్థులను అంచనా వేస్తారు. ఇది న్యాయమైందిగా, నిష్పాక్షికమైందిగా తోస్తూ ఉంది. అదే వైపరీత్యం. ప్రశ్నపత్రాలకు భద్రత కల్పించడం, ఈ పత్రాలను లీక్ చేసే వారిని అడ్డుకోవడం ఎలా అని ఆలోచించడానికి బదులు భయం లేకుండా చదువు నేర్చుకునే పద్ధతి ఉండాలి. పరీక్షలకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వ కూడదు. బాలలు పరీక్షలు ఎలా బాగా రాయాలో, ఇతర విద్యార్థులతో ఎలా పోటీ పడాలో మాత్రమే చూసే పద్ధతి కాకుండా వివేకవంతంగా, అర్థవంతంగా, సృజనాత్మకంగా, సంతోషంగా ఎలా జీవించాలో నేర్పే విద్యా విధానం అవసరం చాలా ఉంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top