ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

స్పష్టత లేని సంకీర్ణాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

         ఇంతలో ఎంత మార్పు. ఒక్క నెల రోజుల్లో ఎంతో మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలోని పార్టీ ఎన్నికల యంత్రాంగం ఒక్క నెలరోజుల కిందట అజేయమైన శక్తిగా కనిపించింది. మార్క్సిస్టులకు కంచుకోటగా ఉన్న త్రిపురలో బిజెపి పాగా వేసింది. అంతే కాక ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని మేఘాలయ, నాగాలాండ్ లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.  అయితే కొద్ది రోజుల్లోనే గాలివాటం మారిపోయింది.  పార్టీకి కీలకమైన పార్లమెంట్ ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధులు మట్టికరిచారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం ఘోరఖ్ పూర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఫూల్పూర్ లో పార్టీ పరాజయం పాలైంది. ఎన్నికల లెక్కలు చమత్కారం చేశాయని ఎన్నికల విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సమాజ్ వాది (ఎస్.పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) పొత్తు పెట్టుకొని పోటీ చేయడం వారికీ కలసి వచ్చింది. బిజెపిని దెబ్బతీసింది. ఉప ఎన్నికలలో కాషాయ పార్టీ ఓటమితో కథ ముగియలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రతిపక్ష శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 2019 సాధారణ ఎన్నికల కోసం పొత్తులపై చర్చలు మొదలయ్యాయి. అయితే తాజా పరిణామాల వల్ల ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న బిజెపి, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్. డి.ఎ) లోని దాని మిత్రపక్షాల తీరులో గణనీయమైన మార్పు వస్తుందా ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పుడు చర్చకు వస్తున్న కొత్త, పాత కూటములలో కాంగ్రెస్ పార్టీ స్థానం ఏమిటి అన్నది మరో ప్రశ్న.  

అయితే ఒక్కటి మాత్రం నిజం. ప్రతిపక్షాల కొత్త పొత్తులకు అవకాశాలు మెరుగయ్యాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్, బిజెపి లేని కూటమి ఏర్పాటు. పోత్తుల గురించి బిజెపి మొదట్లో పెద్దగా కలత చెందలేదు. పొత్తులు, కూటముల ఏర్పాటు వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలగలవని బిజెపి అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీకి ఒక్క కాంగ్రెస్ మాత్రమే సమస్య కాదు. ఉదాహరణకు వచ్చే ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని దక్షిణ ప్రాంత జిల్లాలలో పాగా వేసేందుకు బిజెపి సతమతమవుతోంది. ఆ జిల్లాలలో జనతాదళ్ (సెక్యులర్) కు మంచి పట్టు వుంది.  కాంగ్రెస్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. ఎం. కృష్ణ వచ్చి చేరినప్పటికి ఒక్కలిగ తెగ వారి మద్దతు కూడగట్టు కోవడంలో బిజెపి విఫలమవుతోంది. ఒక్కలిగ కులస్తులకు గౌడల పట్ల ఉన్న విధేయత ముందు హిందూ మతాభిమానం ఎందుకు పనికి రాకుండా పోతోంది. 

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పాతాళానికి పడిపోయింది. అందువల్ల కాంగ్రెస్ ఓట్లను రాబట్టుకోవడం గురించి బిజెపి చింతించనవసరం లేదు.  పైగా ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు సూచించినట్లు ఎస్పి – బిఎస్పి జత కడితే బిజెపి గట్టి పోటీని ఎదుర్కోవలసి వుంటుంది. 2014, 2017లో జరిగిన గత రెండు ఎన్నికలలో ఓటర్లు రెండు వర్గాలుగా చీలి  హిందూ ఓటర్ల విస్తృత సమీకరణ జరగడం భారతీయ జనతా పార్టీకి కలసి వచ్చింది. అప్పుడు దళిత్-జాదవ్ లతో పాటు యాదవ్ లలో కొందరు బిజెపికి అండగా వున్నారు.

ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలో లౌకిక వాదుల సంకీర్ణం కల్ల. అందుకు బదులుగా బిజెపి, కాంగ్రెస్ లేని కూటమి ఏర్పడే అవకాశాలున్నాయి.  కొద్దో గొప్పో ఉనికి ఉన్న గుజరాత్, రాజస్థాన్,   మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక మినహా మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్ దీనావస్థలో ఉంది.  అందువల్ల సంఖ్యా బలంతో రాజకీయంగా ప్రభావం చూపగల యుపి, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుంటే జాతీయవాద కాంగ్రెస్ పార్టీతో జతకట్టే మహారాష్ట్ర మినహా మిగిలిన రాష్ట్రాలలో  కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే.

ఈ పరిస్థితులలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటి? తమ రాజకీయ పలుకుబడి జారుడు బల్లపై పడిందనే వాస్తవాన్ని కాంగ్రెస్ అంత సులభంగా ఒప్పుకోదు కాని కాంగ్రెస్, బిజెపి లేని కూటమిని బలపరచక దానికి గత్యంతరం లేదు. అది కూడా అంత సులభం కాదు. ఉదాహరణకు  తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టి.అర్.ఎస్.) నాయకుడు కె.చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేసి మద్దతుకోసం కోల్ కతా వెళ్లి పశ్చిమ బెంగాల్  ముఖ్య మంత్రి మమతా బెనర్జీ తో భేటి అయ్యారు.  ఆయన కాంగ్రెస్ కన్నా బిజెపి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.  లోక్ సభ కార్యకలాపాలలో ఆయన పార్టీ ఎక్కువగా బిజెపి పక్షమే వహించింది. తెలంగాణలో కాంగ్రెస్ కు పడే వివిధ వర్గాల  ఓట్లను టి.ఆర్.ఎస్. పంచుకుంటుంది. ముస్లిం ఓట్ బ్యాంకు చేజారకుండా కాంగ్రెస్ మీద పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తుంటుంది. అందుకే ముస్లిం ఓట్ బ్యాంక్ ను కాపాడుకుంటూ వస్తోంది. అదే విధంగా ఎస్పి, బిఎస్పి కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధంగా లేవు. పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న సత్తా ఏమిటని  ఆ రెండు పార్టిలు మరికొన్ని ఇతర పార్టీలతో కలసి ప్రశ్నిస్తున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కన్నా ఎక్కువ సీట్లు సంపాదించి కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించాగలదా? అన్నది వారి ప్రశ్న. లేనట్లయితే మరి ఏ విధంగా ప్రత్యామ్నాయానికి నాయకత్వం వహిస్తామని అనగలదు? అని వారు అడుగుతున్నారు. అయితే ఈ పరిస్థితి కూడా మారే అవకాశం లేకపోలేదు. అదేమంటే  కర్నాటక లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు ఈ యేడాది ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో – మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరంలో కనీసం రెండింటిలో గెలవాలి.

 పొత్తులపై ప్రతిపక్షాలు ఇంకా మంతనాలు జరుపుతున్నాయి. అయితే బిజెపి ఎన్నికలలో అప్రతిహతశక్తి అనే వాదనకు బీహార్, యుపి ఉపఎన్నికల ఫలితాలు గండికొట్టాయి. ప్రతిష్టాత్మకమైన ఘోరఖ్ పూర్, ఫూల్పూర్  నియోజకవర్గాలలో బిజెపికి చుక్కెదురైంది.  ఎన్.డి.ఏ. భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కోసం తగిన యంత్రాంగం లేకపోవడం కూడా ఎన్.డి.ఏ. కు సమస్యలు తెచ్చి పెడుతోంది. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్.డి.ఏ. లో సారధ్య కమిటీ వుండేది. మోదీకి అటువంటిది ఇష్టం లేదు. కూటమి నుంచి తెలుగు దేశం పార్టీ బయటికి రావడం, మరికొన్ని పార్టీలు అసమ్మతి స్వరాలు వినిపించడం తాజాపరిణామాలు. పార్లమెంట్ లో బిజెపికి తగినంత సంఖ్యా బలం ఉన్నందువల్ల దాని మెజారిటీపై అ పార్టీలు ప్రభావం చూపకపోయినప్పటికీ వాటికి ఉన్న కులబలం దృష్ట్యా భవిష్యత్తులో సంఖ్యాబలం తగ్గితే వాటికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. 

ఈ ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే  ఎన్నికల ఫలితాల తీరుపైనే కాంగ్రెస్ నాయకత్వ సామర్ధ్యం,  ఎన్.డి.ఏ. ను ఐక్యంగా ఉంచడంలో బిజెపి రాజకీయ చతురత ఆధారపడి వుంటుంది. అవే సంకీర్ణం రూపురేఖలను నిర్దేశిస్తాయి. ఈ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై పరోక్ష జనాభిప్రాయసేకరణ మాత్రమే కాదు. ఈ ఎన్నికలను ప్రాంతీయ నాయకుల నేతృత్వంలో కాక మోదీ నాయకత్వంలో, అమిత్ షా ఎన్నికల నైపుణ్యంపై ఆధారపడి పోటి చేయనున్నాట్లు బిజెపి ఇదివరకే సూచించినందువల్ల మోదీ పలుకుబడి (లేక వ్యతిరేకత)ని కూడా అవి అంచనా వేస్తాయి.  అందువల్ల  దేశ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితమని చెప్పవచ్చు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top