ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

తమిళ నాట నట రాజకీయం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అన్నా డీఎంకె నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, తొంభై ఏళ్లు దాటిన డీఎంకె అధినేత కరుణానిధి రాజకీయాల్లో క్రియాశీలంగా లేకపోవడంవల్ల అక్కడ రెండేళ్ల నుంచి పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. తమిళ రాజకీయాల్లో ఏదో వెలితి కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాలలో మొదటి నుంచి సినీ రంగ ప్రముఖులు గణనీయమైన పాత్ర పోషించారు. అక్కడ సినీ-రాజకీయ రంగాల మధ్య పెద్ద తేడా కనిపించదు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఉన్న వెలితిని పూరించడానికి ప్రసిద్ధ నటులు రజనీకాంత్, కమల హాసన్ ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు.

గతంలో తమిళ రాజకీయాలలో ద్రావిడ ప్రాబల్యమే ఎక్కువ. జాతీయ పార్టీలు, కాస్తో కూస్తో సామాజిక పునాది ఉన్న పార్టీలు కూడా ప్రధానమైన రెండు ద్రావిడ పార్టీల్లో ఏదో ఒక దాని పంచన చేరితే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ద్రావిడ పార్టీలు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే పరిపాలనా విధానాలు అనుసరించాయి. కాని ఆ పాలనలో అవినీతి, తమ ఆధిపత్యమే కొనసాగాలన్న ధోరణి చాలా ఎక్కువ. ద్రావిడ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీని ఎందుకూ కొరగాకుండా చేయడంలో సఫలం అయినాయి. ఈ పార్టీలే కేంద్రంలో కాంగ్రెస్ నో, బీజేపీనో సమర్థించాయి. తమిళ నాట ఉన్న రెండు ప్రధానమైన ద్రావిడ పార్టీల్లో ఒక సారి ఒక పార్టీ మరో సారి మరో పార్టీ అధికారంలోకి వస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మీద అసంతృప్తి తక్కువేమీ లేదు.

సినీ నటుడు విజయ కాంత్ 2005లో దేశీయ మురపొక్కు ద్రావిడ కగజం పార్టీ స్థాపించి శాసనసభ, లోకసభ ఎన్నికలలో దాదాపు పది శాతం ఓట్లు సంపాదించారు. మొదటి సారి పోటీ చేసినప్పుడే ఆ పార్టీ ఈ పని చేయగలిగింది. అంటే ఓటర్లలో ఎక్కువ మంది ప్రధానమైన రెండు ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారన్న మాట. దశాబ్దం కింద తమ తోటి నటుదు సాధించిన ఈ విజయాన్నే పునరావృతం చేయాలని రజనీ కాంత్, కమల హాసన్ ఆశిస్తున్నారు. కాని వారు భిన్నమైన పద్ధతిలో ఈ పని చేయాలనుకుంటున్నారు. రజనీకాంత్ కు సూపర్ స్టార్ అన్న కీర్తి ఉంది. అనేకమంది అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని వారు కోరుకున్నారు. 1996లో జయలలిత మొదటి సరి ముఖ్యమంత్రి అయిన తర్వాత రజనీకాంత్ అన్నా డీఎంకెను దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆధిపత్య ధోరణిని ఎండగట్టారు. అవినీతిని తూర్పారబట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దూకలేదు. ఇటీవల ఆయన రాజకీయాలను మలుపు తిప్పాలని భావిస్తున్నారు. తన ఆధ్యాత్మిక భావనను, తన మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు. తన మతాభినివేశం గురించి మాట్లాడినందువల్ల సహజంగానే ఆయన మితవాద పక్షాలకు సన్నిహితుడవుతున్నారు. ఆ పక్షాలు రజనీకాంత్ కు ఉన్న జనాభిమానాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అయితే తమిళనాడులో హిందుత్వ రాజకీయాలకు అంత స్థానం లేదు కనక అది నిష్ప్రయోజనం కావచ్చు.

రజనీకాంత్ మాత్రం తాను బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం లేదని, సుపరిపాలన ఉండాలని అంటున్నారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు పోటీ చేసే శక్తి సమకూర్చుకోవాలని తన అభిమానులకు చెప్తున్నారు. వివిధ అంశాల మీద తన అభిప్రాయం ఏమిటో చెప్పడం లేదు. తన సిద్ధాంతం ఏమిటో కూడా వెల్లడించడం లేదు. డీఎంకె నుంచి వేరుపడి విజయం సాధించిన ఎం.జి. రామచంద్రన్ ను అనుసరించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎం.జి.ఆర్. కూడా సిద్ధాంతాల జోలికి పోకుండా అన్నా డీఎంకెను పటిష్ఠమైన పార్టీగా తయారు చేయగలిగారు. రజనీకాంత్ తన సొంత పలుకుబడి మీద దృష్టి కేంద్రీకరించడం బీజేపీకి ఉపకరించవచ్చునన్న భావన కూడా ఉంది.

కమల్ హాసన్ కు వైవిధ్యభరితమైన పాత్రలు పొషించిన నటుడిగా పేరుంది. ఆయన అనేక క్లిష్టమైన పాత్రలలో నటించారు. ఆయనకు రజనీకాంత్ కు ఉన్నంత జనాదరణ లేకపోవచ్చు కానీ నటుడిగా గౌరవం సంపాదించారు. రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచన రజనీకాంత్ కు చాలా కాలంగా ఉంది. కానీ కమల హాసన్ ఇటీవలే ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఆయన మునుపటి ద్రావిడ విధానాలను, హేతువాద, అభ్యుదయ భావాలను బాహాటంగా వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గత ఏడాది కమల హాసన్ రాజకీయాలలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆచరణాత్మక విధానాలను అనుసరిస్తానని చెప్పారు. తన పార్టీకి మక్కల్ నీతి మయం (ప్రజా న్యాయ కేంద్రం) అని పేరు పెట్టారు. మధ్యేమార్గం అనుసరిస్తానంటున్నారు. రజనీకాంత్ లాగా కాకుండా మతతత్వాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారనిపిస్తోంది. రైతుల కడగండ్లు, నీటి పంపిణీలో తమిళనాడుకు వాటా, ప్రర్యావరణ సమస్యలపై కూడా కమల్ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్తున్నారు. అయినా తన రాజకీయ సిద్ధాంతం ఇదీ అని స్పష్టంగా చెప్పడం లేదు.

మొత్తం మీద జయలలిత మృతి తర్వాత అన్నా డీఎంకెలో నెలకొన్న అస్తవ్యస్తత కారణంగానే ఈ ఇద్దరు సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అధికారంలో ఉన్న పార్టీల మీద ప్రజల అసమ్మతి మరో కారణం. అన్నా డీఎంకె మీద అభిమానం తగ్గుతున్నా కరుణానిధి కుటుంబంలో ఉన్న విపరీత ఆకాంక్షల కారణంగా డీఎంకె అన్నా డీఎంకెకు ప్రత్యామ్నాయం కావడం లేదు. రజనీ కాంత్, కమల హాసన్ చాలా కాలంగా మిత్రులే అయినప్పటికీ వారు నటులుగా ప్రసిద్ధులు కావడానికి భిన్న మార్గాలు అనుసరించారు. రజనీకాంత్ తన వ్యక్తిత్వం, నటనా చాతుర్యంతో ప్రసిద్ధులైనారు. కమల హాసన్ కాస్త లోతుగా ఆలోచించే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి రాజకీయ అవతారంలో కూడా ఈ భిన్నత్వమే కనిపిస్తోంది. తమిళనాట మధ్యాదాయ వర్గం పెరిగిపోతున్న తరుణంలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి. కాని తమిళనాడు ప్రజలు కచ్చితమైన రాజకీయ నిర్దేశం కోసం ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం.

Back to Top