ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

రైతులతో భుజం కలిపిన ముంబై వాసులు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

గ్రామీణ ప్రపంచం, నగర జీవనం వేర్వేరు అన్న భావన 2018 మార్చి 11న పటాపంచలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆడ, మగ, పిల్లా పెద్దా అంతా కలిపి 40వేల మంది ఒక్కుమ్మడిగా ముంబైకి చేరుకున్నారు. వీరిలో కొంతమంది ఎర్ర టోపీలు పెట్టుకున్నారు. మరి కొందరు ఎర్ర జెండాలు చేతబూనారు. వీరంతా నాసిక్ నుంచి ముంబై దాకా 180 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. కాని ఈ యాత్ర విశిష్టత అంత దూరం పాద యాత్ర చేయడం మాత్రమే కాదు. అనేక వర్గాల వారు ఇంతకు ముందూ ఇలాంటి యాత్రలు చేశారు. కానీ ఈ యాత్ర మునుపటి యాత్రలకన్నా భిన్నమైంది. మొట్టమొదటి తేడా అందులో వివిధ వర్గాలవారు పాల్గొనడం. పేద రైతులు, ఆదివాసులు ఈ యాత్రలో ఎక్కువ మంది ఉన్నారు. రెండవది: వ్యాపారస్థులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వ్యాపరస్థులు ముంబై జీవనానికి భంగం కలగకుండా చూడడమే కాదు రైతులకు సంఘీభావం తెలియజేశారు. వారికి ఆహారం, నీళ్లు, వైద్య సహాయం అందించారు. యాత్రలో పాల్గొన్న రైతుల అలసట తీర్చడానికి తోడ్పడ్డారు. మీడియా కూడా ఈ యాత్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చి తిమ్మిని బమ్మిని చేయడానికి అవకాశం లేకుండా పోయింది.

మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సంక్షోభం అలాగే కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జి.ఎస్.టి.) వంటి విధానాలు అమలు చేసినందువల్ల 2016-17లో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ విధానాలు వ్యవసాయ రంగాన్ని బాగా దెబ్బ తీశాయి. 2017లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పుడు సీపీఎం నాయకత్వంలోని అఖిలభారత కిసాన్ సభ రైతులను సమీకరించి ఉద్యమబాట పట్టింది. ఈ కారణంగా ఇష్టం లేకపోయినా ఫడ్నవీస్ ప్రభుత్వం రూ. 30,000 కోట్ల మేర రైతు రుణాలను మాఫు చేయక తప్పలేదు. కనీస మద్దతు ధరలు పెంచవలసి వచ్చింది. అయినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గడం ఆగలేదు. అందువల్ల బేషరతుగా రుణాలు మాఫు చేయాలని, నీటిపారుదల సదుపాయాలు మెరుగుపరచాలని, భూమిపై ఆస్తి హక్కు ఇవ్వాలని కోర్తుతూ రైతులు ఉద్యమించారు. విధి లేక ఫడ్నవీస్ ప్రభుత్వం రైతుల కోర్కెలన్నింటినీ ఆమోదించక తప్ప లేదు. ఈ కోర్కెలు తీర్చడానికి ప్రభుత్వం అదనంగా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది.

రుణాల మాఫీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. రైతులు బకాయిపడ్డ అప్పులు మాఫు చేయడంవల్ల వారికి కొంత ఊరట మాత్రమే కలుగుతుంది. మళ్లీ రుణాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. మహారాష్ట్రలో రైతుల ఆత్మ హత్యలు ఎక్కువ కనక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిన్నదేమీ కాదు. రైతులు పండించిన పంటకు తక్కువ ధర పలకడంవంటి సమస్యలకు తోడు చాలా కాలంగా వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతోంది. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించలేదు. రైతుల పెట్టుబడి వ్యవయం పెరిగిపోవడం, తీరా పంట పండిన తర్వాత అమ్మాలంటే ధర పలకకపోవడం నిత్య సమస్యగా మారిపోయింది. సాగునీటి వనరులు, సాంకేతిక సదుపాయాలూ రైతులందరికీ సమానంగా అందుబాటులో లేవు. వాణిజ్య పెరుగుతున్నా ఉత్పాదకత తగ్గుతోంది. దీనికి తోడు వర్షాలు సరిగ్గా కురవకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో పండిన పంటకు ధర తగ్గడంవంటి సమస్యలున్నాయి. అందుకని రైతులకు రక్షణ లేకుండా పోయింది.

1970లలో రైతుల నూతన ఉద్యమం మొదలైనప్పటి నుంచీ వ్యవసాయరంగ సంస్కరణల్లో 'ధర 'కు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్న రైతులు, పెద్ద రైతుల మధ్య ఐక్యత అన్న అంశానికీ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ నిర్మాణాత్మక సంస్కరణలకు విఘాతం కలుగుతోంది. ముఖ్యంగా భూకమతాలు, నీటిపారుదల, రుణ సదుపాయం, భూ వినియోగం, పంటల విధానం మొదలైన అంశాలలో సంస్కరణల జాడే కనిపించడం లేదు. రైతుల సమస్యలను పరిశీలించడానికి 2004-06లో ఎం.ఎస్.స్వామీనాథన్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశారు. స్వామీనాథన్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా సంస్కరణలు అమలు చేయాలన్న డిమాండు గత దశాబ్దకాలంలో ఎక్కువ అయింది. రైతుల కష్టాలు తీర్చడానికి రుణమాఫీ అంతగా ఉపకరించలేదు. సాంకేతిక సహాయం అందజేయడం, వాణిజ్యం, రైతులకు శిక్షణ మొదలైన అంశాలపై దృష్టి పెట్టాలని ఆ కమిషన్ సిఫార్సు చేసింది. ఆర్థికంగాను, జీవావరణ పరిరక్షణకు అనుకూలమైన పంటలు పండించడంలో రైతులకు శిక్షణ ఇవ్వాలని స్వామీనాథన్ సూచించారు. ఈ సిఫార్సులను అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. చిన్న, సన్నకారు రైతులు మరింత ఇబ్బందుల పాలవుతున్నారు.

గత సంవత్సరంలో రైతు ఉద్యమాలకు, మొన్నటి రైతు ఉద్యమానికి మధ్య మౌలికమైన తేడా ఉంది. ఈ ఉద్యమంలో ఆదివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2006 నాటి గిరిజనులు, ఇతర సాంప్రదాయిక అటవీ వాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ఇది సాధ్యం కావాలంటే ఆదివాసీ రైతులకు అటవీ భూముల మీద యాజమాన్య హక్కు, సేద్యం చేసుకునే హక్కు ఉండాలి. అభివృద్ధి సాధనలో మహారాష్ట్ర ముందున్నప్పటికీ ఈ చట్టం అమలు విషయంలో మాత్రం వెనుకబడే ఉంది. భూమిలేని ఆదివాసులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కార్పొతేటు రంగం తమ భూములను కబళించే సమస్యను కూడా ఆదివాసులు ఎదుర్కోవలసి వస్తోంది. వనరులు సమృద్ధిగా ఉన్న అటవీ ప్రాంతాల నుంచు ఆదివాసులు నిర్వాసితులు అవుతున్నారు. రైతులు సమీకృతం కావడానికి 'భూమి ' ఇప్పటికీ రాజకీయ ఎజెండాగా కొనసాగుతోంది.

ఇంతకు ముందు మరాఠాల నాయకత్వంలో సాగిన మాహారాష్ట్ర రాజకీయాలు చెరకు పండించడాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రాంతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయానికి ముప్పు కలిగింది. పంటలు పండించే ప్రాంతంలో చెరకు పండే ప్రాంతం నాలుగు శాతమే అయినా మహారాష్ట్రలో అందుబాటులో ఉన్న సాగునీటిలో చెరకు పండించడానికి 65 శాతం నీరు ఖర్చవుతోంది. చెరకు సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని చక్కెర సహకార మిల్లులు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అల్ల కల్లొల వాతావరణం ఉన్నందువల్ల బీజేపీ ప్రభుత్వానికి వ్యవసాయ సంస్కరణలు అమలు చేసే అవకాశం వచ్చింది. కాని ఆ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే వారు, పట్టణ ప్రాంతాలలోని మధ్యతరగతి వర్గం, చిన్న వ్యాపారులు సంస్కరణలకు మోకాలడ్డుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న ఈ ఏడాదిలో బీజేపీ ఆచి తూచి అడుగు వేయక తప్పదు. మహారాష్ట్ర అనుభవాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తాయి. ఇది ఎన్నికల ప్రచారంలో బీజేపీకి మహదవకాశం.

Back to Top