ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సంకెళ్లలో ప్రసార భారతి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గాని, అంతకు ముందున్న ప్రభుత్వానికి గానీ నిజంగా స్వతంత్రంగా వ్యవహరించే ప్రజా ప్రసార మాధ్యమం అంటే ఇష్టం లేదు. ప్రసార భారతి అభిప్రాయానికీ ప్రభుత్వ భావానకు మధ్య చిన్న తేడా వచ్చినా ప్రసార భారతి స్వయంప్రతిప్రత్తి చర్చకు వస్తుంది. ప్రసార భారతి బోర్డు వృత్తి నిపుణులను నియమించడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఆ మంత్రిత్వ శాఖ నిర్ణయాలను ప్రసార భారతి బోర్డు తిరస్కరించింది. నియామకాల విషయంలో హక్కు తమదేనని భావించిన ప్రసార భారతి బోర్డు తన స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతిగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ దూరదర్శన్, అకాశవాణి సిబ్బందికి చెల్లించవలసిన జీతనాతాలను ఆపేసింది. ఇది ప్రతీకార చర్యేనని ప్రసార భారత్ బోర్డు అంటోంది. కాని ఈ రగడ ఒక కుటుంబంలో తగాదాలా చప్పున చల్లారి పోయింది.

ఇందిరా గాంధీ హయాంలో 1975-77 కాలంలో దూరదర్శన్, ఆకాశవాణిని ప్రభుత్వ ప్రచారానికి బాకాగా ఉపయోగించుకున్నందువల్ల స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రసార మాధ్యమం ఉండాలన్న ఆలోచన మొదాలైంది. అలాంటి సంస్థను ఎలా రూపొందించాలో సూచించడానికి 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ప్రసిద్ధ సంపాదకుడు బి.జి.వర్గీస్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఇంగ్లాండ్ లోని బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తరహాలో మన దేశంలో అలాంటి వ్య్వస్థ ఏర్పాటు చేయాలనుకున్నారు. వర్గీస్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రసార భారతి ఏర్పాటు చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ఈ బిల్లు 1990లో ఆమోదం పొందింది. కాని ఆ వ్యవస్థ ఏర్పడడానికి మరో ఏడేళ్లు పట్టింది.

అయినప్పటికీ ఏ ప్రభుత్వమూ ఆ చట్టంలోని కీలకాంశాలను అమలు చేయాలని ఇప్పటికీ అనుకోవడం లేదు. ప్రసార భారతిలో ప్రభుత్వ జోక్యం లేకుండా చూడడానికి 22 మంది పార్లమెంటు సభ్యులతో ఒక పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇది ఇంతవరకు ఏర్పడనే లేదు. ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలని ఏ రాజకీయ పార్టీ కోరడమూ లేదు. ఈ లోపాన్ని సవరించాలని మునుపటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాం పిత్రోడా కమిటీ కూడా ఇదే సిఫార్సు చేసింది. నిజానికి 2011లో రాజ్య సభ టీవీ ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి కమిటీ ఎంత సమర్థంగా ఉంటుందో అన్న చర్చ వచ్చింది. అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నాయకత్వంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీల కమిటీకి ఈ బాధ్యత అప్పగించారు. దానితో కుప్పతెప్పలుగా ఉన్న ప్రైవేటు చానళ్లలో వినిపించే అర్థరహిత రణగొణ ధ్వనులతో నిమిత్తం లేకుండా రాజ్యసభ టీవీ ఎలా పని చేయగలదో తేలింది. కాని ఆ ప్రయోగం ఎక్కువ కాలం కొనసాగలేదు.

ప్రసార భారతి చట్టం ప్రకారం "ప్రజా జీవనంలో ప్రసిద్ధులైన" 11 మందితో ఒక బ్రాడ్ కాస్టింగ్ మండలి ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ సభ్యులను రాష్ట్రపతి నియమించాలి. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు చెందిన నలుగు సభ్యులు ఉండాలి. ప్రసార భారతి ప్రసారం చేసే అంశాలపై ప్రజల ఫిర్యాదులను పరిశీలించడం ఈ కమిటీ బాధ్యత. ఈ కమిటీనీ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే వ్యవస్థ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఇదీ అస్తిత్వంలోకి రానే లేదు.

దీనికి బదులు ప్రస్తుతం అమలులో ఉన్నదల్లా ముందున్నట్టుగానే దూరదర్శన్, ఆకాశవాణిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పెత్తనం మాత్రమే. ఏమైనప్పటికీ ప్రసార భారతి బోర్డు స్వతంత్రమైందని చెప్పడానికి వీలు లేదు. ఆ బోర్డులో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ సిద్ధాంతలతో ఏకీభవించే వారినే నియమిస్తుంటారు. ప్రస్తుత ప్రసార భారతి అధ్యక్షుడు, బోర్డు సభ్యులు ఆ బాపతు వారే. బోర్డుకు, ప్రభుత్వ రాజకీయ సిద్ధాంతానికి మధ్య ఇంతవరకు ఏ తేడా లేదు. ఒక వేళ ఏమైనా ఉంటే అది పని చేసే రంగాలలో మాత్రమే. అందువల్ల ప్రసార భారతిని ప్రజా ప్రసార భారతి అనడం ఓ అపోహ. అది గతంలో లాగే ఇపూడూ ప్రభుత్వ ప్రసార వ్యవస్థే.

ప్రసార భారతి వ్యవహారంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జోక్యం కొనసాగినంతకాలం ప్రజా ప్రసార మాధ్యమానికి స్వయంప్రతిపత్తిపై చర్చకు అవకాశమే లేదు. నిజానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండాలన్నదే అడగవలసిన ప్రశ్న. ఆ మంత్రిత్వ శాఖ చేసే పనల్లా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రచారం చేయడంతో పాటు ప్రైవేటు మీడియా సంస్థలకు లైసెన్సులు మంజూరు చేయడమే. ప్రభుత్వం చేతిలో ఇప్పటికే దూరదర్శన్, ఆకాశవాణి ఉన్నాయి. లైసెన్సులు జారీ చేసే బాధ్యతను మరో మంత్రిత్వ శాఖకు అప్పగించవచ్చు. ప్రజా ప్రసార మాధ్యమంపై పెత్తనం చేసే మంత్రిత్వ శాఖ ఉండడమే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వైపరీత్యం కాదా?

స్వయంప్రతిపత్తిగల ప్రజా ప్రసార వ్యవస్థ అవసరం అన్న విషయంలో సందేహానికి తావు లేదు. ప్రైవేటు మీడియా సంస్థలు చేయని పనిని ఇలాంటి ప్రసార వ్యవస్థ చేయగలుగుతుంది. కొన్ని కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవు అని ప్రైవేటు మీడియా సంస్థలు భావిస్తాయి. కాని ఆ సమాచారం ప్రజలకు అవసరం అయింది కావచ్చు. ఆ బాధ్యతను ప్రజా ప్రసార వ్యవస్థ నిర్వర్తించవచ్చు. కొన్ని అంశాల మీద చర్చలు, వాదోపవాదాలు అవసరం. దానివల్ల ప్రజల జ్ఞాన పరిధి పెరుగుతుంది. ప్రైవేటు చానళ్లు నిర్వహించే ఇలాంటి చర్చా కార్యక్రమంలో అసలు విషయం మరుగున పడి పోతోంది. కొన్ని అంశాలను ఈ మీడియా సంస్థలు పూర్తిగా విస్మరిస్తాయి. అన్నింటికన్నా మించి ప్రజా ప్రసార వ్యవస్థ దేశంలోని సుసంపన్నమైన వైవిధ్యాన్ని చాటి చెప్పడానికి ఉపకరిస్తుంది. ఇంతకు ముందు ఆకాశవాణి దేశంలో వివిధ ప్రాంతాల సంగీత సంపదను రికార్డు చేసింది. స్వతంత్రప్రతిపత్తి గల ప్రసార వ్య్వస్థ ఉంటే ఇలాంటి పనులు అనేకం చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రసార భారతి ఆ పని నామమాత్రంగానైనా చేయడం లేదు.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top