అధికారమే పరమావధి!
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో ఈమధ్య జరిగిన ఎన్నికల నుంచి ముఖ్యభారతం ఓ పాఠాన్ని నేర్చుకోవలసి ఉంది. అదే- అనవసర సూత్రీకరణల జోలికి పోకూడదని! త్రిపురలో 25 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీని తోసిరాజని, భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడాన్ని జాతీయ మీడియా ‘‘ఈశాన్యంలో కాషాయ కెరటం’’గా ఆకాశానికెత్తేసింది. కానీ ఎప్పటిలాగే ‘‘ఈశాన్య భారతం’’లో భిన్నమైన రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక అంశాలు కలిగిన ఏడు వైవిధ్యమైన (సిక్కింతో కలుపుకొని ఎనిమిది) రాష్ట్రాలు ఉన్నాయని మర్చిపోయింది. వాటిని ఒక ముద్దగా చేర్చి చూడటం అంటే, వాటి వ్యక్తిగత ఉనికిని విస్మరించడమే. తమని ఒకటే మూసలోకి చేర్చి, అవతలికి విసిరిపారేశారని ఈశాన్య రాష్ట్రాల వారు భావించడానికి... ‘‘ముఖ్యభారతం’’లో కనిపించే ఈ దృక్పధం కూడా ఓ ముఖ్య కారణమే!
అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల అసంతృప్తితో పాటుగా, స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న హిందువులు భాజపా అజెండాకు ఆకర్షింపబడటం కూడా ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. క్రైస్తవులు అధికసంఖ్యలో ఉన్న కొండ ప్రాంతాలలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భాజపాకు త్రిపురలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆదివాసులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే లక్ష్యంతో ఏర్పడిన ‘ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర’ (ఐపీఎఫ్‌టి) వంటి పార్టీతో జతకట్టి బరిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఐపీఎఫ్‌టి చాలా చిన్న భాగస్వామే. అయితే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఒప్పుకునే అవకాశం లేదుకాబట్టి, స్థానికంగా ఈ పార్టీ భాజపాకు కంట్లో నలుసులా మారే ప్రమాదం ఉంది.
ఇక మేఘాలయ, నాగాలాండ్‌లలో స్థానిక రాజకీయాలు అసలు కథని చెబుతాయి. ఒకనాటి అసోంలో ఉన్న ఖాసీ, జైన్‌టియా, గెరో తెగలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (ఏపీహెచ్‌ఎల్‌సి) ఏర్పడింది. ఆ పార్టీ పోరాట ఫలితంగా 1972లో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాల పుణ్యమా అని, ఏపీహెచ్‌ఎల్‌సి మరికొద్ది సంవత్సరాలకే వీగిపోయింది. ఇందిరాగాంధి ఎమర్జెన్సీ పాలన సాగుతున్న 1976లోనే ఈ చీలక జరగడం యాదృచ్ఛికం. ఏపీహెచ్‌ఎల్‌సిలోని పూర్వ సభ్యులంతా కాంగ్రెస్ లేదా ఇతర స్థానిక పార్టీలలో చేరిపోయారు. 2008లో అలాంటి చిన్న పార్టీలంతా ఒక్క తాటి మీదకు వచ్చి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించే ప్రయత్నం జరిగినా... కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వారు అధికారంలోకి మనగలిగారు. ఆపై రాష్ట్రపతి పాలన సాగి మరోసారి కాంగ్రెస్ పాలనకు దారితీసింది. ఈసారి కూడా ఇతర పార్టీలకంటే కాంగ్రెస్‌కు అధిక సీట్లు దక్కినప్పటికీ, ఒకనాటి దుష్పరిపాలన సంగతి పక్కన పెట్టినా... ఇతర పార్టీలతో జతకట్టేందుకు భాజపా తరహా వ్యూహరచన చేయలేకపోయింది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో తను కూడా ఓ భాగస్వామిగా ఉంది కాబట్టి, భాజపా ప్రభుత్వాన్ని పడదోసే ప్రయత్నాలు చేయకపోవచ్చు. దాంతో ఈసారి ప్రభుత్వం పూర్తికాలం పదవిలో సాగే అవకాశం ఉంది.
నాగాలాండ్ పరిస్థితి పూర్తిగా ఇందుకు వెలుపల ఉంది. జాతీయ పార్టీలతో జతకట్టడం ద్వారా, రాష్ట్రంలో తమ అధికారాన్ని నింపుకోవాలని చూసే ప్రాంతీయ పార్టీల పరిస్థితిని భాజపా తనకు అనుకూలంగా మార్చుకుంది. టిఆర్ జెలియాంగ్ నేతృత్వంలో అధికారంలో ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) చీలిపోయాక, నేపియు రియో నాయకత్వంలో ఏర్పడిన నేషనలిస్ట్ డెమోక్రెటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)తో ఎన్నికలకు ముందే భాజపా పొత్తు పెట్టుకొంది. సైద్ధాంతిక బేధాల మీద కాకుండా... రియో, జెలియాంగ్‌ల మధ్య ఉన్న విభేదాల వల్లే ఎన్‌పీఎఫ్ చీలిపోవడాన్ని భాజపా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. చివరికి భాజపా, ఎన్‌డిపిపితో కలిసి... ఇతర చిన్నాచితకా పార్టీలను కూడా కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావల్సిన సంఖ్యను సాధించింది. ఈ మధ్యకాలంలోని పరిస్థితిని గమనిస్తే, నాగాలాండ్‌లో ఏ ఒక్క పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లు కనిపించదు. మున్ముందు కూడా ఇలాంటి పరిస్థితే పునరావృతం కావచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలో చేరేందుకు ఎన్‌పీఎఫ్ మరోసారి చీలిపోయింది. అధికారంలో ఉండాలనుకునే ఆకర్షణే నాగాలాండ్ పార్టీలన్నింటిని ఐక్యంగా ఉంచే సిద్ధాంతంగా మారిపోయింది.
అయితే మరి మూడు ఈశాన్య రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల నుంచి ‘‘ముఖ్యభారతం’’ ఎలాంటి సారాంశాన్ని గ్రహించాలి? త్రిపురలో వచ్చిన ఫలితం మిగతా రెండు రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితిని ప్రతిబింబించదన్నది మొదటి విషయం. త్రిపురలో భాజపా గెలిచి ఉండవచ్చు కానీ, రెండు కొండప్రాంతపు రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలదే పైచేయి. ఈ రెండు రాష్ట్రాలలో భాజపా స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది సమీప భవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చు. ఇక రెండో విషయం- తరచూ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తూ, తాను ఒక భిన్నమైన పార్టీనని చెప్పుకునే భాజపా... నిజానికి అంత భిన్నమైన పార్టీ ఏమీ కాదని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ఏ మార్గాన్నయినా నిరంతరాయంగా అనుసరించవచ్చే సిద్ధాంతాన్ని రెండు పార్టీలూ అవలంబిస్తుంటాయి. ఇక మూడవ విషయం- స్థానికంగా, కాంగ్రెస్‌లా దుష్ఫరిపాలనని అందించిన చరిత్ర లేకపోవడంతో... భాజపా ‘‘అభివృద్ధి’’ మంత్రాన్ని జపించే అవకాశం దక్కింది. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో, సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే ఈ మంత్రం నీరుగారిపోవచ్చు. చివరగా- త్రిపురలోను, అసోంలోను (2016) భాజపా ఒక బలమైన ప్రత్యర్థి అని ఒప్పుకోక తప్పనప్పటికీ, ఈశాన్యంలోని మిగతా రాష్ట్రాలలో ఆ పార్టీ విజయానికి కారణం... అధికారమే ఆకర్షణగా కల్గిన భాగస్వాములతో జట్టు కట్టగలిగే ‘‘సంధానకర్త’’ (తిమ్మిని బమ్మి చేయడానికి కాస్త గౌరవప్రదమైన పదం) బాధ్యతని చాలా నైపుణ్యంతో నెరవేర్చడం!