ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మతస్వేచ్ఛపై బ్రిటన్ గురువింద తత్వం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

నరేంద్ర మోది నేతృత్వంలోని భారతదేశంలో... ‘మతపరమైన విశ్వాసాలు, స్వేచ్ఛ’ ప్రమాదంలో ఉన్నాయంటూ మార్చి 1, 2018న బ్రిటన్ పార్లమెంటు ఆందోళన వెలిబుచ్చింది. 2018 ఏప్రిల్‌ మధ్యకాలంలో కామన్‌వెల్త్‌ ప్రభుత్వ నేతల సమావేశంలో భాగంగా నరేంద్ర మోదీ బ్రిటన్‌ను సందర్శించినప్పుడు, ఈ విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించవలసిందిగా బ్రటన్‌ పార్లమెంటు సభ్యుడైన స్కాటిష్‌ జాతీయ పార్టీ నాయకుడు మార్టిన్‌ డొచెరీ- హ్యూగ్స్‌, బ్రటిష్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. భారతేదశంలోని అల్ప సంఖ్యాక మతస్థుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద బ్రటిన్‌ దృష్టి సారించడం ఓ శుభవార్తే! భారతీయ సమాజాన్నీ, రాజ్యాన్నీ హిందూ ఎజెండాతో పాలిస్తున్న ప్రభుత్వం మీద దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, బ్రిటన్ దిగువ సభ (హౌజ్ అప్ కామన్స్) లో జరిగిన ఉపన్యాసాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. పాశ్చాత్యేతర దేశాలలో క్షీణిస్తున్న మత స్వేచ్ఛ గురించి బ్రిటన్‌ చేస్తున్న ఆందోళనను సామ్రాజ్యవాద ధోరణులు ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇవి సూచిస్తున్నాయి. ప్రజాభిప్రాయంలో తమకి లభిస్తున్న సానుకూలత ఆధారంగా, ఆధునిక ఐరోపా తరహా సామ్రాజ్యవాద ధోరణుల విజయాన్ని అంచనా వేయలేము. సామ్రాజ్యవాద ధోరణిలోని కొన్ని మౌలికమైన భావజాలాలు ఏమేరకు వ్యక్తమవుతున్నాయో అన్నది మాత్రమే ఇవి సూచిస్తున్నాయి. వాటిలో ఒకటి- ఏ రంగంలో అయినా సరే, ఐరోపాలో సాధించిన పురోగతిని, ఇతర సమాజాలలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఓ తిరుగులేని కొలబద్దలా భావించే ధోరణి. మతస్వేచ్ఛ దిగజారిపోతోందని ఆందోళన వెలిబుచ్చుతూ, వెస్ట్‌మినిస్టరు హాలులో జరిగిన చర్చ కూడా ఐరోపాదృష్టిలోనే సాగింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ‘‘ఐరోపా ప్రాంతాల్లో ఊహించలేని విధంగా అక్కడ మతపరమైన అణచివేత’’ ఉందంటూ లేబర్‌ పార్టీ ఎంపీ ఫేబియన్‌ హేమిల్టన్‌ దిగాలుప్డడారు. ఐరోపాతో (ముఖ్యంగా పశ్చిమ ఐరోపాతో) పోల్చుకుంటే మత స్వేచ్ఛని అందించడంలో భారతదేశ చరిత్ర చాలా దయనీయంగా తోచవచ్చు.

మత స్వేచ్ఛ మీద ఈ తరహా సామ్రాజ్యవాద ఉపన్యాసాల ప్రభావం ఏమిటో స్పష్టంగానే అర్థమవుతుంది. భారతదేశంలో క్రైస్తవులు, సిక్కులు మాత్రమే అణచివేతకు గురయ్యే మతాలు అన్న అభిప్రాయాన్ని దిగువ సభ చర్చ కలిగిస్తుంది. భారతదేశంలో హిందుత్వ హింసకు ఎక్కువగా బలయ్యే ముస్లింల భవితవ్యం గురించి ఈ చర్చలో ఒక్కమాట కూడా వినిపించలేదు. ఈ స్పష్టమైన ఉపేక్షకి కారణం ఏమై ఉంటుంది? బ్రిటన్‌ (ఆ మాటకు వస్తే, పశ్చిమ దేశాలు అన్నీ)... అల్పసంఖ్యాకులైన ముస్లింలకు తగిన హక్కులు, భద్రతలను కల్పించే విషయంలో భారతదేశంలో పోల్చుకునే స్థాయిలో లేవు. ఈ విషయాన్ని హామిల్టన్‌ తన అంతరంగ మధనంలో భాగంగా వెలిబుచ్చారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్ లో ముస్లింల పట్ల ద్వేషపూరితమైన దాడులు పెరిగాయని ఒప్పుకున్నారు. అయితే కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ ఎడ్వర్డ్‌ లేహ్‌ మాటల హోరులో ఈ స్వీయవిమర్శ కొట్టుకుపోయింది. ఎడ్వర్డ్‌ అభిప్రాయం ప్రకారం ఈ లోకంలో అందరికంటే ఎక్కువ అణచివేతని ఎదుర్కొంటోంది క్రైస్తవులు, ముస్లింలలోని అల్పసంఖ్యాక తెగలవారే! ముస్లింలలోని అల్పసంఖ్యాత తెగలు, తమకంటే బలమైన తెగల చేతిలో బాధలు పడుతున్నాయి (ఉదాహరణకు పాకిస్తాన్‌లోని అహ్మదీయులు). దీని ఉద్దేశం- ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే భారతదేశం, బ్రిటన్‌ వంటి ప్రదేశాలలో ముస్లింలు అణచివేతకు గురవడం లేదనీ, ఒకవేళ వాళ్లు ఏదన్నా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే... అది ప్రపంచాన్ని తీవ్రవాదం నుంచి కాపాడే చర్యలలో భాగం అని చెప్పదలిచారా?

ఏమైనప్పటికీ కూడా, మోదీతో సాగే సంభాషణల్లో భాగంగా మతపరమైన దాడుల గురించి ప్రస్తావన వస్తే మంచిదే! అయితే ఇది జరుగుతుందా లేదా అన్నది సందేహాస్పదమే! ఈ చర్చలకు స్పందిస్తూ ఆసియాపసిఫిక్‌ వ్యవహారాల మంత్రి మార్క్‌ ఫీల్డ్‌, మోదీతో జరిగే సమావేశంలో భాగంగా ‘‘పార్లమెంట్‌ స్వరాన్ని వినిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని’’ చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో ‘‘దౌత్యాన్ని ఒకోసారి బహిరంగంగా కాకుండా, నాలుగు గోడల మధ్య నెరపాల్సి ఉంటుందని’’ తన సహచరులకు గుర్తుచేశారు. 2015లో మోదీకి ఆయన ప్రభుత్వం నుంచి లభించిన స్వాగతాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే, నాలుగు గోడల మధ్య దౌత్యం అనే సాకుతో... మరీ ఎక్కువగా ఆశించవద్దంటూ పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు పరిభాషలోనే చెప్పినట్లు లెక్క. బ్రెక్సిట్‌ పరిమాణాల తర్వాత, ఆసియా దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకునేందుకు బ్రిటన్‌ ఉవ్విళ్లూరుతోంది. వాణిజ్యం, వ్యాపార ఒప్పందాలని చర్చించేందుకు... మోదీ, బ్రిటన్‌ ప్రధాని తెరెసా మే మధ్య ద్వైపాక్ష సమావేశాలను ఏర్పాటుచేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. భారతదేశంలో ఓ ప్రాంతీయ వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మత విద్వేషం వంటి ఇబ్బందికరమైన అంశాలను లేవనెత్తి, బ్రిటన్‌ను సందర్శించే భారతీయ ప్రధానిని చికాకుపరిచే సాహసం చేయకపోవచ్చు.

 భారతదేశంలో అల్పసంఖ్యాకులైన క్రైస్తవ, సిక్కు మతస్థుల మీద అణచివేత ఉందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. 2008లో జరిగిన కందమల్ హింసాత్మక సంఘటనల్లో బాధితులైన క్రైస్తవులకు ఇంకా న్యాయం దక్కలేదు. 1984లో సిక్కు వ్యతిరేక దాడులలో బాధితులైనవారిదీ ఇదే కథ. కానీ బ్రటిష్‌ పార్లమెంటులో జరిగినట్లుగా... సామ్రాజ్యవాద దృక్కోణంతో, మతపరమైన అణచివేతల గురించి చేసే విమర్శలు చాలా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. వర్తమాన భారతదేశంలో ముస్లిం ప్రజలు ఎదుర్కొన్న భయానక అనుభవాల చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని అవి బలపరుస్తున్నాయి. మతపరమైన హింసలో ఇమిడి ఉండే అనేక సూక్ష్మాంశాలను కూడా విస్మరిస్తున్నాయి. భారతదేశంలోని క్రైస్తవులు కేవలం వారు బైబిల్ చదువుతారనే కారణంతోనే అణచివేతకు గురికావడం లేదు. పెట్టుబడిదారులు అర్రులుచాచే భూములు, ఇతర వనరుల మీద ఆధారపడి జీవించే దళిత, ఆదివాసీ వర్గాలకు చెందడం వల్ల కూడా వారు పీడనకు గురవుతున్నారు. ప్రపంచంలో అణగారిన వర్గాల (అల్పసంఖ్యాక మతస్థుల సహా) మీద ఆధిపత్యాన్ని చూపిస్తున్నవారిలో... పెట్టుబడిదారీ సమాజాన్ని కోరుకునే నయా సామ్రాజ్యవాదులు కూడా ఉన్నారు. కాబట్టి సామ్రాజ్యవాద ధోరణిని విడనంతవరకు, మతపరమైన అణచివేతల గురించి నిష్పాక్షికంగా చర్చించడం సాధ్యం కాదు!

Back to Top