ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

దళితుల సమైక్యతపై కన్నెర్ర

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మహారాష్ట్రలోని పుణే జిల్లాలోని భీమా కోరేగావ్ లో జనవరి ఒకటవ తేదీన కోరేగావ్ పోరాటం ద్విశతవార్షికోత్సవం సందర్భంగా దళితుల మీద ఒక పద్ధతి ప్రకారం దాడులు జరిగాయి. ఈ దాడులు చెదురుమదురుగా జరిగినట్టు కనిపించొచ్చు కాని వాటి వెనక ఒక పథకం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఈ దాడులకు నిరసనగా మహారాష్ట్ర అంతటా దళితులు తీవ్ర నిరసనకు దిగారు. బీమా కోరేగావ్ ఉత్సవాలు హిందుత్వ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు చిహ్నంగా నిలిచాయి. ఈ ఉత్సవాలకు దళిత, మైనారిటీ వర్గాల వారు నాయకత్వం వహించారు. వీరు మితవాద శక్తులను ఎదిరించే వారిగా తయారయ్యారు.

భీమా కోరేగావ్ లో 1818లో బ్రిటిష్ సైన్యానికి, పీష్వా పాలకులకు మధ్య జరిగిన యుద్ధం దళిత చరిత్రలో ఒక మైలు రాయిగా పరిగణిస్తారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనలు విజయం సాధించాయి. ఈ పోరాటంలో పాల్గొన్న దళాలలొ మహార్ బటాలియన్ కీలక పాత్ర పోషించింది. యుద్ధంలో విజయం బ్రాహ్మణులైన పీష్వాల పాలనకు చరమ గీతం పాడింది. అందువల్ల దళితులు ఇది తమ విజయంగా భావిస్తారు. డా. అంబేద్కర్ కూడా దీనిని దళితుల ధైర్య సాహసాలకు ప్రతీకగా భావించారు. ఇది అణగారిన వర్గాల విజయంగా భావించారు. ఆ తర్వాత ఇది అంబేద్కర్ వాదుల సంస్కృతిలో, అనేక ముఖ్య సంఘటనల్లో కీలకమైన మైలు రాయిగా పరిగణించడం మొదలైంది. అంబేద్కర్ వాద సంస్కృతిని సవర్ణ హిందూ సంస్కృతికి భిన్నమైందిగా భావిస్తారు. అంబేద్కర్ మరణించిన డిసెంబర్ ఆరో తేదీన ముంబై లోని చైత్యభూమి వద్ద భారీ సంఖ్య్లో హాజరై దళితులు అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తారు. అలాగే అంబేద్కర్ మనుస్మృతిని దగ్ధం చేసిన డిసెంబర్ 25న దళితులు భారతీయ స్త్రీ ముక్తి దివసంగా పాటిస్తారు. ప్రధానంగా దళిత-బహుజన స్త్రీవాద దళితులు ఈ దివసాన్ని పాటిస్తారు. అలాగే కోరేగావ్ పోరాటంలో విజయం సాధించిన జనవరి ఒకటో తేదీని కూడా పుణే లోని కోరేగావ్ లో వేలాది మంది దళితులు గుమి కూడి విజయోత్సవం జరుపుకుంటారు. జనవరి మూడవ తేదీ సావిత్రీ బాయి ఫూలే జన్మ దినం. ఆ రోజును దళితులు ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తారు. అలాగే అంబేద్కర్ సారధ్యంలో రూపొందిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26ని కూడా దళితులు ముఖ్యమైన దినంగా పాటిస్తారు. ఈ దినోత్సవాలను పాటించడం దళితుల చైతన్యానికి, అంబేద్కర్ వాదుల అస్తిత్వానికి ప్రతీకగా మారిపోయింది.

కాని ఈ సంవత్సరం కోరేగావ్ దినోత్సవం హిందుత్వ వాద రాజకీయాలకు ప్రతిఘటనగా నిలిచింది. అంబేద్కర్ మనవడు, భారిప బహుజన మహాసంఘ్ పార్టీ నాయకుడు ప్రకాశ్ అంబేద్కర్ భీమా కోరేగావ్ శౌర్య దిన ప్రేరణ అభియాన్ గా పాటించాలని సంకల్పించారు. 2017 డిసెంబర్ 31న ఎల్గార్ పరిషద్ మహాసభలో ఈ విషయం ప్రకటించారు. అంటే భీమా కోరేగావ్ విజయోత్సవానికి ఒక రోజు ముందు ఈ విషయం చెప్పారు. పుణే నగరంలోని శనివార్ వాడలో మునుపటి పేష్వాల రాజభవనం ఈ విజయోత్సవాలకు వేదిక అయింది. "నయా పేష్వాలకు (నయా ఫాసిస్టులకు) వ్యతిరేకంగా గొంతెత్తండి" ప్రధాన నినాదంగా తయారైంది. ఈ ఉత్సవాల ప్రధాన ఇతివృత్తం ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ వర్గంపై రాజకీయ దాడి. ఈ సమావేశంలో ప్రకాశ్ అంబేద్కర్, గుజరాత్ దళిత నాయకుడు, ఇటీవల శాసనసభ్యుడిగా ఎన్నికైన జిగ్నేశ్ మేవాని, సామాజిక కార్యకర్తలు సోనీ సోరి (ఛత్తీస్ గఢ్), ఉల్కా మహాజన్ (మహారాష్ట్ర), రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, విద్యార్థి నాయకులు దొంత ప్రశాంత్, ఉమర్ ఖాలిద్ ప్రసంగించారు. ఈ ఉపన్యాసకులందరూ హిందుత్వ సిద్ధాంతాన్ని, అధికారంలో ఉన్న బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే వారే. కోరేగావ్ ఉత్సవాలలో ఈ అగ్రవర్ణ వ్యతిరేకతే సవర్ణులకు ఆగ్రహం కలిగించింది. దళితుల మీద ఈ దాడులు డిసెంబర్ 31 న, జనవరి ఒకటవ తేదీన జరిగాయి. ఈ దాడి ప్రధానంగా ఉత్సవాలలో పాల్గొన్న వ్యక్తులు, బృందాలు, ఆస్తుల మీద కేంద్రీకృతమైనాయి. దాడిలో ఒకరు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అనేక కార్లు ధ్వంసమైనాయి.

ఎల్గార్ పరిషద్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడమే పుణే లో అధిక సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులకు కోపకారణం అయింది. ఈ బ్రాహ్మణులు తర్వాత ఒత్తిడికి లోనై భీమా కోరేగావ్ చరిత్ర గురించి చర్చిద్దాం రండి అని పిలుపు ఇచ్చారు. 2017లో మేధ ఖోలే అనే శాస్త్రవేత్త తన పని మనిషి తన అసలు కులం ఏమిటో తెలియజేయలేదని, తద్వారా తమ ఇంటి స్వచ్ఛతకు భంగం కలిగించిందని ఆరోపిస్తూ కేసు దాఖలు చేయడం కూడా దళితులకు, బ్రాహ్మణులకు మధ్య ఉద్రిక్తతకు కారణం అయింది. కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి.) కూటమి కొనసాగించిన బ్రాహ్మణేతర-మరాఠా రాజకీయాలను చిత్తు చేసిన బీజేపీ బ్రాహ్మణ-ఇతర వెనుకబడిన వర్గాల రాజకీయాలను ముందుకు తెచ్చింది. శివ ప్రతిష్ఠాన్ నాయకుడు శంభాజీ భీడే, హిందూ ఏక్తా మంచ్ కు చెందిన మిళింద్ ఎక్బోటే దళితుల మీద దాడిలో ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరికీ ప్రస్తుతం మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దౌర్జన్యానికి, మతోద్రేకాలను రెచ్చగొట్టడానికి, ముఖ్యంగా దళితుల మీద దాడి చేయడానికి సంబంధించి వీరి మీద అనేక కేసులు కూడా ఉన్నాయి.

దళిత నిరసన పెల్లుబకడంతో బీజేపీ ఆచి తూచి ప్రవర్తిస్తోందంటున్నారు. మహారాష్ట్రలో దళితులు పది శాతం మాత్రమే. కాని వారు అత్యంత సంఘటిత శక్తిగా ఉన్నారు. వారి మధ్య సంబంధాలు పటిష్ఠంగా ఉన్నాయి. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని వ్యవహరించే హిందు అతివాదులని బీజేపీ అదుపు చేయలేకపోతోంది. గత రెండేళ్ల కాలంలో బీజేపీ దళిత వ్యతిరేక మరాఠాలను సమీకరించడం మీద ఆధారపడింది. తద్వార విశాల ప్రాతిపదికన హిందువులను సమీకరించాలని అనుకుంది. రాజకీయ ఆర్థిక వ్యవస్థపై మరాఠాలకు ఆధిపత్యం ఉండడం, సాంస్కృతిక రంగంలో బ్రాహ్మణులకు పట్టు ఉండడం వల్ల దళితులు వ్యూహాత్మకంగా తమకు అండగా ఉండే వారు ఎవరో తేల్చుకోవాల్సి వచ్చింది. నితిన్ ఆగే, కోర్ది కేసుల్లో, పద్మావతి సినిమాపై రాజపుత్రుల నిరసనలు, భీమా కోరేగావ్ లో దళితుల నిరసనలు కుల వివక్ష న్యాయవ్యవస్థలోనూ, వీధుల్లోనూ వ్యక్తమవుతున్న వాస్తవం దళితులకు అనుభవంలోకి వస్తోంది. అయితే నయా పీష్వాలు అన్న అంశం ఆధారంగా హిందుత్వ శక్తుల మీద వ్యతిరేకత హిందూ మితవాదుల సాంస్కృతిక, రాజకీయ అవకాశాలను దెబ్బ తీస్తున్నాయి. ఘర్షణలకు మూలం ఇదే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top