ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ముస్లింలను చేల్చే తలాఖ్ బిల్లు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

పురుషుల తోడు లేకుండానే ముస్లిం మహిళలు ఇక హజ్ యాత్రకు వెళ్లొచ్చునని నూతన సంవత్సరాగమనానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వం దీనికి హామీ ఇస్తుందని చెప్పారు. ఇది వాస్తవన్ని అందంగా కప్పి పుచ్చే ప్రయత్నమే. లేదా నిఖార్సైన అబద్ధం. నిజానికి సౌదీ అరేబియా ప్రభుత్వం 2015లో హజ్ యాత్ర చేసే మహిళల విషయంలో నిబంధనలను మార్చింది. 45 ఏళ్ల వయసుకన్నా ఎక్కువ ఉన్న మహిళలు నలుగురు అంతకన్నా ఎక్కువ మంది ఒక బృందంగా ఏర్పడితే పురుషులు వెంట లేకపోయినా హజ్ యాత్ర చేయవచ్చునని సౌదీ ప్రభుత్వం చెప్పింది. ఏ దేశం కూడా మరో దేశంలో ప్రవేశించడానికి అవసరమైన నిబంధనలను మార్చలేదు. హజ్ యాత్ర విషయంలో నిబంధనలు మార్చే అధికారం సౌదీ అరేబియాకు మాత్రమే ఉంటుంది. ఈ విషయానికి సంబంధించిన కట్టు కథలు ఎలా ఉన్నప్పటికీ మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గో సంరక్షణ పేరిట ముస్లింలు ఎదుర్కుంటున్న సమస్యలపై ప్రధాని, బీజేపీ మౌనంగా ఉండడానికి కారణం ఏమిటి? కాని ఇటీవలి కాలంలో మోదీ ముస్లిం మహిళల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు.

ఒకే విడత మూడు సార్లు తలాఖ్ అని మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ 2017 నాటి ముస్లిం మహిళల (పెళ్లి హక్కుల పరిరక్షణ) బిల్లును లోక సభలో చర్చ లేకుండానే ఆమోదింప చేయడం మోదీ చూపుతున్న ఈ శ్రద్ధకే తార్కాణం. మరి అంత శ్రద్ధే ఉన్నట్టయితే ఒక వర్గానికి చెందిన ముస్లింలు ఇలా ఒకే తడవ మూడు సార్లు తలాఖ్ అని విడాకులు ఇచ్చే వారిని ఈ బిల్లు రూపొందించేటప్పుడు ఎందుకు సంప్రదించలేదు? ఈ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించడానికి ముందు ఈ పద్దతిలో విడాకులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు విచారిస్తున్న సమయంలోనే ఒక వర్గం ఈ బిల్లుపై విస్తృత చర్చకు వీలు కల్పించాలని కోరింది. ముమ్మారు తలాఖ ను నేరంగా పరిగణించకూడదని ఈ వర్గం కోరింది. ఇంతకు ముందు మహిళలకు సంబంధించిన చట్టాలు రూపొందించేటప్పుడు విస్తృత చర్చలు జరిగాయని ఆ వర్గం గుర్తు చేసింది. "పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య సివిల్ కాంట్రాక్టు అయినప్పుదు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కూడా సివిల్ వ్యవహారమే కావాలి. అది మహిళలను బలోపేతం చేసేది అయి ఉండాలి. బాధలకు గురిచేసేది కాకూడదు" అని ఈ వర్గం విజ్ఞప్తి చేసింది.

ఈ పరిస్థితిలో సుప్రీంకోర్టు ఆగస్టులో ముమ్మారు తలాఖ్ పద్ధతి చెల్లదని తీర్పు చెప్పినప్పుడు హడావుడిగా ఈ బిల్లు తీసుకు రావలసిన అవసరం ఏమొచ్చింది? ఈ కేసును విచారించిన న్యాయమూర్తుల్లో మైనారిటీ తీర్పు చెప్పిన ఇద్దరు న్యాయమూర్తులు చట్టం చేయాలని చెప్పారు. మెజారిటీ తీర్పు చెప్పిన ముగ్గురు న్యాయమూర్తులు ఆ మాట చెప్పలేదు. ఇంతకీ సివిల్ వ్యవహారంలో నేరంగా పరిగణించే చట్టం అవసరం ఏముంది? సివిల్ పరిష్కారాలు ఏమీ సాధ్యం కావా? అలాంటి అవకాశాలను ఎందుకు అన్వేషించలేదు?

దీన్ని బట్టి ప్రభుత్వం హడావుడిగా బిల్లు తీసుకు రావడం ముస్లిం మహిళ సంక్షేమం కోసం కాదని, ఇందులో రాజకీయాలు ఉన్నాయని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. నేరుగా ముస్లిం మహిళలను ఆకట్టుకునేట్టు ప్రవర్తించడం బీజేపీకి ప్రయోజనకరం. ఆ రకంగా ముస్లింలను విడగొట్టవచ్చు. ముమ్మారు తలాఖ్ పద్ధతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న ముస్లిం మహిళల అభ్యర్థనను పెడచెవిన పెట్టిన ముస్లిం మత పెద్దలు ఈ బిల్లును వ్యతిరేకించారు. అది ఊహించిందే. ఇప్పుడు ఒక వైపున విడాకుల పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సిన ముస్లిం మహిళలు ఉంటే మరో వేపున ముస్లిం మహిళల సంక్షేమం మీద ఏ శ్రద్ధా లేకపోయినా ఒక అంశంలో బిల్లు తీసుకొచ్చామని చెప్పే రాజకీయ పార్టీ మరో వేపున ఉంది.

ఈ రాజకీయ ఎత్తుగడ పారినట్టు రుజువు అవుతూనే ఉంది. ముమ్మారు తలాఖ్ ను నేరంగా పరిగణించే బిల్లును ఏ రాజకీయ పార్టీ కూడా గట్టిగా వ్యతిరేకించలేదు. అయితే కాంగ్రెస్ తో సహా ఏ రాజకీయ పార్టీకూడా ముస్లిం మహిళలకు వ్యతిరేకమైంది, ముస్లిం పురుషులకు అనుకూలమైందీ కాదు. పురుషుల నుంచి ముస్లిం మహిళలను కాపాడుతున్నాం అని చెప్తున్నప్పుడు వ్యతిరేకించడానికి ఏమీ మిగలదు. ఈ వికృత విడాకుల పద్ధతిని అనుసరిస్తున్న మతాన్ని రాక్షసి లాగా చిత్రించడం బీజేపీకి అనుకూలమైన అంశమే.

ఈ అంశాన్ని మొదట లేవనెత్తింది ముస్లిం మహిళలే తప్ప ఈ ప్రభుత్వం కాదు అన్న విషయాన్ని వాటంగా విస్మరిస్తున్నారు. భారత పౌరులుగా తమకు ప్రాథమిక హక్కులు హరించడానికి వ్యతిరేకంగా ముస్లిం మహిళలు కోర్టుకెక్కారు. విజయం సాధించారు. కాని వారు దీన్ని నేరంగా పరిగణించాలని కోరలేదు. ఇప్పుడు కోర్టుకెక్కిన వారు సందిగ్ధంలో పడ్డారు. ఒక వేపున అన్యాయమైన విడాకుల పద్ధతికి వ్యతిరేకంగా చట్టం ఉండడం వారికి సంతోషకరమే. మరో వేపున ఈ చట్టంలో చాలా లొసుగులున్నాయని వారికి తెలియాలి. ఈ చట్టం భరణానికి సంబంధించింది కాదు. ఈ చట్టం వల్ల ముమ్మారు తలాఖ్ చెప్పిన తర్వాత ఏ రకంగానూ రాజీకి అవకాశం కల్పించడం లేదు. ఎందుకంటే అలా తలాఖ్ చెప్పిన వ్యక్తిని జైలుకు పంపిస్తారు. ఇది మహిళలకే వ్యతిరేకంగా పరిగణించవచ్చు. విడాకులిచ్చిన ముస్లిం పురుషులపై భార్యే కాకుండా మరెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు మీద కూడా పోలీసులు చర్య తీసుకోవచ్చు. చాలా మంది న్యాయకోవిదులు చెప్పినట్టు పురుషులు లాంఛనప్రాయంగా తలాఖ్ అని చెప్పకుండానే భార్యలను వదిలివేయొచ్చు.

ఈ మొత్తం వ్యవహారం చలా చిరాకుగా ఉంది. ముస్లింల సంక్షేమం మీద ఏ మాత్రం దృష్టి లేని పార్టీ, తమ ఎన్నికల క్రమంలో వారిని పూర్తిగా విస్మరించిన పార్టీ, విద్వేషాన్ని రెచ్చగొట్టడం మానని పార్టీ మేం ముస్లిం మహిళలకోసం పాటు పడతామని చెప్పుకోవడం విచిత్రమే. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top