ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఉదాసీనతకు భారీ మూల్యం

.

భారత నగరాల్లో భవనాలు కూలిపోవడం, అగ్నిప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడల్లా విపరీతమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇవన్నీ పూర్వానుభవల్లాగే కనిపిస్తాయి. చాలా మంది వీటిని వెంటనే మరిచిపోతారు. ఈ ప్రమాదాలు జరిగినప్పుడల్లా సాధారణంగా ఒకే ధోరణి కనిపిస్తుంది. భద్రతా నియమాలను ఉల్లంఘిస్తారు. అధికారులు తక్షణం చర్య తీసుకుంటామని హామీ ఇస్తుంటారు. సానుభూతి వ్యక్తం చేసే వారూ ఉంటారు. డెసెంబర్ 2017లో ముంబైలో రెండు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. 29వ తేదీన ఒక విలాసవంతమైన పబ్ లో అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు. 18వ తేదీన ముంబై పొలిమేరల్లోని ఒక చిరుతిండ్లు తయారు చేసే విభాగంలో జరిగిన మరో అగ్నిప్రమాదంలో 12 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా ఇదివరకు వ్యక్తమైన అభిప్రాయాలే వ్యక్తమైనాయి. నగరమంతటా చట్ట విర్దుద్ధమైన నిర్మాణాలను కూల్చి వేసే ప్రయత్నం జరిగింది. ఈ రెండు సంఘటనలతో పాటు 2017 సెప్టెంబర్ లో ఒక రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 22 మంది మరణించినప్పుడూ పౌరులు, అధికారులూ పాత పద్ధతిలోనే స్పందించారు. దేశమంతటా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. పట్టణ ప్రణాళిక అధ్వానంగా ఉంటుంది. ఇందులో ప్రజల పాత్ర ఉండదు. అందువల్ల పరిస్థితి మారదు అన్న నిర్వేదం వ్యక్తం అవుతుంది.

భారత వాణిజ్య పారిశ్రామిక మండలి 2017లో భారత్ లో ఎదురవుతున్న ముప్పు గురించి ఓ సర్వే నిర్వహించింది. వ్యాపార దృష్టితో 12 రకాల ముప్పులున్నట్టు ఈ సర్వేలో తేలింది. ఈ ముప్పుల జాబితాలో అగ్నిప్రమాదాలు అయిదవ స్థానంలో ఉన్నాయి. 2016 తో పోలిస్తే అగ్ని ప్రమాదాల సంఖ్య మూడు స్థానాలు పైకి ఎగబాకింది. జాతీయ నేరాల బ్యూరో లెక్కల ప్రకారం 2017లో మొత్తం 18,450 అగ్నిప్రమాదాలలో 17,700 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదాల్లో మరణించిన వారిలో 42.1 శాతం మంది ఇళ్లల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లోనే మృతి చెందారు. మహారాష్ట్రలో మిగతా చోట్ల కన్నా ఎక్కువగా ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు 22 శాతం ఉన్నాయి. అవినీతి, లంచగొండి తనం, కార్పొరేట్ మోసాలు ముప్పుల్లో మూడో స్థానంలో ఉన్నాయని నేరాల నమోదు సంస్థ వెల్లడించింది. పరిస్థితి ఎంత మారుతూ ఉన్నా అంతే మారకుండా ఉంటుంది.

మునిసిపల్ అధికారులు, ప్రభుత్వం తాము తీసుకున్న చర్య గురించి చెప్తుంటాయి. అంతకు ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు కాదని అంటుంటాయి. కాని ఈ సంఘటనల నుంచి నేర్చుకునే గుణపాఠాలు ఏమీ లేవు. ప్రజల ఆగ్రహంలో కూడా పెద్ద మార్పు లేదు. 2015లో ఎనిమిది మంది కళాశాల విద్యార్థులు ఒక హోటల్లో భోజనం చేస్తుండగా కాలి బూడిదై పోయారు. ఈ హోటల్ అక్రంమంగా లోపల అనేక మార్పులు చేసింది. గ్యాస్ సిలిండర్లను అజాగ్రత్తగా నిలవ చేసింది. 1997లో ఉపహార్ సినిమా హాలులో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది మరణించారు. ఆ సినిమా హాలులో కూడా ఇష్టానుసారం మార్పులు చేశారు. కోల్ కతాలోని ఎ.ఎం.ఆర్.ఐ. ఆసుపత్రిలో 2011 లో జరిగిన ప్రమాదంలో 89 మంది మృతి చెందారు. ఇవన్నీ జనం జ్ఞాపకాల పుటల్లో మిగిలిపోయాయి. కాని భద్రతా నియమాలను పాటించే విషయంలో ఏ మాత్రం మార్పు లేదు. అనేక తినుబండార శాలల్లో, హోటళ్లలో, పబ్బుల్లో, సినిమా హాళ్లలో, ఆసుపత్రుల్లో, చిన్న పరిశ్రమల్లో, షెడ్లలో, ఫ్యాక్టరీలలో, నివాస భవనాల్లో దేశంలోని అన్ని పట్టణాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. నిబంధనలను అమలు చేయడానికి ఏ మాత్రం ప్రయత్నించినా భవన నిర్మాతలు, వ్యాపారులు తమను వేధిస్తున్నారని యాగీ చేస్తారు. తినుబండారాలు తయారు చేసే విభాగంలో గ్యాస్ సిలిండర్లను, ఇతర ప్రజ్వలన పదార్థాలను అస్తవ్యస్తంగా నిలవ చేశారు. అక్కడే అటకల మీద కార్మికులు పడుకుంటారు. ఈ కార్మికుల్లో ఎక్కువ మంది వలస వచ్చిన వారే.

తినుబండారాలు తయారు చేసే విభాగం అవసరమైన ఏ నిబంధనలూ తీసుకోలేదని మునిసిపల్ అధికారులు అంటున్నారు. కమలా మిల్స్ ఆవరణలో అక్రమ నిర్మాణాల గురించి అధికారులకు ఇంతకు ముందే తెలియజేశామని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు. అక్కడ విలాసవంతమైన భోజనశాలలు, పబ్బులు ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన పబ్ ను పదిహేను రోజులపాటు మూసి వేసి మళ్లీ తెరిచారు. కాని దీని మీద ఏ చర్యా తీసుకోలేదు. ముంబైలో అక్రమ నిర్మాణాలు, మిల్లు ఆవరణలో వ్యాపారాలు, నివాస భవనాలు చాలా వెలిశాయి. దీనికి రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉంది. ఇతర పట్టణాల్లో, నగరాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల చిన్నా పెద్దా వ్యాపార వాణిజ్య సంస్థలు, నివాస భవనాలు అక్రమంగా వెలుస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు అవినీతిపరుల, స్వార్థపర శక్తుల రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. సమస్య చట్టాలు లేక కాదు. వాటిని నిష్పక్షపాతంగా, కచ్చితంగా అమలు చేయకపోవడమే సమస్య.

సమాజంలోని వారిలో చైతన్యం ఉండడం, తమ పాత్ర నిర్వహించడం అవసరం. అనేక నివాస భవనాల్లో, పారిశ్రామిక సంస్థలలో అక్రమ నిర్మాణాలు, సంస్థలు ఉన్న చోట నివాసితుల సంఘాలు కూడా ఉంటాయి. అవే రోజువారీ వ్యవహారాలు చూస్తుంటాయి. భద్రత గురించి ఈ సంస్థలను సంప్రదించడం ముందు చేయాల్సిన పని. భద్రతా నియమాలను గౌరవించాలి. విషాదం ఏమిటంటే అన్ని వర్గాల వారు వీటిని ఖాతరు చేయరు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు నిబంధనలను అమలు చేసేట్టు చూడడం అంతకన్నా ఎక్కువ అవసరం. దీనికోసం పౌర సమాజం ముందుకొచ్చి ఆందోళన చేయాలి. ఉదాసీనంగా ఉండడం, పట్టించుకోకుండా ఉంటె భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top