ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఉత్తర కొరియా సంక్షోభం అమెరికా చలవే

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాధారణంగా సంయమంతో, నిగ్రహంతో వ్యవహరించరు. ఆయన అధ్యక్షుడైన తర్వాత ఆసియాలో మొట్ట మొదట పర్యటించిన దేశం జపాన్. అక్కడ జపాన్ ప్రధానమంత్రి శింజో అబేతో గోల్ఫ్ ఆడారు. జపాన్ ప్రధాన మంత్రి అబే తమ రాజ్యాంగంలోని తొమ్మిదవ అధికరణాన్ని తొలగించాలని చూస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా వివాదాలను పరిష్కరించడానికి యుద్ధమే చేయనక్కర్లేదని చెప్తుంది. ఇదే అదునుగా జపాన్ కు భారీగా ఆయుధాల ఎగుమతికి ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నించారు.

మొదట క్షిపణులు విక్రయించాలని అనుకున్నారు. రెండు దేశాల అధినేతలు గోల్ఫ్ ఆడిన తర్వాత సహజంగానే చర్చ ఉత్తర కొరియా వ్యవహారం మీదకు మళ్లింది. ఆ విషయంపై ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన అబే ఉత్తర కొరియా విషయంలో అమెరికాతో తాము నూటికి నూరుపాళ్లు ఏకీభవిస్తున్నామని చెప్పారు. ట్రంప్ ఎప్పటిలాగే ఉత్తర కొరియామీద చర్య తీసుకోవడానికి సకల అవకాశాలను, పద్ధతులను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ మాట ఆయన పదేపదే ఉద్ఘాటించడం అందరికీ తెలిసిందే. యుద్ధానికి వెనుకాడమని, అవసరమైతే అణ్వస్త్రాలూ ప్రయోగిస్తామని సెలవిచ్చారు.

ఆ తర్వాత ట్రంప్ ఉత్తర కొరియా వెళ్లి ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ ఉత్తర కొరియాను తీవ్రంగా ఖండించారు. రెచ్చగొట్టారు. ఉత్తర కొరియా విషయంలో అమెరికా ఇలా వ్యవహరించడం కొత్త కాదు. 1945 సెప్టెంబర్ నుంచీ అమెరికా విదేశాంగ విధానంలో ఇదే కనిపిస్తుంది. దక్షిణ కొరియాలో అమెరికా సేనలు దిగినప్పటి నుంచీ ఇదే వరస. అంతకన్నా ఒక నెల ముందు అంటే 1945 ఆగస్టులో రష్యా ఎర్ర సైన్యం కొరియాలో ప్రవేశించి ఆగస్టు మధ్య నాటికి జపాన్ లొంగిపోయేట్టు చేసింది. కానీ ఏదో కారణంవల్ల సోవియట్ యూనియన్ తన మిత్ర రాజ్యం అభ్యర్థనను అంగీకరించి తన బలగాలను 38వ అక్షాంశ రేఖ దగ్గర అంటే ప్రస్తుతం ఉభయ కొరియాల సరిహద్దు రేఖ వద్ద ఆపేసింది.

సెప్టెంబర్ లో అమెరికా సేనలు కొరియాలో దిగక ముందు కొరియా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా ప్రకటించుకుంది. అప్పుడు అధికారాన్ని వికేంద్రీకరించి “ప్రజా కమిటీలకు” పరిపాలనా బాధ్యత అప్పగించారు. చాలా మంది కొరియా ప్రజలు దీనికి ఆమోదం తెలియజేశారు. ఉత్తరాన ఉన్న సోవియట్ సేనలు కూడా ఈ ఏర్పాటును ఒప్పుకున్నాయి.

కాని కొరియా చేరిన అమెరికా దళాలు కొరియాలోని మితవాద భావాలుగల వారితో కుమ్మకై భిన్నమైన కుటిల ఆలోచనలు చేశాయి. కొరియా దక్షిణ ప్రాంతంలో ప్రజా కమిటీలను రద్దు చేసి శాశ్వతంగా ఆ దేశాన్ని విడగొట్టాయి. జపాన్ లొంగి పోయి ఐక్య రాజ్య సమితి అధ్వర్యంలో 1950లో జరిగిన పూర్తి స్థాయి ఉద్యమంలో లక్ష మంది దక్షిణ ప్రాంతంలో మరణించారు. అందువల్ల కొరియా యుద్ధం 1945లోనే మొదలైనట్టు.

అమెరికా జోక్యం వల్ల అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. 1950 నుంచి 1953 దాకా కొనసాగిన యుద్ధం మరో రకంగా కొనసాగిన యుద్ధం కిందే లెక్క. ఆ యుద్ధంలో అమెరికా నాపాం బాంబులు కూడా వాడింది. 1953లో సంధి కుదరడం వల్ల యుద్ధం ఆగింది. కాని శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు. అందువల్ల అమెరికాకు, ఉత్తర కొరియాకు ఏదో ఒక రకంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.

ఉత్తర కొరియాను అమెరికా “దుష్టశక్తి” గానే పరిగణిస్తోంది. 1970లలో చైనా అమెరికాతో సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత, 1990 నాటికి సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధానికి స్వస్తి చెప్పినందువల్ల ఉత్తర కొరియాకు అణ్వస్త్ర రక్షణ లేకుండా పోయింది. అందువల్ల తాను సొంతంగా అణ్వస్త్రాలు సమకూర్చుకోవాలని నిర్ణయించుకోక తప్పలేదు. అణ్వస్త్రాలు సమకూర్చుకోవడంతో పాటు జపాన్ తో సంబంధాలు మెరుగుపరచుకుంది. దాని ఫలితంగా 2002 నాటి పోంగ్యాంగ్ ప్రకటన వెలువడింది. అమెరికా అంతకు ముందే ఇరాక్, ఇరాన్ తో పాటు ఉత్తర కొరియాను “దుష్ట కూటమి”గా ప్రకటించింది. అసలు ఉత్తర కొరియా అస్తిత్వాన్నే సవాలు చేసింది.

ఉత్తర కొరియా యురేనియం శుద్ధి చేసే సామర్థ్యం సంపాదించుకున్న తర్వాత 2006 సెప్టెంబర్ నాటికి జపాన్ కు ఆ దేశంతో సంబంధాలు చెడగొట్టి ఉత్తర కొరియా మీద కసి తీర్చుకోవడానికి జపాన్ సహకారం సంపాదించింది. ఆ తర్వాత 2006 అక్టోబర్ లో ఉత్తర కొరియా భూగర్భంలో అణ్వస్త్ర పరీక్ష చేసింది. 2016 జనవరి నాటికి నాల్గవ సారి అణ్వస్త్ర పరీక్ష చేసింది. సుదూర ప్రాంతాలకు ప్రయోగించగలిగే బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడం మీద దృష్టి కేంద్రీకరించింది. 2017 నాటికి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

ఐక్య రాజ్య సమితి అనేక ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని కూడా ట్రంప్ ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదిక మీంచే బెదిరించారు. అమెరికా-దక్షిణ కొరియా కలిసి జపాన్ సమకూర్చిన సైనిక స్థావరాలను వినియోగించుకుని ఉమ్మడి సైనిక విన్యాసాలు చేశాయి. ఇది ఉత్తర కొరియాను నాశనం చేయడంలో భాగం. అయినా ఉత్తర కొరియా బెసకలేదు. ఉత్తర కొరియా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నందువల్లే మనగలిగే హక్కును కాపాడుకోగలిగింది. కొరియా ద్వీపకల్పానికి సంబంధించి ఐక్య రాజ్య సమితి అనేక సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంది.

కొరియాపై అమెరికా, దక్షిణ కొరియా సమితి పతాకం కింద యుద్ధానికి దిగినందుకు సమాధానం చెప్పవలసి ఉంది. 2005-2010 మధ్య దక్షిణ కొరియా వాస్తవం, సమన్వయ కమిషన్ ఈ విషయాన్ని అంగీకరించింది కూడా. గత ఏడు దశాబ్దాల నుంచి అణ్వస్త్రాల సాకుతో ఉత్తర కొరియాను వేధిస్తున్నందుకు సైతం అమెరికా జవాబు చెప్పవలసి ఉంది. 38వ అక్షాంశానికి రెండు వైపులా పురోగమన రాజకీయాలు కొనసాగక పోవడానికి, ఉభయ కొరియాల మధ్య సయోధ్య లేకపోవడానికి, కొరియా దేశస్థులు నిర్ణయించినట్టుగా పునరేకీకరణకు కూడా అమెరికా సామ్రాజ్యవాదమే కారణం.

 

Back to Top