ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మూలుగలు పీల్చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

డెంగీ జ్వరానికి 22 రోజులు చికిత్స చేసినందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆసుపత్రి 16 లక్షల రూపాయలు వసూలు చేస్తే మరో ప్రైవేటు ఆసుపత్రి 15.6 లక్షలు వసూలు చేసింది. ఈ రెండు బాగా పేరున్న ప్రైవేటు ఆసుపత్రులే. వీటికి అనేక శాకలున్నాయి. దీన్నిబట్టి మన దేశంలో ఆరోగ్య సేవలు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం అవుతోంది. ఒక వేపున ప్రభుత్వ ఆరోగ్యసేవలు మృగ్యం అవుతూ ఉంటే మరో వేపున ప్రైవేటు ఆసుపత్రులు తామర తంపరగా పెరిగిపోతూ ఇష్టారీతిన దోచేస్తున్నాయి. ఆసుపత్రి పాలైతే దివాలా తీయడమే కాక ఆర్థికంగా కుదేలైపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇటీవల 2017 జాతీయ ఆరోగ్య స్థితిపై విడుదల చేసిన నివేదిక దశాబ్దాలుగా అంతర్జాతీయ, జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న విషయాలనే ధ్రువీకరించింది. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం వాస్తవంగా పేరగడం లేదు కాని ప్రైవేటు ఆసుపత్రుల వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. చికిత్స చేయించుకోవడానికి జనం జేబులోంచి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తోంది. దీని వల్ల ప్రజలు పేదరికంలో కూరుకుపోవాల్సి వస్తోంది. ఈ దారుణ పరిస్థితి గ్రామీణ ప్రాంతాలో మరీ ఎక్కువగా ఉంది. ప్రబుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య బీమా లేక పోవడం వల్ల ప్రజలు ఎలా పేదరికంలో కూరుకుపోతున్నారో పైన పేర్కొన్న రెండు ఉదంతాలూ తెలియజేస్తున్నాయి. పై రెండు సందర్భాలలోనూ అంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రాణం మాత్రం దక్కలేదు.

ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వనరులు లేకపోవడం వల్ల నిరుపేదలు సైతం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులలో వ్యయం కన్నా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చులు రెండు నుంచి తొమ్మిది రెట్లు ఎక్కువ అవుతున్నా గ్రామీణ ప్రాంతాలలో 61 శాతం మంది, పట్టణ ప్రాంతాలలో 69 శాతం మంది ప్రైవేటు వైద్యం మీదే ఆధారపడవలసి వస్తోంది. ఆసుపత్రిలో ఉండవలసి వస్తే గ్రామీణ ప్రాంతాలలోని వారిలో పాతిక శాతం మంది, పట్టణ ప్రాంతంలో 20 శాతం మంది అప్పులు చేయడమో, ఆస్తులు అమ్ముకోవడమో తప్పడం లేదు. చికిత్స కోసం 63 శాతం మంది జనం సొంతంగా ఆ ఖర్చు భరించవలసి వస్తోంది. తలసరి ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు అవుతోందో జాతీయ ఆరోగ్య ఖాతా వల్ల తెలుస్తుంది. ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరిరక్షణకు రూ. 3,826 ఖర్చు అవుతుండగా అందులో రూ. 2,934 సొంతంగా భరించవలసి వస్తోంది.

అయినప్పటికీ ప్రభుత్వం ఈ రంగంలో వైద్యం మీద ఖర్చు పెట్టడం మానేసి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించే మార్గం లేదు. ఆ ఆసుపత్రులకు బాధ్యతా లేదు. ఈ దుస్థితి ప్రభావం బాహాటంగా కనిపిస్తోంది. దిల్లీలో నెలలు నిండకుండా పుట్టిన ఒక శిశువు సజీవంగా ఉన్నా మరణించినట్టు ప్రకటించిన ఒక పెద్ద ఆసుపత్రి లేసెన్సు రద్దు చేశారు. ఈ విషయం తెలిసి ఆ పసికందుకు చికిత్స చేసినా వారం తర్వాత ప్రాణం పోయింది. ఈ పెద్ద ఆసుపత్రి లైసెన్సు అనాలోచితంగా రద్దు చేసినందువల్ల ఇతర రోగులు ఇబ్బంది పడవలసి వచ్చింది. తీవ్ర జబ్బులతో బాధపడుతున్న వారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి అనాలోచిత చర్య జనాకర్షణకు తప్ప ఎందుకూ పనికి రాదు.

కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు 2010 నాటి చికిత్సాలయాల (నియంత్రణ, నమోదు) చట్టాన్ని అమలు చేసి ఉంటే ప్రైవేటు ఆసుపత్రుల అవకతవకలు, దోపిడీ తగ్గి ఉండేవి. ఈ చట్టం అనైతిక వ్యవహారాలకు పాల్పడ్డ ప్రైవేటు ఆసుపత్రుల మీద చర్య తీసుకొవడానికి వీలు కల్పిస్తుంది. కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టం లాంటివే ఉన్నాయి. పది రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ చట్టం ఉంది. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితం. కేంద్ర ప్రభుత్వం గుండే చికిత్సకు వాడే స్టెంట్లను నియంత్రించడానికి ప్రయత్నించింది. కాని ప్రైవేటు ఆసుపత్రులు ఈ విషయంలో అడ్డ దార్లు తొక్కడంలో ప్రావీణ్యం సంపాదించాయి. చట్టంలో లొసుగులను వాటంగా వినియోగించుకుంటున్నాయి. స్టెంట్ల ధర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఖర్చు ఏమీ తగ్గలేదని రోగులు చెప్తున్నారు.

ప్రైవేటు ఆసుపత్రులు ఎంత శక్తిమంతమైనవో కర్నాటక ఉదంతం తెలియజేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు నిరసన వ్యక్తం చయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2017 నాటి కర్నాటక ప్రైవేటు వైద్యాలయాల (స్వరణ) బిల్లును నీరుగార్చింది. ఈ బిల్లును కర్నాటక శాసనసభ నవంబర్ లో ఆమోదించింది. ఇది చట్టం అయి ఉంటే రోగుల చికిత్సలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్లక్ష్యం వహించినా, ఇతర అవకతవకలకు పాల్పడినా చర్య తీసుకోవడానికి వీలుండేది. కాని ప్రవేటు ఆసుపత్రులు, ఆ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు సమ్మెకట్టడం వల్ల ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైద్య సేవలు బలహీనంగా ఉండడమే. మన వైద్య విద్య విద్యార్థులకు పేదల గురించి, గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు ఉన్న అంతరం గురించి చెప్పదు. అంటువ్యాధులు ఎంత భయంకరమైనవో చెప్పదు. జాతీయ ఆరోగ్య స్థితిపై నివేదిక ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయం పెంచాలని సూచించింది. స్థూల జాతీయ ఉత్పత్తిలో ప్రభుత్వం ప్రస్తుతం ఒక శాతం మాత్రమే వెచ్చిస్తోంది. దీనిని 2.5 శాతానికి పెంచాలని ఈ నివేదికలో సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వైద్య సేవలకు స్థూల జాతీయ ఉత్పత్తిలో 5.9 శాతం వెచ్చిస్తున్నారు. విధాన రూపకల్పనలో సమాచారం విశ్వసనీయంగా ఉండాలని కూడా ఈ నివేదికలో తెలియజేశారు. బోలెడు సమాచారం అందుబాటులో ఉంది. కావాల్సిందల్లా ప్రభుత్వం సత్వరం చర్య తీసుకోవడమే. దీనికి రాజకీయ సంకల్ప బలం కావాలి. అప్పుడే పేద రోగులకు వారి కుటుంబాలకు దురాశాపరులైన ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసిన దౌర్భాగ్యం తప్పుతుంది.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top