ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బీజేపీని అనుకరించడం వినాశకరం

The Congress and opposition cannot copy the BJPs majoritarian politics.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

గుజరాత్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికలపై విష్లేషకులు తమ పని ముగించిన తర్వాత కూడా ఆ ఎన్నికల ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఫలితాలు ఊహించనవి ఏమీ కాదు. భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ముందే తెలుసు. అలాగే జరిగింది. కాని బీజేపీది నిర్ణాయకమైన విజయం మాత్రం కాదు. బీజేపీ కాంగ్రెస్ ను ఓడించగలిగింది కాని అంతం చేయలేక పోయింది.

గుజరాత్ లో విజయం సాధించడంవల్ల దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే బీజేపీ 19 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. పార్లమెంటులో కూడా సంపూర్ణమైన మెజారిటీ ఉంది. రెండు దశాబ్దాల కిందట దేశంలో 26 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ 16 రాష్ట్రాలలో అధికారంలో ఉండేది. ఇంతకీ "కాంగ్రెస్ ముక్త్ భారత్" అన్న బీజేపీ పథకం సాధ్యం అవుతోందా? ప్రధాన ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నది బీజేపీ లక్ష్యం. బీజేపీ యంత్రాంగం ఎంత పకడ్బందీగా ఉన్నా కాంగ్రెస్ ను అంతం చేయడం సాధ్యం కాలేదు. రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్ లో అధికారంలో నున్న బీజేపీ మూడింట రెండు వంతుల స్థానాలు సంపాదిస్తానని గొప్పలు చెప్పుకుంది. కాని 182 స్థానాలున్న శాసనసభలో బీజేపీకి దక్కింది 99 సీట్లే. అంటే మెజారిటీకన్నా కేవలం ఏడు స్థానాలే ఎక్కువ. గత శాసనసభలో బీజేపీకి ఉన్న బలం తగ్గిపోయింది. అయితే ఓత్ల శాతం మాత్రం స్వల్పంగా పెరిగింది. గుజరాత్ లో బీజేపీ బలం తగ్గలేదు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నా ప్రజల్లో వ్యతిరేకత పెరగలేదు. కాంగ్రెస్ బలం పుంజుకున్నా బీజేపీ బలాన్ని తగ్గించలేక పోయింది.

గుజరాత్ ఫలితాలు భవిష్యత్ పరిణామాలకు బోలెడు సంకేతాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్ నమూనా గురించి అదే పనిగా మాట్లాడారు. కాని ఆ మంత్రం పారదని గుజరాత్ ఫలితాలు నిరూపించాయి. గుజరాత్ లో పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి అంతో ఇంతో కనిపిస్తోంది కాని గ్రామీణ ప్రాంతాలలో ఆ ఊసే లేదు. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ సీట్లు రావడమే దీనికి నిదర్శనం. అందుకే గ్రామీణ ప్రాంత ఓటర్లు గుజరాత్ లో గట్టి పునాది ఉన్న బీజేపీని కాదని అంత పటిష్ఠంగా లేని ప్రతిపక్షాలకు ఓట్లు వేశారు. రాజస్థాన్ లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అక్కడ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ కన్నా కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది.

అయితే బీజేపీ ఓడించనలవి కాని పార్టీ కాకపోయినా గట్టి ప్రత్యర్థి అని గుజరాత్ ఎన్నికలు నిరూపించాయి. నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయం దేన్నీ ఆషామాషీ వ్యవహారంగా వదిలిపెట్టదు. బీజేపీ మీద ఉన్న ఆగ్రహాన్ని బీజేపీకి వ్యతిరేక ఓటుగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నించక ముందే మోదీ-షా ఎన్నికలకు సకల ఏర్పాట్లూ చేశారు. సైద్ధాంతికంగా పటిష్ఠంగా ఉన్న పార్టీని ఓడించాలంటే కేవలం భారీ ర్యాలీలు సరిపోవు. గుజరాత్ లో కాంగ్రెస్ కు సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల మూల్యం చెల్లించవలసి వచ్చింది. వరసగా అనేక ఎన్నికలలో ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ కు పటిష్ఠమైన వ్యవస్థ లేకుండా పోయింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించినా నిజానికి సరైన వ్యవస్థ లేదు. స్థానిక నాయకత్వం లేదు. ఇప్పుడు సాధించిన ఫలితాల ఆధారంగా పార్టీని నిర్మించడానికి కావాల్సిన స్థానిక పరిస్థితి లేదు. గట్టి పోటీ ఇచ్చామని సంతృప్తి పడితే ప్రయోజనం లేదు. 30 నియోజక వర్గాలలో కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్న అంతరం చాలా తక్కువ.

గుజరాత్ లో విభిన్నమైన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ముగ్గురు నాయకులు నిర్వహించిన ర్యాలీలకు భారీగా జనం హాజరయ్యారు. కాని అవి కాంగ్రెస్ కు విజయం కట్టబెట్టలేక పోయాయి. మోదీ ప్రభుత్వం మీద జనానికి ఉన్న్ ఆగ్రహాన్ని కొంత మేరకు మాత్రమే సరైన దిశకు మళ్లించగలిగాయి. ఊనా లో దళితుల మీద దాడి తర్వాత వెలుగులోకి వచ్చిన దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ, పాటీదార్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్, వెనుకబడిన తరగతుల వారిలో ఒక వర్గానికి నాయకుడైన అల్పేశ్ ఠాకూర్ గుజరాత్ ఎన్నికలను రసవత్తరంగా తయారు చేయగలిగారు. అయితే ఈ త్రిమూర్తులు సమగ్రమైన ప్రత్యామ్నాయ శక్తి కాలేక పోయారని ఎన్నికల ఫలితాల వల్ల స్పష్టం అయింది. అయితే ఈ ప్రత్యామ్నాయం రూపు దిద్దుకోవడానికి ఇప్పటికీ ఆస్కారం ఉంది. ఈ ముగ్గురిలో జిగ్నేశ్ మేవానీ మాత్రమే ఇతర అణగారిన వర్గాల తరఫున మాట్లాడతారు. కాని ఈ ముగ్గురికీ ఉన్న ఏక సూత్రతల్లా బీజేపీ వ్యతిరేకతే. అంతకు మించిన సామాన్య లక్షణాలు ఏమీ లేవు.

బీజేపీ విజయం సాధించిన మాట నిజమే. కాని ఈ విజయంతో బీజేపీ సంతృప్తి చెందడం లేదని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ సమావేశంలో మోదీ చెప్పిన మాటల వల్ల తెలుస్తోంది. రైతుల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కేసం అనేక చర్యలు తీసుకుంటే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. వ్యూహాలు రూపొందించాలనుకున్న వారు ఎవరైనా బీజేపీని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. అలాగే కృతనిశ్చయంతో పని చేయవలసిందే. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా సరైన ప్రత్యామ్నాయం చూపక పోతే ఫలితం ఉండదని బీజేపీ ఫలితాలు స్పష్టం చేశాయి.

అచ్ఛే దిన్, సబ్కే సాథ్-సబ్కా వికాస్ అన్న నినాదాలు పని చేయడం లేదన్నది వాస్తవం. అయినా బాలెట్ ద్వారా "ప్రతీకారం" తీర్చుకోవాలని బీజేపీ హిందువులకు ఇస్తున్న సందేశం పని చేస్తూనే ఉంది. పురోగమన భావాలున్న రాజకీయ శక్తులు ముస్లింలను, దళితులను, ఇతర అణగారిన వర్గాల వారిని ఒకే తాటికి మీదకు తెచ్చి హిందుత్వ వ్యతిరేక వేదిక ఏర్పాటు చేయగలగాలి. గుజరాత్ లో కాంగ్రెస్ అనుసరించిన పద్ధతి దీవాలాకోరు విధానమే. బీజేపీ హిందుత్వ ప్రచారాన్ని కాంగ్రెస్ ఎదుర్కోకపోవడమే కాక చాలా బలహీనంగా అదే విధానం అనుసరించే ప్రయత్నం చేసింది. ఇదే భవిష్యత్ మార్గమైతే అంతకన్నా ఘోరం, విషాదకరం మరొకటి ఉండదు. ఎందుకంటే మెజారిటీ మతస్థులను కూడగట్టడంలో బీజేపీ ఇప్పటికే పై చేయి సాధించింది. బీజేపీని అనుకరించడం వినాశకరమే.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top