ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సుస్థిరత దిశగా నేపాల్

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

నేపాల్ లో 2015లో ఆమోదించిన కొత్త రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికలలో నేపాలీ కాంగ్రెస్ ను ఓడించి వామపక్ష కూటమి ఘన విజయం సాధించింది. 1990ల నుంచి వామపక్ష కూటమి ఇంతటి మహత్తర విజయం సాధించడం ఇదే మొదటి సారి. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) లేదా యు.ఎం.ఎల్., కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) లేదా సి.పి.ఎన్. (ఎం.సి.) నేపాల్ పార్లమెంటులో ఉన్న మొత్తం 165 స్థానాలలో 70 శాతం సీట్లు సపాదించాయి. మొదట ఎవరు గీత దాటితే వారే విజేతలు అన్న విధానం కింద, దామాషా పద్ధతి ప్రకారం కూడా వామపక్షాలు గొప్ప విజయం సాధించాయి.

యు.ఎం.ఎల్.-సి.పి.ఎన్.(ఎం.సి.) కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని, పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించి ప్రజల జీవనోపాధి గురించి ఆలోచించగలుగుతుందని నేపాల్ ఓటర్లకు నమ్మకం కుదిరినందువల్లే ఈ విజయం దక్కింది. మునుపటి రాజవంశానికి అనుకూలమైన వారితో, మదేశీలతో కలిసి నేపాలీ కాంగ్రెస్ నానావిధ పార్టీలను కూడగట్టి ఏర్పాటు చేసిన కూటమిని అక్కడి ప్రజలు విశ్వసించలేదు. నేపాలీ కాంగ్రెస్ ప్రచారం నిరాశావాదంతో, ఆందోళనకరంగా సాగింది.

1990 లో నేపాల్ ప్రజాస్వామ్య పద్ధతి అనుసరించడం మొదలు పెట్టినప్పటి నుంచి రాజకీయ పార్టీల మధ్య అధికారం కోసం పెనుగులాట సాగుతోంది. ఈ దశలో సుస్థిర ప్రభుత్వం అందిస్తామని కమ్యూనిస్టులు ఇచ్చిన హామీని జనం నమ్మారు. నేపాల్ ప్రజాస్వామ్యాన్ని ఆమోదించిన 27 సంవత్సరాల కాలంలో 13 మంది ప్రధానమంత్రులు మారారు. 23 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఓ దశాబ్దంపాటు అంతర్యుద్ధం కొనసాగింది. కొంత కాలంపాటు మునుపటి రాజు నియంతృత్వ పాలన ఉంది. సాయుధులైన మావోయిస్టులకు ప్రధాన స్రవంతిలోని రాజకీయ పార్టీలకు మధ్య సయొధ్య కుదిరినందువల్ల రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పడింది. రాచరిక పాలనను రద్దు చేసి నేపాల్ ను గణతంత్రంగా మార్చే ప్రయత్నాలూ జరిగాయి. రాజ్యాంగాన్ని రూపొందించడంలోనూ సుదిర్ఘకాలం ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు భయంకరమైన భూకంపం సృష్టించిన విలయం నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య సయోధ్య సాధ్యమై రాజ్యాంగ రచన పూర్తి అయింది. అయితే కొత్త రాజ్యాంగంపై కూడా అసంతృప్తి లేకపోలేదు. ఉదాహరణకు రాజ్యవ్యవస్థను సమగ్రంగా పునర్నిర్మించాలని మాదేశీలు, జనజాతి వారి కోరుతున్నారు. ఈ కోర్కెలు నెరవేర లేదు.

1990లలో మదన్ భండారీ నాయకత్వంలో యు.ఎం.ఎల్. ఉన్నప్పటి నుంచి సాధించని విజయాన్ని ఇప్పుడు ఆ పార్టీ సధించగలిగింది. కాని ఆ పార్టీలో కూడా అప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. కె.పి.ఓలి నాయకత్వంలో యు.ఎం.ఎల్. గత దశాబ్దంలో యథాతథ పరిస్థితి కొనసాగాలని వాదించడంతో నేపాలీ జాతీయతను ప్రోత్సహించింది. నేపాల్ నిజమైన ఫెడరల్ వ్యవస్థగా మారడాన్ని నిరోధించింది. ఆ పార్టీ ఆర్థిక విధానాలు కూడా ప్రాపక వ్యవస్థను సమర్థించేవే. మాదేశీ ఆందోళన కొనసాగుతున్న దశలో నేపాల్ వ్యవహారాలలో భారత్ విపరీతంగా జోక్యం చేసుకుంటున్న దశలో యు.ఎం.ఎల్. జాతీయ వాదాన్ని అనుసరించింది. దీనివల్లే యు.ఎం.ఎల్. ప్రజల మద్దతు సమీకరించగలిగింది.

పుష్ప కమల్ దహల్ "ప్రచండ" నాయకత్వంలోని సి.పి.ఎన్.(ఎం.సి.) కూడా అనేక రకాలుగా పరివర్తనకు గురైంది. మునుపటి దుందుడుకు ధోరణి విసర్జించింది. 1990లలో, 2000లలో ఉన్న ప్రజా యుద్ధ పంథాను మార్చుకుంది. ఈ పార్టీ రాజ్యాంగ నిర్ణాయక సభ లక్ష్యాల సాధనకు, అధికారంలోకి రావడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ముందు అనుసరించిన తీవ్రవాద ఎజెండాను విడనాడింది. అప్పుడు ఈ పార్టీ భూ సంస్కరణలు, నిఖార్సైన ఫెడరల్ వ్యవస్థ ఉండాలని వాదించేది. మావోయిస్టులలో ఈ మార్పు వల్ల ప్రచండ నాయకత్వంలోని పార్టీలో చీలికలు కూడా వచ్చాయి. యు.ఎం.ఎల్. తో కలిసి పని చేయడం వల్ల ప్రచండ పార్టీలో చాలా మార్పులు వచ్చాయి.

ఈ రెండు పార్టీలు బ్రహ్మాండమైన మెజారిటీ సాధించడం వల్ల, భవిష్యత్తులో సమైక్యం కావాలని అనుకుంటున్నందువల్ల ప్రచండ పార్టీలో అలసత్వం ఆవరించే ప్రమాదమూ ఉంది. రెండు కమ్యూనిస్టు పార్టీలు ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి. ఈ రెండు పార్టీలు సాధించిన విజయాన్ని అవకాశంగా తీసుకుని సంస్కరణల మీద దృష్టి పెట్టి దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడానికి పాటు పడవలసి ఉంటుంది. విధిలేక వలసలు వెళ్లడం, భూకంప బాధితులకు ఇంతవరకు అందవలసినంత సహాయం అందకపోవడం, పునర్ణిర్మాణం, పునరావసం ప్రస్తుతం నేపాల్ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు. నేపాల్ లో వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం వల్లే వలసలు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థలో వైవిధ్యం లేదు. విదేశీ ఆర్థిక సహాయం మీద, ఇతర దేశాల్లో పని చేసే నేపాలీలు పంపే డబ్బు మీద ఆధారపడక తప్పని దుస్థితిలో నేపాల్ కూరుకుపోయింది.

నేపాల్ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రాపక ధోరణిని విడనాడడంలో, కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను పురోగమించడంలో వామపక్ష ఫ్రంట్ ఎలా వ్యవహరిస్తుందో భవిష్యత్తులోనే తేలుతుంది. ఈ లక్ష్యాలను సాధించాలంటే యు.ఎం.ఎల్., సి.పి.ఎన్.(ఎం.సి.) పార్టీలు ఇంతకు ముందు చెప్పిన భూ సంస్కరణలు, జల విద్యుత్తు లాంటి ఉత్పాదక రంగాలలో ప్రభుత్వ పెట్టుబడి పెంచడం, స్వేదేశీ పారిశ్రామికీకరణకు ఊతం ఇవ్వడం, విదేశాల మీద ఆధారపడడాన్ని మానుకోవడం లాంటి పురోగమన చర్యలు తీసుకోవాలి.

రాజ్యవ్యవస్థను పునర్మించాలన్న లక్ష్యం కూడా పూర్తి కాలేదు. దీని వల్ల మాదేశీలు, జనజాతి వారిలో తీవ్ర అసంత్రుప్తి ఉంది. తెరాయ్ లో ఈ డిమాండును వ్యతిరేకించి యు.ఎం.ఎల్. గిరిజనుల మద్దతు సమీకరించగలిగింది. కాని ఈ సమస్యను దాటవేయడం వల్ల ప్రత్యేకవాద ధోరణులు ప్రబలి పోతాయి. అవి న్యాయమేనన్న భావన ఏర్పడుతుంది. పునర్నిర్మాణం, ఫెడరిలిజం విషయాల్లో యథాతధ స్థితిని కొనసాగించడానికే ప్రజలు తమకు మద్దతిచ్చారని వామపక్ష ఫ్రంట్ భావించకూడదు.

సార్వభౌమాధికారాన్ని, అధికారాన్ని ప్రజలకు బదలాయిస్తామని చెప్పినందువల్లే నేపాల్ ప్రజలు రాచరికాన్ని అంతమొందించడానికి మద్దతు ఇచ్చారన్న అంశాన్ని విస్మరించకూడదు. కాని రాజకీయ వర్గాలు ఈ ఆకాంక్షను గుర్తించలేదు. అయినా ప్రజల్లో ప్రజాస్వామ్యం మీద మక్కువ చెక్కు చెదరలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవలసిన బాధ్యత ఇక వామపక్ష కూటమిదే. 

Back to Top