ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

స్త్రీకి స్వేచ్ఛ లేని భద్రత అసాధ్యం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

అయిదేళ్ల కింద, 2012 డెసెంబర్ 16వ తేదీన దిల్లీలో ఒక బస్సులో జ్యోతీ సింగ్ (నిర్భయ) మీద కిరాతకంగా అత్యాచారం జరిగింది. ఆమె మీద అత్యాచారం చేసి, ఆ తర్వాత అత్యంత ఘోరంగా ప్రవర్తించిన ఉదంతంపై వివరాలు బయట పడిన తర్వాత జనాగ్రహం పెల్లుబికింది. భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమైనాయి. అప్పటి ప్రభుత్వం ఈ సంఘటనపై సత్వర విచారణ జరిపించక తప్పలేదు. దీన్నే నిర్భయ కేసు అంటున్నాం. ఈ ఉదంతం చివరకు మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి నేరాలకు సంబంధించిన చట్టం సవరణకు దారి తీసింది.

జ్యోతీ సింగ్ గాథ దేశంలోని చెదిరిపోతున్న యువతరం ఆకాంక్షలకు ప్రతీక. అందువల్లే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. గత అయిదేళ్ల కాలంలో మహిళల మీద అత్యాచారాలను నిరసిస్తూ జనం రోడ్డు మీదకు వచ్చారు. విశ్వవిద్యాలయాల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. బడికి వెళ్తున్న రేవారీ పాఠ శాల బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు హర్యానాలో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాచారం జరిగినందుకు ఉత్తరప్రదేశ్ లో ఉద్యమాలు తలెత్తాయి. దిల్లీ విశ్వవిద్యాలయంలో మహిళలు పింజ్రా తోడ్ (పంజరాన్ని బద్దలు కొట్టండి) ఆందోళన చేపట్టారు. కేరళలోని తిరువనంతపురం ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతి గృహాల విషయంలో వివక్షకు వ్యతిరేకంగా అమ్మాయిలు ధ్వజమెత్తారు. ఒక విద్యార్థిని మీద అత్యాచారానికి నిరసనగా పశ్చిమ బెంగాల్ లో హోక్ కొలొరోబ్ (గొడవ చేయండి) ఉద్యమం వచ్చింది. ఇటీవల 'నేను సైతం' అన్న ఉద్యమం సామాజిక మాధ్యమాలలో అలజడి సృష్టించింది. ముంబైలో శక్తి మిల్స్ అత్యాచారం కేసు, ఉత్తరప్రదేశ్ లో బదవూన్ మూకుమ్మడి అత్యాచారం, కేరళలో మహమూద్ ఫారూఖీ కేసు, జిషా అత్యాచారం-హత్య కేసు, మహారాష్ట్రలో కొపార్డి కేసు వంటివి జనాగ్రహానికి రెక్కలు తొడిగాయి. ఈ దృష్టితో చూస్తే గత అయిదేళ్ల కాలంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు గొంతెత్తుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఇంతకు ముందు అత్యాచారాలు, వేధింపులు ఎదురైనా అవి బయటికి పొక్కడం తక్కువ. కాని ఇప్పుడు జనం బాహాటంగా ఈ అత్యాచారాలను ప్రతిఘటిస్తున్నారు.

అయితే అత్యాచారం జరిగినప్పుడు ఫిర్యాదు చేయడం, అత్యాచారానికి గురై సజీవంగా ఉన్న వారు గొంతెత్తడం బాగా పెరిగిందని చెప్పే అవకాశం లేదు. అత్యాచారానికి గురైన వారి మీద మచ్చ పడడం కూడా తగ్గలేదు. మహిళల, బాలల భద్రతకు భరోసా పెరగలేదు. ప్రతికూల విధానాలు, అవమానకరమైన రీతిలో దర్యాప్తులు, న్యాయ వ్యవస్థ అందుబాటులో లేకపోవడం, అత్యాచారం జరిగినప్పుడు ఏమవుతుందోనన్న భయం ఇంకా పోనే లేదు. మీడియా సంచలనాత్మక వార్తల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తూనే ఉంది. బాధితుల వివరాలు బయట పెట్టకూడదన్న సూత్రాన్ని తుంగలో తొక్కుతూనే ఉంది. పట్టణ ప్రాంతాలలో జరిగే అత్యాచారా కేసులను మీడియా ఎక్కువ ప్రచారంలో పెడ్తోంది. వీటిని మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యంగా పరిగణించడం లేదు. తెలియని వారు అత్యాచారానికి పాల్పడినప్పుడు మీడియా సంచలనాత్మక వార్తలు వెలువరిస్తోంది కాని కింది కులాలకు చెందిన మహిళలపై జరిగే అత్యాచారాలను అంతగా పట్టించుకోవడం లేదు. అల్పసంఖ్యాక వర్గాల వారి మీద మతపరమైన దాడులను, కుటుంబంలో, సమాజంలో జరిగే అత్యాచారాలను మీడియా పట్టించుకోవడం లేదు. పేదలు, వలస వచ్చిన, శ్రామిక వర్గం వారిని అత్యాచారాలు చేసే వారిగా మీడియా చిత్రిస్తూనే ఉంది.

మరో వేపున రాజకీయ వర్గాలు, న్యాయస్థానాలు మహిళల వ్యవహారాన్ని "భద్రత" అన్న అంశానికి మించి చూడడం లేదు. పితృ భావంతోనే వ్యవహరిస్తున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోకుండా వారిని సంరక్షించే వారిగా, వారి మీద నిఘా పెట్టే వారిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. హాదియా విషయంలో ఈ ధోరణే ప్రస్ఫుటంగా వ్యక్తం అయింది. టీవీ కార్యక్రమాలు, సినిమాలు, సామాజిక మాధ్యమాలు ప్రజల్లో భయాన్ని మరింతగా పెంచుతున్నాయి. మహిళల గౌరవం, ప్రతీకారం గురించే మాట్లాడుతున్నాయి. అందుకే అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని కోరే వారు ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి వారు మానవ హక్కుల నియమాలను, న్యాయమూర్తి వర్మ కమిషన్ సిఫార్సులను ఖాతరు చేయడం లేదు. అంతే గాక 2013 నాటి అత్యాచారానికి సంబంధించిన చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో జరిగే అత్యాచారానికి ఇప్పటికీ న్యాయ పరిష్కారం లేదు. లైంగిక సంపర్కానికి సమ్మతి విషయంలో వయస్సును తగ్గించాలని, కల్లోలిత ప్రాంతాలలో భద్రతా దళాల వారు పాల్పడే అత్యాచారాలను లైంగిక నేరాలుగా పరిగణించడానికి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని సవరించాలని వర్మ కమిషన్ చేసిన సిఫార్సును 2013 నాటి సవరణ చట్టంలో చేర్చనే లేదు. అత్యాచారాలకు సంబంధించిన చట్టాలను పక్కన పెట్టినా నకిలీ ఫిర్యాదులు వస్తున్నాయన్న నెపంతో నేర విచారణా ప్రక్రియా స్మృతి (సి.ఆర్.పి.సి.) లోని 498ఎ సెక్షన్ లాంటి వాటిని నీరుగారుస్తున్నారు. కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటుందన్న సాకుతో ఈ సెక్షన్ ను నీరుగార్చారు.

దీనికి తోడు ప్రస్తుతం దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న రాజకీయ సిద్ధాంతం మహిళలను "ఘనమైన" హిందూ గతంలో బందీలను చేయాలని చూస్తోంది. పద్మావతి సినిమా వివాదంలో ఈ ధోరణే మరింత కనిపించింది. లవ్ జిహాద్ లాంటి వాటికి ప్రాధాన్యత పెరిగిపోతోంది. మహిళలను కాలదోషం పట్టిన సాంస్కృతిక ఎజెండాలో భాగం చేసి వారికి కుటుంబ రక్షణ, రాజ్య వ్యవస్థ రక్షణ అవసరం అని ప్రచారం చేసి మహిళలపై దౌర్జన్యం నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాతుకుపోయిన పితృస్వామ్య ఆలోచనా ధోరణి మార్చకుండా జనాగ్రహం, చట్టాల వల్ల మహిళల పరిస్థితి మెరుగుపడదు. సామాజిక సమానత్వం, న్యాయం, సుహృద్భావం అందరికీ అవసరమైనవని గ్రహిస్తే తప్ప మహిళలకు భద్రత సాధ్యం కాదు. భద్రత కొంత మందికే పరిమితం కాకూడదు.

Back to Top