ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

హద్దు మీరిన మోదీ అబద్ధాలు

Modi’s absurd conspiracy theories are a deliberate ploy to ensure electoral victory by any means.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు నిజం చెప్తారని ఆశించలేం. నిజానికి వాగాడంబరం, ఉత్ప్రేక్షలు, పాత అబద్ధాలను సరికొత్తగా వల్లించడం ఎన్నికల ప్రచార సరళిగా మారిపోయింది. ప్రధానమంత్రి అయితే ఈ అసత్యాలు మరింత తక్కువగా ఉంటాయనుకోవడం అత్యాశ కాదు. కాని గుజరాత్ లోని బనస్కాంతలో డెసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి మోదీ ప్రసంగం వింటే నిజం చెప్తారన్న ఆశ ఆడియాసగానే మిగిలిపోయింది. హావభావాలు, వాగాడంబరం మోదీకి అలవాటే. ఇందులో ఆయనకు సాటి ఎవరూ లేరు. కాని ఆ రోజు ఆయన ప్రసంగం వింటే ఒక దేశాధినేత మాట్లాడవలసిన రీతిలో లేదు అని స్పష్టం అయిపోతోంది. సకల మర్యాదలనూ తుంగలో తొక్కారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సైనికదళాల మాజీ అధిపతి దీపక్ కపూర్ రహస్యంగా సమావేశమై రాజద్రోహానికి పాల్పడ్డారని మోదీ నిందించారు. ఇది ఏమరుపాటున చేసిన ఆరోపణో, సరదాకు చేసిన ఆరోపణో కాదు. కావాలనే గుజరాత్ ఎన్నికల ప్రచారం చివరి దశలో ఓటర్లను మతాల వారీగా చీల్చడానికి ఉద్దేశ పూర్వకంగానే మోదీ వారికి రాజద్రోహ నేరం అంటగట్టారు. వీరంతా శత్రువుతో అంటే పాకిస్తాన్ తో కుమ్మక్కయ్యారని మోదీ దుయ్యబట్టారు. గుజరాత్ ఎన్నికలలో బీజేపీని ఓడించడానికే ఆ పని చేశారని నిరాధార ఆరోపణలు చేశారు. ముస్లిం అయిన అహమద్ పటేల్ ను గుజరాత్ ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇలా చేశారన్నారు. డెసెంబర్ ఆరో తేదీన కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఇంట్లో మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో ఈ కుట్ర జరిగిందని చెప్పారు. మోదీ చెప్పిన విషయంలో నిజం ఏమైనా ఉంటే ఆ సమావేశం మూడు గంటలపాటు జరిగిందన్నదే. మణి శంకర్ తన ఇంట్లో విందు ఇవ్వడం రహస్యమేమీ కాదు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమూద్ కసూరీ చాలా కాలంగా అయ్యర్ కు మిత్రుడు. ఆయన గౌరవార్థం ఈ విందు ఇచ్చారు. ఇందులో రహస్యం ఏమీ లేదు.

మోదీ మాటలను ఎవరూ నమ్మకపోయి ఉండొచ్చు. కాని ఆయన పాకిస్తాన్, కాంగ్రెస్, ముస్లింలను ఒకే గాట కట్టడమే అసందర్భమైన, అవివేకమైన, నిఖార్సైన అబద్ధం. అదే పెద్ద ప్రమాదం. మోదీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. ఆయనను సమర్థించే వారికి మాత్రమే నాయకుడు కాదు. ఆయన అందరికీ ప్రాతినిధ్యం వహించాలి. అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి రాజ్యాంగపరమైన పదవులలో ఉన్న వారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడమంత దారుణం మరొకటి లేదు. పైగా మోదీ పదే పదే ముస్లింలను పాకిస్తాన్ తో జతకట్టి మాట్లాడతారు. అంటే దేశం పట్ల వారి నిజాయితీని శంకిస్తున్నట్టే. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా ముస్లింలు ఈ దేశం పట్ల తమ విశ్వాసాన్ని, నిజాయితీనీ పదే పదే నిరూపించుకోవాలా? తనను గద్దె దించడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ శత్రువుతో కత్తు కలుపుతోందని మోదీ ఆరోపిస్తున్నారు. గో సంరక్షణ, లవ్ జిహాద్ పేర ముస్లింల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు మాత్రం మోదీ పెదవి విప్పరు. డిసెంబర్ ఆరో తేదీన రాజస్థాన్ లోని రజ్సమంద్ లో మహమ్మద్ అఫ్రాజుల్ ను కిరాతకంగా హత్య చేస్తే మోడీకి నోట మాట పెకలదు. ఇది ముస్లింలను పక్కకు నెట్టేయడం మాత్రమే కాదు. ప్రజాస్వామ్య మొలిక సిద్ధాంతాలకే విరుద్ధం. గుజరాత్ ఎన్నికలలో బీజేపీ ఒడిగట్టిన ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టలేక పోవడం దురదృష్టం. తాము ముస్లింలకు అనుకూలం కాదు అని నిరూపించుకోవడానికి బీజేపీ జనాభాలో ప్రధానమైన ముస్లింలను విస్మరిస్తోంది. దశాబ్దాలుగా వారిని నోరెత్తనీయడం లేదు.         

గుజరాత్ ఎన్నికల ప్రచార సరళిలో మరో కోణం కూడా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న కొద్దీ మోదీ మీద వ్యక్తి ఆరాధనా తత్వం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. ఎన్నికల ప్రచార సభల్లో జనం "మోదీ, మోదీ" అని అరవడం, సబర్మతి నదిలో మోదీ నీటి మీద ప్రయాణించే విమానంలో వెళ్లడం అపూర్వమైనట్టు ప్రచారం చేయడం మరింత ప్రమాదకరం. ఇలాంటి విమానాలు కొత్తేమీ కాదు. అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ తరహా విమానాలను దశాబ్దాలుగా వాడుతూనే ఉన్నారు. మణిశంకర్ అయ్యర్ అనాలోచితంగా, యథాలాపంగా చేసిన వ్యాఖ్యను ఆధారంగా చేసుకుని తనను అంతమొందించాలని ప్రయత్నుస్తున్నారని మోదీ ప్రచారం చేయడం ఘోరమైంది. దీన్ని బట్టి ఎలాంటి మినహాయింపులు లేకుండా తనను సమర్థించాలని మోదీ కోరుకుంటున్నారు. తద్వారా జాతీయత అంటే మోదీని సమర్థించడమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మోదీ అంటే ఇండియా, ఇండియా అంటే మోదీ అనాలంటున్నారు.

హిందుత్వను ముందుకు తోయడానికి అభివృద్ధిని దానితో ముడిపెడ్తున్నారు. అభివృద్ధి నాటకీయ వ్యవహారంగా మారిపోయింది. అభివృద్ధి సాధిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చలేక పోయారు కనక నీటి మీద నడిచే విమానంలో ప్రయాణించడం వంటి చిట్కాలు ప్రయోగిస్తున్నారు. దీన్ని అభివృద్ధి అని నమ్మించాలని చూస్తున్నారు. దీనివల్ల జనం కడుపులు నిండవు. జీవనోపాధీ దొరకదు. కనీసం అభివృద్ధి గురించి ఈ మాయమాటలకైనా కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు. అభివృద్ధి స్థానంలో మతం, అస్తిత్వం, అస్మిత, నాయకుడిపట్ల విశ్వాసపాత్రంగా ఉండడం అన్న అంశాలను తెచ్చి పెడ్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు ఏమైనా ఉంటే గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తంగా తుడిచిపెట్టేసింది. వచ్చే రెండేళ్ల కాలంలో విద్వేషాన్ని మరింత రెచ్చగొడ్తారు. జనాన్ని చీల్చే వ్యూహాలు అనుసరిస్తారు. మైనారిటీలను మరింత పక్కకు నెట్టేస్తారు. వారి నోళ్లు నొక్కేస్తారు. మెజారిటీ మతస్థుల వాణి గట్టిగా వినిపిస్తుంది. ఈ స్థితిలో బీజేపీ ఎజెండాకు భిన్నమైన కార్యాచరణను రూపొందించడం ప్రతిపక్షాలకు పెద్ద సవాలు.

తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారన్న మోదీ నిరాధార ఆరోపణలకు మన్మోహన్ సింగ్ తగిన సమాధానం చెప్పారు. "మోదీ తన ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సకల రాజ్యాంగ వ్యవస్థలకు మసి పూస్తున్నారు. మాజీ ప్రధానికి, సైనిక దళాల మీజీ అధిపతికి కూడా మసి పూస్తున్నారు" అని మన్మోహన్ అన్నారు. అన్నింటికన్నా ప్రమాదకరమైంది ఏమిటంటే మోదీ ఏ మర్యాదనూ పాటించడం లేదు. ప్రధానమంత్రిగా తనకున్న బాధ్యతలను తుంగలో తొక్కుతున్నారు. కేవలం అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. యుద్ధంలో లాగా ఎన్నికల్లో ఎం మాట్లాడినా చెల్లుతుందని మోదీ అనుకుంటున్నారు. ఎలా గెలిచినా గెలవడం ప్రధానం అనుకుంటున్నారు. 

Updated On : 31st Jan, 2018
Back to Top