ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

అసత్యాలతో ఆర్థికాభివృద్ధి కుదరదు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

కేంద్ర గణాంకాల కార్యాలయం తాజా జాతీయ ఆదాయం గురించి విడుదల చేసిన వివరాలు భారత ఆర్థిక వ్యవస్థ రుజాగ్రస్థమై ఉందనడానికి నిదర్శనం. 2017-18 రెండవ త్రైమాసికంలో అంటే జులై-సెప్టెంబర్ మాసాల కాలంలో 6.3 శాతం అభివృద్ధి రేటు నమోదైందని ఇది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి చిహ్నమని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం చేస్తున్న ఈ వాదనను ప్రభుత్వ అనుకూల వ్యాపార పత్రికలు చిలకపలుకుల్లా వల్లిస్తున్నాయి. ఆ పత్రికల వాదనలు ఇలా ఉన్నాయి: 2016-17 జనవరి మార్చి నెలల్లో వృద్ధి రేటు 9.1 శాతం ఉండేది. ఆ తర్వాత ప్రతి త్రైమాసికానికి వృద్ధి రేటు తగ్గుతూ వచ్చింది. కాని 2017 జులై-సెప్టెంబర్ లో వృద్ధి రేటు అంతకు ముందు త్రైమాసికానికన్నా ఎక్కువగా నమోదైంది. అంటే మందకొడిగా ఉన్న వృద్ధి రేటు పుజుకుందని ఆ పత్రికల వాదన. దురదృష్టవశాత్తు ఈ వాదన తప్పు. ఒక త్రైమాసికంలో వృద్ధి రేట్లను అంతకు ముందు సంవత్సరంలో పోల్చి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే వృద్ధి రేటు ఒకో సీజన్లో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ రకంగా చూస్తే 2017 జులై-సెప్టెంబర్ మధ్య వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో చాలా తక్కువగా ఉందని, ఇది 2012-13 నుంచి ఉన్న వృద్ధి రేటుకన్నా చాలా తక్కువని జాతీయ అకౌంట్స్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. భారత ఆర్థికాభివృద్ధి దిగజారిపోతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ వాస్తవాన్ని అంగీకరించడం లేదు.

నూతన జాతీయ అకౌంట్స్ గణాంకాల ప్రకారం నిజానికి రెండవ త్రైమాసికంలో ఎక్కువగా ఉంటుంది. మిగతా త్రైమాసికాల కన్నా ఒక శాతం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి అలా లేదు. 2015-16 రెండవ త్రైమాసికంలోనూ, 2016-17 త్రైమాసికంలోనూ రెండవ త్రైమాసికంలోనూ వృద్ధి రేటు పెరగలేదు. ఈ ధోరణినిబట్టి చూస్తే ఈ ఏడాది వృద్ధి రేటు 6.3 శాతాన్ని మించేట్టు కనిపించడం లేదు. 2012-13 నుంచి వృద్ధి రేటు ఎన్నడూ రెండవ త్రైమాసికం కన్నా ఎక్కువగా లేదు. అందువల్ల వార్షిక వృద్ధి రేటు 6.3 శాతం కన్నా మించే అవకాశం కనిపించడం లేదు. 2016-17లో వృద్ధి రేటు 7.1 శాతం ఉంది. ముందుగా వేసిన అంచనాల మేరకు ఇంత వృద్ధి రేటు ఉండవచ్చు. 2015-16 తాత్కాలిక అంచనానుబట్టి వృద్ధి రేటు 8 శాతం ఉంది.

అదే సమయంలో ఆర్థిక సవత్సరాన్ని రెండు అర్థ భాగాలు చేసి గమనిస్తే మొదటి అర్థ సంవత్సరంలో వృద్ధి రేటు రెండవ అర్థభాగం కన్నా ఒక శాతం ఎక్కువగా నమోదైంది. 2015-16లో మాత్రం ఇలా జరగలేదు. అలాగే ఈ ఏడాది మొదటి అర్థభాగంలో నమోదైన వృద్ధి రేటు 2012-13 తో పోల్చితే తక్కువ ఉంది. ఈ లెక్కన చూస్తే వృద్ధి రేటు 6 శాతమో అంతకన్నా తక్కువో ఉండవచ్చు. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ఇది తక్కువ.

మౌలిక ధరల ఆధారంగా స్థూల విలువను చేర్చి ప్రభుత్వం ఇలాంటి వాదనలే చేస్తోంది. వస్తూత్పత్తి రంగం పుంజుకుందని చెప్తున్నారు. ఆ రంగంలో 2017-18 రెండవ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి రేటు ఉందంటున్నారు. అది అంతకు మునుపటి త్రైమాసికం కన్నా 1.2 శాతం ఎక్కువ. కాని గత సవత్సరం వస్తూత్పత్తి రంగం సాధించిన 7.7 శాతం వృద్ధి రేటు కన్నా ఇది తక్కువ. పరిశ్రామిక ఉత్పత్తి సూచిక ప్రకారం కూడా వస్తూత్పత్తి రెండవ త్రైమాసికంలో 2.2 శాతం పెరిగింది. అంతకు ముందు సవత్సరం ఈ పెరుగుదల 5.5 శాతం ఉంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం వాదిస్తున్నట్టు వస్తూత్పత్తి రంగంలో వృద్ధి రేటు పెరగలేదు.

అదే విధంగా ఆర్థిక సంవత్సరంలో స్థూల విలువ చేర్చిన వృద్ధి రేటు స్థిరాస్తి, వృత్తిపరమైన సేవల రంగంలో నమోదైన 5.7 శాతం వృద్ధి రేటు, వ్యవసాయ రంగంలో 1.7 శాతం వృద్ధి రేటు ఈ రంగాలలో రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు కన్నా తక్కువ. ఈ మూడు రంగాలు కలిసి స్థూల విలువ చేర్చిన వృద్ధిలో 55 శాతం. గనులు, విద్యుత్తు, వాణిజ్యం, హోటళ్లు, కమ్యూనికేషన్ల రంగాలలో వృద్ధి రేటు, నిర్మాణ రంగం, ప్రజా పరిపాలన రంగంలో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరం కన్నా తగ్గింది. అందువల్ల విస్తృత రంగాలలో వృద్ధి రేటు పెరిగిందనడానికి దాఖలాలు లేవు. పైగా ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతోందని రుజువైంది.

పెట్టుబడులు పెట్టే వాతావరణం కూడా మెరుగు పడలేదు. ఇటీవలి త్రైమాసికంలో స్థూల పెట్టుబడి సమకూరడం త్వరితంగా 4.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం అదే త్రైమాసికంలో ఇది 3 శాతం మాత్రమే ఉంది. అనేక సంవత్సరాలుగా వృద్ధి రేటు తగ్గినందువల్ల ఈ పెరుగుదల గొప్పదేమీ కాదు. ఇది 2011-12 లో ఇది 35.6 శాతం ఉంటే 2017-18లో 28.8 శాతానికి తగ్గింది.

2016-17 రెండవ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిన సమయంలోనే పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) కారణంగా వృద్ధి రేటుపై ప్రభావం పడింది. ఈ రెండు చర్యలవల్ల ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగింది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అందువల్ల ఆర్థిక రంగ పరిస్థితి సవ్యంగా లేదు. ఏకపక్ష చర్యలవల్ల ఎంత ఇబ్బంది కలుగుతోందో గమనించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. వాస్తవాలను నిరాకరించినందువల్ల ప్రభుత్వం వృద్ధి రేటు తగ్గడం లేదని వాదించే అవకాశం లేదు. ప్రజలను పెడదారి పట్టించడం కుదరదు. ఆర్థికాభివృద్ధి పుంజుకోవాలంటే ముందు సమస్యను గుర్తించాలి.

Back to Top